10_012 తో. లే. పి. – మధురాంతకం నరేంద్ర

.

ఆ తరం తెలుగు రచయితలలో అగ్రశ్రేణి కి చెందినవారిలో ఒకరు శ్రీ మధురాంతకం రాజారాం గారు. తెలుగు సాహిత్యానికి సంబంధించి కథ, నాటకము, నాటిక, గీతాలు.. మొదలైన వివిధ  ప్రక్రియలలో ఉన్నత ప్రమాణాలను పాటిస్తూ, సాహిత్యం లో మకుటాయమానం అనదగ్గ రచనలు చేసారు శ్రీ రాజారాం గారు. వృత్తి రీత్యా ఆయన ఉపాధ్యాయుడే అయినా ప్రవృత్తిపరంగా సాహితీ వ్యవసాయం చేస్తూ అవిరామంగా కృషి చేసిన కృషీవలుడాయన. అప్పట్లో భారతి మాస పత్రికలోనూ, ఆంధ్రపత్రిక లోనూ రాజారాం గారి రచనలు ఆ పత్రికలకే అలంకారాలు  గా భాసిల్లేవి. రాజారాం గారి రచనలలో వాస్తవికత తొంగి చూసేది. కల్పనలకు కడు దూరం ఆయన రచనా శైలి. ఒక సందర్భం లో ఆయన నాకు వ్రాసిన ఉత్తరం లో ఈ విషయాన్నే ప్రస్తావించారు. రచన వాస్తవికత కు అద్దంపట్టాలని కాల్పనికతకు తావివ్వకూడదని అంటూ, ఇసుకలో పడుకుని పసిడి మేడలు కట్టడం తన అభిమతం కాదని వ్రాసారు. 

రాజారాం గారి పుత్రులు నరేంద్ర, మహేంద్ర కూడా తండ్రిబాటలోనే అడుగులు వేస్తూ సాహితీ పిపాసను ప్రోది చేసుకున్నారు. వాస్తవానికి తండ్రి రచనలను విమర్శనాదృక్పధంతో సమీక్షను చేసే తొలి  వ్యక్తులు ఈ అన్నదమ్ములే. నిజానికి ఇద్దరికీ కూడా సాహిత్య పిపాస మెండుగా ఉండేది. రాజారాం గారి ఇల్లు సాహితీగోష్టులకు వేదిక గా ఉండేది. వీరి ఇంట ఆ రోజులలో తరచుగా జరిగే సాహితీ గోష్టులలో పేరెన్నికగన్న రచయితలెందరో పాల్గొంటూ ఉండేవారు. ఆ గోష్ఠులు ఈ అన్నదమ్ముల సాహిత్యాభిలాష  మరింతగా పెరగడానికి దోహదపడేవి. వీరిలో తమ్ముడు మహేంద్ర రచయిత, చిత్రకారుడు తాను ఒక పుస్తకం రచించి, అందులో బొమ్మలు తానే వేసుకున్నాడు. కానీ, అటు పిమ్మట దురదృష్టవశాత్తూ మహేంద్ర కాలం చేయడం విషాదకరం. ఇక అన్న నరేంద్ర చదువు మొదట్లో సాహిత్యేతర రంగం లో సాగినా, అటు పిమ్మట కొంతకాలానికి అది తన మార్గాన్ని సాహిత్యం దిశ గా మార్చుకుంది. ఆ రకం గా నరేంద్ర తన అభిరుచికి అనుగుణం గా చదువును కొనసాగించి అటు పిమ్మట అధ్యాపక వృత్తి లో ప్రవేశించి అందులో ఉన్నత స్థాయి కి చేరుకుని చివరకు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి లో ఆంగ్ల శాఖాధిపతి ( Professor, Department of English ) గా పదవీ విరమణ చేయటం జరిగింది. తన ఉద్యోగ పర్వం లో విధులలోని ఒత్తిడి కారణం గా, తన ఆసక్తి కి అనుగుణం గా రచనారంగం వైపు ఎక్కువగా దృష్టిని సారించడానికి తగినంత సమయం లభ్యమయ్యేది కాదు. ఈ విషయాన్నే తాను నాకు 2009 లో వ్రాసిన ఒక ఉత్తరం లో ప్రస్తావించడం జరిగింది. అయినప్పటికీ, తన విధులను ఒకప్రక్క నిర్వహిస్తూనే వేరొక వంక గ్రంథ రచన ను చేస్తూ ఉండడం ఒక విశేషం. నరేంద్ర కలం లో వెలువడి, గ్రంధస్తం అయిన రచనలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణ కు :

కథాస్రవంతి. 

అస్తిత్వానికి అటూ ఇటూ 

రెండేళ్ల పధ్నాలుగు 

ఆంస్టర్డామ్ లో అద్భుతం 

రూపాంతరం 

వెదురుపువ్వు 

The one and the only Peddibhotla.. 

వాస్తవికతను నమ్మి దానిని తన రచనలలో ప్రతిబింబిస్తూ చూపడం నరేంద్ర రచనలలోని ప్రత్యేకత. ఆ కారణం చేతనే ఆయన రచనలు పాఠకుల అభిమానాన్ని విశేషంగా చూరగొన్నాయి అనడంలో అతిశయోక్తి లేదు. 

నా శ్రీమతి సీతాదేవి 2004 లో కాలం చేసినప్పుడు తాను నాకు సంతాపాన్ని తెలుపుతూ వ్రాసిన ఉత్తరం లో నరేంద్ర అంటారు.  

” My heartfelt condolences for you for the demise of your wife. It is really sad to lose the life partner when she is needed more than in any other phase of the life. As you said, it is impossible to forget her, but you can and have to learn to live with the grief which makes you more mellowed and matured. 

Jiddu Krishna Moorthy is the only person, I found, who gives a convincing answer to this question of death. All said and done, one has to live one’s own life. Everyone has to play a role imposed on him in this world, till he gets his way out. Afterall, we are all sojourners to this planet, and our real place is somewhere else. 

May her soul rest in peace. ” 

అవును.. శ్రీ అన్నమాచార్య కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, జీవన వేదాంతాన్నంతా మన ముందు ఆవిష్కరిస్తారు 

” నానాటి బతుకు నాటకము..

 పుట్టుటయు నిజము.. పోవుటయు నిజము.. 

నట్టనడిమి పని నాటకము… ” అని 

అక్షర సత్యం… కదా ?!

.