10_015 పాలంగి కథలు – కోనసీమ జ్ఞాపకాలు

.

కోనసీమ జ్ఞాపకాలుమా అమలాపురం ప్రయాణం…

.

ఆ ఇంటితో అనుబంధం అరవైయ్యేళ్లనాటి జ్ఞాపకాల సుగంధం! ఆ పరిమళం మనోవీధిలో ఈనాటికీ గుబాళిస్తూనే ఉంటుంది. వాస్తవం గుర్తొస్తేనే మనసు నిట్టూరుస్తుంది ఆ ఇల్లు కనబడక. నిజమే… అన్నీ కాలగర్భంలో కలిసిపోవాల్సిందే! “ గతాసూ నగతాసూంశ్చ నానుశోచంతి పండితాః ’’ అని భగవద్గీత హెచ్చరిస్తూనే ఉంటుంది. తల్చుకుని ఓసారి మూగగా నిట్టూర్చక మానదు మనసు !

చిన్నతనపు జ్ఞాపకాలు మధురానుభూతులే. వాటిని గుర్తుచేసుకోవడం ‘వాస్తవానికి ఊరట’. అలా ఓసారి గతంలోకి వెళ్తే ….! జ్ఞాపకాలు కళ్లల్లో మెదులుతాయి!!

‘ఆ గోదారి! దాంట్లో లాంచీ ప్రయాణం. పచ్చటిపొలాలు, కొబ్బరి, తాటితోపుల మధ్య కాలువ పక్కగా సాగే రోడ్డు, దుమ్ము రేపుకుంటూ గతుకుల రోడ్డు మీద ప్రయాణం, ఊరు చేరాక ఒంటెద్దు బండి మీద ఇల్లు చేరడం! తాతలనాటి పెంకుటిల్లు పెద్ద పెరడు, కనకాంబరాలు, మల్లెలు, జాజిపూల సువాసనలతో వేసవికాలపు సాయంకాలాలూ, మామిడిపళ్లు, చెరకు పానకంతో మినపరొట్టె! పూల జడలు,…’అలా చెప్పుకుంటూ పోతే…ఎన్ని ఆనందాలో!!!

చెన్నపట్నం సెంట్రల్‌ స్టేషన్‌లో హౌరా మెయిల్‌ ఎక్కి మర్నాడు ఉదయానికల్లా రాజమండ్రి స్టేషన్‌లో దిగి తిన్నగా ‘నాళం వారి సత్రం’కి వెళ్లి, గుమాస్తా దగ్గర ఓ గదికి చీటి రాయించుకుని సామాను అందులో ఉంచి దగ్గరే ఉన్న గోదార్లో స్నానం చేసి వచ్చి, బట్టలు మార్చుకునేసరికి నాన్నగారి స్నేహితులు, కవులు వచ్చి సత్రం అరుగుమీద కూర్చుని ఉండేవారు. రచయితలు వాళ్లు రాసిన పుస్తకాలు ‘పత్రికల్లో సమీక్షల’ కోసం నాన్నగారికి ఇస్తుండేవారు. సాహితీగోష్టి జరిగేది వారి మధ్య. పదకొండు గంటలవుతుంటే వాళ్లందరినీ పంపి లోపలికి వచ్చేవారు. ముగ్గురం కలిసి వరదరావు హోటల్‌కి వెళ్లేవాళ్లం భోజనానికి. ( ఊళ్లో బంధువులు, స్నేహితులు భోజనానికి రమ్మన్నా సున్నితంగా తోసిపుచ్చేవారు ). నాన్నగారిని చూడగానే గల్లా పెట్టె దగ్గర నుంచి దిగి ‘ వచ్చేరా పంతులుగారూ? ఇదేనా రావడం? ’ అంటూ ఎంతో ఆప్యాయంగా పలకరించి ‘ ఒరేయ్‌… ఎవరున్నారురా లోపల, పట్నం నుంచి పంతులుగారు వచ్చారు. పీటలు వాల్చి ఆకులు వేసి వడ్డించండి ’ అని కేకేస్తే…‘ రండి బాబయ్యా ! అమ్మా ఇటు రండి ’ దగ్గరుండి తీసుకెళ్లి పీటలు వాల్చి పెద్దరిటాకులు ఏరి వేసి, ఎంతో వినయంగా ప్రతీదీ కొసరి కొసరి మరీ వడ్డించేవారు. భోజనం హోటల్‌లో చేస్తున్నట్టుండేది కాదు. ఆత్మీయుల ఇంట తింటున్నట్టు ఉండేది! సత్రం గదికి తిరిగి వచ్చాక కాస్సేపు పడుకుని లేచేవారు నాన్న. మళ్లీ సత్రం అరుగుల మీద వచ్చినవాళ్ల గోష్టి ప్రారంభం. సాయంత్రం వాళ్లంతా కలిసి గోదారి ఒడ్డుకు వెళ్లేవారు. మేం వచ్చినట్లు తెలిసి, వచ్చిన బంధువులతో అమ్మ గడిపేది. నాకెవరూ ఉండేవారు కాదు. ఇంటినుంచి వచ్చేటప్పుడు హోల్డాల్‌ మడతల్లో కూరిన చందమామ, బాలమిత్ర బయటకు తీసి కిటికీలో కూర్చుని చదువుతూ గడిపేదాన్ని.

