10_015 కథావీధి – చాసో రచనలు 4

.

ఒక రచయిత సృష్టించిన సాహిత్యాన్ని, అతని వ్యక్తిగత ఇష్టాయిష్టాలు, సంస్కారం, అతని లోకానుభవం, అతని ఆర్ధిక అవసరాలు, సమకాలీన సమాజ తీరు తెన్నులూ, ఇలాంటి చాలా విషయాలు ప్రభావితం చేస్తాయి. రచయితా మనిషే. అతనూ సమాజం లో భాగమే. లౌక్యం తెలిసిన వారెవరూ నేల విడిచి సాము చెయ్యరు. చాసో గారే స్వయంగా ‘ చిన్నాజీ ’ కథ లో చెప్పినట్టు, రచయిత వ్యవహారం ఇంటావిడకి లోకువ, సమాజానికి వినోదం. అతను వ్యక్తిగతంగా సంపన్నుడై ఉండి ఆర్ధిక పరంగా ఇంటావిడకీ, సంతానానికీ ఇబ్బందులు లేకుండా చూసుకుని తన రాతలు తాను రాసుకుంటే కొంతలో కొంత మేలు. అలా కొంత సాహిత్యాన్ని సృష్టించినా అది సమాజం చేత అంగీకరించబడాలి. అలా జరగాలంటే ఇతని సాహిత్యం జనానికి చేరాలి. రచయితకీ జనానికి మధ్య వారధిలా పత్రికలు పని చేస్తాయి.

చాగంటి సోమయాజులు గారి రథయాత్ర, మాతృధర్మం, ఊహా ఊర్వశి,ఊళ్ళో వాన లేదు, బొండు మల్లెలు, బొమ్మల పెళ్లి, వజ్రహస్తం, వెలం వెంకడు, భల్లూక స్వప్నం లాంటి కథలలో విషయం చాలా తక్కువ. వివరణ, వర్ణనల తో పాటు శిల్పం పైన, విషయం పై రచయితకు ఉన్న పట్టు పాఠకులకు అర్ధం అవుతుంది.

‘ రథయాత్ర ’ కథలో ఆరేడేళ్ల చిన్న పిల్లవాడు నాయకుడు. దేవుడి రథయాత్ర సందర్బంగా జరిగే తీర్థానికి అబ్బాయి ప్రయాణం కడతాడు. తీర్థం లో ఖర్చుల కోసం నాన్న కానీ ఇస్తాడు, అమ్మని అదిలించుకుని అర్ధనా తీసుకుంటాడు అబ్బాయి. నాన్నమ్మ గారం చేసి ఒత్తుల పెట్టె లోనుంచి ఇంకో అర్ధనా ఇస్తుంది. తీర్థానికి వెళ్లేముందే అబ్బాయి లెక్కలు వేస్తాడు. రంగుల రాట్నానికి కానీ తప్పదు. ఇంకా పకోడీలూ, బంగరమూ, తాడూ ఉన్నాయి. ఎరుపూ ఆకుపచ్చ రంగుల బంగారం కొనక తప్పదు. ఇలా లెక్కలు కట్టుకుంటూ తీర్థానికి వెళ్లిన అబ్బాయి అక్కడ ఒక ఐదేళ్ల అమ్మాయి ప్రేమలో పడడం, ఆ అమ్మాయి బామ్మగారితో తమ దగ్గర బాగా డబ్బు ఉందని చెప్పడం, బంగారాన్ని సావిట్లో తిప్పుతూ బాదం చెట్టు మీద ఉన్న ఎర్ర బాదం పళ్ళ మధ్యలో ఆకుపచ్చ సాలి పట్లు చూడడం ఇలా సాగే కథ రాత్రి భోజనం చేసిన అబ్బాయి నిద్రలోకి జారుకుని తీర్థం కలలో మునగడం తో ముగుస్తుంది. ఈ కథ పాఠకుడిని అబ్బాయి ప్రపంచం లోనికి తీసుకుని వెడుతుంది.

