10_015 వాగ్గేయకారులు – స్వాతి తిరునాళ్

.

స్వాతి తిరుణాల్  (1813-1846)

స్వాతి తిరుణాల్ ట్రావెన్కోర్, వైనాడ్ రాజవంశానికి చెందిన శ్రీ బాలరాజ వర్మ అనే రాజుకు జన్మించాడు. ఇది ప్రస్తుత కేరళ రాష్ట్రానికి చెందినది. బలరాజవర్మ ” రామ భరతం ” అనే నాట్యశాస్త్ర గ్రంథాన్ని రచించారు. ప్రజలను కన్నబిడ్డల్లా పాలించిన వంశం. చాలారోజుల అనంతరం స్వాతి తిరుణాల్ జన్మించటం వలన, బలరాజ వర్మ సోదరి శ్రీ గౌరీ లక్ష్మీబాయి రాజ్యం ఏలింది. శ్రీ గౌరీ లక్ష్మీబాయికి మగపుత్రులు లేరని చాలా బాధపడుతూ, సంతానం కలగాలని దానధర్మాలు, నిరంతరం శ్రీ పద్మనాభస్వామిని కొలుస్తూ వ్రతాదులు చేస్తూ ఉండేది. చిట్టచివరికి, 1813, మార్చ్ 16 న చైత్రమాసంలో స్వాతి నక్షత్రంలో ఒక బాలుడు జన్మించాడు. వారి రాజవంశాచారం ప్రకారం ఆ మగశిశువుకు ” స్వాతి తిరుణాల్ ” అని నామకరణం జరిగింది. పూర్తిపేరు ” H. H. శ్రీ పద్మనాభదాస వంచిపాల శ్రీరామవర్మ కులశేఖర పెరుమాళ్ “. ఇతడు గర్భంలో ఉన్న సమయంలో కూడా, శ్రీలక్ష్మిబాయి రాజ్యపరిపాలన చేస్తూ ఉండేది. అందుచేత కాబోయే రాజుగా ఇతడిని ” గర్భ శ్రీమాన్ ” అనే పేరుతో కూడా పిలిచేవారు. ఇరయిమ్మన్ తంపి అనే ప్రముఖ వాగ్గేయకారుడు స్వాతి తిరుణాల్ పుట్టినప్పుడు అత్యంత లోకప్రియమైన మలయాళం జోలపాట ” ఓమతింకల్ కిడవో ” ను రచించారట. వీరికి నాలుగు నెలల వయసులో వీరి తల్లి కర్నల్ జాన్ మన్రో అనే పేరు గల ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతినిధిని, వారి అధికారగణాన్ని ఆహ్వానించి,  రాజ దర్బారులో తన బిడ్డ సంరక్షణను ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పగిస్తున్నామని బహిరంగంగా ప్రకటించి, భవిష్యత్తులో కంపెనీ తమ బిడ్డకు సంపూర్ణ సహకారాన్ని అందించవలసిందిగా కోరింది. కానీ  రెండవ ఏడు వచ్చేసరికి తల్లి శ్రీ గౌరీ లక్ష్మీబాయి మరణించింది. ఈమెకు శ్రీ గౌరీ పార్వతీబాయి అనే చెల్లెలు ఉండేది. ఆమే ఇతడి మంచిచెడ్డలను చూసుకుంటూ అల్లారుముద్దుగా పెంచింది. ఈ విధంగా దినదినాభివృద్ధి చెంది, రాజతంత్రంతో బాటు, మలయాళం, సంస్కృతం, ఇంగ్లీష్, తెలుగు, కన్నడ, మరాఠీ, హిందుస్తానీ, పర్షియన్ వంటి 13 భాషలలో నైపుణ్యం సంపాదించాడు. ఈ భాషలన్నింటిలోనూ కవిత్వం చెప్పగలిగిన పాండిత్యం ఉండేది. వీరి సంస్థానానికి వచ్చిన ఒక ఇంగ్లీష్ దొర కర్నల్ వెల్స్, వీరి భాషా పాండిత్యానికి ఎంతగానో ఆశ్చర్యపడ్డారు. ఇవిగాక చిత్రకళ, శిల్పకళ, మాంత్రీకం, దేహభ్యాసంలో కూడా నిపుణులు. కేవలం భాషలతో బాటు జామెట్రీ, హెక్సాగన్, హెప్టాగన్ అనే పదాలు సంస్కృతంలోంచి ఏ విధంగా జనించాయో వివరించగలిగేవాడట స్వాతి తిరుణాల్. కర్నల్ మన్రో వీరి విద్యాభ్యాసంలో స్వయంగా ఎంతో శ్రద్ధ వహించేవారు. 

