.
నీ ప్రశ్నలే నిన్ను ఆథ్యాత్మికంగా ముందుకు నడిపిస్తాయి
– సినీ గీత రచయిత భువనచంద్ర
ఆత్మ, పరమాత్మ ఒక్కటేనని, జీవితంలో తృప్తిని సాధించే క్రమంలో ఈ విషయం అవగతమవుతుందని ప్రసిద్ధ సినీ గీత రచయిత భువనచంద్ర పేర్కొన్నారు.
అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి అమరజీవి 120వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన “గురుబ్రహ్మ” అంశంపై ప్రసంగించారు. ఈ కార్యక్రమం మార్చి 13వ తేదీ శనివారం సాయంత్రం యూట్యూబ్ ద్వారా ప్రసారమైంది. ఈ సందర్భంగా, సినీ గీత రచయితగా ప్రసిద్ధి పొందిన భువనచంద్ర తనలోని ఆథ్యాత్మిక కోణాన్ని ప్రేక్షకుల ముందు పరిచి వారిని తన్మయత్వంలో ఓలలాడించారు.
తన ఎనిమిదవ ఏట తన స్వగ్రామం చింతలపూడిలో ఆశ్రమం ఏర్పాటు కాగా, అప్పుడు అక్కడికి కేరళ నుంచి వచ్చిన బోధానంద గురు మహరాజ్ ను తన గురువు అవ్వవలసిందిగా అర్థించానని వక్త పేర్కొన్నారు. ఆయన సూచన మేరకు ఆశ్రమంలో సేవ చేస్తూనే “నేనేంటి?” అని ఆలోచించసాగానని వెల్లడించారు.
యువకుడిగా ఉన్నప్పుడు హిమాలయాల్లోను, ఎడారుల్లోను కొందరు మహానుభావులని, కంచిలో మహాస్వామిని, జిల్లెళ్ళమూడిలో మాతాజీని దర్శించుకున్నానని తెలిపారు. ఒకసారి రైల్లో వెళ్తుండగా కలిసిన ఒక మహానుభావుడి వల్ల మనుషుల్లోనే గురువు ఉంటాడని తెలిసిందన్నారు. మన ప్రశ్నలే మనకు కరదీపికలై దారి చూపిస్తాయని ఆయన అన్నమాటని పట్టుకొని తన ప్రస్థానాన్ని కొనసాగించానన్నారు. దాని ఫలితంగా, తింటేనే పంచదార రుచి తెలిసినట్టుగా, “తృప్తి” అనేది ఆనందానికి మూలమని తెలిసిందని వివరించారు.
అన్ని జీవుల్లో, జీవం లేనివాటిలో ఉన్నది ఒకే చైతన్యం అని చెప్తూ, కన్నతల్లి నుంచి నేలతల్లి వరకు మనం చేసే ప్రయాణమప్పుడు, అంతకుముందు, తరువాత కూడా ఉండేది “నువ్వు” అంటే, గురువేనని వివరించారు. అనేక ఉపమానాలిచ్చారు. మనలోపల ఉన్నదాన్ని గుర్తిస్తే “ఆత్మ” తెలుస్తుందని, అదే ఇతరుల్లో కూడా ఉందన్నది అనుభవానికొస్తే “పరమాత్మ” తెలుస్తుందని, ఆ రెండింటికీ తేడా లేదని చెప్పారు. భారతీయులకు ఇక్కడి నేల, ఇక్కడి గాలే వేదాంతాన్ని నేర్పుతాయని, ఎవరూ నేర్పఖ్ఖరలేదని వ్యాఖ్యానించారు. అందుకు కారణమైన ఋషులకి నమస్కరిస్తూ భువనచంద్ర తన ప్రసంగాన్ని ముగించారు.
తెలుగుజాతి గర్వంగా తలచుకొనే మహనీయుడు, భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకోసం తన జీవితాన్నే త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు స్ఫూర్తిని యువతీయువకులు తమ మనసుల్లో నింపుకొని యువత దేశం పట్ల బాధ్యతగా వ్యవహరించాలని కార్యక్రమం ప్రారంభంలో భువనచంద్ర పిలుపునిచ్చారు.
సంస్థ తరఫున డా. చదలవాడ ఉదయశ్రీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
.
**********************************