10_013 ఆనందవిహరి

.

మహాగాయకుడిది మహోన్నత వ్యక్తిత్వం

         – ఘంటసాల వర్ధంతి సందర్భంగా ప్రసంగించిన గుడిమెట్ల చెన్నయ్య

.

                భక్తి, రక్తి, కరుణ, హాస్యం వంటి పలురకాల భావాలకు ఘంటసాల గాత్రం పెట్టినది పేరని, ఆయన ఏ దేవుడి గురించి పాడితే ఆ దేవుడే వినేవారి కళ్ళముందు కనబడతాడని గుడిమెట్ల చెన్నయ్య కొనియాడారు. గానగంధర్వుడు ఘంటసాల 47వ వర్ధంతి సందర్భంగా ఫిబ్రవరి 13 శనివారం సాయంత్రం అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి యూట్యూబ్ ద్వారా ప్రసారం చేసింది. ఇందులో వక్తగా “జనని” పత్రిక వ్యవస్థాపక కార్యదర్శి, సమితి సంయుక్త కార్యదర్శి, రచయిత, కవి అయిన గుడిమెట్ల చెన్నయ్య పాల్గొన్నారు. ఘంటసాల పాడుతుంటే అది ఏ పాత్రకో, ఏ పాత్రధారికో తెలిసిపోయేదని, అంతటి వైవిధ్యమైన గాత్రం ఆయనదని వక్త పేర్కొన్నారు. ఆయన పాడిన పాటల్లో, కూర్చిన సంగీతంలో, వాటిల్లోని మాటల్లో మునిగిపోయి ఆసాంతం తన్మయత్వంతో ప్రసంగించారు. ప్రసంగిస్తూ సందర్భానుసారంగా కొన్ని పాటల పల్లవులను పాడారు. ఘంటసాల తానెదుగుతూ మాధవపెద్ది, పిఠాపురం, లీల, సుశీల, జానకి, బాలసుబ్రహ్మణ్యం తదితర కళాకారుల ఎదుగుదలకు తోడ్పడ్డారని అన్నారు. 1953లో పాకిస్థాన్ నుంచి వచ్చిన ప్రసిద్ధ హిందుస్తానీ గాయకుడు బడే గులామ్ అలీ ఖాన్ ను తమ ఇంటికి ఆహ్వానించి రెండు నెలలపాటు కన్నతండ్రికి చేసినట్టు ఘంటసాల దంపతులు సేవలు చేశారని గుర్తు చేశారు. తన వద్ద పనిచేసిన ఇతర మతాలకు చెందిన కళాకారులను ఎంతో ఆదరంగా చూసుకున్నారని, ఘంటసాలది ఏ కులం? ఏ మతం? అని చెన్నయ్య ప్రశ్నించారు. ” ఆచారాలనేవి శరీరాన్ని అదుపులో ఉంచుకోవటానికే కానీ మనుషులను దూరంగా ఉంచడానికి కాదని ” ఆయన ఒక సందర్భంలో గుర్రం జాషువాతో అన్నారని చెప్పారు. పై రెండు సంఘటనల గురించి గుంటూరులో జరిగిన ఒక సభలో జాషువా స్వయంగా చెప్పారని వెల్లడించారు. ఆ మహాగాయకుడిది మహోన్నత వ్యక్తిత్వమని ప్రశంసించారు. ఘంటసాల ఎదుగుదలకు దన్నుగా నిలిచిన ఆయన సతీమణి సావిత్రికి కార్యక్రమం ద్వారా వందనాలు అర్పించారు.

సమితి కార్య నిర్వాహక సభ్యుడు చాడ శ్రీనివాసమూర్తి కార్యక్రమం మొదట్లో వక్తను పరిచయం చేసి, చివరిలో వందన సమర్పణ చేశారు. 

.