10_012 ఆనందవిహారి

.

తమిళనాట తెలుగురాజుల ఆలయ శిల్పకళావైభవం

– డా. పి. సుమబాల

 

                

                

                 తమిళనాడులో ఆబాలగోపాలాన్ని అలరించే శిల్ప, చిత్రకళలకు నెలవులైన దేవాలయాలలో అడుగడుగునా తెలుగు రాజుల ఉత్తమాభిరుచి, తెలుగు శిల్ప, చిత్ర కళాకారుల ఉన్నత ప్రతిభ కనబడుతుందని డా. పి. సుమబాల పేర్కొన్నారు. కైద్ ఏ మిల్లత్ ప్రభుత్వ మహిళా కళాశాల చారిత్రక అధ్యయన విభాగంలో సంయుక్త ఆచార్యులుగా ఉన్న ఆమె అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి నిర్వహించిన ‘నెల నెలా వెన్నెల’ కార్యక్రమంలో “తమిళనాట తెలుగు రాజుల ఆలయ  శిల్ప, చిత్రకళా వైభవం” అంశంపై ఆకట్టుకునే ప్రసంగం చేశారు. ఈ కార్యక్రమం శనివారం సాయంత్రం యూట్యూబ్ ద్వారా ప్రసారమైంది. 

 

ఆంధ్ర దేశం నుంచి మొట్టమొదట తమిళ ప్రాంతం మీద దండెత్తి వచ్చిన శాతవాహనులు ఇక్కడ దేవాలయాలు నిర్మించిన దాఖలాలు లేవని, తదనంతరం వచ్చిన వారి సామంతులైన పల్లవులు అనేక దేవాలయాలు నిర్మించారని, వాటిని మనం నేటికీ చూస్తున్నామని డా. సుమబాల గుర్తు చేశారు. వీరు  కాంచీపురాన్ని ముఖ్య పట్టణంగా చేసుకొని సామ్రాజ్యాన్ని విస్తరించారని, వీరితో అనేకమంది తెలుగు శిల్పులు, చిత్రకారులు, ఇతర కళాకారులు తమిళ దేశానికి వచ్చారన్నారు. క్రీ.శ ఆరవ శతాబ్దం నుంచి పదవ శతాబ్దం వరకు 400 సంవత్సరాల పరిపాలనలో వీరు నిర్మించిన దేవాలయాల శైలిలో వీరితో బాంధవ్యం కలిగిన విష్ణుకుండినుల ప్రభావం కనిపిస్తుందని తెలిపారు. 

 

కృష్ణా తీరాన మొగల్రాజపురం, ఉండవల్లిలలో వారు నిర్మించిన గుహాలయాల వలె ఈ రెండు వంశాల వారసుడు, తమిళనాట పల్లవ రాజ్య స్థాపనకు కారకుడైన సింహవిష్ణు పల్లవుడి కుమారుడు, సకల కళా వల్లభుడు అయిన  మహేంద్ర వర్మ తిరుచినాపల్లి, పల్లవరంలలో గుహాలయాలను నిర్మింపజేశాడని వెల్లడించారు. పల్లవులు ఆంధ్ర శిల్పకళా వారసత్వాన్ని తమిళ నేలపై స్థాపించి ఒక కొత్త ఒరవడికి నాంది పలికారని పేర్కొన్నారు. తొండై మండలంతో మొదలుపెట్టి తదిత ప్రాంతాల్లో కూడా  ఇటుక, కలప, లోహం లేని రాతి దేవాలయాలు నిర్మింపజేసిన ఖ్యాతి కూడా మహేంద్ర వర్మదేనని శాసనాలు చెబుతున్నాయని వివరించారు. మామళ్ళపురం  (మహాబలిపురం) ఆయన వారసులే నిర్మింపజేశారన్నారు. 

 

ఇక విజయనగర, నాయక రాజుల పరిపాలనలో నిర్మితమైన దేవాలయాలు, అప్పటికే ఉన్నవాటి  విస్తరణలో తెలుగు శిల్పులు, చిత్రకారుల నైపుణ్యం ఉట్టిపడుతూ ఉంటుందని డా. సుమబాల సోదాహరణంగా వివరించారు. సాహిత్యంలో, సమరంలోనే కాక ఆలయ నిర్మాణంలో కూడా శ్రీకృష్ణదేవరాయల కళా వైభవం  సుస్పష్టంగా కనిపిస్తుందని వ్యాఖ్యానించారు. కాంచీపురం ఏకామ్రేశ్వరాలయం దక్షిణ గోపురం ఇందుకు ఒక ఉదాహరణ మాత్రమేనన్నారు. ఇంకా అనేక విశేషాలతో తమిళనాట తెలుగు వైభవాన్ని వక్త కళ్ళకు కట్టారు. 

డా. కల్పన గుప్తా కార్యక్రమాన్ని నిర్వహించి, ఇటీవల స్వర్గస్తులైన ప్రముఖ సినీ గీత రచయిత  వెన్నెలకంటికి సంస్థ తరఫున నివాళులు అర్పించారు. 

 

.

**************************************

.

