10_015 ఆడపిల్ల ‘ఆడ’ పిల్లే!

.

మా అమ్మాయి పెళ్ళి చేసుకుని న్యూయార్క్ వెళ్ళిపోయిన తర్వాత మా ఇల్లు చాలా నీటుగా..నిశ్శబ్దంగా ఉంటోంది! ఉన్నట్టుండి ఒకరోజున మా అమ్మాయి ఫోన్ చేసింది “ నేను వస్తున్నానూ ” అంటూ. పెళ్ళి అయిన తర్వాత ఒకటి రెండుసార్లు ఇద్దరూ కలిసి వచ్చి వెళ్లారు. కానీ మా అమ్మాయి విడిగా ఒక్కతే రావడం ఇదే మొదటిసారి. ముద్దుల కూతురిని బాగా మిస్ అవుతున్న మావారు ఎంతో సంతోషంగాను..కొత్త చోటు, కొత్త మనుషుల మధ్య ఎలా ఉందో అన్న ఆత్రుతతో నేనూ, ఇద్దరం మా అమ్మాయి కోసం ఎదురుచూసాం.

దాని కారు చప్పుడు విని ఇద్దరం గబగబా కిందికి వచ్చాం. మేము తలుపు తీసి “హలో” అనేలోపే మా అమ్మాయి “ అయి మిస్ యు..అయి మిస్ దిస్ హౌస్ ” అంటూ మమ్మల్ని గట్టిగా కావలించుకుని ఏడ్చేసింది. నేను కాఫీ చేసి తీసుకొచ్చేలోపు ఎవరో కొత్తవాళ్ళు చూసినట్లు గబగబా ఇల్లంతా తిరిగింది. అన్నం అంటే ఆమడదూరంలో ఉండే బాపతు కదా అని నేను “ బయట నీ కిష్టమైన రెస్టారెంట్ కెళ్ళి డిన్నర్ చేద్దామా? ” అని అడిగాను. తను వెంటనే “ నేను అంత దూరం నుంచి నీ భోజనం కోసం వస్తే, నువ్వేంటి బయటకు వెళ్ళి తిందాం అంటావు? ” అంటూ ఓ కసురు కసిరింది. ఇన్నేళ్ళలో మా అమ్మాయి అంత ఇష్టంగా నా చేతి వంట తినడం నేను ఎప్పుడూ చూళ్ళేదు!

మావారైతే వాళ్ళ అమ్మాయిని చూసుకుని మురిసిపోతున్నారు. నాకేమో దాని కొత్త చోటు వివరాలు వినాలని ఉంది. తానుగా ఏమీ చెప్పకపోగా నాకు అడగటానికి కూడా అవకాశం ఇవ్వకుండా “ ఇక్కడి కబుర్లేంటి? ” అంటూ ఎదురు అడిగింది. పెళ్ళికి వచ్చిన బంధువుల గురించి…ఇక్కడి ఫ్రెండ్స్ గురించి ప్రశ్నలు వేస్తూ ఏవో మాట్లాడ్డం మొదలుపెట్టింది. మాట్లాడి..మాట్లాడి అలసిపోయింది కాబోలు “ ఇక పడుకుంటా..గుడ్ నైట్ ” అంటూ అలవాటు ప్రకారం తన రూములోకి వెళ్లబోతుంటే, గెస్ట్ రూములో పడుకోమని చెప్పి నేనూ వెళ్ళి పడుకున్నాను. తెల్లవారి నేను లేచి చప్పుడు చేయకుండా, గెస్టు రూములోకి తొంగి చూసా. పక్కమీద పిల్ల లేదు సరికదా, వేసిన పక్క వేసినట్టే ఉంది. ఇల్లంతా వెతికాను, ఎక్కడా కనపళ్ళేదు. మొగుడి మీద మోజుతో  ఏ తెల్లారుజామునో వెళ్ళిందేమో అనుకుని, బయట చూస్తే కారు డ్రైవేలోనే ఉంది. వెంటనే మావారిని లేపా..పిల్ల కనిపించడం లేదని. మావారు అంత నిద్ర మత్తులోనూ పాత జోకు వేస్తూ “ అదేమన్నా నలకా..నల్లపూసా కనిపించకపోవడానికి? దాని రూములో చూడు ” అన్నారు.