మర్నాడు పొద్దున్న ఏడు గంటలకల్లా లాంచీ. పెందరాడే లేచి స్నానాలు ముగించుకుని బయల్దేరే వాళ్లం. ఈలోగా నాన్న వెళ్లి హోటల్‌ కుర్రాడి చేత ఇడ్లీలు, కాఫీ పంపించేవారు సత్రంకి.  తినేసి లాంచీల రేవుకి సామాను పుచ్చుకుని చేరుకుంటే బయల్దేరే లాంచీలో సామాను పెట్టించి, ఆడాళ్లం ఒకవైపు కూర్చుంటే మగాళ్లు మరోవైపు ఎక్కి కూర్చునేవారు. డబడబా శబ్దంతో, పొగలు కక్కుకుంటూ కదిలేది లాంచీ గోదావరి నీటిని చీల్చుకుంటూ. ఇంతలో ‘కాలక్షేపానికి కాశీ మజిలీ కథలమ్మా ఆడవాళ్లపాటలు, ఊర్మిళ నిద్ర, కుచ్చల కథ, సీతమ్మవారి సీమంతం పాటలు… ఖరీదు అణా మాత్రమే. తీసుకోండమ్మా. సామెతల పుస్తకం, కితకితలు పెట్టే పొడుపు కథల పుస్తకం, కావాలా బాబూ? ’ అంటూ అమ్మేవాడు ఓ అబ్బి. ఏటా ఇలా వచ్చినప్పుడు లాంచీలో తటస్థపడే పుస్తకాల పాత నేస్తం వాడు.

నన్ను చూడగానే…‘ఆ ఆ పట్నం పాప సెలవులకొస్తోందా కోనసీమ?’ అంటూ ఆప్యాయంగా పలకరించేవాడు. ‘ఓసారి పొడుపు కథల పుస్తకం ఇవ్వవూ ? కొంచెంసేపు చూసిస్తా’ అంటే…అభిమానంగా పుస్తకాల దొంతరలోంచి ఏరి ఇచ్చేవాడు. అతను మగవాళ్ల కేబిన్‌కెళ్లి తిరిగి వచ్చేసరికి ‘ఇదిగో అబ్బీ తీసుకో’ అంటూ ఇచ్చేసేదాన్ని. పోయిన సంవత్సరం వచ్చినప్పుడు నాన్నని కొనమంటే ‘పొడుపు కథల పుస్తకం కొనడమేమిటి? ఊహించు, నువ్వే కొన్ని పొడుపు కథలు తయారుచెయ్యి’ అన్నారు. ఇంకేమంటాను? పుస్తకం తిరిగి ఇచ్చేస్తుంటే ఆ అబ్బిని పిలిచి ‘ సింహాసన ద్వాత్రింశిక ’ పుస్తకం కొనిచ్చారు. ఎంత బాగున్నాయో ఆ కథలు!

