.
శ్రీ కోరాడ రామకృష్ణయ్య గారి కడపటి సంతానాన్ని, రెండవ కుమార్తెను నేను. వారి సాహిత్య భాషాసేవ, నవ్యమైనవారి విమర్శనా పటిమా, సునిశితమైన వారి ఆలోచనా సరళీ, ఇవన్నీ సాహితీ రంగంలోని వారికి సుపరిచితాలే. ఇక దైనందిన జీవితంలో వారి వ్యక్తిత్వం, జనక ఋషిలాంటి వారి స్వభావం, నా జీవితం మీద వారి ప్రభావం క్లుప్తంగా చెప్పటం వల్ల వారి మూర్తిని పరిచయం చేయడం జరుగుతుందనే ఉద్దేశ్యంతో నాలుగు మాటలు వారిని గురించి చెప్పాలని ఈ ప్రయత్నం.
నా చిన్ననాటి ముచ్చట్లు చెప్పడం మాత్రమే నా ఉద్దేశ్యం కాదు. కానీ ఆనాటి ఉన్నతమైన విలువలూ, వాటి ప్రభావం ఒక సంపూర్ణ వ్యక్తిత్వాన్ని కలిగించగల తీరూ, అన్నిటికీ మించి తలిదండ్రులు తమ పిల్లలకి ఉత్తమ అభిరుచులు కల్గించటం ఆ రోజుల్లో దైనందిన జీవితంలో ఎలా సాధ్యపడిందీ వాటి గురించి చెప్పాలీ అంటే నా చిన్నతనం… నాన్నగారు… నేనూ –
‘ ఉత్తిష్ఠ ఉత్తిష్ఠ కమలాదేవీ ఉత్తిష్ఠ ’ అంటూ తెల్లవారుఝామున నాలుగున్నరకల్లా లేపేసేవారు. ఓ అయిదు నిమిషాల్లో తెమిలి కూర్చుంటే ప్రాతఃకాల ప్రార్థనకి – ప్రాతఃస్మరామి రఘునాథ ముఖారవిందం – అంటూ శ్రీరామచంద్రమూర్తి సుప్రభాతంతో మొదలుపెట్టి, కస్తూరీతిలకం; చేర్చుక్కగానిడ్డ చిన్ని జాబిల్లిచే సింధూర తిలకమ్ము చెమ్మగిల్ల; శ్రీయన గౌరినాబరుగు; ఎవ్వనిచే జనించు; ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తీ; భక్తాపాయ భుజంగగారుడ మణిః; శతృచ్ఛేదైకమంత్రం; నమశ్శివాభ్యాం…ఇలా సాగేది మా ప్రార్థన. వారు మొదలు అందిస్తుంటే అలా పూర్తి చేసుకుంటూ పోవడమే. ‘‘ అంగనా మంగనా మంతరే మాధవం; హే గోపాలక హే కృపాజలనిధే; నీవే తల్లివి తండ్రివి; ఎవ్వనిచే జనించు… ” ఇలా ఈ పద్యం, ఆ శ్లోకం అని కాకుండా భారతం, భాగవతం, కృష్ణకర్ణామృతం, ముకుందమాల, కృష్ణశతకం, దాశరథీ శతకం… ఎందులోనైనా సరే అలా మనసుకి ‘ బాగుంది ’ అనిపించిన వాటిని అలా చదువుకుంటూ పోవడమే. ‘ ఈ పద్యం నాకు చెప్పలేదు నాన్నా ’ అనే దాకా సాగేది. ఆ పద్యమో శ్లోకమో అప్పటికప్పుడే 5,6 సార్లు వల్లింపజేసి, అర్థం తాత్పర్యం చెప్పేవారు. అంతటితో ప్రార్థన ముగిసేది. అప్పటికి 6 గంటలు అయ్యేది. మేడ మీద నుంచి కిందికి దిగి ఓ పది నిమిషాల్లో తెమిలి మద్రాసులో ఉన్నప్పుడు బీచ్‌కీ, తిరుపతిలో ఉన్నప్పుడైతే కపిలతీర్థం దాకానో, అలిపిరి దాకానో ప్రభాత నడకకు బయల్దేరేవాళ్లం. దారిలో వేంకటేశ్వర సుప్రభాతం శ్లోకాలూ, బాలరామాయణం శ్లోకాలు చెబుతుండేవారు, అక్కడిక్కడే అర్థతాత్పర్యాలతోసహా. నాన్నగారి బోధనలో ఇది మాత్రం ప్రత్యేకం! తిరుపతిలో కపిలతీర్థం వెళ్లేదారిలో గొల్లవాళ్ల ఇళ్లుండేవి.
