10_016 సినీ సంగీతఝరి

.

“పులకించని మది పులకించు,   

వినిపించని కథ వినిపించు,      

కనిపించని ఆశల దించు           

మనసునే మరపించు గానం             

                                                                     

మనసునే మరపించు.     

రాగమందు అనురాగమొలికె

రక్తినొసగును గానం, రేపు రేపను

తీపి కలలకు రూపమిచ్చును గానం,

చెదరిపోయే భావములను చేర్చి

గూర్చును గానం, జీవమొసగును గానం,

మది చింత బాపును గానం. (పులకించని) – “ పెళ్లికానుక ”

 

సినిమాలో సంగీతం లేకుంటే మనం ఎక్కువ సేపు చూడలేము. ప్రతి ఒక్క సంఘటనకి తగట్టుగా సంగీత దర్శకుడు బ్యాక్ గ్రౌండ్ సంగీతం సమకూరుస్తారు. ఉదాహరణకి ఒక సంతోషకరమైన సంఘటన ఉంటే దాని వెంటే మనకి ఆహ్లాదకరమైన సంగీతం వినిపిస్తుంది. అలాగే ఒక దు:ఖభరితమైన సంఘటన ఉంటే దానికి తగ్గట్టుగా బాధాకరమైన సంగీతం సమకూరుస్తారు. దాని ఫలితంగా ప్రేక్షకుల కళ్ళనుంచి కన్నీరు కారుతుంది.

సినిమాలో సినీ గీత సాహిత్యం గురించి కానీ, సంగీత దర్శకత్వం గురించి కానీ, గాయనీ గాయకుల గురించి రాయాలంటే ఒక వ్యాసం సరిపోదు. ఈ వ్యాసంలో ఆ పాత మధురాల సినీ గీత సాహిత్యకారుల గురించి మాత్రమే గుర్తు చేసుకోవడం జరిగింది. ఒక సన్నివేశానికి పాట పెడితే బాగుంటుంది అని దర్శకుడు, నిర్మాత, అనుకుంటే ఆ సన్నివేశాన్ని గీత రచయితకు చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకు హీరోయిన్ చాలా కష్టాలు పడింది, మోసపోయింది ఆమె మానసికంగా బాగా దెబ్బ తిని ఉంది ఆ సమయంలో తన మనసులో చెలరేగే సంఘర్షణలను ఒక పాట రూపంలో చెప్పాలనుకుంటే ఎలా రాయాలి? సినీకవి/ కవయిత్రి భాషపై పట్టు ఉండడమే కాదు ఏ సన్నివేశానికైనా పాట రాయగలిగే ప్రతిభ కలిగి ఉండాలి. దర్శకుడు చెప్పిన సన్నివేశంలోకి వెళ్ళిపోయి, ఆ హీరోయిన్ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి ఆమె మనసులోని బాధని చెప్పగలగాలి.

ఒక పాట రాసి చూపిస్తే అది వెంటనే దర్శకుడికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. దర్శకుడికి పూర్తిగా నచ్చేవరకు గీత రచయిత/త్రి రకరకాలుగా రాసి చూపించాలి. ఒకోసారి ఒక పాటని వంద రకాలుగా కూడా రాసి చూపించిన సందర్భాలు ఉన్నాయని ఇంటర్వ్యూల్లో చెప్పారు సినీ గీత రచయితలు. ‘ సుఖదు:ఖాలు ’ సినిమాలో వాణిశ్రీ ఒక దుర్మార్గుడి చేతిలో మోసపోతుంది. ఆమె రేడియోలో పాట పాడేపుడు తనకు జరిగిన అన్యాయం, తనలో చెలరేగుతున్న వేదనని దేవులపల్లి గారు ఎంత బాగా రాసారో, దాన్ని పి.సుశీల గారు గొంతులో ఎంత వేదనను నింపుకుని పాడారో, దానికి తగ్గట్టుగా వాణిశ్రీ గారి నటన అన్నీ కలిసి ఆ పాటని హిట్ చేసాయి. 

“ఇది మల్లెల వేళయని మరి వెన్నల మాసమని

తెలియని ఒక కోయిల ముందే కూసింది, విందులు చేసింది.”    

