10_014 అమెరికా ఇల్లాలి ముచ్చట్లు – తెలుగు సంఘాల తికమక

.

ఏమండోయ్, తంటా తెలుగు సంఘం ఇంతకు ముందు ఎవ్వరూ చెయ్యని స్థాయిలో తెలుగు సభలు జరుపుతారట ! వస్తారా అని మోహన్ రావు గారు ఫోన్ చేసారు. వెళ్దామా?

ఏమిటీ…మొన్ననేగా భారీగా బోలెడంత ఖర్చుపెట్టి చేసారు. ఇంతలోనే మళ్ళీ సభలేమిటీ అంటారా ?

అయ్యో..రామ ! ఆ సభలు చేసింది “పంటా“ వాళ్ళు. ఇప్పుడు చేయబోతున్నది “తంటా“ వాళ్ళు. ఇద్దరికీ ఏమి సంబంధం లేదు. కాకపోతే వాళ్ళు ఏంచేసినా, వీళ్ళు అదే పని రెట్టింపు లెవెల్లో చేస్తుంటారు. పంటా వాళ్ళు పచ్చి చేపల పులుసు వడ్డిస్తే, తంటా వాళ్ళు తమ్మకయాల పులుసు పెట్టిస్తారు !

వంటా-గంటా వాళ్ళ తంతు కూడా ఇంచుమించు ఇదే లెవెల్ లో నడుస్తూ ఉంటుంది. వంటా వాళ్ళు నాలుగేళ్ల కిందట నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్మెంట్ ఇచ్చారని, గంటా వాళ్ళు “ అదేం పెద్ద గొప్పా “ అంటూ రెండు వేదికలు పక్కపక్కనే అమర్చి హోరెత్తించేసారు. పాపం వెళ్ళిన వాళ్ళు అటు బ్రేక్ డాన్సులు… ఇటు భరత నాట్యాలు చూడలేక నానా బాధ పడ్డారుట !

మధ్యలో ఈ వంటా-గంటా ఎవరూ అంటారా ?

అబ్బా… అమెరికాలో ఉంటూ కూడా మీరు ఇంత అమాయకులేమిటండీ బాబూ!

వంటా సంఘం ” వాళ్ళు ఒరిజినల్సు. వాళ్ళమీద కోపంతో “ గంట ఎప్పుడూ మీరే వాయించాలా….. మాకూ వాయించడం వచ్చు” అంటూ అప్పటికప్పుడు ఇరవైనాలుగు గంటల్లో “ గంటా తెలుగు సంఘం ” అని ఓ సంఘం ఏర్పడింది కదండీ.. మర్చిపోయారా ? దానికి మొదట మీ మాధవరావే ప్రసిడెంటుగా ఉన్నాడు గుర్తులేదూ ?

ఏమైనా సరే మనం ఆ సభలకు వచ్చి తీరాలని పట్టుబట్టాడు. అప్పటికే మనం మొదటి సంఘం చేయబోయే సభలకు రిజిస్టర్ చేసుకుని వెళ్ళటానికి టిక్కెట్లు కూడా బుక్ చేసుకున్నాం. అవన్నీ కాన్సిల్ చేసి ఆ “ గంటా ” తెలుగు సభలకు రాలేదని ఆయనకు మనమీద గొంతు వరకు కోపం వచ్చి, అప్పటినుంచీ మనతో మాట్లాడ్డమే మానేసారు. అన్నేళ్ళ స్నేహాన్ని పుటుక్కున తెంచేసారు.

ఏమిటీ? ఈ సంఘాలు…..ఈ పేర్లు అంతా అయోమయంగా ఉందంటారా ?

అయోమయం అని నెమ్మదిగా అంటారేమిటీ…చచ్చిపోతుంటేను! పదేళ్లనాడు తంటా సభల్లో “ ఓల్డ్ స్టూడెంట్స్ గెట్ టు గెదర్ “ అని మన గోపాలం గారు పాపం ఎంతో కష్టపడి ఆరెంజ్ చేస్తే అందరూ సరేనని, చివరకు ఒక్కళ్ళూ మొహం చూపించలేదుట. ఎందుకు రాలేదని విచారిస్తే, అందరూ అదే టైములో జరుగుతున్న” వంటా ” సభలకు వెళ్లారుట. ఈయన తంటా…….అంటే వాళ్ళు వంటా అనుకుని అక్కడకు బుక్ చేసుకున్నారుట. గోపాలంగారి వైఫ్ సుజాత ఈ కమ్యూనికేషన్ గాప్ గురించి చెప్పి ఒకటే నవ్వడం! ఈ సంగతి ఎవరి ముందైనా ఎత్తితే చాలు, గోపాలం గారు అక్కడ్నించి చటుక్కున లేచి వెళ్ళిపోతారుట!