శ్లో. ‘యోషాగణేన వరదధ్ని విమధ్యమానే
ఘోషాలయేషు దధిమంథన తీవ్ర ఘోషాః’
అంటూ శ్లోకం చెబుతూ వాళ్ల ఇళ్లకేసి తీసుకెళ్లి, వాళ్లు చల్ల చిలకటం చూపించి – ‘‘ మనం చెప్పుకున్నామే? యోషాగణం… అదుగో వారే! అదే ఆ దధి మంథన తీవ్ర ఘోష, వింటున్నావ్‌గా? ’’ అంటూ ఆ దృశ్యం మనసులో నిల్చిపోయేలా చెప్పేవారు. అలా అడవిదారిలో ప్రభాతసమయంలో దూరంగా ‘‘ భృంగావళీచమకరంద రసానువిద్ధ ఝంకార గీతాల్ని’’ వింటూ అలా నడవడం ఒక మరపురాని అనుభూతి. తిరిగి వచ్చేదారిలో ఒకరింట్లో వీధి కటకటాల్లో కొంకికి తగిలించిన చిలక పంజరం ఉండేది. ఆ గుమ్మం ముందు ఆపి…
శ్లో. ఉన్మీల్య నేత్ర యుగముత్తమ పంజరస్తాః
పాత్రావశిష్ట కదళీఫల పాయసాని
భుక్త్వా సలీల మధు కేళి శుకాః పఠన్తి
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం
… అంటూ శ్లోక సందర్భాన్ని ప్రత్యక్షంగా చూపిస్తుంటే ఇప్పటికీ ఆ దృశ్యం మనో ఫలకమ్మీద ముద్రింపబడిపోయింది శ్లోకంతో సహా. ఇదీ వారి బోధనా సరళి. రేడియోలో తెలుగు వార్తలొచ్చే టైమ్‌కి ఇంటికి చేరుకునేవారం. హోంవర్క్ చేసుకుని తెమలి స్కూలికి వెళ్లటమే. ఇప్పట్లా బోల్డు, బండెడు హోంవర్క్ ఉండేది కాదు ఆరోజుల్లో!
ఉత్తమ సాహిత్యం చదివే అలవాటూ, మంచి సంగీతం మీద అభిరుచీ వారు నేర్పినవే. అందుకు తగినట్లే ఆ రోజుల్లో మద్రాసులో శ్రీ బులుసు వెంకట్రమణయ్యగారు, శ్రీ వసంతరావు వెంకటరావు గారూ, సంధ్యావందనం శ్రీనివాసరావ్ గారు, శ్రీభాష్యం అప్పలాచార్యులు గారి లాంటి – ఆనాటి, ఈనాటి మహామహులు మా ఇంట్లో ఉండేవారు. మిడిల్ స్కూల్ చదివే రోజుల్లోనే మంచి మంచి చారిత్రక నవలలూ, పౌరాణిక నాటకాలూ, శ్రీశ్రీ, భమిడిపాటి కామేశ్వర్రావ్, శ్రీ మొక్కపాటి నరసింహ శాస్త్రి, శ్రీ గురజాడ అప్పారావ్, శ్రీ కాళ్లకూరి వారివంటి మహామహుల హాస్య నాటికలు తెచ్చి చదివించి, వాటిని గురించి తనకు చెప్పమనేవారు. చదివిన వాటిల్లో నచ్చిన అంశాన్నీ, లేదా కొత్తగా అనిపించిన విషయాన్నీ గురించి నాన్నగారితో చర్చించడం చాలా బాగుండేది. కొన్నిసార్లు రాసి చూపించమనేవారు కూడా.
