10_015 కబుసర తో కరోనా ఫట్

.

              “ అందరు టీ ఇస్తారు. మీరు నా కిష్టం అని కాఫీ ఇస్తారు ” అంటూ గ్లాసెడు పాలల్లో ఒక స్పూన్ బ్రూ, 3 స్పూన్ల పంచదార వేసుకుని త్రాగుతుంది సెల్వి. “ నన్ను పని మనిషి అనడానికి వీల్లేదు. హెల్పర్ అనో, ఆయా అనో అనండి ” అంటుంది. కడిగిన ముత్యం లాగ శుభ్రంగా ఉంటుంది. చకచక పనులు చక్కపెట్టేస్తుంది. టప్పున మాటల బాంబు పేల్చింది. “ నేను నా మనవడి పుట్టింరోజుకి వెళ్లాలి. రెండురోజులు రానమ్మా ” అంది. “ అరె, బస్సులు, రైళ్ళు లేవు ఎలా వెళ్తావు? ” అన్నాను. ఆశ్ఛర్యంగా. “ మా తమ్ముడు మోటర్ సైకిల్ మీద తీసుకెళ్తాడు. దూరమే మరి. కరోనా పుణ్యమా అని మోటర్ సైకిల్ మీద వెళ్తాను ” అంటూ గాలిలోకి చూస్తూ జడ సవరించుకుంటూ ముసి ముసి నవ్వులు నవ్వింది. “ ఊ అయితే హుషారే, మరి కరోనా ” అంటుంటే. “ జాగ్రత్తగా ఉంటాం అమ్మా ! పది మంది మాత్రమే ” అంది. కాఫీ చప్పరిస్తూ… మోటర్ సైకిల్ ప్రయాణం భలే అనడం చూసి, నాకూ సంతోషంగా అనిపించింది.

            ఈ కరోనా వచ్చి దడదడలాడించినా మొదట్లో ఓ పది రోజులు రాలేదు. తర్వాత ముక్కుకి, మూతికి కలిపి మాస్క్ కట్టుకుని శానిటైజర్ బ్యాగులో పెట్టుకుని వచ్చేసింది. ఔరా! అని అందరు జెలసీగా చూసి, ‘ ఆ.. ఆవిడ కాఫీ మహత్యం! ’ అనుకున్నారు.

            ఇంతలో బంటి, వాడి స్నేహబృందం రకరకాల ఈలలు వేస్తూ ఒకళ్ల నొకళ్ళు తోసేసుకుంటూ ఇంట్లోకి జొరబడి పోయారు. నేను చేతి కర్ర సాయంతో లేస్తూ “ ఏమర్రా, ఎక్కడికా పరుగులు? ” అంటూ లేచేసరికి అందరు తలో మూల మాయం అయిపోయారు. వాళ్ల తోపుకి క్రింద పడ్డ సెల్వి తిడుతుంటే.. “ అరె, తలుపు వేయండి మామ్మగారు ” అని గట్టిగా అరిచారు. “ఉష్” నెమ్మదిరా అంది ఓ పువ్వులాంటి పిల్ల! “ నేను కొట్టను రా, బైటికి రండి, అలమార తలుపులు తగులుతాయి. దెబ్బలు తగులుతాయి. ఇవతలకి రండి ” అన్నది గట్టిగా. ఎక్కడ నక్కారు ఈ పిల్ల సైన్యం అని వెదుకుతుండగా.

            మామ్మగారు “ చైనీస్ ఎక్స్‌గ్రెషన్! ” అన్నాడు బంటీ. “ నీ ముఖం లాగ ఉంది. సరిగ్గా చెప్పి ఏడు.. ” అంటుండగా రయ్ రయ్ అని నీలం, ఎరుపు రంగు బల్పులతో వెలుగుతూ, ఆరుతూ కార్లు వచ్చేశాయి. అందర్ని చెదరకొట్టేశారు. చిన్న బళ్ల మీద కూరలు, పళ్ళు అమ్మే వాళ్లు క్రింద పడిపోయారు. త్వరగా బల్ల క్రింద దాక్కున్నారు. మందు గొట్టాలతో పిచికారీ చేశారు. ముందుగా ఆ వీధి అంతా, ఆకార్లలో వచ్చిన వాళ్ళు.

            “ వాళ్ళు మూన్ లోకి వెళ్లే వాళ్లలాగ స్పేస్ సూట్లు వేసుకున్నారోయ్ ” అన్నాడు గడుగ్గాయి. బంటీగాడు కళ్లు పెద్దవి చేసి చేతులు త్రిప్పుతూ “ వాటిని పి.పి.ఈ లు అంటారు. అవి వాళ్లని రక్షిస్తాయట. చేతులకి గ్లౌస్, ముఖానికి మాస్క్ లు పెట్టుకున్నారు. కొందరు చూడు ” అన్నాడు. అందరు తమ జేబుల్లోంచి మాస్క్‌లు తీసి మూతికి కట్టుకుని కప్పేసుకుంటూ ఈ చెవి నుంచి ఆ చెవికి తగిలించేసుకున్నారు వెంటనే.