నేను వెంటనే “ దాని రూములో చూడ్డమేమిటండీ..మీకు గాని మతిపోయిందా? పెళ్ళి సామానులతో కాలు పెట్టడానికి సందులేదు అక్కడ. మీరేగా అన్నీ ఆ రూములోకి చేర్చి, తరువాత చూసుకుందాం అన్నారు, గుర్తులేదూ? అందుకే దాన్ని గెస్టు రూములో పడుకోమని చెప్పా” అంటూ ఎందుకైనా మంచిదని మా అమ్మాయి రూముకెళ్ళి జాగ్రత్తగా తలుపు తెరిచా. తీరా చూద్డును కదా కార్పెట్టు మీద దిండు పెట్టుకుని ముడుచుకు పడుకుని ఉంది. నేను “ ఏంటమ్మా!ఇలా కింద పడుకున్నావు? ” అంటే “ అయి మిస్ మై రూమ్ మామ్ ” అంటూ ఇంకా ముడుచుకుపోయి మళ్ళీ నిద్రలోకి జారుకుంది. ఆ రోజు మధ్యాహ్నం తిరిగి వెళ్ళేటప్పుడు మా అమ్మాయి మొహం చూస్తే మా ఇద్దరికీ  జాలేసింది. మమ్మల్ని, ఇంటిని వదల్లేక వదల్లేక వెళ్ళింది. వెళ్లేముందు తనకు ఇష్టమైనవి చేయించుకుని కూడా పట్టికెళ్ళింది.

ఆ తర్వాత మూడుమూన్నాళ్ళకు ఫోన్ చేసి ఇక్కడి కబుర్లన్నీ అడిగేది. కొత్తగా పెళ్ళై సెటిల్ అవుతున్న వాళ్ళను మాటిమాటికి ఫోన్ చేసి, డిస్టర్బ్ చెయ్యడం ఎందుకని నేను అనుకుంటే “ అప్పుడే నన్ను మర్చిపోయావా? ” అంటూ అలిగేది. మావైపు పనుండి ఎప్పుడు వచ్చినా ఆగి, మమ్మల్ని చూసి వెళ్లటం..వెళ్తూ కావాల్సినవి అడిగి పట్టికెళ్ళటంతో పాటు ఏ సాయంకాలమో, వీకెండు లోనో ఫోన్ చేసి అదెలా చెయ్యాలి, ఇదెలా చెయ్యాలి అంటూ అడిగేది.

నెమ్మదిగా ఫోన్ కాల్సు తగ్గిపోయాయి…రావడమూ తగ్గిపోయింది. అమ్మతో సహా అందరూ “ అప్పుడప్పుడూ జ్యోతికి ఫోన్ చేసి మంచి చెడ్డలు కనుక్కుంటూ ఉండు ” అంటూ ఇచ్చిన సలహా గుర్తుకొచ్చి నేనే ఫోన్ చెయ్యడం మొదలుపెట్టాను. నేను ఎప్పుడు పిలిచినా హడావిడిగా రెండు ముక్కలు మాట్లాడటం…లేకపోతే “ అయి విల్ కాల్ యూ బ్యాక్ మామ్ ” అని అంటుండేది. ఈ సంగతి మావారితో చెప్తే “ అవును కొత్త చోటు..కొత్త ఉద్యోగం..కొత్త సంసారం దానికి నీలా టైం ఎక్కడ ఉంటుందీ? ” అంటూ కూతుర్ని సమర్ధించుకుంటూ, నా మీద ఓ ఎత్తిపొడుపు వేసారు!

ఇంతలో ఓ రోజు ఉన్నట్టుండి ఫోన్ చేసి “ ఆఫీస్ పని మీద ఇటువైపు వచ్చాను..కొద్దిసేపు ఆగి వెళతాను మామ్ ” అంది. పని మీద బయటకు వెళ్ళబోతున్న నేను వెంటనే ప్లాన్ మార్చుకుని వంటింట్లోకి నడిచాను.

నా వంట అయిపోవస్తుండగా ఆఫీసునుంచి మావారు, వస్తున్నానన్న మా అమ్మాయి ఇద్దరూ ఒకేసారి వచ్చారు. లోపలికొస్తూనే సరాసరి కిచెన్ లోకి వచ్చి స్టౌ మీద మరుగుతున్న పులుసు చూసి “ అమ్మా! నీకు మెడ్రాస్ రసం ఎలా పెట్టాలో నేర్పించనా? ” అంది కళ్ళు ఎగరేస్తూ! చెప్పద్దూ..నాకు ఒళ్ళుమండి పోయింది. “ కిచెన్ లో కాలు పెట్టని దానివి..అధవా పెట్టినా నీళ్ళు మరిగించమంటే నీళ్ళతో పాటు గిన్నెను కూడా మరిగించే నువ్వు, నాకు వంట నేర్పుతావా? గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించడం అంటే ఇదే కాబోలు అని అనుకుని ఎప్పటిలాగే పైకి ఏమి అనలేక “ షూర్ ” అన్నా. అక్కడే ఉన్న మావారు వెంటనే “ నేర్పు జ్యోతీ ! అమ్మ రసం పెడ్తే జ్వరంపడి లేచిన వాళ్లకు పెట్టే పథ్యం చారులా ఉంటుంది! ” అన్నారు కూతురేదో పాకశాస్త్ర ప్రవీణురాలైందనుకుని పొంగిపోతూ!

