.
చాసో గా కథా రచనా లోకం లో సుప్రసిద్దులైన చాగంటి సోమయాజులు గారి జననం 15/17. జనవరి 1915 శ్రీకాకుళం లో. తల్లి తండ్రులు లక్ష్మీనారాయణ శర్మ, తులసమ్మ గార్లు తరువాత కాలం లో పెదతల్లి తులసమ్మ గారి ఇంటికి దత్తుడు గా వెళ్ళడం తో కానుకొలను నరహరిరావు అనే పేరు మారింది.
శ్రీకాకుళం లో ప్రాధమిక విద్యాభ్యాసం, విజయనగరం లో మాధ్యమిక, విద్యాభ్యాసం అనంతరం విజయనగరం మహారాజా కాలేజీ లో ఉన్నత విద్య ని అభ్యసించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి. జనవరి 1 1994 న చెన్నై లో మరణించారు. వీరి అంతిమ కోరిక ప్రకారం వీరి భౌతిక కాయాన్ని పరిశోధనల నిమిత్తం వైద్య కళాశాలకి ఇచ్చారు. వీరి కుమార్తె చాగంటి తులసి రచయిత్రి. వీరి సాహిత్యం అంతా వీరు కాల్చిన పొగచుట్టల తాలూకు పొగల నుంచే వచ్చిందని వీరి సన్నిహితుల చమత్కారం.
వీరి రచనలు అన్ని ప్రముఖ పత్రికలలోనూ ప్రచురణ అయినప్పటికీ, 1983 లో విశాలాంధ్రా వారు చాసో కథలు అనే శీర్షిక తో ప్రచురించిన కథా సంకలనం లోని నలభై కథలు మాత్రం ఎక్కువమంది పాఠకులకు లభ్యం అయినాయి. ఆ పుస్తకం విశేషం గా జనాదరణ పొంది కొన్ని పునర్ముద్రణలు పొందింది. కానీ ప్రస్తుత కాలం లో లభిస్తుందా అన్న విషయం సంశయమే. కాళీపట్నం రామారావు గారి కథానిలయం లోనూ, ఇంకొన్ని అంతర్జాల సైట్ లలో కొన్ని కథలు మాత్రం లభ్యమవుతున్నాయి. ఆసక్తి గలవారు చదువుకోవచ్చు.
వీరిపై తోరూదత్ అనే భారతీయ ఆంగ్ల రచయిత్రి ప్రభావం వుంది అని కొందరు విమర్శకులు తీర్మానం చేసారు. దీని ఉద్దేశ్యం బహుశా ఈ తీర్మానం చేసిన వారికి తోరుదత్ అనే కవయిత్రి పేరు తెలుసునని పాఠకులకు తెలియజేయడం కావచ్చును.
వీరి కథలలో వస్తువూ, శిల్పం పోటాపోటీ గా సాగుతాయని అంటారు. వీరి దృక్పథం జాతీయ వాదానుకూలం. కథలలోని పాత్రలు నేల విడిచి సాము చేయవు. పరిష్కారాలు అందుకోలేని ఆదర్శాల పునాదుల మీద వుండవు. రచయితా, అతని పాత్రలు సమాజం లోని మనుషులే.
లభ్యమవుతున్న కథలలో నుంచి కొన్ని కథలను సంక్షిప్తం గా పరిచయం చేసుకుందాం.
.
వాయులీనం
వాయులీనం కథలో వెంకటప్పయ్య అనే సర్కారు చిరుద్యోగి, అతని భార్య రాజ్యం, ఇద్దరు పిల్లలూ ప్రధాన పాత్రలు. వెంకటప్పయ్య మదరాసు మహానగరం లో 70 రూపాయల జీతగాడు. రాజ్యం అనుకూలవతి ఐన ఇల్లాలు. బుద్ధిమంతులైన ఇద్దరు పిల్లలు. 15 రూపాయల అద్దె పెంకుటింట్లో కాపురం ఇల్లూ, పరిసరాలూ, సరిగ్గా లేకపోయినా, ఆర్థిక పరిస్థితి అంతకన్నా అనుమతించకపోవడం తో సర్దుకుపోక తప్పదు.
