10_016 ఆనందవిహారి

.

అడివి బాపిరాజు నవలా వైశిష్ట్యం

.

అడవి బాపిరాజు బహుముఖ ప్రజ్ఞ అసామాన్యమైనదని, అనేక రకాల కళలలో నైపుణ్యం ఉండే వ్యక్తులు అత్యంత అరుదుగా ఉంటారని తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి చెందిన డా. పి. బ్రహ్మానందరెడ్డి వ్యాఖ్యానించారు. 

 

వేద విజ్ఞాన వేదిక, ఆంధ్రా సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన తరతరాల తెలుగు కవిత” కార్యక్రమంలో “అడివి బాపిరాజు నవలా వైశిష్ట్యం” అంశంపై ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమం శనివారం సాయంత్రం (28-03-2021) ఆస్కా ప్రాంగణంలో జరిగింది. 

నవల అంటే స్త్రీ అని అర్థమని, ఒక కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు చక్కగా అలంకరించుకొని వెళ్ళే మహిళామణివంటిదే నవల అని వక్త చెప్పారు. కవిత్వం, నవల, వ్యాసం, శిల్పం, చిత్రకళ, గానం మీద పట్టు ఉన్న బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన బాపిరాజు జీవిత విశేషాలను తెలిపారు. 1920, 21 ప్రాంతంలో సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని జైలుకి వెళ్ళిన ఆయన అక్కడే “హిమబిందు” నవలను రచించారని వెల్లడించారు.  

1931లో బాపిరాజు బారెట్లా పూర్తి చేసిన తరువాత… ఒక నవలా పోటీలో విశ్వనాథ సత్యనారాయణ నవల “వేయి పడగలు”, బాపిరాజు నవల “నారాయణ రావు” రెండింటికీ మొదటి బహుమతి వచ్చిందని గుర్తు చేశారు. ఈ ఇద్దరు రచయితల ఉద్దేశ్యం ధర్మస్థాపనేనన్నారు. బాపిరాజు మొత్తం 12 నవలలు రాశారని, వాటిలో 4 చారిత్రక నవలలని పేర్కొన్నారు. 

 

సంపద కలిగిన కుటుంబం నుంచి వచ్చినా, బాపిరాజుకి సంస్కరణతో కూడిన సామాజిక కార్యక్రమాల పట్ల ఆయనకి ఆసక్తి మెండని బ్రహ్మానందరెడ్డి వెల్లడించారు. 1930లలోనే ఆడ, మగ ఇద్దరూ సమానమేనని ఆయన “నారాయణ రావు” నవలలో పేర్కొనడం ఆయన ధర్మనిరతికి,  సంస్కారానికి ఒక గొప్ప ఉదాహరణ అని పేర్కొన్నారు. తత్వ శాస్త్రం, నాట్యం, అభినయం మీద కూడా బాపిరాజుకు పట్టు ఉండేదని ఈ నవల వల్ల తెలుస్తుందని అంటూ సోదాహరణంగా వివరించారు. “గోన గన్నారెడ్డి”, “నరుడు”, “జాజిమల్లి” నవలల విశేషాలను కూడా వక్త వివరించారు. 

మధు సభకు స్వాగతం పలికారు. ఒక చక్కని శ్లోకంతో జేకే రెడ్డి కార్యక్రమానికి శుభారంభం పలికి వక్తను సభకు పరిచయం చేశారు. అడివి బాపిరాజు రచించిన “గోన గన్నారెడ్డి” కాకతీయ చారిత్రక నవల నుంచి కొన్ని పంక్తులను కూడా వినిపించి సభను ఆకట్టుకున్నారు. 

సంస్థ తరఫున డా. సి ఎం కె రెడ్డి, ఆస్కా కమిటీ సభ్యులు రంగారెడ్డి, జేకే రెడ్డి, మధు, మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు డా. విస్తాలి శంకరరావులు వక్తను ఘనంగా సత్కరించారు.

.

 

**************************

.

హాంగ్‌కాంగ్ లో మాతృభాషా దినోత్సవం

.