‘ మాతృధర్మం ’ కథ కత్తెర పక్షులు జంట కట్టి గూడు కట్టుకుని జీవితం ప్రారంభించడం తో మొదలై ముంగిస బారినుంచి గుడ్లను రక్షించుకోవడం కోసం వీరోచితంగా పోరాడి మరణించడం తో ముగుస్తుంది.
 

‘ ఊహా ఊర్వశి ’ కథానాయకుడు ఉన్నత మధ్య తరగతి విద్యావంతుడు, ఉద్యోగి. విద్యార్థి దశలో ఇతను ప్రేమించిన ఊర్వశి ఆర్థిక కారణాల చేత తండ్రి అభిప్రాయానికి తలవంచి  ప్రాక్టీస్ లేని ప్లీడర్ గారికి భార్యగా మారుతుంది. ఇతని భార్య పుస్తకాలని తక్కువగానూ, లోకాన్ని ఎక్కువ గానూ చదివిన మనిషి. భర్త అంటే పిచ్చి ప్రేమ. ఇంట్లో ఇల్లాలి ప్రవర్తనకు ఏ రకమైన వంకా పెట్టడానికి ఆస్కారం లేదు.

ఇతను అప్పుడప్పుడు వ్యవహారపరంగా పక్క ఊరిలో ఉన్న ప్లీడర్ గారి ఇంటికి వెళ్ళవలసి రావడం, అక్కడ భర్త, అత్తమామలు, సంతానం తో సతమతమవుతున్న తన ఊహా ఊర్వశి ని చూసి మనసులోనే నిట్టూర్చడం జరుగుతూ ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఆమెని క్రుంగదీస్తాయి. అయినా నిబ్బరంగానే ఉంటుంది. అరకొర పలకరింపులు దాటి సంభాషణ సాగించలేని పరిస్థితి.

ఒకరోజు పొరుగూరిలో జరుగుతున్న బంధువుల పెళ్లికి బలగం తో కలసి ఇతను నావలో బయలుదేరు తుండగా కథ మొదలవుతుంది. భార్య అమ్మలక్కలతో తన వయసుకి మించిన మాటలు మాట్లాడుతూ ఉంటుంది. ఇతను నావలో ఒక మూల కూర్చుని ఊహాలోకంలోకి జారుకుని తన ఊర్వశి ఆలోచనలలో పడడంతో కథ మొదలయి నావ అడంగుకు చేరుకోవడంతో ఇతను ఆలోచనలలో నుంచి బయటపడడం తో ముగుస్తుంది.

‘ బొండు మల్లెలు ’ కథ ఒక మధ్య తరగతి సౌందర్య పిపాసిది. ఇతనికి ఆర్ధిక విషయాల మీద పట్టు ఉంది. తన ఇంటి పెరడు ఖాళీగా ఉండడంతో నాలుగు రోడ్ల కూడలిలో పనికోసం వేచి ఉన్న ఒక వృద్ధ కూలి మనిషిని పట్టుకుని పనిలో పెట్టుకుని మల్లె తోట నాటించి, కూలి మనిషి కష్టం తో విరగబూసిన  బొండుమల్లి పూలను అతని చేతే అమ్మించి మంచి లాభం గడించినప్పటికీ కూలి మనిషి వృద్ధుడు అవడం  చేత కూలి తక్కువగా ఇస్తాడు.