పెళ్ళికి ముందు రాజ్యం గాత్ర సంగీతాన్నీ, వాయులీనాన్నీ అభ్యసించింది. పెళ్ళిచూపుల వేళ వెంకటప్పయ్య తో వచ్చిన పెద్ద మనుషులు పాట పాడమని పరీక్ష పెడతారు. సిగ్గు, బిడియం, మొహమాటం కంగారు కలగలిపి రాజ్యం పాడిన పాట శృతి తప్పినా సంగీతం లో పరిచయం లేని పెళ్ళివారి చెవులకు అది ఇంపుగానే వుంటుంది.
సాఫీగా, సాదా సీదాగా జరుగుతున్న వారి సంసార జీవితం రాజ్యం అనారోగ్యం తో కొంచెం గాడి తప్పుతుంది. డాక్టర్ గారు కొన్ని మందులు రాసి ఇచ్చి, అవి వాడుతూ, ప్రస్తుతం వారు ఉంటున్న ఇంట్లో గాలీ వెలుతురూ తక్కువ, పరిసరాలు కూడా ఆరోగ్యకరం గా లేనందున కొంచెం మంచి ఇంట్లోకి మారమని సలహా ఇవ్వడం తో ఎక్కువ అద్దె ఇచ్చుకుని డాబా ఇంట్లోకి మారతారు. పాత పెంకుటి ఇంట్లో ఎంత తుడిచినా పోని దుమ్మూ, చూరు నిండా బూజులూ, గుడ్డి దీపాలూ.
కొత్త డాబా ఇంట్లో ట్యూబ్ లైట్లూ, ఫాన్లూ, ఇంటి చుట్టూ మొక్కలూ. ఇంట్లోకి వచ్చిన వేళా విశేషం ఏమో కానీ రాజ్యం అయిదారు నెలలకి బాగా కోలుకుని సత్తువ పుంజుకుంటుంది. మందులకీ అద్దెకీ అయిన ఖర్చు తడిసి మోపెడవుతుంది.
ఒకరోజు రాజ్యం, రోజూ లాగే సంధ్య వేళకు ముందే రాత్రి వంట ముగించుకుని, కొంచెం నీరసం గా అనిపించడంతో, ముందుగదిలో దీపం వెలిగించి పడుకుంటుంది. ఆ సంధ్యా సమయం లో వీస్తున్న చల్లగాలి పక్కింటి వారి పెరటిలో వెలగ పూవుల పరిమళాన్ని, రాజ్యం దగ్గరికి మోసుకుని వస్తుంది. అలాగే ఆ తెమ్మెర మోసుకుని వస్తున్న పక్కింటి వారి అమ్మాయి మధురం గా ఆలపిస్తున్న తోడి రాగం ఆలాపనలు, వాయిస్తున్న వాయులీన స్వరాలూ రాజ్యాన్ని ఏదో తెలియని లోకాలకీ, చిన్నతనపు జ్ఞాపకాలలోకీ తీసుకుని వెళ్ళ గా ఆమె వివశురాలవుతుంది. తాను కూడా త్వరగా కోలుకుని, పుట్టింటి నుంచి తెచ్చుకుని భద్రం గా పెట్టె లో దాచుకున్న వాయులీన వాయిద్య సాధననీ, మధ్యలోనే వదిలేసిన గాత్రాన్నీ తిరిగి ప్రారంభించాలి అని తీర్మానం చేసుకుని ఆ హాయిని అనుభవిస్తున్న సమయం లో వంటింట్లో ని నిప్పులు ఆర్పిన కుంపటి మీద పెట్టిన అన్నం గిన్నె మీద మూత లా పెట్టిన ఉన్న ఇత్తడి సిబ్బి కిందపడి రాజ్యం అలోచనలని భంగం చేస్తుంది. ఆటలు ముగించుకుని పిల్లలు ఇంటికి రావడం తో, రాజ్యం ఈ లోకం లోకి వస్తుంది.
కాసేపటికి ఇంటికి వచ్చిన భర్త తాను ఇంటికి వస్తూ డాక్టర్ గారిని కలిసి రాజ్యం పరిస్థితిని వివరించగా ఇంక మందుల అవసరం లేదన్నారని చెప్పి చేతిలోని పొట్లం ఆమె చేతిలో పెడతాడు. విప్పి చూసిన రాజ్యం సంబ్రమాశ్చర్యాలకి లోనవుతుంది. పొట్లం లో వున్నది మామూలు ఆడదాని దగ్గరనుంచి మహరాణీ వరకూ అందరూ ఇష్ట పడే పడే జరీ చీర.