కసిరే ఎండలు కాల్చునని, ముసిరే వానలు ముంచునని(2)

ఎరుగని కోయిల ఎగిరింది(2)

విరిగిన రెక్కల వొరిగింది …నేలకు ఒరిగింది.” (ఇది మల్లెల వేళయనీ…)  – “ సుఖదుఃఖాలు ”

 

ఒక సినిమాలోని ఒకో పాటని ఒకో గీత రచయితతో రాయించుకుంటారు కొంతమంది. మరి కొంతమంది సినిమాలోని అన్ని పాటలను ఒక్క గీత రచయిత/త్రి తో రాయించుకుంటారు. ఒక పాట హిట్ కావాలంటే, ప్రజల మనసులని తాకాలంటే, వారి నోళ్లల్లో ఆ పాట పదే పదే పలకాలంటే ఎంతోమంది కలిసి కృషి చేస్తారు. గీత రచయిత పాట ఓకే అయ్యాక సంగీత దర్శకుడి చేతిలో పడ్తుంది ఆ పాట. ఆయన ఆ పాటని అర్ధం చేసుకుని అందరికీ అర్ధం అయ్యేలా, వింటే మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఉండాలంటే ఆ పాట మూడ్ కి తగ్గట్టు రాగం ఎన్నుకుని, పాటని ట్యూన్ చేయడం జరుగుతుంది. ఆ పాట పాడడానికి ఏ గాయనీ గాయకులైతే బాగుంటారో వారిని ఎన్నుకుని పాడించడం జరుగుతుంది. ఆ గాయనీ, గాయకులు పాటలోని అర్ధాన్ని, భావాన్ని పాటలోకి దింపేలా పాడాలి. అది రికార్డ్ అయ్యి, సినిమాలో ఆ సన్నివేశంలో నటీనటులు ఆ పాటలోని భావానికి తగట్టు నటిస్తేనే అది ప్రేక్షకులకు నచ్చి హిట్ అవుతుంది. ఒకప్పుడు రేడియోలో పాటలు ఎంత ఎక్కువగా వస్తే అంతగా హిట్ అయ్యేవి. తర్వాత టీ.వీ చానెల్స్ రావడం, ఆ తర్వాత ఇపుడు యూ ట్యూబ్ లో సినిమా రిలీజ్ అవ్వకముందే పాటలని రిలీజ్ చేస్తారు. అవి ఎంత ఎక్కువ మంది చూస్తే అంత ఎక్కువగా హిట్ అయినట్టు లెక్క. సమయంతోపాటు అన్నీ మారుతున్నట్టే సినీ సాహిత్యంలో, సినీ సంగీతంలో మార్పులు వస్తున్నాయి.

మొట్టమొదటి టాకీ “భక్తప్రహ్లాద,”(1931) సినిమా కోసం కొన్ని పాటలు, పద్యాలు రాసిన తొలి గీత రచయిత శ్రీ చందాల కేశవదాసు గారు. ఈయన రాసిన పాటని సురభి కమలాభాయి గారు లీలావతి పాత్రలో నటిస్తూ పాడడం జరిగింది. ఆ తర్వాత “సతీ సక్కుబాయి,” (1935), “శ్రీ కృష్ణ తులాభారం” (1935) వచ్చిన సినిమాలో “భలే మంచి చౌక బేరము” పాట మరికొన్ని పాటలకి మంచి ప్రాచుర్యం లభించింది. ఆ తర్వాత వచ్చిన మరి కొన్ని సినిమాల్లో శ్రీ కేశవదాసు గారి పాటలను ఉపయోగించుకున్నారని డి.ఎం. పురుషోత్తమచార్యగారు తమ గ్రంథంలో పేర్కొన్నారు.

.

తాపీ ధర్మారావు గారిని గూడవల్లి రామబ్రహ్మం గారు తన ’మాలపిల్ల,’ చిత్రం ద్వారా సినీ రంగానికి పరిచయం చేసారు. ’కీలుగుర్రం,’ లో ’కాదు సుమా కల కాదు సుమా,’ లాంటి పాటలు, ’ద్రోహి,’ చిత్రంలో పాటలు, ’పల్లెటూరి పిల్ల,’ చిత్రంలోని పాటలు, ’రోజులు మారాయి,’ సినిమాలో ఆయన రాసిన డ్యూయెట్ ’ఇదియే హాయి, కలుపుము చేయి,’ లాంటి పాటలు బహు ప్రజాదరణను పొందాయి.

.