            సెల్వి లేచి వంటింట్లో పెద్ద గిన్నెతో నీళ్ళు కాచింది. “ ఏమిటి? ఈ పిల్లలు కాఫీ, టీలు తాగరూ ” అన్నా విసుగ్గా. కాదమ్మా ‘కబసుర’ కషాయం కాస్తున్నా. శక్తిని, రక్షణనీ యిస్తుందట. ఈ కషాయం సిద్ధ వైద్యమట ” అంది.

            “ మామ్మగారు ‘చైనీస్ ఎక్స్‌గ్రెషన్’ గురించి మా నాన్న చెప్పారు. తాతగారు కలకత్తా సిలిగురిలో చాలా ఏళ్ల క్రితం ఉద్యోగం చేస్తున్నప్పుడు ఇలాగే చైనా వాడు మన దేశం మీదికి యుద్ధానికి వచ్చాడట. నేను పుట్టలేదట. మరేమో ఉన్నట్టుండి పెద్దగా సైరన్ వచ్చేదట. అప్పుడు టపీమని ఎక్కడి వాళ్ళక్కడ నేల మీద పడుకునేవారట! అంతే! నిశ్శబ్దంగా!! అప్పుడు తాత వాళ్లు అర్జెంటుగా యుద్ధం చెయ్యడానికి ఎమర్జెన్సీ ఆర్మీలో చేరారట. అమ్మ మరి కొంతమంది ఆంటీలు కలిసి గంపలకొద్దీ ఊలు ఉండలు తెచ్చి పెద్ద స్వెట్టర్లు అల్లారట. యుద్ధం చేస్తున్న జవాన్లకి పంపారట ” ఆగి, ఆలోచిస్తూ “ ఇదీ యుద్ధమే కదా మామ్మగారూ ! అప్పుడు కొంతమంది వెళ్ళారు. ఇప్పుడు ఛాయిస్ లేదండి. ప్రపంచం మొత్తం చెయ్యాలి. ఇప్పుడు మళ్లీ ఆ చైనా వాడే దొంగ దెబ్బకి కుట్ర చేస్తున్నాడు. కరోనా అనే కనపడని బుల్లి దెయ్యాన్ని మన మీదికి తోలేడు. అది కరవకూడదనే, అందుకే ఈపీపీఈ సూట్లు, చేతులు కడుక్కోవడం” అని ఆగి చిన్న విజిల్ వేసి “ రండిరా ” అన్నాడు.

            అందరు తలో తుపాకీ, పిస్తోలు పట్టుకుని చకచక తలుపుల దగ్గర, కిటికీల దగ్గర నక్కి నక్కి చూస్తూ కూర్చున్నారు. “ భయపడకండి మామ్మగారు. ఇవి బొమ్మ తుపాకీలు, దీపావళికి కొనుక్కున్నవి. ఇందులో కార్క్ పెట్టి పేల్చవచ్చు. పిస్తోలులో ముందు టపాకాయ మందు పెట్టి పేలిస్తే పొగ వస్తుంది. ఢాం అంటుంది ” అంటూ రెడీగా కూర్చున్నారు. సెల్వి అంది “ ఆ పక్క సందులో ఉన్నాయి కార్లు.  ఇంకా పోలేదయ్యా. రండి ఈ కబసుర కషాయం త్రాగెయ్యండి. బోల్డు బలం, ధైర్యం వస్తుంది. బుల్లి కరోనా దెయ్యాన్ని తరిమేయవచ్చు. చైనా వాణ్ణి ఓడించేయవచ్చు” అని తలో గ్లాసు అందించింది. తనూ ఓ గ్లాసు తీసుకుని, నాకూ ఓ గ్లాసు కషాయం అందించింది. గప్‌చిప్‌గా త్రాగేసి కార్లు వెళ్లిపోయాయి అని గుసగుసలాడి, తమ తమ తుండు, తుపాకీ పుచ్చుకుని ఇంట్లో దూరిన కుర్ర సైన్యం అంతా ‘ చైనా గాణ్ణి ఓడిస్తాం ’ అంటూ పరుగో పరుగు. “ హమ్మయ్య! ఈ రోజుకి ఈ ఉపద్రవం దాటాం… ” అని నవ్వుకున్నాం నేను, సెల్వి.

.

******************