అప్పటివరకూ వైద్యానికైన ఖర్చులూ, అప్పులూ తీర్చడానికి వేరే దారి లేక రాజ్యం తన పెట్టె లో పదిలం గా దాచుకున్న వయోలిన్ ని అమ్మకానికి పెట్టగా దుకాణం అతను దానిని చూసి ఎంతో ముచ్చటపడి రెండు వందల యాభై రూపాయలు తన చేతిలో పెట్టాడనీ, ఖర్చులకీ అప్పులకీ పోగా మిగిలిన దానితో ఎప్పటినుంచో రాజ్యం ముచ్చట పడుతున్న ఈ చీరను కొన్నానని, భర్త చెప్పడం తో రాజ్యం ముందు అవాక్కై, నిర్ఘాంత పోయి కన్నీరు పెట్టుకుంటుంది.
కాసేపటికి తేరుకున్న రాజ్యం సంగీతం తన కన్నతల్లి లాంటిదనీ, తాను ఆ తల్లిని సరిగా ఆదరించకపోయినా తన పట్ల తల్లి ఆదరణ చూపింది అనీ, పోతూ పోతూ తనకి ప్రాణం పోసి చీర పెట్టి తన తల్లి మాతృధర్మాన్ని నెరవేర్చుకుంది అనీ తాను సమాధానపడి భర్త ని ఊరడిస్తుంది.
.
కుక్కుటేశ్వరం
ఈ వూరు కి చెందిన ఒక వయోవృద్దురాలు ఒకప్పుడు బాగా బతికి చెడ్డ మనిషి, కొడుకు కాపురం బరంపురం లో. అతను అంతంత మాత్రపు సంపాదనాపరుడు, పెళ్ళాం పిల్లల తో ఒంటి గది ఇంట్లో కాపురం, ఒకేపూట భోజనం. ఈ పరిస్థితుల్లో తాను వాళ్ళకు భారం కాకూడదని కుక్కుటేశ్వరుణ్ణి నమ్ముకుని, ఆ వృద్దాప్యం లో కాలూ చేయీ కూడదీసుకుని లేని ఓపిక తెచ్చుకుని తెలుసున్న వారి ఇళ్ళలో పనులు చేసుకుంటూ, మాటలు పడుతూ వారిచ్చే అరకొర జీతాలలో కొంచెం వెనకేసి కొడుకునీ, కోడల్నీ, మనవలనీ చూద్దామని ఈవిడ రైలు ఎక్కుతుంది.
ఈవిడ ఆఖరుసారి చూసినప్పుడు మూడో మనవరాలు ఇంకా కనుగుడ్లు తెరవలేని పసికందు. ఈపాటికి ఆ అమ్మాయి పెద్దమనిషి అయి వుండవచ్చు.
ఈవిడ సామాన్లు మొత్తం రెండు మూటలు. ఒక దాంట్లో కట్టుకోవడానికి చిరుగుల చీరలు, రెండవ దాంట్లో కూడబెట్టిన కష్టార్జితం తో పిల్లల కోసం కొన్న నాలుక్కుంచాల బియ్యం.
ఇరుక్కుని పాసింజర్ లో కూర్చున్న ఈవిడ అన్నవరం వచ్చింది అని ఎవరో అన్న మాటలు విని లేని ఓపికను కూడదీసుకుని కదిలి కిటికీ దాకా వెళ్ళేసరికి దాటిపోతున్న గుడి గోపురం మాత్రం దర్శనం అవుతుంది.
తనకంతే ప్రాప్తం అనుకుని సమాధానపడి చల్లగా చూడమని భగవంతుణ్ణి వేడుకుని తిరిగి వచ్చి కూర్చుంటుంది.
తుని వచ్చేసరికి రైల్లో తనిఖీ అధికారులు ఎక్కుతారు.
