.
నాకు తెలుసులేండి! మీరెందుకు అలిగారో ?
మీ మనవడ్ని చూడాలని మీకు ఆత్రంగా ఉంది. కోడలు పిల్లేమో ఈ వారం కుదరదు, పై వారం చూద్దాం లేండి అంది. అందుకని మీరు చిన్నపిల్లాడిలా అలిగి కూర్చున్నారు!
మీరు తాతగారైనప్పటి నుంచీ మీకు ఇంట్లో కాలు నిలవటం లేదు. అస్తమానం వాడితో ఆడుకోవాలని చూస్తారు.
మన మనవడ్ని చూసుకోవటానికి, మధ్యలో ఈ పిల్లల పర్మిషన్ లేవిటీ అంటారా?
అంతేమరి! కాలం మారింది. ఇప్పుడు పిల్లలంతా రూల్స్ ప్రకారం పెరుగుతున్నారు. అన్నీ టైం ప్రకారం టకటకా జరిగిపోవాలి. మీరు చీటికిమాటికి వెళ్ళి, వాళ్ళ నెత్తిన కూర్చుంటే వాళ్ళ రొటీన్-షెడ్యుల్ అంతా మెస్ అప్ అయిపోదూ? ఇప్పుడు పిల్లల్ని పెంచడం అంటే మీ కాలంలో పెంచినట్టు కాదు.
ఈ పెంపకమే వేరు! అసలు పిల్లలు పుట్టకుండానే ఎంత హడావిడి…ఎంత హంగామా!!
మన కోడలు కడుపుతో ఉన్నన్నాళ్ళూ మనవాడు ఆ అమ్మాయిని కాలు కింద పెట్టనిచ్చాడా?
ఇక డెలివరీ టైములో అయితే చెప్పనే అక్కరలేదు! పక్కనే ఉండి పెళ్ళానికి కోచింగ్ ఇస్తూ..ఓపికగా ఓదారుస్తూ..మధ్య మధ్యలో ఆ అమ్మాయి పెట్టే చివాట్లు తింటూ…ఇంకో పక్క వీడియో తీస్తూ వీడే కన్నంత పని చేసాడు!
మన టైములో మీ మగాళ్ళకు అంత శ్రద్ధా లేదు, మా ఆడాళ్ళకు అన్ని తెలివితేటలు లేవు.
మన పెద్దవాడు పుట్టినప్పుడు గుర్తుందా?
నెప్పులొస్తున్నాయని నేను అంటే “అయితే పద” అంటూ ఉన్నపళంగా కారులో కూలేసి హాస్పిటల్ కు తీసికెళ్ళారు. డాక్టరు, “ఇంకా టైముంది” అనగానే, “అయితే ఇక్కడ నేనుండి చేసేదేముంది?” అంటూ ఇంటికెళ్ళిపోయి తీరుబడిగా తర్వాత ఎప్పుడో వచ్చారు.
రెండోవాడు పుట్టినప్పుడు రవ్వంత మార్పు వచ్చింది మీలో. అప్పుడు నేను “అర్జెంట్” అన్నానని ఆ కంగారులో నన్ను తీసికెళ్ళి సరాసరి హాస్పిటల్ లాబీలో దింపేసారు. అప్పుడే ఊరు మారిన మీకు అక్కడ అంతా కొత్త అవడంతో, మీరు కారు పార్క్ చేసి హాస్పిటల్ లో నేను ఎక్కడ ఉన్నానో వెతికి పట్టుకునే సరికి అబ్బాయి పుట్టేసాడు! అలిసిపోయి నిద్రమత్తులో ఉన్న నన్ను, అప్పుడే పుట్టిన పసిగుడ్డును చూసేసి వచ్చిన పనైపోయిందని ఇంటికెళ్ళి హాయిగా నిద్ర తీసారు!
నేను ఇంటికొచ్చేవరకు మన బుజ్జిగాడ్ని పాపం లక్ష్మి గారు చూసుకున్నారు. అప్పట్లో ఎవరికి ఏం అవసరమొచ్చినా గభాలున వెళ్ళిపోయే వాళ్ళం. చెయ్యగలమా లేదా అని కూడా ఆలోచించే వాళ్ళం కాదు.