బాలాంత్రపు రజనీకాంతరావుగారు లలిత సంగీతంలో ఎంతో పేరు సంపాదించినవారు, లలిత సంగీతాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చినవారు. ఆకాశవాణిలో పని చేస్తుండడం వల్ల సినీరంగంలో అవకాశాలు రావడంతో నళినీకాంతరావు గారి పేరుతో ’గృహప్రవేశం,’ సినిమాకి సంగీత దర్శకత్వం అందించారు. రజనీకాంతరావు గారు గీత రచయితే కాదు, సంగీత దర్శకత్వం కూడా చేసేవారు. ’రాజమకుటం,’ సినిమాలో నాగరాజు పేరుతో, ఎంతో బహుళ ప్రాచుర్యం సంపాదించిన పాట “ఊరేది, పేరేది ఓ చందమామ,” రాసారు.

.

సీనియర్ సముద్రాలగా పాపులర్ అయిన సముద్రాల వెంకట రాఘవచార్య గారు సినీ కథ, పాటలు, మాటలు కూడా రాసారు. ’స్వర్గసీమ,’ ’షావుకారు,’ ’దొంగరాముడు,’ సినిమాల్లో మాటలు, పాటలు రాసారు. అలాగే ’మనదేశం,’ (ఎన్.టి.ఆర్ మొదటి సినిమా) ’దేవదాసు,’ ’బాటసారి,’ సినిమాలు చేసారు. రెండూ బెంగాలీ రచయిత శరత్ బాబు రచనలు. కానీ వాటికి మార్పులు, చేర్పులు చేసి సంభాషణలు చాలా సహజంగా ఉండేట్టుగా రాయడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. ఎల్.వి. ప్రసాద్ నిర్మించిన ’పల్నాటి యుద్దం’ లో స్ఫూర్తికరమైన పాటలు రాసారు. జానపద సినిమాల్లో ’బాలరాజు,’ ’స్వప్నసుందరి ’, ప్రేమ కథాచిత్రాలు ’లైలామజ్ను,’ ’అనార్కలి ’. ఈ చిత్రాలు విజయవంతం అవ్వడానికి కారణం సముద్రాల గారు రాసిన మాటలు, పాటలు. పౌరాణిక చిత్రాల్లో ’ పాండవవనవాసం,’ ’నర్తనశాల,’ ’దీపావళి,’ ’భూకైలాస్,’ శ్రీకృష్ణపాండవీయం,’ ’ శ్రీ కృష్ణావతారం,’ ’ సీతారామకళ్యాణం,’ వున్నాయి. ఈ సినిమాల్లోని పాటలన్నీ ఆణిముత్యాల్లాంటి పాటలే. ఉదాహరణకు ’నర్తనశాల ’ సినిమాలోని పాటల్లో ’జననీ శివకామినీ,’ ’సఖియా వివరించవే,’ ఎప్పటికీ క్లాసిక్ పాటలే!

.

సినీ రచయితల గురించి ఒకొక్కరి గురించి చెప్పాలంటే చాలా రోజులే పడ్తుంది. మల్లాది రామకృష్ణశాస్త్రిగారి పాటలు ’ చిరంజీవులు ’ సినిమాలో పాట ’ తెల్లవారగ వచ్చే తెలియక నా సామి, మళ్ళీ పరుండేవులేరా,’ ’జయభేరి ’ సినిమా పాట ’రసికరాజ తగువారముకామా,’ ’రాగమయీ రావే, అనురాగమయీ రావే,’ రేడియోలో వచ్చినపుడల్లా ఆ పాటలతో మా గొంతులు, పెదవులు కలిసేవి మాకు తెలియకుండానే, అంత మధురమైన పాటలు రాసారు మల్లాది గారు.

.

దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు సహజ కవిగా పేరొందారు. ’మల్లీశ్వరీ,’ సినిమాలో పాట ’ ఎంత హాయి ఈ రేయి నిండెనో, ఎన్నినాళ్ళకీ బ్రతుకు పండేనో…’ వింటుంటే మనసు హాయిగా దూదిపింజలా తేలిపోతుంది మనసు. అలాగే ’ ఆకులో ఆకునై, కొమ్మలో కొమ్మనై,’ కవితను ’ మేఘసందేశం ’ సినిమాలో వాడుకున్నారు దాసరి నారాయణరావు గారు. ’ రాజమకుటం ’ సినిమాలోని పాట ’ సడిసేయకోగాలి సడిసేయబోకే, బడలి ఒడిలో నా రాజు పవ్వళ్ళించేనే ’… ఎంత మృదువైన ప్రేమగీతం! ’ ఏకవీర ’ లో ’ ప్రతి రాత్రి వసంతరాత్రి ప్రతి గాలి పైరగాలి, బ్రతుకంతా ప్రతినిమిషం పాటలాగ సాగాలి ’ అని కోరుకున్నారు.