నేను మా అమ్మాయిని ఎలా ఉన్నావు…ఏమిటీ సంగతులు.. అని అడిగేలోపే మాటిమాటికీ అవతలివైపుకు వెళ్ళి ఫోన్ లో వాళ్ళాయనతో మాట్లాడుకోవడం, ఇంక అక్కడినుంచీ వెళ్ళాలి…వెళ్ళాలి అనటం మొదలు పెట్టింది. వెంటనే నేను చేసినవన్నీ బ్యాగ్ లో సర్ది చేతికిస్తే “ వాటీజ్ దిస్? ” అంటూ ప్రశ్నించింది. నేను “ మీకోసం చేసాను, నువ్వు పట్టికెళ్ళడానికి ” అన్నాను. మా అమ్మాయి వెంటనే “ ఇవన్నీ నేను తీసికెళ్ళలేను, అయినా నేను కావాలని అడగలేదే? ” అంది నిర్మొహమాటంగా. వాళ్ళ నాన్న నామొహం చూసి జాలిపడి “ పోనీలే….అమ్మ కష్టపడి చేసింది కదా..తీసికెళ్ళమ్మా ” అన్నారు. 

“ నో డాడ్! ఇప్పుడు ఇవన్నీ తీసికెళ్తే మా రొటీన్ అంతా మెస్ అప్ అవుతుంది. అదీకాక అమ్మ వంటలో పులుపు, కారాలు ఎక్కువగా ఉంటాయి. మా ఇంట్లో కారం చాలా తక్కువగా తింటారు. పులుపు అయితే అస్సలు మా ఇంట్లో దగ్గరికే రానివ్వరు. థాంక్స్ ఎనీ వే ” అంటూ వెళ్ళిపోయింది. పెళ్ళి అయినప్పటి నుంచీ మా అమ్మాయి మాటల్లో “ మా ” అనే పదం ఉండటం గమనించాను. ఆ తర్వాత ఓ నాలుగు రోజులు కాలిఫోర్నియాలో ఉన్న బంధువుల ఇంట్లో పెళ్ళికి వెళ్లాను. ఆఫీసులో అర్జెంట్ పని అంటూ మావారు తప్పుకున్నా నాకు వెళ్లక తప్పలేదు. తిరిగి వచ్చాక ఇల్లు సర్దుతూ మా అమ్మాయి రూము కూడా శుభ్రం చేద్దామని తలుపు తీసిన నేను షాక్ తిన్నాను. రూమంతా ఖాళీగా…బోసిగా ఉంది. ఒక్కసారిగా మావారిమీద నాకు చెప్పలేనంత కోపం వచ్చింది. మా అమ్మాయి పెళ్ళి కుదిరినప్పటినుంచి మావారు ఈ రూము మీద కన్నేసారు! దీన్ని తన ఆఫీసు రూము కింద మార్చాలని పెద్ద ప్లాను మీద ఉన్నారు. నేను “ ఈ గదిలోవి ఏవీ కదిలించడానికి వీల్లేదని” వందసార్లు చెప్పాను. నేను ఊళ్ళో లేని సమయం చూసి ఈయన విజృంభించారని తెలిసిపోయింది నాకు.

మా అమ్మాయి జ్యోతి పెళ్ళి తర్వాత, నాకు టైము దొరికినప్పుడల్లా ఆ రూములో కాసేపు గడపడం అలవాటైపోయింది. కిటికీలో నుంచి సాయకాలపు నీరెండ గది గోడలమీద…ఆ గోడలకు తగిలించి ఉన్న దాని కాలేజీ డిగ్రీల మీద పడి మెరుస్తూ ఉంటే, చూసి నాలో నేనే నవ్వుకునేదాన్ని! హైస్కూల్ అన్నా పూర్తి చేస్తుందా అని భయపడిన రోజులు…కాలేజీకి వెళ్లటం మీద జరిగిన వాదవివాదాలు…చదువుని మధ్యలో ఎక్కడ కొండెక్కిస్తుందో…ఎక్కడ పచ్చబొట్లు పొడిపించుకుంటు౦దో అని నేను భయపడి బెంగపడిన రోజులు గుర్తుకొచ్చి “ థాంక్ గాడ్ “ అని అనుకునేదాన్ని! దాని చిన్ననాటి ఫోటోలు..మైకెల్ జాక్సన్ పోస్టర్…దాని పక్కనే మాఊరి చెరువు ఒడ్డున ఉన్న దేవాలయం ఫోటో..షెల్ఫ్ లో చిన్నప్పటి నుంచీ మొన్న మొన్నటి దాకా కొనిపించుకున్న టెడ్డీబేర్ లు.. బార్బీ డాల్స్ చూస్తూ నా ప్రపంచంలోకి వెళ్ళిపోయేదాన్ని.

