.
సాయి, పల్లవి, కల్కి, రాఘవ – ట్రెక్కింగ్ కి వెళ్ళారు. వెళ్ళి అడవిలో తప్పిపోయారు. మహారణ్యం మధ్యకి చేరారు నగరవాసులు.
వారిని దారిలో కలిసారు – ‘ పక్షి శాస్త్ర అధ్యయనం చేయడానికి వచ్చిన స్టూడెంట్లు పాలన, ఉదయ్ కుమార్.
పాలన ఆదివాసీ భాషలను నేర్చుకున్నది. అరడజను నాగరిక జనులు పట్టణం నుండి వస్తే, చూసిన అరణ్య వాసి ఒకడు కూత పెట్టి, తన తోటి వారిని పిలిచాడు.
ఆటవికులు ఉదయ కుమార్ గ్రూపు చుట్టూ వలయంగా నిలబడ్డారు.
చుట్టూ మూగిన ఆటవికులను చూసి భీతితో వణికిపోతున్నారు.
కారడవిలో ఆ మూక తమ భాషలో మాట్లాడుకుంటున్నారు ఇట్లాగ…,
” అమ్మో, మన సీమలకు వింత జీవులు వచ్చారు. అదేదో గ్రహం నుండి ఈడకు, దారి తప్పి
వచ్చినట్టున్నారు.” ఒకడు రెండో వానితో అంటున్నాడు – ” చూడు చూడు, వీని చర్మం వదులు వదులుగా ఉంది “
” ఔను, చర్మం – మనకు ఒంటికి తాకించినట్లుగా ఉంటే, వీళ్ళకు తగిలించినట్లుగా ఉంటున్నది, భలే భలే!”
మూడవ వాడు సాయి, పల్లవి దగ్గరికి వచ్చి తాకి చూసాడు. ” మరే, విప్పదీస్తుంటే ఊడి, చేతుల్లోకి వస్తున్నది “.
అప్పటికే గుండీలు తీసిన సాయి షర్టు కాస్తా – వాడి వేళ్ళ మీద నాట్యం ఆడుతున్నది.
” చుంకీ, ఇదిగో ” పిలిచి పెళ్ళాంకి ఇచ్చాడు ఆ షర్టుని.
” మామా! వీళ్ళ చర్మం రంగు రంగులుగా పూలు పళ్ళు చెట్లు, లతలు – వింతగా ఉంది కదూ! “
ఆమె చెల్లెలు చాందీ, ఫ్రెండు చాందినీ లకి తమ చొక్కాలను గబగబా విప్పి ఇచ్చేసారు రాఘవ, ఉదయ్‌కుమార్ లు.
వాళ్ళు అడగక ముందే, పై దుస్తులు ఎందుకు ఇచ్చారంటే, “ఈ అడవి మోటు వాళ్ళు, స్త్రీ పురుషుల తేడాలను – దుస్తులు, అలంకారాదులలలో పాటించే అవసరం లేనివాళ్ళు……., లేడీస్ డ్రెస్సులని కూడా – ఒంటి మీది తోలు అనుకుని, పుడింగిన లాక్కోవచ్చును కదా ! అందుకే తమవి ఇచ్చి, వాళ్ళని నిలువరించగలమేమో – అని, చిన్న ప్రయత్నం చేయబూనుకున్నారు.
దట్టమైన ఆ అడవిలో, ఈ అమాయకత్వం బారి నుండి బైటపడే మార్గం గురించి, అంతరంగాలలో ఆలోచిస్తున్నారు.
కీకాణ్యంలో రొద కొనసాగుతూనే ఉన్నది వాళ్ళ భాషలోనే…..,
” వీళ్ళ తలలకు ఏదో టపేరం ఉందిరా “
” ఔనౌను, మనకి మల్లే జుట్టు లేదు కదూ. తాటికాయలు లాగా ఎంత పెద్దదో “
వాళ్ళు అనుకుంటున్న వాటిని, తను కూడా లోలోన గుణించుకుంటూ మిత్రులకు చెబుతున్నది పాలన.
రాఘవ ఫక్కున నవ్వాడు ” అవి మన హెల్మెట్లు – వెండ్రుకల స్థానంలో మొలిచాయి అని వీళ్ళు అనుకుంటున్నారు “.
ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఆ వాతావరణంలో సైతం అందరికీ నవ్వు వచ్చింది.
” హార్నీ, నవ్వడం మాత్రం మనకి మాదిరిగానే ఉంది కదా ! “
వారి అదృష్టం బావుంది. అక్కడికి కొత్త మనుష్యులు ముగ్గురు వచ్చారు.
ఇప్పటిదాకా ఉభయులకు – ఒకరి మాటలు ఒకరికి అర్ధం కావడం లేదు.
” ఫణీ ఫణీ ” నమస్కారం లాగా చేసుకున్నారు – నూతన వ్యక్తులు ఇక్కడి వాళ్ళే –
బస్తీకి వెళ్ళి, అవసర సరుకులు కొనుక్కొచ్చి, ఇక్కడ అమ్ముతున్న చిన్న తరహా వ్యాపారులు.
బేహారి పని కోసం, తరచుగా సిటీకి వెళ్ళి వస్తున్న మనుషులు కాబట్టి చూడంగనే, పరిస్థితి అవగాహన చేసుకున్నారు.
అడవి వాళ్ళకి – రాఘవ, ఉదయ్ కుమారులు తనకి చెప్పిన విశేషాలను వివరించి చెప్పాడు.
” ఐతే, వీళ్ళు ఆకాశం నుండి దిగి వచ్చిన వాళ్ళు కాదన్నమాట” చాలాసేపు ఆశ్చర్యపడ్డారు.
అటు తర్వాత – వెదురు బియ్యం, ఇప్ప పూల సారాయి, పళ్ళు ఇచ్చి మర్యాద చేసారు.
నిరాటంకంగా కల్కి, ఉదయ్, అందరి పనులు, ప్రోగ్రాములు పూర్తి ఐనాయి.
ఈ జర్నీలో తమ అనుభవాలను, మొబైల్స్ లో నిక్షిప్తం చేసుకున్నారు.
తిరుగు ప్రయాణం చేస్తూ, వెళ్ళేటప్పుడు అడవిమనుషులకు ఆప్యాయతతో చాక్లెట్స్, బిస్కట్ పాకెట్స్ వంటివి ఇచ్చారు.
నగరవాసుల టెంట్లు, దువ్వెనలు, స్వీట్లు, డ్రింకులు, చిన్న చిన్న వస్తువులను అపురూపంగా స్వీకరించారు అడవిజనులు.
దట్టమైన ఆ అరణ్యలోకి మీరెప్పుడైనా వెళ్తే, చూడవచ్చు అక్కడి దృశ్యం ఒకటి…..
ఊడల మర్రిచెట్టు కింద, పూజలు చేస్తున్నారు,
అర్చనలను అందుకుంటున్న ఆ వస్తువు వేరే ఏమిటో అనుకునేరు సుమా…..
అది ఉదయ్ కుమార్ ఇచ్చినదే, అది ఒక అద్దం.
.
************************