మా స్నేహితులు కొందరు ఆ రోజుల్లో కొత్తగా ‘యువ ప్రచురణల’ పేరుతో వచ్చే కొవ్వలి, చలం నవలలు చదవడం చూసి నేనూ ఒకసారి ఎవరూ చూడకుండా చదూదామని మొదలుపెట్టాను. ఆ రోజుల్లో వాటిని మరీ పెద్దవాళ్లు ఇష్టపడే వారు కాదు. ఇంతకీ పుస్తకం పేరు ‘ లాటరీ పెళ్లాం ’. నాన్నగారు చూసినట్లున్నారు. ఒక్కమాటేనా మాట్లాడకుండా నా చేతిలోంచి పుస్తకం తీసుకుని మధ్యకి చించి పారేసి వెళ్లిపోయారు. అంతే… నాల్గు రోజులదాకా నాన్నగారి కంటపడకుండ తప్పుకొని తిరిగాను వారికిష్టంలేని పనిచేసినందుకు. ఐదోరోజు నన్ను పిలిచి అడవి బాపిరాజుగారి ‘ హిమబిందు ’ నవల ఇచ్చి చదవమన్నారు. ఇదీ వారు మందలించకుండా ఏ పుస్తకాలు చదవాలో చెప్పేతీరు!
వచ్చిన సినిమాలన్నీ చూసే అలవాటుండేది కాదు. ‘ ఝాన్సీరాణి ’ పాఠం ఉండేది మాకు. హిందీలో ఆ సినిమా వస్తే తీసుకెళ్లి, పాఠంలో చదివిన దానిని సినిమాలో చూసినదానితో అన్వయించి చెప్పీ, ఆ పాఠం మనసుకి హత్తుకునేలా చేశారు. భక్తపోతన, త్యాగయ్య, మల్లీశ్వరి ఇవీ వారితో చూసిన మరికొన్ని సినిమాలు.
విలక్షణంగానూ కొత్తగానూ ఆలోచించే తీరు నేర్పేవారాయన. ఏడో తరగతి చదివే రోజుల్లో ఒకసారి వార్షికోత్సవానికి మోనో యాక్షన్ కాంపిటిషన్ లో పేరిచ్చాను. మా స్నేహితులు కొందరు నాటకాల్లోని ఒక సీనో, సినిమాల్లోని సీనో చేస్తున్నట్లు తెల్సుకున్నాను. నేనేం యాక్ట్ చేయాలో అర్థంకాక నాన్నగారిని సలహా అడిగాను. అందుకు ఏదైనా ఒక సీన్ చెప్పండని అడిగితే మనుచరిత్రలో వరూధినీ ప్రవరాఖ్యుల సంవాదం పద్యాలు నేర్పి చదవమన్నారు. ‘ ఎవ్వతె వీవు భీతహరిణేక్షణ ’ అంటూ ప్రవరాఖ్యుడు అడగటం,
‘ ఇంతలు కన్నులుండ తెరువెవ్వరి వేడెదు భూసురేంద్ర ’ అంటూ వరూధిని జవాబూ,
మరికొంత సంభాషణా, వాగ్వాదం జరిగాక–
‘ చెప్పకుమిట్టి తుచ్ఛ సుఖముల్ మీసాలపై తేనియల్ ’ అంటూ ఛీత్కరించి
‘ దానజపాగ్నిహోత్రపరతంత్రుడనేని ’ అంటూ హవ్య వాహనుని ప్రార్థించి ప్రవరాఖ్యుడు పురం చేరిన వైనమూ – ఒక సీన్ చెప్పారు. రాగయుక్తంగా పద్యం చదవటం నాన్నగారే నాకు నేర్పారు. ‘ ఎవరూ ఇలా పద్యాలు చదవరు. నేనొక్కదాన్నే చదూతే బాగుండదేమో నాన్నా! ’ అంటే ‘ ఎవరూ చదవటం లేదు కనక ఇంకా బాగుంటుంది ’ అని ప్రోత్సహించారు. మొత్తానికి వెళ్లి – వరూధినీ ప్రవరాఖ్యసంవాదం మోనోయాక్షన్ చేయటం మొదటి బహుమతి రావటం జరిగింది. వచ్చిన జడ్జీలకి కూడా చాలా నచ్చిందీ ప్రయోగం. మనుచరిత్ర కథ గురించి వచ్చిన వాళ్లలో ఓ జడ్జీ గారు ఆనాటి చిన్న మీటింగ్‌లో క్లుప్తంగా చెప్పారు కూడా పిల్లలకి. సందర్భం వచ్చినప్పుడు కావ్యాలనైనా చిన్న కథల్లా పిల్లలకి చెప్పే అలవాటు ఆనాటి ఉపాధ్యాయులది.