ఆ కాలం లో వరి పంట తక్కువ అవడం తో బియ్యం సరఫరా మీద ప్రభుత్వం నియంత్రణ పెడుతుంది. బియ్యాన్ని పక్క ఊరి కి తీసుకెళితే వెళ్లడం కూడా నిషేధం. అలాంటి పరిస్థితులలో ఈవిడ బియ్యాన్ని ఏకంగా రాష్ట్ర సరిహద్దులు దాటించేస్తో ప్రభుత్వం వారి నియమాలను ఉల్లంఘించేస్తోంది. ఇది శిక్షార్హం.
ఈ విషయాలు తెలియని పెద్దావిడకి కి అధికారులు ఆమె దగ్గర బియ్యం మూటని స్వాధీనం చేసుకోవడం జీర్ణం కాదు. నెలలకొద్దీ శ్రమించి, తినీ తినక కూడబెట్టిన డబ్బు తో మనవలకి కొన్ని రోజులైనా ఒక పూటైనా భోజనం పెడదామని తన ఉద్దేశ్యం అనీ, వాళ్ళని చూసి కొన్ని ఏళ్ళు అయిందనీ ఎంత చెప్పినా వారు వినరు. బియ్యం మూటతో సహా ఆవిడని విచారణ కోసం స్టేషన్ లో దింపేసి తీసుకునిపోతారు.
పట్టరాని ఆవేశం ఉక్రోషాల తో ఊగిపోతూ ఆ పెద్దావిడ ” నేను దొంగనే, చేసిన నేరానికి నన్ను ఉరి తియ్యండి. నా కాష్టం పొగ తో కుక్కుటేశ్వరుడికి ధూపం వేయండి నాయనా ” అంటూ రోదిస్తుండగా కథ సమాప్తమవుతుంది.
.
చిన్నాజీ
ఈ కథలోని చిన్నాజీ పాత్రకి ప్రేరణ చాసో గారి కుమార్తె అని అంతర్జాలం లోని ఒక సమీక్షలో ఉంది. ఎంతవరకూ నిజమో మనకి తెలవదు.
కథలోని రచయిత జరుగుబాటు కు లోటు లేని మనిషి. తాను రాయడానికి కూర్చున్నప్పుడు ఎవరు మాట్లాడినా చిరాకుపడే స్వభావం ఉన్నవాడు. తాను కథ రాస్తున్నప్పుడు తన శ్రీమతి యాధాలాపం గా వంకాయ కూర ఎలా చేయమంటారు అని అడిగిన పాపానికి ఈవేళ వంకాయ కూర వద్దు. పొట్లకాయలు పాలతో ఉడికించి కూర చెయ్యమని ఇబ్బంది పెట్టే స్వభావం కల మనిషి. రాస్తున్న సమయం లో తన భార్య తో మాట్లాడడానికి ఇరుగుపొరుగు ఇంటి అమ్మలక్కలు వచ్చినా సహించలేడు.
అలాంటి మనిషి తమ పక్కింటి వారి మూడేళ్ళ చిన్న పిల్ల చిన్నాజీ తమ ఇంటికి వస్తే సరళ స్వభావుడై పోతాడు. దీనికి తట్టుకోలేని కవి గారి భార్య ఉక్రోషపడుతూ వుంటుంది.
కవి గారి అలోచన వేరు. తాను రేయింబవళ్ళు శ్రమించి, అంతరంగాన్ని మధించి, ఆలోచనలకు పదును పెట్టి రాసిన సాహిత్యం ఎవరికీ అక్కరలేనిదై పోయింది. తాను జీవించి వుండగా తనని ఎవరూ గుర్తించరు అన్న విషయం ఆయనకు అవగతమైంది. బహుశా చనిపోయిన తరువాత తనకి కొంత గుర్తింపు రావచ్చును అని మనసు లోని ఏదో ఒక మూల చిన్న సందేహం వుంది.
రాక రాక చిన్నాజీ వచ్చింది. చిన్నాజీ రాకడ ఉత్తమమైన కవిత్వం లాంటిది. ఎంతో మూడ్ కుదిరితే కానీ రాదు. చిన్నాజీ తో గడిపిన ఐదు నిమిషాలు షేక్స్ ఫియర్ నాటకం లోని ఐదు అంకాల పాటు చెయ్యవూ. ? అని రచయిత అనుకోవడం తో కథ ముగుస్తుంది.
.
***********************************