 

.

గత తరంలో సినీ గీత రచయితలు / త్రులు వారు డైరెక్ట్ గా సినీ గీత రచయితలవ్వలేదు. వీరిలో చాలామంది మహాకవులు. ఎన్నో కవితా గ్రంధాలని ప్రచురించారు, వీరిలో సహజకవులు, ప్రజాకవులున్నారు. కవితారంగానికి ఎంతో సేవ చేసారు. ఎన్నో బిరుదులు సంపాదించారు. ఆల్ ఇండియా రేడియోలో పని చేస్తుండగా సినీ పరిశ్రమలో అవకాశాలు రావడం, వీలయినపుడల్లా వేరే కలం పేరుతో సినీ గీతాలు, కథలు రాసేవారు. ఈ కవులు కేవలం సినీ గీత రచయితలే కాదు, స్వాతంత్ర సమరంలో పాల్గొన్నవారు. క్విట్ ఇండియా ఉద్యమంలో జైలు శిక్ష అనుభవించారు. వీరిలో చాలా మంది కేవలం సినీగీత రచయితలే కాదు, సినీ కథలు, డైలాగులు రాసిన వారున్నారు. ప్రతి ఒక్కరూ తమకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్నారు.

.

పింగళి నాగేంద్రరావు గారు ’ ప్రేమయాత్రలకు బృందావనము, నందనవనము ఏలనో’ – ’గుండమ్మ కథ,’ ’ ఎంత ఘాటు ప్రేమయో ’ – ’పాతాళభైరవి,’ ’బృందావనమది అందరిదీ గోవిందుడు అందరివాడేలే ’ – ’మిస్సమ్మ,’ ’ మోహనరాగ మహమూర్తిమాయే ’ – ’మహామంత్రి తిమ్మరుసు,’ ’ ఎచటినుండి వీచెనో ఈ చల్లని గాలి ’ – ’ అప్పు చేసి పప్పు కూడు,’ ’ శివశంకరి శివానందలహరి ’ – ’ జగదేకవీరుని కథ ’. ఈ సుమధుర గీతాలే కాదు ఎన్నో హిట్ పాటలను అందించిన సినీ కవి పింగళి. 

.

’ ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా ’ ఎవరిపై ఆధారపడకుండా తమ సమస్యలను తామే పరిష్కరించుకోగలగాలి అని సూటిగా చెప్పగలిగిన కవి శ్రీశ్రీ గారు….. ’ భూమికోసం ’ సినిమాలో.  ‘ పాడవోయి భారతీయుడా, ఆడి పాడవోయి విజయగీతిక ’ అంటూనే ’ వెలుగునీడలు ’ సినిమాలో ’ కలకానిది విలువైనది, బ్రతుకు కన్నీటి ధారలలోనే బలిచేయకు ’… డిప్రెషన్లో వున్నవారికి కష్టాలు వచ్చినంత మాత్రాన భయపడిపోకూడదని, ధైర్యంగా పోరాడాలనే సందేశాన్నిచ్చారు. ఈ పాట విని ఆత్మహత్య చేసుకోబోయిన ఒకతను ఆ ప్రయత్నం విరమించుకున్నాడట. ‘ అల్లూరి సీతారామరాజు ’ సినిమాలో ’ తెలుగువీర లేవరా దీక్షబూని సాగరా,’ ’ కదలి రండి మనుషులైతే, కలసి రండి మమత ఉంటే ’… దివిసీమ తుఫాన్ కి గురయినపుడు ఎంతో ఆవేదనతో రాసిన పాట. ’ నేడే ఈనాడే మహాయుద్ద సంరంభం, నేడే ఈనాడే ప్రళయశక్తి సంచలనం,’ అని స్ఫూర్తిదాయకమైన పాటలు రాసారు. అలాగే ’మనసున మనసై బ్రతుకున బ్రతుకై ’ – ’ డా.చక్రవర్తి,’ ’జోరుగా హుషారుగా షికారు పోదమా ’ హుషారు గొల్పే గీతాలు, ’ పాడవేల రాధికా, ప్రణయసుధాగీతికా,’ – ’ఇద్దరు మిత్రులు,’ ’నా హృదయంలో నిదురించే చెలి ’ – ’ ఆరాధన ’…  ఇలా ఎన్నో మృదు మదురమైన గీతాలు రాసారు. 