యజమానికి వ్యాపారం లో ఆర్ధిక లాభం తో పాటు, అందమైన స్త్రీలు ఇతని పెరటిలో పూసిన బొండుమల్లి పూలు ఇష్టంగా కొనుక్కుని తలలో ముడుచుకొని తమ అందాన్ని ద్విగుణీకృతం చేసికోవడం ఇతని లోని సౌందర్య పిపాసిని సంతృప్తి పరుస్తుంది. కూలి మనిషి నిజాయితీగా కష్టపడి విశ్వాసం గా ప్రవర్తించినా అతనికి కూలి తక్కువగానే దొరుకుతుంది. కూలి మనిషి మొదటి నెలంతా మధ్యాహ్నం పూట గంజి తాగి నెల జీతం అందిన మరునాటి నుంచీ మధ్యాహ్నం అన్నం తెచ్చుకోవడం చూసిన ఇతను అందుకు కారణం గ్రహించి అన్నంలోకి కొన్ని మిగిలిపోయిన కూరలు ఇస్తాడు.

ఇతనికి అన్ని రకాలుగానూ లాభాలు సంపాదించి పెట్టిన కూలి మనిషి చావుకు ఇతను ఒక నిట్టూర్పు కూడా విడువ లేకపోవడంతో కథ ముగుస్తుంది.

‘ బొమ్మల పెళ్లి ’ కథ. పాఠకులను వేరే లోకం లోకి తీసుకుని వెడుతుంది. ధనుర్మాసం లో ఒకరోజు తెల్లవారుఝామునే లేచిన ఇంటి యజమాని తన భార్య, తల్లితో పూజాకార్యక్రమాలలో మునిగి ఉండగా, ఆ హడావుడి కి లేచిన పిల్లలు తాము కూడా త్వరగా తెమిలి ప్రసాదాలకు ఉత్సాహంగా ఎదురు చూస్తూ, కాలక్షేపం కోసం తండ్రి గారి మాతామహి చుట్టూ చేరతారు. ఆవిడ వయస్సు తొంభయ్యారేళ్లు, కంటి బలం, పంటి బలం తగ్గలేదు. తన చిన్ననాటి బొమ్మల పెళ్లి ముచ్ఛట్లు, ఆ వయసులోనే తన బాల్య వివాహపు విషాద కథ ఆమె చెప్పడం… ఇలా సాగుతుంది.

‘ వజ్ర హస్తం ’ కథ. పదవీద్యుతుడై, కష్టకాలం గడిపి, పై వారి దయతో రిమార్కులు చేరుపుకుని, మర్యాదస్తుడి గా మారి తిరిగి ఉద్యోగంలో చేరిన ఒక తిమింగలం ఉద్యోగి తన మొక్కు తీర్చుకొనేందుకు ఏడుకొండలు ఎక్కి నిలువుదోపిడీ సమర్పించుకుంటూ తనతో పాటు పదవీద్యుతుడైన తోటి ప్రజాసేవక తిమిగలం గురించి ఆందోళన పడుతున్న సమయంలో కళ్యాణ కట్ట దగ్గర తోటి తిమింగలం దర్శనం ఇచ్చి ఏడుకొండలసామి దయతో తాను బయటపడి నిలువుదోపిడీ మొక్కు తీర్చుకునేందుకు వచ్చానని, ఇతనికి చెప్పి ఆందోళనా విమోచనం చేస్తాడు. పరమాత్ముని నిర్ణయాలు పామరులకు బోధపడవు అని తీర్మానం చెయ్యడంతో కథ ముగుస్తుంది.

ఏ ప్రమాణం తో కొలిచినా చాగంటి సోమయాజులు గారి కథలు సమకాలీన కథా ప్రపంచం లో ఉత్తమమైన రచనల కోవలోకే చేరతాయి.  

అమెజాన్ అనే అంతర్జాల బట్వాడా సంస్థ ద్వారా చాసో గారి పుస్తకాలను పొందవచ్చును. కాళీపట్నం రామారావు గారి కథానిలయం లో చాసో గారి కొన్ని కథలు PDF రూపం లో భద్రపరచబడినాయి. ఆసక్తి గలవారు చదవగలరు.

.

( చాసో గారి కథల పరిచయం సమాప్తం )

.

**************************************