మరోసారి ఇలాగే ప్రయాణం చేస్తుంటే ఆ అబ్బి ‘ కొవ్వలి వారి నవలలు, జంపనవారి అధునాతన నవలలు, యువ ప్రచురణలు ’ కావాలామ్మా అంటుంటే – కొనమని అడిగా. ‘ వద్దులేవయ్యా నువ్వెళ్లు ’ అంటూ సంచీలోంచి ఓ పుస్తకం తీసి ‘ చదువుకో ’ అన్నారు.

వచ్చే ముందు రేవు దగ్గరికి వచ్చి భమిడిపాటి కామేశ్వరరావుగారు ఏవో పుస్తకాలివ్వడం నేనూ చూశాను. ‘ ఈ పుస్తకాలు నువ్వు చదువుతావనే ఇచ్చారు మాస్టారు ’. అది ‘మాయల మాలోకం’ ఎంత సరదాగా ఉందో?! అప్పుడు చదవడం మొదలెట్టి ‘బొబ్బర్లంక…బొబ్బర్లంక…’ అన్న కళాసు కేకలకి తలెత్తాను!!

బొబ్బర్లంక వచ్చేసింది. లాంచీల నుంచి ఒడ్డుకు వేసిన బల్లమీదనుంచి జాగ్రత్తగా దిగి సామాను పట్టుకుని గట్టెక్కి రోడ్డు చేరుకున్నాం. కాస్త దూరం నడిచి వెళ్లేసరికి అప్పటికే సిద్ధంగా ఉన్న బస్సులోకి జనం ఎక్కేస్తున్నారు. దూరం నుంచే చూసిన బస్సబ్బాయి ‘ఆ…ఆ… రండి రండి పట్నం పంతులుగారూ, రండమ్మా రండి. ఆ హోల్డాలు నేను టాప్‌ మీద పెడతాను ఇటివ్వండి. బాబూ, పట్నం పాపా బాగున్నారా? పై కళాసుకి వెళ్లిపోయారా? ఎన్నో కళాసు తల్లీ? ఇలా వచ్చేయండి మీరు ’ అంటూనే …. ‘ ఒరేయ్‌ బుల్లబ్బిగా నువ్విట్టా రారా ఆడ బాబు గారు కూకుంటారు’ అంటుంటే లేచిన ఆ కుర్రాడు డ్రైవర్‌ని ‘ ఎవరంటావ్‌?’ అని అడిగాడు.

‘ ఆరు పెద్ద పెద్ద సదువులు సదువుకునేటోరికే సదువు సెప్తారంట. పెద్ద పంతులుగోరన్నమాట. ఏటా ఇలా సెలవులకొత్తారు అమలాపురం ’ అనడం వినబడింది. ‘ రండి బాబూ ఈడ ఎక్కండి ’ అంటూ చేతిలో తోలుపెట్టె అందుకుని ‘ బాబుగారూ, నేనియ్యన్నీ జాగ్రత్తగా ఎడతాగా. దిగేటప్పుడిస్తా ’ అంటూ ఆప్యాయంగా ‘ ఈ సంచీ మీ కాళ్ల కాడ ఎట్టుకోండమ్మా ’ అంటూ ముందు వరసలో కూర్చోబెట్టాడు కండక్టర్‌. కిటకిటలాడుతోంది బస్సు. రైట్‌ రైట్‌ అంటూ ఈల వేశాడు కండక్టర్‌. ఇక బయల్దేరుతుందన్నమాట బస్సు. ఓ ఇనప కడ్డీతో బానెట్‌ ఎత్తిపట్టి తిప్పడం మొదలెట్టాడు క్లీనర్‌. డబడబమంటూ పెద్ద శబ్దంతో బయల్దేరింది బస్సు. వెనక రోడ్డు మీద దుమ్ము మేఘాల్లా లేచి కమ్మేస్తుంటే ఎత్తెత్తి కుదేస్తూ, గతుకుల రోడ్డు మీద సాగుతోంది బస్సు.