ఆ రోజుల్లో మద్రాసు అన్నిటికీ కూడలి. సంగీతం, సాహిత్యం, కోర్టు, వింత, చదువూ… ఇలా దేనికైనా మద్రాసు రావలసిందే. అలా మద్రాసు వెళ్లినవారెవరేనా ఈ రోజుల్లోలా హోటళ్లలో దిగటం ఉండేది కాదు. మనవాళ్లెవరున్నారో తెల్సుకుని వాళ్లింటికెళ్లటమే. అటు విజయనగరం నుంచి నెల్లూరు దాకా ఎవరే పని మీద వచ్చినా పూర్తయ్యేదాకా ట్రిప్లికేన్‌లో రామకృష్ణయ్యగారింట్లో దిగాల్సిందే. ఎప్పుడూ వచ్చేపోయె జనాల్తో, నరసింహ జయంతీ, కృష్ణాష్టమీ, శ్రీరామనవమీ, దేవీ నవరాత్రుల బొమ్మల కొలువులూ, ఓహ్… ఎంతో కోలాహలంగా ఉండేది. శ్రీ చిరంతనానంద స్వామివారూ, శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారూ, శ్రీ గిడుగు రామ్మూర్తి పంతులుగారూ, శ్రీ మామిడిపూడి వెంకట్రంగయ్యగారూ, శ్రీ మొక్కపాటివారూ, ప్రొ. సాంబమూర్తి గారూ ఇలా అన్ని రంగాల ప్రముఖులూ ఏదో సందర్భాన్ని పురస్కరించుకుని తరచు వస్తూ పోతూ ఉండేవారు. మా ఇంటి మేడమీద అప్పుడప్పుడు కవి సమ్మేళనాలు కూడా జరుగుతుండేవి. ఇవి కాక రామకృష్ణా మిషన్‌కి, థియసాఫికల్ సొసైటీల్లో జరిగే ఆథ్యాత్మిక ప్రసంగాలకీ నాన్నగారితో కూడా వెళ్తుండేదాన్ని. ఆ ఆథ్యాత్మిక వాసనే నా జీవితంలో ఈనాటికీ పరిమళాన్ని వెదజల్లుతూ ఉంది.
మద్రాసులో అప్పుడప్పుడు రాత్రి 8 గంటల ప్రాంతంలో ద్వారం వెంకటస్వామినాయుడు గారింటికెళ్లి కూర్చునేవారం. వారు వైలెన్ వాయిస్తుంటే వింటూ కాస్సేపయాక వారింట్లో మొక్కల మధ్యనున్న సిమెంటు బెంచి మీద ఇద్దరూ కూర్చుని రాగాలూ, రచనలూ, పాడే విధానాల గురించి మాట్లాడుకుంటూ ఉండేవారు. యూనివర్సిటీలో అయితే ప్రొఫెసర్ సాంబమూర్తిగారితో సంగీత శాస్త్ర గ్రంథాల గురించి చర్చ ఎక్కువగా సాగేది. తిరుపతిలో ఉన్నప్పుడు శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారింట్లో శర్మగారు ప్రతి శుక్రవారం వైలెన్ వాయిస్తూండేవారు. అప్పుడప్పుడు వారి కుమార్తె పాడేవారు.