మీకు గుర్తుందా? మన శంకర్రావు గారి అమ్మాయి మంచి స్నో స్టార్మ్ చూసుకుని మరీ పుట్టింది. అందుకే దానికి “హిమ” అని పేరు పెట్టారు! మోకాటి లోతు స్నోలో తల్లిని పిల్లను ఇంటికి ఎలా తేవడమా అని ఆయన ఆదుర్దా పడుతుంటే, మీరందరూ వెళ్ళి కూరుకుపోయిన కారుని స్నోలోనుంచి పెళ్లగించి, శంకర్రావు గారి కుటుంబాన్ని సాహసోపేతంగా ఇంటికి చేర్చారు! సీటు బెల్టులు, ఎయిర్ బ్యాగులు అంటే ఏమిటో ఎరగని రోజులులవి.
మనతో ఉండి వెళ్ళిన శర్మగారు వాళ్లకు అబ్బాయి పుట్టాడని, అందరం ఒక లాంగ్ వీకెండ్ నాడు పొలోమని వాళ్ళ ఊరు వెళ్ళాం. ఆకలి అవగానే పాలు తాగేసి వాడు గప్ చిప్ గా పడుకుంటే, మనం మాత్రం చిన్న పిల్లల్లా “గోలగోల” చేసాం! మనం ఉన్న మూడు రోజులు కబుర్లతో, నవ్వులతో వాళ్ళ ఇల్లు హోరెత్తించేసాం.
ఆ రోజులు కాబట్టి మన వేషాలు చెల్లాయి! అప్పట్లో ఎవరం ఎవరింటికి వెళ్ళినా అది “మన ఇల్లే” అన్నంత స్వతంత్రంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు మన పిల్లల ఇంటికి వెళ్ళినా, పరాయి ఇంటికెళ్ళినంత జాగ్రత్తగా ఉండాలి.
పెద్దగా మాట్లాడకూడదు…తెలుగు సినిమాలు చూడకూడదు…వాసనలొచ్చేటట్లు వంటలు చేయకూడదు..డీప్ ఫ్రై అసలే చెయ్యకూడదు…పిల్లల చేతిలో చాకొలేట్ కూడా పెట్టకూడదు. ఇలాంటి రూల్స్ చచ్చినన్ని ఉన్నాయి!
మన పిల్లలు కాస్తలొ కాస్త నయం. మొన్న వెంకట్రావుగారు చెప్తున్నారు…మనవడ్ని చూడ్డానికి కూతురింటికి వెళ్లారుట. వాళ్ళింట్లో రాత్రి తొమ్మిది తర్వాత టీవీ చూడకూడదుట, టాయిలెట్ ఫ్లష్ చెయ్యకూడదుట. ఈయన వెళ్ళిన రోజున, వాళ్ళ అమ్మాయి శ్రావణి ఉన్నట్టుండి టక్కున టీవీ ఆపేసి ఇప్పుడే బాత్ రూము కెళ్ళేసి పడుకోమందిట. అదేమంటే వాళ్ళ అబ్బాయికి నిద్రాభంగం అవుతుందిట. చప్పుడుకులేస్తే ఓ పట్టాన పడుకోడుట. వారం రోజులు ఉందామనుకున్న వెంకట్రావు గారు మర్నాడే పెట్టేబేడా సర్దుకుని లేచక్కా వచ్చారుట!
ఈ కాలప్పిల్లలు వాళ్ళే పిల్లల్ని కంటున్నారనుకుంటారు. అవసరం అయినప్పుడల్లా పిల్లల్ని చూసుకోడానికి మనం కావాలి. కానీ పిల్లల్ని మనమీద వదిలెయ్యాలంటే వాళ్లకు చచ్చేటంత అనుమానం. “ఆర్ యు షూర్ యు కెన్ హాండిల్ దెమ్” అంటూ అడుగుతారు.
పద్మ గారు చెబుతున్నారు-వాళ్ళ మనవరాల్ని చూసుకోవాల్సి వచ్చినప్పుడల్లా ఆవిడకు గుండెల్లో రైళ్ళు పరిగెడుతూ ఉంటాయిట. కష్టపడి చూసింది కాక కూతురు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక ఆవిడ బుర్ర తిరిగిపోతుందిట. “ఎన్ని ఔన్సులు పాలు తాగింది? ఎన్ని సార్లు కక్కింది? ఎన్నిసార్లు నవ్వింది..తుమ్మింది? ఏ మ్యూజిక్ వింటూ నిద్రపోయింది? ” అంటూ యక్ష ప్రశ్నలు వేసి చంపుతుందిట!
