10_014 కథావీధి – చాసో కథలు 3

.

                మానవ సంబంధాలన్నీఆర్ధిక సంబంధాలే అని కారల్ మార్క్స్ మహానుభావులు ప్రతిపాదించారు అని ఒక సిద్ధాంతం లేవదీసి, కాస్త పేరు ఉన్న రచయితల రచనలు అన్నీ ఈ కోణంలో పరిశీలించి, రచయిత వ్యక్తం చేసిన అభిప్రాయాలను ఈ కోణం లో సాగదీసి, ” కాబట్టి వీరు వంటినిండా ఎర్ర భావజాలాన్ని నింపుకున్నారు, వీరి రచనల్లో ఆ భావజాలాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు అంటూ కిట్టించి ఇలాంటి అభిప్రాయాల్ని ఇంకొన్నింటిని జోడించి తమ తాలూకు పత్రికలలో ప్రచురించి, తద్వారా ఈ రచయితలకు తమ రంగు పూసే ప్రయత్నమూ, ప్రయోగమూ చా.సో. గారి మీదా జరిగింది. ఒక ఔత్సాహికుడు ఇంకొంచెం బరితెగించి చా. సో. గారిని కధకులకు కథకుడు అని అభివర్ణించేశాడు. ఇది అతనికి సాహిత్యం పై అతని అవగాహనాలేమిని తెలియజేస్తుంది. చాసో గారు నిస్సందేహం గా ఉత్తమ రచయిత. ఈయనని కథకులకే కథకుడు, కథకులకు గురువు అనడం అనంతమైన భారతీయ కథాసాహిత్యం లోని అనేకమైన ప్రతిభావంతులైన.రచయితలని అవమానించినట్టవుతుంది.

ఈ బాపతు విమర్శకులు చేసిందేమిటంటే చా.సో. గారి కథలలో ఎంపు, ఏకరువు, కుంకుడాకు, ఎంరుకు పారేస్తాను నాన్నా, పరబ్రహ్మము, కుక్కుటేశ్వరం లాంటి కొన్ని కథలను తీసుకుని వాటిలో మిగతా కోణాలని వదిలేసి, ఒక్క పేదరికం విషయాన్ని మాత్రమే ప్రస్తావించి, అందుచేత చా.సో. గారు పేదల పక్షపాతి అనీ, బూర్జువాలకి, ఫ్యూడల్ భావాలకీ వ్యతిరేకి అనీ ఒక తీర్మానం చేసేసారు.  

జరిగిన విషయం ఏమిటంటే ముందుకే తెలుగు వారిలో అరకొర గా ఉన్న సాహిత్యాదరణా, శీలం కనిష్ట స్థాయికి దింపివేయడానికి ఈ రకమైన పత్రికలూ, రచయితలూ తమ వంతు పాత్రను దిగ్విజయంగా పోషించారు.

ఎంపు, ఏకరువు కుక్కుటేశ్వరం కథలని గత సంచికలలో పరిచయం చేసుకున్నాము.

కుంకుడాకు, ఎందుకు పారేస్తాను నాన్నా ! కథలు పేదరికం, ఛాయలు, బాల్యాన్ని ఎలా కమ్మేస్తాయో తెలియజేస్తాయి.