చెంబై వైద్యనాథ భాగవతార్, ఎమ్మెస్ సుబ్బలక్ష్మీ, చౌడయ్యల వంటి పెద్దల కచీరీలకీ, కమలా లక్ష్మణ్, ఉదయశంకర్ లాంటి వారి డాన్స్ ప్రోగ్రాములకీ నాన్నగారి కూడా నేనుండాల్సిందే! ప్రకృతి రమణీయత అంటే నాన్నగారికి తగని మక్కువ. అందుకే ప్రతి వేసవి శలవుల్లోనూ కోనసీమకి వచ్చేవాళ్లం. అమలాపురంలో నాకసలు స్నేహితులే లేరు. నాన్నగారే అక్కడ నా స్నేహితులు. అక్కడ కూడా ఉదయాన్నే దాదాపు 2 మైళ్ల దూరంలో ఉన్న గోదావరి కాలువ గట్టుకి ప్రభాత నడకకు వెళ్లేవాళ్లం. పచ్చని పొలాలమధ్యనున్న సన్నిని కాలిబాట మీద నడక. ఆ గోదావరి నీళ్లు తాగడం నాన్నగారికిష్టం. అందుకే ఇద్దరం చెరో పెద్ద చెంబుల్తో గోదారి నీళ్లు తెచ్చుకునేవారం తిరిగి వచ్చేటప్పుడు!
ఇంటి పెరట్లో మల్లెపందిరికి పాదులు చేస్తూ, నీళ్లు తోడిపోస్తూ నా చేత కరుణశ్రీగారి పద్యాలూ, పుష్పవిలాపం, పుత్తడి బొమ్మా పూర్ణమ్మా, ‘ ఆంధ్రతోటల సంస్కృతీ వనలతాళి అంటు తొక్కెడి ఆంధ్రవిద్యార్థి నేను ’ లాంటి చక్కటి పద్యాలు చదివించుకొనేవారు. సాయంత్రానికి రెండుమూడు గంటలేనా అప్పటివరకూ నేను నేర్చుకున్న సంగీతం పాడించుకునేవారు. శ్రీ విస్సా అప్పారావుగారూ, కల్లూరి వీరభద్రశాస్త్రి గారూ సంకలనం చేసిన ‘ త్యాగరాజ కృతులు ’ పుస్తకం ఉండేది. ఆ పుస్తకం ఎప్పుడూ నాన్నగారితో కూడా ఉండేది. రేడియోలో దివ్య నామకీర్తనలు ఏవైనా వస్తుంటే వెంటనే ఆ పాట వెతికి చూసి పాడేవాళ్లతో కూడా విని పాడేదాన్ని. దివ్య నామకీర్తనలు, ఉత్సవ సంప్రదాయ కీర్తనలు సులభంగా ఉంటాయి కనుక విని నేర్చుకోడం సులభం. ఆ పాటకి సంబంధించిన వివరాలు చదూకునే వాళ్లం. ఈ విధంగా ఒక పాట, దాని అర్థం, సందర్భం అన్నీ ఒక్కసారి మనసులో హత్తుకోడం వల్ల మర్చిపోడం అంటూ జరగదు. ఇలా ప్రతీదీ అధ్యయనమే!
మద్రాసులో ట్రిప్లికేన్‌లో పార్థసారథి స్వామి గుడి వీధిలో మా ఇంటి చుట్టుపక్కల ఎక్కువగా శ్రీ వైష్ణవులుండేవారు. ఒకసారి మా స్నేహితులందరం వీధి అరుగుమీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం సాయంత్రం. నాన్నగారు ఇంట్లోంచి వచ్చి, మా ముందు నుంచి ఎక్కడికో వెళ్లారు. నాన్నగారు నల్ల చుక్క బొట్టు(అగులు) పెట్టుకునేవారు. ఇంతలో ఓ అయ్యంగార్ల అమ్మాయి అంబుజ, ‘ కమలా, మీరు అయ్యర్లా అయ్యంగార్లా? ’ అంది (అంటే శైవులా? వైష్ణవులా? అని). ఏమో? నిజానికి నాకు తెలీదు. తెల్సుకునే సందర్భమూ రాలేదు. ‘ ఎలా తెలుస్తుంది? ’ అంది తంగచ్చి. అప్పుడు పార్వతి విడమరచి చెప్పింది. ‘ నాన్నగార్ల పేరు చివర అయ్యంగార్ అని ఉంటే అంబుజ వాళ్ల నాన్నగారిలా గోపాల అయ్యంగార్ అని ఉంటే వాళ్లు వైష్ణవులు. వాళ్లు నామాలు పెట్టుకుంటారు. అలాకాక మా నాన్నగారిలా పేరు చివర అయ్యర్ అని… పంచాపకేశయ్యర్ అని