గజేంద్ర మోక్షం – పోతన హృదయం

 

రామాయణ, భారత, భాగవతాలు మూడూ మూడు సముద్రాలని, అవి మన దేశానికి మూడు వైపులా ఉన్న సహజ అగడ్తలని, భారతాంతర్గతమైనటువంటి భగవద్గీత ఉత్తరాన ఉన్న హిమాలయమని వర్ణిస్తూ.. ఈ నాలుగూ మన దేశాన్ని కాపాడుతున్న వాఙ్మయాలని ఆచార్య డా. కాసల నాగభూషణం వ్యాఖ్యానించారు. చెన్నైలోని ఆంధ్రా సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ లోని గోదావరి హాలు వేదికగా ఆదివారం సాయంత్రం వేద విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో “తరతరాల తెలుగు కవిత” కార్యక్రమం ఏర్పాటైంది. ఇందులో ప్రసంగించిన ఆచార్య కాసల పోతన భాగవతంలోని  “గజేంద్ర మోక్షం” ఘట్టాన్ని రమణీయంగా వివరించారు. 

 

ముందుగా సంస్థ కార్యదర్శి మధు కందనూరు స్వాగతోపన్యాసం చేస్తూ.. పది మాసాల విరామం అనంతరం పునఃప్రారంభిస్తున్నందుకు, అందుకు ప్రేక్షకులు ఆదరించినందుకు ఆనందాన్ని వ్యక్తం చేశారు. అధ్యక్షులు జేకే రెడ్డి చక్కని శ్లోకాన్ని ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

 

ఈ పది నెలల కాలంలో చెన్నై తెలుగువారికి దూరమైన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్రకారులు సత్తిరాజు శంకర నారాయణ, సినీ గీత రచయిత వెన్నెలకంటి, మరికొందరు సాహితీ ప్రముఖులకు  నివాళులర్పిస్తూ సభ రెండు నిముషాలు మోనం పాటించింది.

జేకే రెడ్డి వక్తను సభకు పరిచయం చేసి, ఆయన గురించి తను రాసిన ఒక పద్యాన్ని ఆలపించారు. సంస్థ తరఫున డా. సీ ఎం కె రెడ్డి, ఆస్కా కమిటీ సభ్యులు రంగారెడ్డి, జేజే రెడ్డి, మధులు ఆచార్య కాసలను నూతన వస్త్రాలతో, జ్ఞాపికతో సత్కరించారు.

 

వక్త మాట్లాడుతూ… కరోనా నుంచి ప్రపంచం కోలుకుంటున్న సందర్భంగా రామాయణ, భారత, భాగవతాల్లో ఏదైనా అంశాన్ని ఎంచుకుంటే బాగుంటుందని నిర్వాహకులు సూచించారన్నారు. ఈ మూడూ మూడు సముద్రాలని, అవి మన దేశానికి మూడు వైపులా ఉన్న సహజ అగడ్తలని, భారతాంతర్గతమైనటువంటి భగవద్గీత ఉత్తరాన ఉన్న హిమాలయాలని పేర్కొంటూ.. ఈ నాలుగూ మన దేశాన్ని కాపాడుతున్న వాఙ్మయాలని వ్యాఖ్యానించారు. 

 

పోతన  జన్మరాహిత్యాన్ని కోరుతూ భాగవతాన్ని అనువదించారని, మందార మకరంద మాధుర్యయుక్తమైన అనేక పద్యాలకు అది నెలవని కొనియాడారు. పోతన దృష్టిలో త్రిమూర్తులందరూ ఒక విష్ణువేనని వెల్లడించారు. ఆయనతోపాటు గంగన, సింగన, నారయలు కూడా భాగవతంలోని  కొన్ని స్కంధాలను అనువదించగా, గజేంద్ర మోక్ష ఘట్టం పోతన అనువదించిన భాగంలోనిదని వివరించారు. అందులోని అనేక పద్యాలను వివరిస్తూ ఆద్యంతం ఆసక్తిగొలిపేలా ప్రసంగించారు. మొసలి గజేంద్రుడి కాలిని పెట్టుకొనే సందర్భంలో…  “స్థాన బలిమే కానీ తన బలిమి కాదు” అని వేమన చెప్పిన పద్యాన్ని ఉటంకించారు. ఈ పద్యానికి గజేంద్ర మోక్ష ఘట్టమే స్ఫూర్తి కావొచ్చన్నది తన అభిప్రాయమని వెల్లడించారు. అనుప్రాస యుక్తమైనదంటూ “శ్రీ కైవల్య పదంబు” పద్యాన్ని వివరించారు. పోతన, శ్రీనాథుడు బావా బావమరుదులనే కథ ప్రచారంలో ఉందని పేర్కొంటూ ఆ విశేషాలకు తనదైన హాస్యం జోడించి వివరించారు. 

 

భాగవతం ప్రతిపాదించిన నవవిధ భక్తి మార్గాలలోని శ్రవణం ఆధారంగా భాగవత కథలను విని మోక్షం పొందినవాడు పరీక్షిత్తని అన్నారు. గజేంద్ర మోక్షం విన్నవారికి గజ తురగ శ్యందనాలు, కైవల్యం లభిస్తాయని పోతన ఫలశ్రుతి చెప్పారని, ప్రస్తుత పరిస్థితిలో కరోనా నుంచి కైవల్యం లభించగలదని ఆశిస్తూ వక్త ప్రసంగాన్ని ముగించారు. 

    

 చెన్నైలోని తెలుగు సాహితీప్రియులు కరోనాకు ముందులాగే అధిక సంఖ్యలో హాజరై నిర్వాహకులను ఉత్సాహపరిచారు. 

 

**********************************