కుంకుడాకు కథ లో గవిరి అనే అమ్మాయి నాయిక. గవిరి తల్లితండ్రుల సంపాదన పొయ్యి మీద కాచుకునే గంజికీ, నీళ్ళకీ సరిపోతుంది. పొయ్యికింద మంట పెట్టడానికి కావలిసిన వంట చెరకు ఏర్పాటు చేసే బాధ్యత గవిరిమీద ఉన్నాది. రోజూ ఉదయాన్నేగవిరి ఊరి చివరన ఉన్న గోర్జ లోకి వెళ్లి అక్కడ రాలిన కుంకుడాకులనీ, చింత కంపనీ ఏరుకుని వస్తేనే పొయ్యి మండుతుంది. గంజి ఉడుకుతుంది. బతుకు బండి నడుస్తుంది. ఇలాంటి గవిరి కి చదువు గగన కుసుమం. రోజూ ఉదయాన్నే గోర్జ ( అంటే చిట్టడవి లాంటి ప్రదేశం ) కి వెళ్లే దారిలో తన వయసు పిల్లలు శుభ్రమైన దుస్తులు ధరించి బళ్ళో గదిలో కూర్చుని పంతులుగారు చెప్పే పదహారార్ల తొంభయ్యారు ఎక్కాన్ని వల్లె వేయడం గవిరికి వింతగా, ఆసక్తికరంగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే రాత్రంతా ఆకలితో అలమటించినా బుగత గారి చేని లోని పెసర కాయలను ఓలుచుకోదు, బుగత గారిచేత మాటలు పడాలనీ తిట్లు తినాలనీ… . తన ఈడుదే అయిన పెద్ద నాయుడి కూతురు పారమ్మ కడుపునిండా తిన్నా, కాలక్షేపం కోసం బుగత గారి కళ్ళముందే పెసర కాయలు కోసుకున్నా బుగత గారు ఆ పిల్లని ఏమీ అనడు. ఉన్నవాళ్ళు చేసిన తప్పులన్నీ కమ్ముకు పోతాయి.

ఒకరోజు గవిరి ఎండి రాలిన కుంకు తో పాటు నేల రాలిన కొంత చింత కంపను కూడా ఏరుకోగా, అది చూసిన బుగత గారు ఆగ్రహోద్రగ్దుడై గవిరిని బండ బూతులు తిట్టి ఇంకా కోపం చల్లారక కాలికున్న పాంకొడు విసరగా అది గవిరి  కాలి ఎమికకి తగిలి ప్రాణం జిల్లార్చుకుపోగా, తాను చేయని దొంగతనానికి తనకు శిక్ష పడడం తో అభిమానం, కోపం, దుఃఖం కలగలిపి ” ఓర్నాకొడకా ! ఓర్నంజ కొడకా ! నాను కాదు ఒలమ్మో నానుకాదు ! లమిడీ కొడకా ! నీ సింత కంపలెవరికీ అక్కరనేదు ” అంటూ మహా మహా వాళ్ళను పాతీసిన కాంభుక్త గారిని తిడుతూ గవిరి కుంకుడాకుని మాత్రం గంపలో కెత్తుకుని బయట పడడం తో కథ ముగుస్తుంది.

‘ ఎందుకు పారేస్తాను నాన్నా ! ‘ కథ కృష్ణుడు అనే పిల్లవాడి చుట్టూ తిరుగుతుంది. తన తో పాటు మూడో ఫారం చదివిన పిల్లలలో పాసయిన వారంతా నాలుగో ఫారం లో చేరిపోతారు, అత్తెసరు మార్కులతో బొటాబొటీ గా పాసైన వాళ్ళతో సహా ! క్లాసులు కూడా మొదలైపోయాయి. మూడో ఫారం ఫస్ట్ రాంక్ లో పాసయిన కృష్ణుడు మాత్రం చెల్లిని వళ్ళో కూర్చోపెట్టుకుని కబుర్లు చెపుతో ఇంట్లో కూర్చున్నాడు. కారణం తండ్రికి కృష్ణుడిని నాలుగో ఫారం చదివించే స్తోమత లేదు. కొడుకుని చదివించమని తల్లి చేసిన కన్నీటి సాధింపులూ, కృష్ణుడి పేచీలూ, పేదరికం ముందు నిలబడలేకపోయాయి. తండ్రికి మనసులో క్షోభ పైకి ప్రకటించుకోలేడు.