మనం ఎన్ననుకున్నా ఎవరి పిల్లలు వాళ్లకు అపురూపం..అబ్బరమే! అది సహజం.
ఏమిటీ…మనం ఏమి వీళ్ళలా అతిగా బిహేవ్ చెయ్యలేదంటారా?
అలా అని మీరనుకుంటున్నారు. కానీ మీ టైములో మీరూ అదే పని చేసారు!
పిల్లల్ని ఇండియా తీసికెళ్ళాలంటే మీకు ప్రాణాంతకంగా ఉండేది గుర్తుందా?
పెద్దవాడు పసివాడుగా ఉన్నప్పుడు ఇండియా వెళ్ళాం. మీ బామ్మగారు వాడు గుక్కపట్టి ఏడుస్తున్నా లెక్కచెయ్యకుండా నూనెతో వళ్ళంతా మర్దన చేసి, సున్నిపిండితో నలుగు పెట్టి, వేడి నీళ్ళతో స్నానం చేయించారని మీకు గొంతువరకు కోపం వచ్చింది! ఇక మీదట మీ కొడుకును ముట్టుకోవడానికి వీల్లేదని అంత పెద్దావిడను బెదిరించారు! మీ ధోరణికి ఆవిడ ఆశ్చర్య పోయి ముక్కుమీద వేలేసుకుని, “అబ్బో! ఏమి అబ్బరమే అమ్మా!” అన్నారు.
ఆ తర్వాత రెండోవాడిని తీసికెళ్ళినప్పుడు, కృష్ణ అప్పుడే బాగా పారాడుతున్నాడు. తెల్లగా దొరబాబల్లె ఉన్న మీ అబ్బాయిని కిందకి దించితే ఎక్కడ మట్టి అంటుతుందో అని, అక్కడ ఉన్నన్నాళ్ళు వాడిని ఎత్తుకు మోసారు గుర్తుందా?
“పిల్లలన్నాక మట్టి అంటకుండానే పెరుగుతారా? ఏం అపురూపమే తల్లీ!” అంటూ అత్తయ్య గారు బుగ్గలు నొక్కుకోవడం నాకు బాగా గుర్తుంది!
ఏమిటీ…అప్పటి పరిస్థితులు వేరా? దానికీ దీనికీ ఏం సంబంధం లేదంటారా?!
.
*********************************
.
అబ్బరం - అపురూపం - నేపథ్యం
.
నేను అమెరికా వచ్చినప్పటినుంచీ నాకంటే ఎంతో ముందు వచ్చిన వారితోటే పరిచయాలు, స్నేహాలు అవడం వలన మేము ఎప్పుడు కలుసుకున్నా, నాకు తెలియని సంగతులు, ఆశ్చర్యం కలిగించే విషయాలు, భవిష్యత్తులో మాకు కూడా ఎదురయ్యే సంఘటనల గురించి వింటుండేదాన్ని. కొత్తగా అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు అయిన వాళ్ళ అనుభవాలు వింటుంటే, నాకు అప్పుడు నిజంగానే నవ్వొచ్చేది! ఒకసారి, ఒకావిడ పార్టీకివస్తూ ఆ టైములో బేబీసిట్ చేస్తున్న వాళ్ళ చిన్న మనవడిని తీసుకొచ్చారు. పార్టీ అంతా అయిపోయాక వెళ్లేముందు ఆవిడ “ఏమిటో ఇక్కడికి రాగానే వీడు అందరి దగ్గరికీ వెళ్ళిపోవటంతో, నేను నా హోంవర్క్ గురించి పట్టించుకోలేదు. రేపు పొద్దున మా అబ్బాయి పెట్టే పరీక్షలో నేను తప్పటం ఖాయం!” అంటూ నవ్వుకుంటూ కారెక్కారు!
ఈ సంభాషణలు అన్నీ తలచుకున్నప్పుడు, మా అమ్మాయిని పసిపిల్లగా ఇండియా తీసికెళ్ళినప్పుడు అప్పట్లో మేము ఎలా ఫీల్ అయ్యామో గుర్తుకొచ్చి, నవ్వుకుంటూ రాసిన ముచ్చట ఇది!!
.
*********************************