ది హాంగ్‌కాంగ్ తెలుగు సమాఖ్య 2021 ఫిబ్రవరి 21వ తేదీన మాతృభాషా దినోత్సవాన్ని వైభవోపేతంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జయ పీసపాటి మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని హాంగ్‌కాంగ్ తెలుగు సమాఖ్య తొలిసారిగా నిర్వహిస్తోందని, భావితరాలలో మాతృభాషపై మమకారాన్ని పెంచి, వారిని భాషా సైనికులుగా తీర్చిదిద్దడమే మన కర్తవ్యమని అన్నారు. సమాఖ్య ప్రధాన కార్యదర్శి గరదాస్ జ్ఞానేశ్వర్ మాతృభాషాదినోత్సవ ప్రాముఖ్యం, తెలుగు భాష, సంస్కృతిని పరిరక్షించడానికి సమాఖ్య నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి వివరించారు. హాంగ్‌కాంగ్ లో ఉన్న తెలుగు పిల్లలకు తెలుగులోనే పాటలు, పద్యాలు, కథలు చెప్పడం వంటి కార్యక్రమాలతో బాటు తెలుగులో మాట్లాడటంలో పోటీలు నిర్వహించారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, తెలుగు వారి చరిత్ర అనే అంశాలలో చిత్రలేఖన పోటీలు, ప్రశ్నోత్తర ( క్విజ్ ) పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ప్రత్యూష కల్లూరు, సువర్ణ ఆదినారాయణ, అనుపమ రాంభట్ల సమన్వయకర్తలుగా వ్యవహరించారు.

.

హాంగ్‌కాంగ్ లో నివశిస్తున్న ఇతర రాష్ట్రాల వారి కోసం కూడా మాతృభాషా దినోత్సవాన్ని జయ పీసపాటి అంతర్జాలంలో నిర్వహించారు. వీరిలో తెలుగుతో బాటు హిందీ, మరాఠీ, తమిళం, మలయాళం, కన్నడం, బెంగాలీ, పంజాబీ, సంస్కృతం భాషలు నేర్చుకుంటున్న విద్యార్థులతో బాటు వారి గురువులు కూడా పాల్గొన్నారు. విచ్చేసిన ముఖ్య అతిధి, ఇండియా అసోసియేషన్ హాంగ్ కాంగ్ సంస్థ పూర్వ అధ్యక్షులు, సింధీ అసోసియేషన్ వ్యవస్థాపకులు  శ్రీ నోతన టోలాని మాట్లాడుతూ హాంగ్‌కాంగ్ లో ఇంతవరకు ఇలాంటి కార్యక్రమం జరుగలేదని, ప్రవాసంలో ఉన్న భారతీయులందరినీ ఒకే త్రాటి పైకి తెచ్చి మాతృభాష పైన, మాతృభూమి పైన శ్రద్ధాభక్తులను పెంచుతుందని పేర్కొన్నారు. దేశం కాని దేశం లో ఇటువంటి వేదిక చాలా అవసరమని అంటూ ఈ కార్యక్రమ రూపకర్త జయ పీసపాటి గారిని అభినందించారు.

.

స్థానికంగా ఉన్న ఆర్. టి. హెచ్. కె. ( రేడియో టెలివిజన్ హాంగ్‌కాంగ్ ) లో అల్ప సంఖ్యాక వర్గాల కోసం ప్రత్యేకమైన ‘ కమ్యూనిటి ఇన్వాల్వ్మెంట్ బ్రాడ్‌కాస్టింగ్ సర్వీసెస్ ’ విభాగంలో “ ఇన్‌క్రెడిబుల్ ఇండియా ” అనే కార్యక్రమాన్ని జయ పీసపాటి మూడు నెలల పాటు నిర్వహించారు. మన దేశంలోని 26 ప్రాంతాల వారు తమ సంస్కృతి, సంప్రదాయాలు, భాష, ఆహారం మొదలైన విషయాలను ఈ కార్యక్రమంలో వివరించారు. అలాగే తమ ప్రాంతంలోని జానపద గీతాలను కూడా పాడి వినిపించారు. తెలుగు తో బాటు ఒడియా, బిహారీ, పంజాబీ, మరాఠీ, గుజరాతీ, తమిళం, మలయాళం, కాశ్మీరీ, కొంకిణీ, మైథిలీ / అస్సామీ, సంతాలీ / చత్తీస్‌ఘడ్, హిందీ భాషలలో మొత్తం 113 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

.

.

***********************

__________________________________________________

ఈ నివేదికల పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న comment box లో వ్రాయండి.

__________________________________________________