ఉండబట్టలేక బడి దాకా వెళ్లిన కృష్ణుడికి అక్కడ వాతావరణం కొత్త పుస్తకాల వాసనతో, కొత్త బట్టల తళుకులతో, పిల్లల కేరింతలతో, నిండిపోయి కనిపిస్తుంది. అందులో తాను లేకపోవడం ఉక్రోషానికీ, వేదనకీ గురి చేస్తుంది. తాను అందరిలాగా చిరుతిళ్ళకీ, కొత్త బట్టలకీ, పుస్తకాల సంచీలకీ పేచీలు పెట్టలేదు, టెస్ట్ పుస్తకాలు అవికూడా ఇంగ్లీషు, లెక్కలలాంటి అత్యవసరమైన పుస్తకాలు మాత్రం కొనిమ్మన్నాడు. స్కూల్ ఫీజు కడితే చాలన్నాడు. తండ్రికి అది కూడా కుదరలేదు.

 

మరిహ చేసేది ఏమీ లేక కృష్ణుడు ఇంట్లో వంటింట్లో కూర్చుని చెల్లెలిని ఒళ్ళో కూర్చోపెట్టుకుని కబుర్లు చెపుతూ ఉంటాడు. అది చూసి గుండె తరుక్కు పోయిన తల్లి , భర్తని శత విధాలా పోరుతూ ఉంటుంది. ఉపయోగం లేదు అని తెలిసినా  కూడా!
” పుస్తకాలకే యాభై రూపాయలవుతుంది. ఇంకా నెల నెలా జీతం! ఎక్కడినుంచి తేను? ” ఇది తండ్రి అశక్తత. దీనికి సమాధానం లేదు అని  తల్లికి తెలుసు. అయినా ఎక్కడో ఆశ.

ఒకరోజు ఉదయం తండ్రి చుట్టలు తెమ్మని పంపడం తో కృష్ణుడు ఇంటి బయటకి వస్తాడు. చుట్టల కొట్టుకి బడి మీద నుంచే వెళ్లాలి. కృష్ణుడి మనసులో సంకోచం, బాధ, అవమానం, ఉడుకుమోతుతనం, ఉక్రోషం అన్నీ కలగలిసిపోయి ఉంటాయి. స్కూలు దగ్గర స్నేహితుడు నరసింహం కొత్త ఇంగ్లీషు పుస్తకం వాసన చూపిస్తాడు. వాడికి అన్నీ అత్తెసరు మార్కులే ! కృష్ణుడికి పోటీదారైన శకుంతల కొత్త బట్టలు, కొత్త పుస్తకాలతో తళతళ లాడుతూ వచ్చి ” పాఠాలన్నీ మొదలెట్టేశారు, నువ్వు ఎందుకు రావడం లేదూ? ” అని అడుగుతుంది. ఇంగ్లీషు లో ఆ పిల్లకీ, లెక్కలు, సైన్స్ లలో కృష్ణుడికీ ఫస్ట్ మార్కులు. మిగతా అన్ని సబ్జక్ట్ లలో ఇద్దరికీ ఇంచుమించుగా ఒకేలా మార్కులు వస్తాయి.

బడి గంట మోగడం తో స్నేహితులంతా క్లాస్ గది కేసి పరుగు తీస్తారు. బెల్లయ్యింది బళ్ళోకి రా అన్న శకుంతలతో ” ఇక నుంచి ఫస్ట్ మార్కులన్నీ నీవేలే ” అంటాడు కృష్ణుడు.