కాసేపటికి బస్సు రోడ్డు వారనున్న ఓ పెద్ద పాక దగ్గర ఆగింది. ‘ ఊబలంక…ఊబలంక… కాఫీ, టీలు తాగేటోళ్లంతా తాగొచ్చెహ ’ అంటూ అరిచాడు క్లీనర్‌ కుర్రాడు. నాన్నగారు బస్సు దిగి ఆ పాక హోటల్‌కేసి నడుస్తున్నారు. నేనూ దిగి నడిచాను నాన్నతో. బస్సులోని ఆడంగులంతా చాలామంది దిగి అలా పొలాల చాటుకి వెళ్లారు.

నాన్నగారిని చూసి గల్లా పెట్టె దగ్గరున్న యజమాని ‘ ఒరేయ్‌ పెద్దోడా…ఓపాలి గల్లా పెట్టెదగ్గరుండురా. పట్నం నుంచి పంతులుగారొస్తున్నారు. పలకరించి వస్తా ’ అంటూ ఎదురొచ్చి ‘ దండాలు పంతులు గారూ, దండాలు. రండి. ఈ బల్లపై కూకోండి ’ అంటూ తన భుజమ్మీదున్న తువ్వాలుతో బల్లను ఓసారి తుడిచి ‘ ఓ పాలి లేచి అటుగా కూకోరా అబ్బీ ’ అంటూ ఆ బల్లమీదున్న కుర్రాణ్ణి లేపి నాన్నగారిని కూర్చోమన్నాడు. ‘ ఇలా కూకోండమ్మాయి గారూ…మీరు కూడా ’ – ఎంతో గౌరవం, అభిమానం గొంతునిండా నింపుకుని.

‘ బాగున్నావా కాపూ…ఎలాగుంది వ్యాపారం? ’ నాన్నగారి ఆప్యాయపు పలకరింపు.

‘ మీ దయతో బాగా సాగుతుండాది బాబూ, నిరుడు ఓ బాపన కుర్రాయన తగిలారు. ఇరుసుమండే ఆరిది. దొడ్డ సెయ్యి లెండి…బాబూ ఆరొచ్చిన కాణ్నించి ఒటేలు బాగానే పుంజుకుంది బాబయ్యా. శానా రుసిగా సేస్తారు. వంటకాడికి ఇంకెవ్వర్ని రానీయరు. అంతా ఆరే! ఈమధ్యే ఆరి పినతండ్రిగారబ్బాయిగోరు సాయం వత్తున్నారు సెలవులని. ఇలా చేత్తున్నారని ఆరింట్లో కూకలేశారంట! కానయ్యగారూ…మా దొడ్డ మడిసి లెండి. ఏవైనా నిలదొక్కుకున్నారు… ఏం చెప్పుకున్నారోగానీ! నాకు నాలుగు డబ్బులు రాల్తున్నాయి. అంతా అయినవిల్లి సామి దయ. మా ఎదవలున్నారే అంత బాగా చైలేరు. అదిగో ఇటే వత్తున్నారు చిన్నపంతులు! ఎవరొచ్చారో చూడండి. లోన చూడ్డానికి తమ్ముడుగారున్నారుగా? ’

‘ అవును సుబ్బయ్యా… ’ బాబయ్య మాట వినిపించింది దూరం నుంచి. ‘ పట్టు లంగాతో చెల్లాయి కనబడింది. అందుకే తమ్ముడికి పురమాయించి ఇలా వచ్చాను. పట్నంలో అందరూ బాగున్నారా బాబాయ్‌? ’

‘ ఏమే చెల్లీ! బాగా చదువుకుంటున్నావా? ’

అమ్మ మరచెంబు పట్టుకొచ్చి ‘ కమలా మరచెంబులో మంచినీళ్లు పోయించుకురావే ’ అంటూ పరీక్షగా చూస్తూ ‘ సుబ్బులక్క కొడుకువి కదూ? ’ అంటూంటే ‘ అవును పిన్నీ బాగున్నావా? ’