ఏదో మనలాంటి వాళ్ళం, పేర్లు పొరపాటు పడటంలో పెద్ద ఆశ్చర్యం లేదు. కానీ పెద్దవాళ్ళు, పేరున్న వాళ్ళు ఇలాంటి పొరపాట్లు చేస్తే సంఘాలకు అవమానం కాదుటండీ ?

తెలుగు సినిమా ఫీల్డ్ లో చక్రాన్ని తిప్పుతున్న ఓ మూవీ స్టార్ అట్టహాసంగా స్టేజీ మీదకు వచ్చి “ ‘ పంటా వారు అమెరికా దేశం లో జరుపుతున్న ఈ తెలుగు సభలకు విచ్చేయడం నాకు గర్వకారణంగా ఉందీ…… పంటా సంస్థ ఇక్కడే కాదు ఆంద్ర రాష్త్రంలో కూడా ఎంతో పేరు తెచ్చుకున్న సంస్థ…” అంటూ “ తంటా ” వారి సభల్లో మాట్లాడాడుట. వెంటనే  ఆడియన్స్ అందరూ……. ఒకటే గోల….. అరుపులు….ఈలలుట! కార్యకర్తలకి ఏం చెయ్యాలో తెలీక, వెంటనే సౌండ్ సిస్టం షటాఫ్ చేసారుట! ఈ హీరో గారిని ఆహ్వానించటానికి వీళ్ళు నానా ఇబ్బందులు పడి, పడిగాపులు కాసి ఆయన్ని  కలిసి….ఎలాగో ఒప్పించి…..డేట్లు ఖాయం చేసుకుని, అతగాడు అలసిపోకుండా ఫస్ట్ క్లాస్ టిక్కెట్టు మీద ఈ దేశం తీసుకొచ్చి, ఆయనకు ఇష్టమైన ఫైవ్ స్టార్ హోటల్ లో ఉంచి, ఆ పెద్దమనిషికి కావాల్సినవన్నీ ముందుగానే “ మందు ” తో సహా అన్నీ సిద్ధం చేసి, రాచమర్యాదలతో……వేదిక మీదకు తీసుకొస్తే ఏ సంఘం వాళ్ళు ఆహ్వానించారో చూసుకోకుండా, తమ ప్రత్యర్ధి సంఘం పేరు చెప్పి ఢంకా వాయిస్తుంటే, ఆ కార్యకర్తలకు వొంట్లో నుంచి సెగలు పొగలు వచ్చాయంటే… రావూ! ఒళ్ళు మండిందంటే… మండదూ?

సరే! ఆ వచ్చేవాళ్ళు ఇండియా నుంచి వూడిపడ్డ వాళ్ళు, తికమక పడ్డారంటే అర్ధం ఉంది. ఆ సంఘాల్లో పనిచేసే వాళ్ళే  పప్పులో కాలేస్తుంటే సంఘాల పరువేం కాను? ప్రతి సంఘంలో దూరి ఎలాగో అలా పదవి చేపట్టే ఓ పెద్దమనిషి, ఈ మధ్య టీవీ ఛానల్ వాళ్లకు అదేపనిగా ఇంటర్వ్యూలు ఇస్తూ సంఘం పేరు తప్పు చెప్పి తల వాచేటట్లు తిట్లు తిన్నాట్ట ! 

అక్షరాలూ అటుమార్చి ఇటుమార్చి కొత్త సంఘాలు ఎన్ని ఏర్పడినా, మనుషుల ఆలోచనలో మార్పు ఏమి లేదు. సభల పేరుతో లక్షల కొద్దీ డాలర్లు ఖర్చుపెడుతూ, హంగామా జరపటమే ఆనవాయితీగా అయిపోతోంది. ఎవరికి వాళ్ళు మేమే సేవ చేస్తున్నాం అని, డప్పు వాయించుకోవడం రొటీన్ అయిపోయింది. “ మన సంస్కృతి సంప్రదాయం అంతా వేదిక మీద రాశి పోసి తెలుగుతనం ఉట్టిపడేలా సభలు జరపబోతున్నాం ” అంటూ జనాలకు ముందుగా బిల్డప్ ఇచ్చేయడం అలవాటైపోయింది.