క్లాసులు మొదలవుతాయి. కృష్ణుడు ఒక్కడూ బడి ముందు మిగిలిపోతాడు. దుఃఖం తన్నుకుని వస్తుంది. ఇంక ఉండబట్టలేక బడి వరండాలోకి వెళ్లి నేనిక్కడ నుంచి కదలను, ఇంటికి వెళ్ళను, భోజనం చేయను ” అని భీష్మించుకుని కూర్చుంటాడు. తండ్రి వెతుక్కుంటూ వస్తాడు. చదువు మాన్పించిన తండ్రితో గోడ కేసి బుర్ర బద్దలు కొట్టుకుంటాను అంటాడు. బళ్ళో వేయిస్తానని హామీ ఇచ్చిన దాకా అక్కడనుంచి కదలనంటాడు, తక్షణం బళ్ళో వెయ్యమంటాడు. డబ్బు చూసుకుని వేయిస్తానంటాడు తండ్రి. ఇంగ్లీషు పుస్తకమైనా కోసమని ఏడుస్తాడు కృష్ణుడు. ఏడవకు నాయనా, నేను చచ్చిపోయాను, ఏడవకు అంటాడు తండ్రి. తాను చుట్టలు మానేస్తే ఆ డబ్బు తో బడి జీతం కట్టవచ్చని అని తీర్మానించుకుని, ఇందాకా చుట్టలకిచ్చిన డబ్బులు ఉన్నాయా ? పారీశావా? అని తండ్రి అడుగు తాడు. ” ప్పా పారీ లేదు జేబులో ఉన్నాయి. ఎందుకు పారేస్తాను నాన్నా? ” అని కృష్ణుడు అనడం తో కథ ముగుస్తుంది.

ఈ కథలని పూర్తిగా పరిచయం చేయకుండా, వీటిలోని పేదరికం, దోపిడీలనే ప్రముఖం గా ప్రస్తావించి, దానికి కారణం కులంపరంగా, ఆర్ధికపరంగా రెండు వర్గాలుగా విడిపోయిన వ్యవస్థే అని తీర్మానం చేసి, వ్యవస్థ దే దీనికి బాధ్యత అని నిర్ణయం చేసేసి చా.సో గారికి ఎడం పక్క భావజాలాన్ని అంటగట్టిన వారు చా సో గారి జంక్షను లో బడ్డీ కథని సమీక్షకు ఎంచుకోకపోవడానికి కారణాలు తెలియజేసే ప్రయత్నం చేస్తాను.

జంక్షను లో బడ్డీ కథలో పేదరికం ఉంది, వంచన ఉంది, దోపిడీ ఉంది. అయితే కథా పాత్రలు అన్నీ ఒకే వర్గానికి చెందినవి కావడం తో అగ్ర వర్ణాల వారి కి అహంకారాన్నీ, ఇంకా మిగిలిన దుర్గుణాలనూ అంట గట్టే అవకాశం లేకపోయింది. పేదవారిని పేదవారు దోచుకుంటే అది దోపిడీ, అణచివేత… ఇలాంటి వాటికింద రాదు కాబోలు.

రామయ్య అనే ఒక పల్లెటూరి మనిషి బ్రతుకు తెరువు కోసం ప్రక్క ఊరికి వస్తాడు, ఆ ఊరూ పల్లెటూరే కానీ పట్నం గా రూపాంతరం చెందే దశ లో ఉంది. జనం మంచివారు. లంబ కోణం లో ఉన్న రెండు పెద్ద వీధులని కలిపే ఒక గొంది లో ఇతనికి వసతి దొరుకుతుంది. గుఱ్ఱపు బండిలో తిరిగే అగ్రవర్ణ కౌన్సిలర్ మారాజు ఇతనికి సహయం చేయ పూనుకుని, స్వయంగా దగ్గర ఉండి ఇతనికి ఆ గొంది లోనే ఒక బడ్డీ కొట్టు పెట్టుకునేందుకు అనుమతి జారీ చేయిస్తాడు, ఒక్క దమ్మిడీ కూడా పుచ్చుకోకుండా.