‘ అవునొరేయ్‌. ఈ హోటల్‌లో ఫలహారాలు చేస్తున్నావా? మీ నాన్న, అమ్మ ఊరుకున్నార్రా? ’ అని ఇంకా ఏదో అనబోతుంటే నాన్న అమ్మకేసి కోపంగా చూసి ‘ శాస్త్రీ!! కాస్త కాఫీ తెప్పించు నాయినా! మళ్లీ బస్సు బయల్దేరే వేళయిపోతుంది ’

అతను వెంటనే అక్కడినుంచి వెళ్లి కాఫీలు తెచ్చి పెట్టాడు. ఈలోగా అమ్మ బస్సెక్కేసింది. అమ్మకు కాఫీ గ్లాసు పట్టుకెళ్లి ఇచ్చాను. ‘ చీకటి పడేలోగా ఊరు వెళ్తే బాగుణ్ణు ’ అంటోంది అమ్మ కాఫీ గ్లాసు వెనక్కిస్తూ.

‘ నాన్నా నాకు పాలకోవా బిళ్లలు కొనరా మరి? ’

‘  చెప్పానమ్మా. కట్టిస్తాడు ’ అంటూ ఉండగానే కుట్టుడాకులో కోవా బిళ్లలు మడిచి తెచ్చి పెట్టాడు. ఈలోగా బస్సు హారన్‌ బొయ్‌ బొయ్‌ మంటూ రంకెలేసింది.

అందరూ హడావుడిగా బస్సెక్కేస్తున్నారు. నాన్న గల్లా పెట్టె దగ్గరికెళ్లి డబ్బిచ్చి బస్సుకేసి నడిచారు. నేను వెళ్లబోతుంటే శాస్త్రి అన్నయ్య లోపల్నించి వస్తూ నా చేతులు పట్టమని దోసిలి నిండా పకోడీలు పోశాడు. ‘ పరికిణీలో పోసుకుని బస్సెక్కేక తినేం ’ అంటే ఆప్యాయంగా భుజం తట్టి చెయ్యుచ్చుకుని బస్సు దాకా వచ్చి నన్ను బస్సెక్కించాడు. ‘ పిన్నీ ! ఎల్లుండి ఇంటికొచ్చి కనబడతానేం ’ అంటూంటే అప్పటికే బానెట్‌ ఎత్తి ఇనపకడ్డీతో తిప్పుతున్నాడేమో గుర్‌గుర్‌ మంటూ కదిలింది బస్సు. కడ్డీ తిప్పిన క్లీనరబ్బాయి పరుగో పరుగు బస్సుతో కూడా. భలే ఎక్కేశాడు పరుగెత్తే బస్సు కడ్డీ పట్టుకుని. హడలిపోయాను పడిపోతాడేమోనని. వాడెక్కాక హమ్మయ్యా అనుకున్నాను.

కుదుపులతో, గతుకుల రోడ్డు మీద బస్సు వెళ్తుంటే రోడ్డు పక్కనున్న చెట్లు పరుగెడుతున్నాయి వెనక్కి. వాటి గురించి ఆలోచిస్తున్న నా భుజం తట్టి– ‘ అటు చూడు. సంధ్య ఎంత బాగుందో ’ అన్నారు నాన్న. నిజమే, సూర్యుడు పడమట వాలడం కనబడుతోంది దూరంగా, కొబ్బరి చెట్ల మధ్య ఎర్రగా. కింద పచ్చని తివాచీ పరిచినట్టు వరిచేలు. గాలి, దుమ్మూ కలగలిసి మొహానికి తగులుతుంటే – మన గాలి ఇది. మన నేల ఇది. మన ప్రాంతం అనిపించినట్టుంది నాన్నకి. తన్మయత్వంతో ఆప్యాయంగా చూస్తున్నారా దృశ్యాన్ని కిటికీలోంచి. ఆయన మొహంలో భావం అర్ధమైన నేను అంతే తన్మయత్వంతో చూశానా సంధ్యా దృశ్యాన్ని. ప్రతి విషయాన్ని నాన్న దృష్టితో చూడటం అలవాటు.