మొదట్లో ఇలాంటి సభలకు వివిధ రంగాల్లో పేరుతెచ్చుకుని, ఉన్నతస్థాయిలో ఉన్నవారిని ఒక్కొక్కరిని పిలిచేవారు. ఇప్పుడు అలా పదిరకాల వాళ్ళను విడివిడిగా పిలవాల్సిన పనిలేదు. అలాంటి వారిని సెలక్ట్ చేసుకోడానికి ఆట్టే శ్రమా పడక్కర్లేదు. టాలీవుడ్ ని పిలిస్తే అన్ని రంగాల వాళ్ళను పిలిచినట్లే! టాలీవుడ్ వస్తే తెలుగుతనం వచ్చేసినట్లే! ఓ పండితుడైనా…కవి అయినా…రచయితలైనా….నాట్యకారులైనా….సంగీత విద్వాంసులైనా….రాజకీయ నాయకులైనా……సంఘసేవకులైనా….ఇంకెవరయినా అందరూ సినిమా పరిశ్రమకు సంబందించిన వాళ్ళే. ఈ మధ్య కాలంలో “ సినిమాలే మన సంస్కృతి, మన సంస్కృతే సినిమాలు ” అన్న భావన బాగా నాటుకుపోయింది. అందుకే  అమెరికా తెలుగు సంఘాలు పోటీలు పడుతూ, సినిమా వాళ్ళను కుప్పతెప్పలుగా తెప్పిస్తున్నారు.

నిజమైన ప్రతిభ వాళ్ళలో ఉన్నా లేకపోయినా, వాళ్ళు ఇక్కడికి రాక ముందు, వచ్చిన తర్వాత ఎన్ని డిమాండ్లు చేసినా…ఇవ్వాల్సిన ప్రోగ్రాం ఇవ్వకపోయినా… ఒకవేళ ఇచ్చింది తుస్సుమనిపించినా కూడా….. వాళ్ళ అడుగులకు మడుగు లొత్తుతూ… వాళ్ళను అందలమెక్కిస్తూ… ఆహా ఓహో అనుకుంటూ…. వాళ్ళే కావాలనుకునే స్థితికి దిగాజారాం. పొరపాటున ఆ గుంపు మధ్యలో ఓ పండితుడు ఉన్నా పట్టించుకోరు. ముందు గొప్పగా ఫలానా వారి కార్యక్రమం అని వేసి, ఆ సమయానికి వాళ్ళ ఇష్టం వచ్చినట్లు టైములు మార్చేసి పేరుకు ప్రోగ్రాం అయిందనిపిస్తారు.  

ఏమిటీ…నేను మరీ విడ్డూరంగా మాట్లాడుతున్నానా ?  

నేనేమి విడ్డురంగా మాట్లాడటం లేదు. కిందటి ఏడాది జరిగిన సభల్లో నారాయణశర్మ గారు పోతన భాగవతం లో కొన్ని ఘట్టాలు తీసుకుని ఎంత బాగా చెప్పారో. కానీ ఏం లాభం ? అంత మంచి కార్యక్రమాన్ని మధ్యలోనే ఆపేయిన్చేసారు. ఎవడో యాక్టరు మొదటి సినిమాతోనే బాక్స్ బద్దలు చేసాట్ట! అతని ఫాన్స్ కి ఆ హాలు కావాలని ఆప్పటికప్పుడు ఖాళీ చేయించారు. అప్పుడు నేను అక్కడే ఉన్నాను తెలుసా ?!

ఆ తరువాత మెడిటేషన్ సెమినార్ కి వెళ్దామని నేను, సరస్వతిగారు బయలుదేరాం. పాపం ఆవిడ ఈ క్లాసుల కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఇద్దరం మ్యాపు చూసుకుంటూ అంత పెద్ద బిల్డింగ్ లో కష్టపడి ఈ మూలనుంచి, ఆ మూలకు మెడిటేషన్ హాలు కు వెళ్ళాం. తీరా చూస్తే అక్కడ పెద్ద హంగామాతో ఏదో ఫాషన్ షోకి రడీ అవుతున్నారు. ఇదేమిటి అంటే…. ఆ షో కి జడ్జ్ గా వచ్చిన ఆవిడకు, ముందు ఎలాట్ చేసిన చోటు నచ్చలేదుట, అందుకని ఆవిడ కోరిక మేరకు యోగా – మెడిటేషన్ హాల్ కు  మార్చారుట. మెడిటేషన్ క్లాస్ ని వేరే ఓ చిన్న రూముకి మార్చి అక్కడ కానిచ్చేయమన్నారు. ఎంతో ఆసక్తితో వచ్చిన వాళ్ళందర్నీ ఆ కాస్త చోటులో మిరపకాయల్ని బస్తాల్లోకి కుక్కినట్లుగా కూర్చోపెట్టి “ సిట్ కంఫర్టబుల్లీ….రిలాక్స్……ఎంజాయ్ ది బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్” అని ఆ ఇన్స్ట్రక్టర్ అంటుంటే నాకు నవ్వాలో ఏడవాలో తెలీలేదు!