ఉంటే శైవులన్నమాట. ఇంకా అయ్యర్లు నుదుట విభూతి అడ్డంగా పెట్టుకుంటారు, అయ్యంగార్లు నుదుట నామాలు పెట్టుకుంటారు ’ ఇలా చాలా విడమరిచి చెప్పింది. మళ్లీ అంబుజ అందుకుంది. ‘ మీ నాన్నగారి పేరులో ఉత్త ‘రామకృష్ణయ్య’ అని మాత్రమే ఉందేమిటి? పైగా అడ్డంగానూ, నిలువుగానూ కాక మీ నాన్నగారు నల్లచుక్క బొట్టు పెట్టుకుంటారు. మరి వాళ్లనేవంటారు? ఇదీ ప్రశ్న. ‘ సరే నాన్నగారినే అడిగి చెప్తా ’ అన్నాను. రాత్రి నాన్నతో సాయంత్రం మా బృందంలో జరిగిన సంభాషణ వివరాలు చెప్పా. ఇంతకీ మనం ఎవరం నాన్నా? అన్న నా ప్రశ్నకి – ఈ పద్యం చెబుతా నేర్చుకో… అంటూ
‘ శ్రీయన గౌరినాబరగు చల్వము చిత్తము పల్లవింప భ
ద్రాయ మూర్తిౖయె హరి హరంబగు రూపము దాల్చి విష్ణురూ
పాయ నమశ్శివాయయని గొల్చెడి భక్త జనంబు వైదిక
ధ్యాయతకిచ్చమెచ్చు పరతత్వము గొల్చెద నిష్ట సిద్ధికిన్ ’
పద్యం నాలుగైదు సార్లు నేర్పి అర్థం చెప్పారు. సరే, అంతా వల్లెవేశానే కాని ఇంతకీ మేం ఎవరో అర్థం కాలేదు. ఆ మాటే అడిగితే ‘ మనం శివుణ్ణి, విష్ణువుని కూడా సమంగానే పూజిస్తాం. మనకి ఆ భేదం లేదు ’ అన్నారు. నాకేమైనా అర్ధమైందా అంటే అయినట్లూ కానట్లూ!! నిద్దరొచ్చేస్తుంటే వెళ్లి పడుకున్నా. నిద్దట్లో కూడా ఇదే ఆలోచన. మేం ఎవరం ??
మర్నాడు సాయంత్రం మళ్లీ అందరం తొక్కుడు బిళ్ల ఆడి, అరుగుమీదికి చేరాం. అంబుజ నిన్నటి విషయం గుర్తుగా –“ మీ నాన్నగారిని అడిగావా కమలా? ” అంది. ఆ… పరధ్యానంగా అంటూనే ఒక్కసారి నాన్నగారితో నా సంభాషణంతా గుర్తు తెచ్చుకున్నాను. పద్యం మనసులో చెప్పుకున్నాను. ఈ ప్రశ్నకి జవాబు అందులోనే ఉండి ఉంటుంది. అందుకే నాన్నగారు నేను అడగ్గానే ఈ పద్యం చెప్పారు. శ్రీ (యన) గౌరి = లక్ష్మీ, పార్వతి. హరి, హర=లక్ష్మీదేవి భర్త హరి, గౌరీదేవి భర్త హరుడు. విష్ణురూపాయ; నమశ్శివాయ–మళ్లీ వాళ్లిద్దరే!! ఇవికాక ఇంకేం ఉంది పద్యంలో? ఆ… పరతత్వము గొల్చెద… అని ఉంది కదా! సరే! ‘ మేం పరతత్వంవారం ’ అన్నాను! అలాంటిదెప్పుడూ వినలేదే అంటారు వాళ్లు. నాన్నగారే చెప్పారు. కావలిస్తే పద్యం కూడా చెప్పారు వినండి అంటూ పద్యం అంతా చదివి వినిపించేసరికి – నిజమే విష్ణురూపాయ, నమశ్శివాయతోపాటు పరతత్వము అని కూడా ఉందిగా! ఓహో పరతత్వంవారు నల్ల చుక్క బొట్టు పెట్టుకుంటారన్నమాట! అలా సందర్భానికి తగిన సమయస్ఫూర్తిని చెప్పకనే చెప్పి నా మనసులో కలిగించారు నాన్న. పరతత్వ భావన ఆ చిన్నతనంలో గాఢంగా నాటుకుపోయేలా చేశారు. ఆ అద్వైత భావనే ఆది శంకరుల తత్వాన్ని లోతుగా అర్ధం చేసుకోడానికి ఉపకరిస్తూంది. ఇలా నాన్నగారితో గడిపిన ప్రతిక్షణం, విన్న ప్రతి విషయం ఏదో ఒక కొత్త విషయాన్ని తెల్సుకోడానికీ, మనసులో ప్రతిష్టించుకోడానికీ పనికి వచ్చేది.