చుట్టలు చుట్టుకుంటూ, సోడాలు కొట్టుకుంటూ, కిల్లీలు చుట్టుకుంటూ, బిళ్ళలు, బిస్కట్లూ, ఇంకా చిన్నా చితకా తినుబండారాలు అమ్ముకుంటూ, సంసారం చేసుకుంటూ, పిల్లల్ని కన్న రామయ్య వారందరికీ పెళ్లిళ్లు చేసి, తాను పుట్టిన ఊరిలో రెండెకరాల మాగాణీ జమ చేసుకుంటాడు. కౌన్సిలర్ మారాజు కాపడ్డప్పుడల్లా లెగిసి నుంచుని చేతులు జోడించి దండం పెడుతూ ఉంటాడు.

కాలం మారుతూ ఉంటుంది. ఎక్కువ సీట్లు సంపాదించి అధికారాన్ని కైవసం చేసుకునే ప్రక్రియలో ఉన్న రాజకీయుల వలలో పడ్డ జనం కులాల వారీ గా విడిపోయి, బరిలో ఉన్న అభ్యర్థుల గుణశీలాలని ఉపేక్షించి కేవలం తమ కులానికి చెందిన వారినే ఎన్నుకునే స్థితికి దిగజారి పోతారు. మునిసిపాలిటీ గా ఎదిగిన ఆ ఊరి కౌన్సిలర్ల ఎన్నిక సమయంలో రామయ్య అతని వార్డు ఓటర్లూ, గుఱ్ఱబ్బండి కౌన్సిలర్ మారాజుకి జెల్లకొట్టి తమ కులస్తుడైన రామునాయుడు ని సీట్లో కూర్చోపెడతారు.

సీటెక్కిన రామునాయుడి కన్ను గొంది మీద పడుతుంది. రెండు పెద్ద వీధులను కలిపే గొంది కావడం తో నిత్యం కిట కిట లాడుతూ  ఉంటుంది. అక్కడ రామయ్య కొట్టు పెట్టి బాగా డబ్బు చేసాడు.

 

గొంది లోని రామయ్య కొట్టుమీద కన్నుపడ్డ కవున్సిలరు రామునాయుడు, పురజనుల ప్రయాణ సౌకర్యార్ధం, గొందిని వెడల్పు చేసే ప్రయత్నాలు త్వరలోనే జరగబోతున్నాయని ఒక వార్త పుట్టించి ప్రచారం చేయిస్తాడు. చుట్టుపక్కల వారు రామునాయుడిని కలుసుకొని వ్యవహారం చక్కబెట్టుకొమ్మని రామయ్యకు సలహా ఇవ్వడంతో అతను రామునాయుడిని కలుసుకుని గోడు వెళ్ల బోసుకుంటాడు, తాను కవున్సిలరు గా ఉన్నంతకాలం ఏమీ భయపడనవసరం లేదని రామునాయుడు రామయ్యకు ధైర్యం చెప్పి పంపిస్తాడు.

కొట్లోకి వచ్చేవారు రోజు కో కథ చెపుతూ ఉండడం, భయపడ్డ రామయ్య కవున్సిలర్ ని కలవడం అతను అభయం ఇవ్వడం కొన్నాళ్లు జరిగాక, ఒకరోజు రాత్రి కవున్సిలర్ రామునాయుడు రామయ్య ఇంటికి వచ్చి కుశల ప్రశ్నల అనంతరం విషయం బయటపెడతాడు. తాను చైర్మన్ గారి తో కలిసి అధికారులను శత విధాల బతిమాలుకున్నాననీ, అయినా ప్రయోజనం లేకపోయిందనీ, గొందిని వెడల్పు చెయ్యడంలో భాగం గా రామయ్య కొట్టు కూల్చివేయడం తప్పదనీ, చైర్మన్ గారి మనసు కరగక ముందే రామయ్య అర్జీ పెట్టుకుంటే అదే గొందెలో కొంచెం లోపలికి కొట్టు పెట్టుకోడానికి అనుమతి ఇప్పించగలననీ, ఆలోచించుకుని త్వరలో నిర్ణయం చెప్పమని వెడతాడు.