‘ పొద్దు వాలిపోతోంది. ఎప్పటికి చేరుకుంటామో ’ అంటూ సణుక్కుంటోంది. ఆవిడ బాధ ఆవిడది. ఏటికేడాదీ తాళం వేసి ఉంచిన ఇల్లు. దుమ్ము కొట్టాడుతున్న ఇల్లు తాళం తీసి, తుడుచుకుని శుభ్రం చేసుకుని అన్నం వండుకుని తినాలి గుడ్డి దీపాల వెలుగులో!!

‘ అంబాజీపేట…అంబాజీపేట ’ క్లీనర్‌ అరుస్తున్నాడు. బస్సు ఆగింది జనాలు దిగుతున్నారు.

‘ అమ్మా ఇక్కడ దిగిపోయి పోనీ ముంగండ అమ్మమ్మ గారింటికి వెళ్దామా? ’ అమ్మకి శ్రమ తప్పించాలని నా తపన.

‘ వద్దులే తల్లీ…మీ నాన్నగారికి నచ్చదు. అయినా ఈ సామానుతో…ఇంటికే వెళ్దాంలే ’

కనుచీకటి పడలేదింకా. అమలాపురం వచ్చాం. బస్సు టాపు మీద నుంచి పెట్టె, హోల్డాలు దింపుతున్నారు. ఒంటెద్దు బండి బేరమాడి సామానుతో ఎక్కి కూర్చున్నాం. గంటస్తంభం సెంటరు రాగానే – ‘ ఓసారి ఆపరా అబ్బీ’ అంటూ నాన్న దిగి ‘ నువ్వు బండి సాగించు. నే వస్తాలే ’ అంటూ ఎదురుగా ఉన్న హోటల్‌లో కెళ్లి గాజుగ్లాసుతో పెరుగు పట్టుకుని పైన కుట్టుడాకుల మూతలతో వెనకాలే నడిచి వచ్చారు.

హైస్కూలు దాటి డాక్టర్‌ మంథా సుబ్బారావుగారి మేడ పక్క సందులోకి మలుపు తిప్పి, గుమ్మం ముందు ఆపాడు బండి. సామాను అరుగు మీద పెట్టి తలపాగా దులిపి భుజం మీదేసుకుని నాన్న కోసం చూస్తున్నాడా అబ్బి. ఇంతలోనే వచ్చిన నాన్న వాడికి డబ్బులిచ్చి, పెరుగు గ్లాసు అమ్మకిచ్చి, జందెంకి ఉన్న తాళం చెవితో తోలుపెట్టె తాళం తీసి లోపలినుంచి ఇంటి తాళం చెవి బయటకు తీసి మొత్తానికి ఇంటి తాళం తీశారు. ఈలోగా చివరి వాటాలో ఉన్న మాస్టారు, వాళ్లావిడ, పిల్లలు వచ్చారు వీధరుగు మీదికి. ‘ రండి రండి వదినగారూ అంతా బాగున్నారా ’ అంటూ పలకరిస్తుంటే – ‘ ఆ ఆ మీరంతా ఎలా ఉన్నారు? ’ అంటూనే మరచెంబందుకుని లోపలికి నడిచింది అమ్మ.

‘ సామాను అరుగు మీదే ఉండనీ గదులు తుడిచాక పెట్టుకోవచ్చు’ లోపల నించి అమ్మ కేక. మేస్టారమ్మాయి మాణిక్యం గబగబా వచ్చి కావలించుకుంది. ‘ వచ్చావా కమలా నిన్ను చూస్తే ప్రాణం లేచొస్తుందే ’ అంటూ. ఈలోగా మాస్టారు వాళ్లావిడ లాంతరు తెచ్చి పెట్టి ‘ బాగున్నావా పిల్లా ! సంగీతం పాడుతున్నావా ’ అంటూ పలకరించి ‘ ఈ ఒక్క పూటా ప్రయాణం చేసి వచ్చారు. మా ఇంట్లో తినమంటే తినరు కదా ’ అంటుంటే– ‘ పోనీలే ఒదినా…ఆయనగారి సంగతి తెలియందేముంది? అయినా మొదలెట్టాక ఎంతసేపం’టూ చీపురందుకుని తుడుపు మొదలెట్టింది.