లోకల్ గా ఉన్న మన తెలుగు సంఘాలు కూడా ఏమి తక్కువ తినలేదు. ఏళ్ళ కిందట ఈ దేశానికి వచ్చిన తెలుగు వాళ్ళు, మన భాషనూ సంస్కృతిని పదిల పరుచుకోటానికి, ఇక్కడ పుట్టి పెరిగే మన పిల్లలకు మన సంస్కృతిని అందించే ప్రయత్నంలో భాగంగా ఈ సంస్థలు ఏర్పడ్డాయి. అటువంటి సంస్థలు కూడా ఈ రోజు సినిమా పరిశ్రమకే పెద్దపీట వేస్తున్నాయి. సంవత్సరం పొడుగునా జరుపుకునే పండగల కార్యక్రమాలకు కూడా టాలీవుడ్ తళుకుబెళుకులు కావాల్సివస్తోంది. ఇక్కడ ఉన్న ఎంతోమంది కళాకారుల్ని, ఆ కళాకారుల్ని తీర్చిదిద్దుతున్న ప్రతిభా వంతుల్ని, ముఖ్య సమయాల్లో పక్కకు నెట్టేస్తూ, సినిమా రంగానికి సలాములు కొడుతున్నాయి.

సినిమా హంగామాతో కూడిన కార్యక్రమాల్ని ఆర్భాటంగా ఎడ్వ్‌టైజ్ చేసుకుంటూ చివరలో ముక్తసరిగా “ మరియూ లోకల్ టాలెంట్ ” అని చూసినప్పుడు, విన్నప్పుడు మనం ఎటు పోతున్నామా అని అనిపిస్తుంది.

అందుకే ఈ సభలు గురించి విన్నప్పుడు ముందు ఉత్సాహంగా అనిపించినా, వెళ్ళి వచ్చింతర్వాత మాత్రం ఎందుకు వెళ్ళాంరా బాబూ అనిపిస్తుంది!

ఇంతకూ రేపు జరగబోయే సభలు ఏ సంఘం వాళ్ళవి అంటారా ?

సారీ..ఈ సంఘాల కబుర్లలో పడి ఇప్పుడు నేను మర్చిపోయానే….ఎవరబ్బా ? వంటా….గంటా…..పంటా…..తంటా…?

తొలి ప్రచురణ “తెలుగు జ్యోతి” 2013

.

తెలుగు సంఘాల తికమక-నేపథ్యం

అమెరికాలో ప్రాంతీయ పరంగా తెలుగు సంఘాలు ఏర్పడ్డ తర్వాత, జాతీయ స్థాయిలో తెలుగు సంఘాలు ఒకదాని తర్వాత మరొకటి వరసగా పుట్టుకు రావడం మొదలైంది. ఈ సంస్థలు, పోటీలు పడి చేస్తున్న తెలుగు సభలకు వెళ్ళినప్పుడు కలిగిన ఆ అనుభవాలు, మనసులో అలాగే ఉండిపోయాయి. కార్యకర్తలే తప్పు పేరు చెప్పటం… అతిధులు సంస్థ పేరు పలుకుతున్నప్పుడు తడబిడ పడటం, ఒకే సంవత్సరం ఒకే టైములో రెండేసి సభలు జరుగుతున్నప్పుడు, వెళ్ళిన వాళ్ళ అనుభవాలు విన్నప్పుడు.. నవ్వుకోడానికి బాగానే ఉన్నా, ఆశయాన్ని మరచి ఆర్భాటానికి చేస్తున్నామన్నదానికి సాక్ష్యాలు.

సాధారణంగా నా అమెరికా ఇల్లాలి ముచ్చట్లు అన్నీ విషయం తమాషాగా అనిపించో, అలాగే ఏదైనా విన్నప్పుడు నవ్వు వచ్చి సరదాగా రాయడం జరుగుతూ ఉంటుంది! ఈ ముచ్చట మాత్రం డిజప్పాయింట్‌మెంట్ లో నుంచి వచ్చిన ముచ్చట.  

***************************************