.

“త్వమేవాహం ” కవితా సంపుటిని రచించిన ఆరుద్ర గారు మంచి మంచి సినీగీతాలు రచించారు. సినీ సాహిత్యంలో అన్ని రంగాల్లో అందెవేసిన చెయ్యి ఆరుద్ర గారిది. అన్ని రకాల పాటలను రచించి మెప్పును పొందారు. ’ ముద్దు బిడ్డ ’ సినిమాలోని ’ ఎవరు కన్నారు, ఎవరు పెంచారు నవనీత చోరుని – గోపాలబాలుని ’ పాటలో కన్నతల్లి దేవకి, పెంచిన తల్లి యశోద ప్రేమను తెలియజేస్తుంది. ‘ చెంచులక్ష్మి ’ లోని పాట ’ నీలగగన శ్యామ,’ ’బావా మరదళ్లు ’ సినిమాలోని పాపులర్ పాట ’ ముక్కోటి దేవతలు ఒక్కటైనారు ’ ఘంటసాల గారి గొంతులో వెలువడి విపరీతమైన ప్రాచుర్యాన్ని పొందింది. ’ బావామరదళ్ళు ’ లోనే ’ నీలిమేఘాలలో గాలి కెరటాలలో ’ ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. అలాగే ’జయభేరి ’ లోని పాట ’ యమునా తీరమున సంధ్యా సమయమునా ’ మధురాతి మధురంగా వుంటుంది. ‘ ముత్యాల ముగ్గు ’ లో పాట ’ ముత్యమంత పసుపు ముఖమంత చాయ,’ ప్రతి తెలుగింట్లో మారుమ్రోగింది. ‘ ఇల్లరికం ’ చిత్రంలోని పాట ’ నేడు శ్రీవారికి మేమంటే పరాకా ’ లాంటి ప్రణయగీతాలను కూడా రచించి యువ జంటల మనస్సుల్లో గిలిగింతలు పెట్టారు.

.

మనసు కవి ఆత్రేయ మనసు గీతాలు రాసి ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసారు. ‘ కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదానా ’ పాటలో పేద, గొప్ప తేడాలను చూపారు. ఇది చాలామంది శ్రీశ్రీ గీతమనుకునేవారు.

’ మూగమనసులు ’ లో ’ ’పాడుతా తీయగా చల్లగా పసిపాపలా నిదరపో తల్లిలా, బంగారు తల్లిలా,’ ఈ పాటలోనే ’ పోయినోళ్ళందరూ మంచోళ్ళు.. ఉన్నోళ్ళు పోయినోళ్ళ గురుతులు ’ అని ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు ఆత్రేయ. ’ మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకు ఇంతే, మనసున్న మనిషికి సుఖము లేదంతే ’ అనే పచ్చి నిజాన్ని తెలియజేసారు. ’ అనుకున్నామని జరగవు అన్నీ అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్ని మంచికని, అనుకోవడమే మనిషి పని ’ ‘ మురళీకృష్ణ ’ సినిమాలో మనసు విరిగిపోయిన హీరోతో ఈ సత్యాన్ని చెప్పించారు.

.

’ దులపర బుల్లోడో, దుమ్ము దులపర బుల్లోడ,’ అంటూ, ’ సోగ్గాడే చిన్ని నాయన, ఒక్క పిట్టనయిన కొట్టలేదు సోగ్గాడు ’ అంటూ జానపద శైలిలో గీతాలు రచించిన రచయిత కొసరాజు గారు. ’ ఏరువాక సాగారోరన్నో చిన్నన్నా’ పాటతో పల్లెల్లో రైతుల జీవితాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు. ’ మత్తువదలరా నిద్దుర మత్తు వదలరా ’ పాటలోనే ’ అతినిద్రాలోలుడు తెలివిలేని మూర్ఖుడు ’ పాట చివరలో ’ చెప్పటమే నా ధర్మం, వినకపోతే నీ ఖర్మం ’ అని చెపుతారు ‘ శ్రీ కృష్ణపాండవీయం ’ సినిమాలో. ‘ శభాష్‌రాముడు ’ చిత్రంలో ’ జయమ్ము నిశ్చయమ్మురా, భయమ్ము లేదురా ’ అంటూ స్ఫూర్తిదాయకమైన గీతాన్ని అందించారు. ‘ కులగోత్రాలు ’ చిత్రంలో ’ అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే ’ అంటూ ’ రాముడు భీముడు ’ సినిమాలో ’ సరదా సరదా సిగరెట్టు, ఇది.. దొరలు తాగు సిగరెట్టు ’ పాటలో ధూమపానం వల్ల వచ్చే నష్టాలను చెబుతారు.