పదహారవ ఏట స్వాతి తిరుణాల్ వయస్కుడై, రాజ్యపరిపాలన భారాన్ని స్వీకరించాడు. ఆ విధంగా 1846 లో మరణం చెందేవరకూ ట్రావెన్కోర్ మహారాజాగా పరిపాలించారు. విభిన్న భాషా కోవిదులను, కళానిపుణులను, తమ ఆస్థానానికి రప్పించి వారిని ఆస్థాన విద్వాంసులుగా నియమించి గౌరవించి ఆదరించేవారు.  

రవివర్మన్ తంపికిలిమానుర్కోయిల్ తంబిరాన్; పంజాబ్ సులేమాన్ అల్లాఉద్దీన్ ( హిందుస్తానీ సంగీత విద్వాంసులు ); అనంతపద్మనాభ గోస్వామి ( మరాఠీ భాషా కోవిదులు ); హరికథా కాలక్షేపంలో నిపుణులు, ( కర్ణాటక, హిందుస్తానీ సంగీత అఖండ విద్వాంసులు, మెరుస్వామి అని పేరు కూడా కలిగి ఉండేవారు ), శ్రీ త్యాగరాజువారి శిష్యులైన తంజావూరు సోదరులు వడివేలు పిళ్ళై, పొన్నయ్య పిళ్ళై; చిన్నయ్య పిళ్ళై, శివానందం ( నాట్య విద్వాంసులు ); వైణిక విద్వాంసులైన వెంకటాద్రి భాగవతార్, పరమేశ్వర భాగవతార్, గణపతి భాగవతార్, క్షీరాబ్ధి శాస్త్రి, కన్నయ్య మొదలైన గొప్ప వ్యక్తులు స్వాతి తిరుణాల్ సభను అలంకరించిన ప్రముఖులలో కొందరు. 

వీరు తరుచుగా తమ రచనలను శ్రీ త్యాగరాజువారికి పంపి వారి అభిప్రాయాన్ని కోరేవారట. పలు భాషలలో అనేక దేవతలపై చాలా కృతులను రచించారు. వీరు రచించిన వాటిలో నవరాత్రి కీర్తనలు చాలా ప్రముఖమైనవి. స్వరజతులు, పదములు, జావళీలు, తిల్లానాలు ఎన్నో రచించారు. హిందూస్థానీ సంగీత పద్ధతిలో దృపద్, టప్పా, ఖయాల్, ఠుమ్రీ వంటివెన్నో రచించారు. ఇక్కడ టప్పా గురించి నాకొక చిన్న పిట్టకథ గుర్తుకొస్తోంది. పంజాబ్ మరియు సింధ్, గ్వాలియర్ ఘరానాలో ఎక్కువగా వినిపిస్తాయి. రాజస్థాన్ లో ఒంటెలపై ప్రయాణిస్తున్నప్పుడు ఎవరైనా పాడితే ఒంటె తీసే పరుగు కంఠానికి ఒక రకపు కంపనను ఇస్తుందట. ఆ విధంగా ఒంటె ప్రయాణంలో పాడే పాటలనే టప్పా అంటారట. కానీ ఈ టప్పాలు అనేక గమకాలు, ఒడుపుగా తిప్పే ఆకారాలతో రమ్యంగా ఉంటాయి. స్వాతి తిరుణాల్ రచన కాకపోయినా ఒక ఉదాహరణ ఇక్కడ ఇచ్చి, స్వాతి తిరుణాల్ కి గల సంగీత పటిమ ఎంత గొప్పదో తెలియచేయాలని ఇస్తున్నాను. 

స్వాతి తిరుణాల్ రచనలను గుర్తించటానికి వారు వాడిన వేర్వేరు ముద్రలు అబీజనాభా, అంభోరుహనాభ, పంకజనాభ, పుండరీక నాభ, జలరుహనాభ మొదలైన ఇరవై రకాలున్నప్పటికీ, “పద్మనాభ” అన్నిట్లోకీ అత్యధికంగా వాడబడిన ముద్ర.. 

వీరి రచనల్లో “భావయామి రఘురామమ్” రామాయణ కీర్తన ఎవరికి తెలియనిది?

కొన్ని ప్రత్యేక ఉదాహరణలు ఇవిగో:  

టప్పా అనేది ఎలా పాడతారో వినండి:

.

భావయామి రఘురామమ్ – ఎమ్మెస్ సుబ్బలక్ష్మి