లాంతరు వెలుగులో ఇల్లంతా తుడిచి పెరట్లో ఇటుకలు పేర్చి పొయ్యి అమర్చింది. నిరుడు వేసంగుల్లో వాడి, తిరిగి వెళ్లే ముందు కడిగి, గోడకున్న వాసం మేకుకు తగిలించిన కుండ తీసి కొబ్బరి పీచుతో తోమి కడిగి పెట్టింది. పెరట్లో ఉన్న కమ్మలు, గిలకపూలు ( అంటే తెలుసా…? ఎండిన కొబ్బరిపువ్వన్నమాట ) పొయ్యిలో అమర్చి లాంతరు సందులోంచి కొబ్బరాకు అంటించి మొత్తానికి పొయ్యి వెలిగించింది. ఈలోగా నాన్న పెరటి నూతి దగ్గర స్నానం చేసి, చిన్ని బిందెతో నీళ్లట్టుకొచ్చి కుండలో నీళ్లోసి ఎసరు పడేశారు. తెచ్చిన సామాన్లలోంచి బియ్యం సంచీ బయటకు తీశారు. వంటింటి గూట్లో ఉన్న గిన్నెల్లో అవసరమైనవి తీసి తోమి కడగడం నా వంతు. నాన్న పొయ్యి దగ్గరుండి మంట ఎగసన తోస్తుంటే అమ్మ నూతిదగ్గరకు వెళ్లి గబగబా నాలుగు చాదలు ( బకెట్లన్న మాట!! ) తోడుకుని స్నానం చేసి వచ్చి ఎసట్లో బియ్యం పోసి వంట పూర్తి చేసింది. మేం వచ్చేటపుడు వెంట తెచ్చుకున్న ఊరగాయ, కందిపిండి, పెరుగుతో భోజనాలు పూర్తి చేశాం పెరటి కటకటాల్లో కూర్చుని. అంతకుమందు మాస్టారమ్మాయి మాణిక్యం నేతి గిన్నె తెచ్చి పెట్టింది వాళ్లింటినుంచి.

పక్కంటి గడియారం తొమ్మిది గంటలు కొట్టింది. వీధి గదిలో సందుకా పెట్టెలో ఉంచిన బొంతలు, దుప్పట్లు తీసి దులిపి మధ్య గదిలో నేల మీద పరిచింది అమ్మ. ఈలోగా మాస్టారబ్బాయి పట్టె మంచం తెచ్చి ‘ మీరు నిరుడు ఊరెళుతూ మా ఇంట్లో అట్టిబెట్టిన పట్టె మంచం ఇదిగో. అమ్మ ఇచ్చి రమ్మంది ’ అన్నాడు. ‘ నా తండ్రే! తెచ్చి పెట్టావా! ఆ వారగా వేసి పెట్టు నాయనా ’ అంటూ దీపం ఎత్తి చూపించింది వెలుగుకోసం. ఆ మంచం మీద కూడా మూడు బొంతలు ఒకదాని మీద ఒకటి ఒత్తుగా పరిచి దుప్పటి వేసింది. వీధరుగు మీద మాస్టారితో కబుర్లు చెబుతున్న నాన్నగారు వచ్చి మంచం మీద జారగిలబడ్డారు. మేమూ పక్కల మీద వాలాం. వేసంగి సెలవులికి చెన్నపట్టణం నుంచి అమలాపురం ప్రయాణంలో ఓ ప్రధాన ఘట్టం పూర్తయింది. హడంగుకి చేరి నడుం వాల్చాం!! హమ్మయ్య!!!

.

******************