.

తోలేటి వెంకటరెడ్డి గారు, సముద్రాల రాఘవాచార్య గారు, రావూరు వెంకట సత్యనారాయణరావు గారు, సదాశివబ్రహ్మం గారు సినీ కథలతో, డైలాగులతో పాటు మంచి మంచి పాటలను అందించారు.

.

’ నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని, కన్నులలో దాచుకుందు నిన్నేరా స్వామి ’ అంటూ ‘ గులేబకావళి కథ ’ సినిమాలో పాటలు రాయడం మొదలు పెట్టి దాదాపు 3,000 పాటలు రాసి, 65 గురు సంగీత దర్శకులతో పనిచేసిన ఘనత సాధించారు సినారె. ఘంటసాల గారు అత్యధికంగా ( 302 ) సి. నారాయణరెడ్డి గారి పాటలను పాడి రికార్డులను సృష్టించారు. ’ పగలే వెన్నెల జగమే వూయల ’ – ‘ పూజాఫలం ’ లోని పాట ప్రకృతిలోని అందాలని చూపిస్తుంది. ’ ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి ’ – ఇద్దరు మిత్రుల ’ వేరు వేరు అనుభవాలను తెలియజేస్తుందీ పాట. ’ బంగారు మనిషి ’ చిత్రంలో ’ ఎక్కడికెళ్తుంది, దేశం ఏమైపోతుంది ’ అని ప్రశ్నిస్తూనే సమాజాన్ని పీడిస్తున్న సమస్యలను వివరిస్తారు. ’ శివరంజనీ, నవరాగిణీ ’ పాట బాలు గారి మధురమైన గానంతో బాగా పాపులర్ అయ్యింది. ‘ అందాల రాముడు ’ లో ‘ మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి….. పులిని చూస్తే పులి ఎన్నడు బెదరదు – మేక వస్తే మేక ఎన్నడు అదరదు, మాయరోగమదేమో గానీ -మనిషి మనిషికి కుదరదు ’ అంటూ జీవిత సత్యాలను చెబుతారు. పిల్లలున్న తల్లులు ఎన్నడూ మర్చిపోలేని లాలిపాటని అందించారు సినారె గారు. ’ లాలీ లాలీ లాలీ లాలీ.. వటపత్రశాయికి వరహాల లాలి, రాజీవనేత్రునికి రతనాల లాలి…’ ఈ పాట ఎంత మంది తల్లులు తమ పిల్లలకి పాడారో, పాడుతున్నారో ఇప్పటికీ. ’ మట్టిలో మాణిక్యం ’ లోని హైద్రాబాద్ పాట ఒకప్పటి సిటీ అందాలను గుర్తుకు తెస్తుంది మారిపోయిన హైద్రాబాద్ లో. ‘ రింఝింరింఝిం హైద్రాబాద్ రిక్షావాల జిందాబాద్, మూడుచక్రములు గిర గిర తిరిగితే మోటరు కారు బలాదూర్ ’, ’ చిత్రం భళారే విచిత్రం, చిత్రం అయ్యారే విచిత్రం, ఈ రాచనగరుకు రారాజును రప్పించుటే చిత్రం ’ ధుర్యోధనుడిని రొమాంటిక్ గా దర్శకులు చూపించాలనుకోవడం, సినారె గారు దానికి తగ్గట్టు గీతం రాసి ఇవ్వడం, అది అనుకున్నదానికన్నా హిట్ అవ్వడం అన్నీ త్వరత్వరగా జరిగిపోయాయి. ’ మాతృదేవత ’ లోని పాట ’ మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది మహిళ ’ ఇప్పటికీ మహిళాదినోత్సవం రోజు తప్పకుండా వినిపిస్తూనే వుంటుంది.

.