రామయ్య సన్నిహితుల ( వారంతా రాము నాయుడి అనుచరులు ) తో సలహా చేయగా, వచ్చిన అవకాశం జారవిడుచుకోవద్దనీ, తరవాత కాలంలో ఎవరి మనసు ఎలా మారుతుందో చెప్పలేమనీ, కొట్టు కొంచెం లోపలికి ఉన్నా ఖాతాదారులంతా రామయ్య వెంటే ఉంటారు కనక పెద్దగా భయపడనవసరం లేదని ధైర్యం చెప్పి అర్జీ పెట్టిస్తారు.

ఉత్తర క్షణంలో చైర్మన్ గారు గొంది లో కొంచెం లోపలికి రాము నాయుడు చూపించిన స్థలంలో రామయ్య కి కొట్టు పెట్టుకోవడానికి స్థలం అనుమతిస్తూ ఫర్మానా జారీ చేస్తారు. తన జనాన్ని ప్రాణాలొడ్డయినా ఆదుకునే నాయకుడిగా, పరోపకారిగా రాము నాయుడి పేరు మారుమోగిపోతుంది. లోపలి మూలకు మారిన రామయ్య కొట్టుకి బేరాలు తగ్గుతాయి కానీ ఆసలుకి మోసం ఉండదు.

అంతా సర్దుకుని ఐదారు నెలలైన తరవాత, ఇదివరకు రామయ్య కొట్టు ఉన్న చోట ఒక పెద్ద షెడ్డు వెలుస్తుంది. షెడ్డులోని ముందు భాగంలో ఉన్న కొట్లో దొరకని సరుకు ఉండదు. కొట్టు వెనక ఉన్న షెడ్డు భాగంలో కొట్లోకి వచ్చే మర్యాదస్తులకి ఇబ్బంది లేకుండా నాటుసారా సరఫరా చేసే సౌకర్యం ఏర్పాటు చేయబడింది. గొంది చుట్టుపక్కల జనమంతా కొత్త కొట్లోకి ఎగబడడం తో రామయ్య కొట్టు వెల వెల బోతుంది. రామయ్య లబోదిబోమంటాడు. జనం దగ్గర గోడు వెళ్లబోసుకుంటాడు.

జనానిదేముంది. వినేవారికి వినోదం కావాలి. కాలక్షేపం కావాలి. ఎద్దు పుండు కాకి కి రుచి.

కొందరేమో రామునాయిడిది తప్పంటారు. మరికొందరు రామునాయుడి తప్పేమీ లేదనీ, తన సాటి కులం వాడు కనక రామయ్య హితం కోరి తనకి తెలిసిన విషయం రామయ్యకు చెప్పాడనీ, గొందిని వెడల్పు చేయటం, చేయకపోవడం అతని చేతిలో లేదనీ, అతను రామయ్యకు కొట్టు మార్చుకొమ్మని సలహా ఇవ్వలేదనీ, మార్చుకునే పక్షంలో సహాయం చేస్తానని మాత్రమే చెప్పాడనీ, పిరికివాడైన రామయ్య భయపడిపోయి కొట్టు లోపలికి మార్చుకుంటానని చెప్పడంతో తనకి వీలైనంత సహాయం చేశాడనీ, అలాంటి రామునాయుడిని నిందించడం ఉపకారస్తులకి మంచి రోజులు కావన్న విషయాన్ని స్పష్టం చేస్తోందనీ అంటారు.

కొత్తగా వెలసిన కొట్టు కి యజమాని రామునాయుడి కి దూరపు బంధువు అనీ, అతను ఆ కొట్టుకి కాయితాలమీద మాత్రమే యజమాని అనీ ఎక్కవమంది కి తెలియదు. అయినా అది జనానికి పనికొచ్చే విషయం కాదు కదా!

 

తరువాయి భాగం వచ్చే సంచికలో…

*************************