వెంటనే మావారికి కోపంగా ఫోన్ చేసేసా. తీరా తెలిసిందేమిటంటే అవన్నీ మా అమ్మాయి రెండురోజుల కిందట వచ్చి తీసికెళ్ళిందిట. పైగా “ రూములో ఉన్నవాటి మీద సర్వ హక్కులు నావే కదా డాడ్? ” అందిట. “ దాని వాలకం చూస్తే గోడలు కూడా తీసికెళ్తుందేమో ” అని అనిపించింది అని నవ్వారు!    

ఈ కొద్ది నెలలలోనే మా అమ్మాయిలో వచ్చిన మార్పు గురించి ఆశ్చర్యపోతూ, ఆ విషయం మా అమ్మకు చెప్పడం జరిగింది. అమ్మ అంతా విని చాలా తాపీగా “ ఊరికే అన్నారా మన పెద్దవాళ్ళు ‘ ఆడపిల్ల ఆడ పిల్లే ’ అని అంది. ముప్పై రెండేళ్ళ కిందట నువ్వు కూడా ఇలాగే చేసావు! నీ కొత్త కాపురం కోసం నేను ఎంతో ముచ్చటపడి కొనిచ్చిన వస్తువులన్నీ “ మా అమెరికాలో ఇవి పనికి రావు…ఇక్కడి వస్తువులు మా అమెరికాలో పనిచేయవు..మా ఇంట్లో ఆల్ రెడీ ఇవి ఉన్నాయిట…మా ఆయన వద్దన్నారు ” అంటూ అన్నీ నా దగ్గిరే వదిలేసి వెళ్ళావు. నేను కొన్నవి పనికి రాలేదు కానీ, పెళ్ళి చదివింపుల్లో వాళ్ళు వీళ్ళు ఇచ్చినవి “ ఇవి నావి ” అంటూ అన్నీ పట్టికెళ్ళావు గుర్తుందా? అంది ఫోన్ లో. నీ కంటే నా మనవరాలే నయం. అది అక్కడకు వెళ్ళాక “ మా ఇల్లు ” అంటే నువ్వు అమెరికా వెళ్ళకుండానే “ మా ఇల్లు..మా అమెరికా ” అనేదానివి అంది నవ్వుతూ!!!      

.

ఆడపిల్ల ‘ఆడ’ పిల్లే – నేపథ్యం

మా అమ్మాయి జ్యోతి తన పెళ్ళి తర్వాత న్యూయార్క్ కు మారిపోవడం, తర్వాత అక్కడ కొత్తగా జాబ్ మొదలు పెట్టడం జరిగింది. కొద్ది రోజులు ఆఫీసు పనిమీద తను వేరే చోటుకు వెళ్ళి, అక్కడి నుంచి నన్ను పిలిచింది. కొద్దిసేపు మాటలు జరిగాక, నేను “ఇంటికి ఎప్పుడు వస్తున్నావు?” అని అడిగా. దానికి మా అమ్మాయి వెంటనే “ నువ్వు అడిగేది  ‘ మా ఇంటికి” ’ నేను ఎప్పుడు వస్తున్నానని అడుగుతున్నావా లేక మీ ఇంటికి నేను ఎప్పుడు వస్తానని అడుగుతున్నావా ” అంటూ నన్ను ప్రశ్నించింది!  మా అమ్మాయి అన్న ఆ మాటలే నా ఈ ముచ్చటకు ప్రేరణ అయింది. అలాగే నాకు నేను పంతొమ్మిదేళ్ళ వయసులో మొదటిసారి అమెరికాకు ప్రయాణం అవుతున్నప్పుడు, అమ్మతో నేను జరిపిన సంభాషణలు గుర్తుకొచ్చి మరింత నవ్వొచ్చి రాసిన ముచ్చట ఇది!!