’ నా కంటిపాపలో నిలిచిపోరా ’ అంటూ ‘ వాగ్దానం ‘ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టిన దాశరధి ’ ఖుషీ ఖుషీగా నవ్వుతూ… చలాకీ మాటలు రువ్వుతూ… హుషారు గొలిపేవెందుకే నిషాకనులదానా ’ అంటూ ఉర్దూ పదాలను తెలుగు పదాలతో కలిపి పదవిన్యాసం చేసారు. అది బాగా హిట్ అయ్యింది. ’ మంచి మనిషి ’ లో ’ ఓహో గులాబీబాలా… అందాల ప్రేమ మాల ’, ‘ కన్నెవయసు ’ పాట ’ ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో ’ సత్యం గారి సంగీత దర్శకత్వంలో బాలు గారి ఫ్రెష్ గొంతులో వెలువడి ఒక సంచలనం సృష్టించింది. ‘ రాము ’ చిత్రం లోని ’ మంటలు రేపే నెలరాజ ఈ తుంటరితనము నీకేలా ’ అనే విరహగీతం రాసిన కలంతోనే, ’ రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య దీనులను కాపాడ రారా కృష్ణయ్య.. ’ అని రాసారు. ‘ దాగుడుమూతలు ’ లో ’ గోరొంక గూటికే చేరావు చిలకా భయమెందుకే బంగారు మొలకా ’, ‘ ఆత్మీయులు ’ సినిమాలోని పాట ’ మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే ’, ’ పాడెద నీ నామమే గోపాల ’ – ‘ అమాయకురాలు ’ సినిమాకి, ’ భద్రకాళి ’ చిత్రానికి ’ చిన్ని చిన్ని కన్నయ్య, కన్నులలో నీవయ్యా ’,

‘ శ్రీ కృష్ణతులాభారం ’ లోని సత్యభామ కోపాన్ని పోగొట్టడానికి ప్రయత్నించే గీతం ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా రాసారనిపిస్తుంది. ‘ ఓ చెలి కోపమా అంతలో తాపమా, నీవలగితే నే తాళజాల ’, ఘంటసాల గారు ఎంత మార్ధవంగా పాడారో ఈ పాటని. మరొకరి గొంతులో ఊహించలేము. ‘ పూజ ’ సినిమాలో ’ ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎన్నటికి వాడని మమత నీది నాది, ఒక్క క్షణం నిను వీడి నేనుండలేను ’, ‘ మల్లెతీగ వాడిపోగా మరలపూలు పూయునా ’, ‘ మనుషులు మమతలు ‘ లోని పాట ’ నిన్ను చూడనీ నన్ను పాడనీ ’, ‘ లేతమనసులు ’ లోని పాట ’ అందాల ఓ చిలకా అందుకో నా లేఖ,’ ’ పిల్లలు దేవుడు చల్లని వారే కల్ల కపటమెరుగని కరుణామయులే,’ ‘ రాధాకృష్ణ ’ సినిమాలో ” రాధా… కృష్ణా… నీ వలపే బృందావనం, నీ పిలుపే మురళీరవం,’ ‘ బుద్దిమంతుడు ’ లో ’ నను పాలింపగ నడిచి వచ్చితివా, మొరలాలింపగ తరలి వచ్చితివా… ’, ‘ చదువుకున్న అమ్మాయిలు ’ లోని నాకెంతో ఇష్టమైన పాట ‘ వినిపించని రాగాలే, కనిపించని అందాలే అలలే మదినే కలచే మదిలో ఎవరో పిలిచే ’….  

 

.

ఇలా చెప్పుకుంటూ పోతే ఆ పాత మధురాలు ఎప్పటికీ మధురాతి మధురంగానే ఉంటాయి.

.

అందమైన గీతాలు రాసిన సినీ గీత రచయిత/త్రులకు, సంగీత దర్శకులకు, మధురంగా ఆలపించిన గాయనీ గాయకులకు, సంగీత సహకారాన్నందచేసిన సంగీత వాయిద్యకారులకు, ఆయా పాటలకు సన్నివేశాలకు తగ్గట్టుగా మంచి నటనను అందించిన నటీనటులకు, వీటినన్నింటిని కెమెరాలో బంధించిన కెమెరామెన్లకు ఇతర టెక్నీషియన్లకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.

 

ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు!

(“సినీగీత వైభవం,” రచయిత ఎస్.వి.రామారావు గారికి కృతజ్ఞతలతో)

D. Kanakadurga, USA

Mail : durgadingari@gmail.com

  .

____________________________________________________

ఈ రచన పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న comment box లో వ్రాయండి.

_____________________________________________________