శ్రీ వీరేశలింగం పంతులుగారి సంస్కరణాభిలాషా ప్రభావం చాలామంది మీద ఉన్నట్టే నాన్నగారి మీద కూడా ఉండేదనుకుంటాను. మా పెదతల్లి కుమార్తె అతి పిన్న వయసులోనే పసుపుకుంకుమలకు దూరమై, ఏవిధమైన వ్యాపకమూ లేకుండ పల్లెటూర్లో గడపడం చూసి నాన్నగారు ఎంతో కష్టం మీద అందరినీ ఒప్పించి, తను బాధ్యత వహించి మద్రాసు తీసుకుని వచ్చి లేడీ విల్లింగ్టన్ విడో హోంలో చేర్పించి చదివించారు. ఆమె ఆ తర్వాత అదే స్కూల్లో ఉపాధ్యాయినిగా చేసి రిటైరై, తాను పుట్టిన గ్రామంలో ఒక కాలేజీ స్థాపనకు కారకురాలు కాగలిగింది.
స్త్రీలు బైటికి వచ్చి చదువుకోవడం అరుదైన రోజులవి. అలా చదూకోవాలని ఉత్సాహం చూపిన శ్రీమతి కాంచనపల్లి కనకమ్మగారు, బత్తుల కామాక్షమ్మగారు వంటి కొందరు నాన్నగారి వద్ద చదువుకుని విద్వాన్ పరీక్ష పాసైనారు. జీవితంలో తమదైన ప్రత్యేకతను నిల్పుకున్న విదుషీమణుల్లో వీరు కొందరు. ఆనాటి స్త్రీలలో శ్రీమతి దుర్గాబాయమ్మగారి ధైర్యం, చొరవా, వాక్చాతుర్యాలని గురించి ఎంతగానో మెచ్చుకునేవారు నాన్నగారు.
గాంధీగారి ఆలోచన తీరు నాన్నగారికి చాలా ఇష్టం. భగవద్గీత గాంధీ గారి జీవితానికి చుక్కాని వంటిదని చెబుతుండేవారు. నేను పెళ్లయి అత్తవారింటికి వెళ్లేప్పుడు గాంధీ గారు కామెంటరీ రాసిన భగవద్గీత ఇచ్చారు. నిజంగా భగవద్గీత నా దైనందిన జీవితంలో ఎంతో మార్గదర్శకమై తృప్తిని వెతుక్కుని శాంతిగా జీవించటం ఎలాగో నేర్పింది. చిన్నతనంలో నాన్నగారి తోడి సాన్నిహిత్యంతో వారి మాటలూ, వారి ఉన్నతమైన అభిరుచులూ నా జీవనగమనానికి ఎంతగానో సహకరించాయ్. నాకు మార్గదర్శకాలైనాయ్. నన్నెంతగానో ప్రభావితం చేశాయ్.
ఇలా వారి ఔన్నత్యం అడుగడుగుకు మార్గదర్శకమై సాగింది నా జీవితంలో. కేవలం జన్మకారకులుగా మాత్రమే కాక నా వ్యక్తిత్వ వికాసంలో వారి ప్రభావమే ప్రముఖం! వారి స్మృతికి అంజలి ఘటించే అవకాశం నా అదృష్టం.
‘కమల’
( 1992 శ్రీ కోరాడ రామకృష్ణయ్యగారి శతజయంతి సంచిక ‘సాహితీ నీరాజనం’ నుండి… )
.
****************************************