సంస్కృతం అనగానే అందరికీ గుర్తొచ్చేవి శ్లోకాలూ, మంత్రాలూ, ఇతిహాసపురాణాదులూ. కానీ నిజానికి మన దైనందిన జీవితంలో మనకే తెలియకుండా ఎన్నో సంస్కృత పదాలూ, ప్రయోగాలూ మనం ఉపయోగిస్తాము. ’ఇవి సంస్కృతభాషకు చెందినవి’ అని మనకు తెలియకపోవడానికి కారణం బహుశా సంస్కృతానికీ తెలుగుకూ గల సామీప్యమే కావచ్చు.
గాంభీర్యం, సౌందర్యం, దైవత్వం కలిసిన సంస్కృతం నిజానికి మంత్రతంత్రాదులకే పరిమితం కాదు. దీనికి చక్కటి ఉపమానం సముద్రం. సముద్రంలోని చేపలు మత్స్యకారులకు జీవనోపాధి చూపించగా, దీని లోతుల్లోకి వెళ్ళి వెతికేవారికి రత్నాలు దొరుకుతాయి, అక్కడి ప్రాణుల జీవనశైలి తెలుస్తుంది. లోతుల్లోకి వెళ్ళక కేవలం తీరస్థులైనవారికి అందమైన అలలు నేత్రానందం కలిగిస్తాయి. ఈవిధంగానే, సారభూతమై, నిష్కర్షతో వ్యవహరించే శాసనప్రాయమైన సకల శాస్త్రాలూ సంస్కృతంలో అనుస్యూతమయ్యుండగా, లాలిత్యంతో కూడుకున్న ఎన్నో రచనలూ, అంశాలూ భాషాభిమానులను పరవశింపజేస్తాయి.
- ఇంతటి విస్తృత వాఙ్మయంగల ఈ దేవభాష తెలుగువారైన మనకు ఎంతగానో చేరువ. మన సాహిత్యంలోని ఛందస్సులూ, అలంకారాలూ, పదాలూ, వ్యాకరణాదులూ చాలామటుకు సంస్కృతాన్ని అవలంబిస్తాయి. కాబట్టే, మన చలనచిత్రగేయలలో పూర్తిస్థాయి సంస్కృత గేయాలు బహుళ జనాదరణను పొందాయి. ఉదాహరణకు–
- “దినకర శుభకర దేవ దీనాధార తిమిరసంహార” –
.
- “అగ్నిస్ఖలన సందగ్ధరిపు-వర్గప్రళయ-రథ ఛత్రపతి” –
.
- “జయ చిరంజీవ జగదేకవీర అసహాయశూర అంజనికుమార..
ఆరోగ్యదాతా అభయప్రదాతా ఉన్మాద-భయ-జాడ్య పీడానివార” –
.
- “దేవదేవ ధవళాచలమందిర గంగాధర హర నమో నమో
దైవతలోక-సుధాంబుధి-హిమకర లోకశుభంకర నమో నమో” –
.
ఇత్యాదులు తెలుగు పాటలుగానే చలామణీ అయిపోతున్నాయి!
దేశభక్తి గీతాలలో ప్రశస్తి గాంచిన ’వందే మాతరం,’ ’జయ జయ జయ ప్రియ-భారత-జనయిత్రీ దివ్యధాత్రీ’ వంటివిగూడా తెలుగువారి గుండెల్లో చిరంతన స్థానాన్ని ఆర్జించాయి.
- ఒక రోజంతా మనం తెలుగే మాట్లాడాలి అని సంకల్పిస్తే, దాంట్లో మనం తొంభై శాతం పైగా సంస్కృత పదాలే వాడుతాము. ఉదాహరణకు, ’శుభోదయం/సుప్రభాతం, వార్తాపత్రిక, అల్పాహారం, విద్యాలయం, కళాశాల, కార్యాలయం, మధ్యాహ్నం, సాయంకాలం, భోజనం, శుభరాత్రి’ మొదలగు పదాలు సంస్కృత పదాలే!
- అలాగే, వేదికపై జరిగే కార్యక్రమాల విషయానికొస్తే ’వేదిక, ప్రార్థన, జ్యోతి ప్రజ్వలనం, స్వాగతోపన్యాసం, ముఖ్య అతిథి పరిచయం, బహుమతి ప్రదానం, కార్యదర్శి నివేదిక, వందన సమర్పణం, సాంస్కృతిక కార్యక్రమం, జాతీయ గీతం/మంగళం కూడా సంస్కృత పదాలే.
ఇంక మనం మామూలుగా వాడే పదాల సంగతి తీసుకుంటే–
- కరతలామలకం— మన అరచేతిలో(కరతలం) ఉసిరికాయ(ఆమలకం) ఉంటే, దాని గుణగణాల చెప్పడం మనకెంత తేలికో, ఒక విషయం గురించి ఎవరికైనా మంచి అవగాహన ఉంటే, వారికి ఈ విషయం కరతలామలకమనడం వాడుక.
- కాకతాళీయం— ఒకానొకప్పుడు ఒక కాకి (కాక) వచ్చి తాటి చెట్టుపై (తాళవృక్షంపై) కూర్చోగా, ఒక తాటాకు రాలిందట. ఆ కాకి కూర్చున్న సమయానికీ, ఆ ఆకు రాలడానికీ ఏ సంబంధం లేదు; ఒక ప్రణాళిక ప్రకారం ఇది జరుగలేదు. అలా యాదృచ్ఛికంగా జరిగే వాటికి ’కాకతాళీయంగా’ జరిగిందంటాము.
- నిష్ణాతుడు— నిస్+స్నాతుడు. ఒక విషయంపై మంచి పట్టు సాధించిన వారిని, దాంట్లో మునిగి తేలారనడాం రివాజే, అదే ’ నిస్+స్నాత’ శబ్దానికి అర్థం—బాగా స్నానం చేశాడని.
- కింకరుడు–కిం+కరోమి. ’ఏం చెయ్యాలి? నా కర్తవ్యం ఏమిటి?’ అని ప్రశ్నిస్తాడు కాబట్టీ, తమకు స్వంతంగా నిర్ణయాలు తీసుకునే అధికారం లేనందున భృత్యులకు ’కింకర’ శబ్దం సముచితం.
- అజరామరం— దేనికైతే జరా(ముదిమి) మరియూ మరణం(మర) ఉండవో, అట్టి విషయాన్ని ’అజరామరం’ గా పేర్కొంటారు.
- పశ్చాత్తాపం–ఒక పని చేసిన పిమ్మట (పశ్చాత్), వేడిని(తాపం) అనుభవించడం, ’ఈ పని చేసియుండకూడదు’ అని అనిపించడమే, మనం తరచూ వాడే ఈ శబ్దానికి అర్థం.
- ధురంధరుడు–ధురం+ధరతి. ఒక గొప్ప బరువునో (ధురం) లేక బాధ్యతనో ధరించేవాణ్ణి ఇలా వర్ణిస్తాము. ఉదాహరణకు, ’రావణుడు శివపూజా ధురంధరుడు’.
- ధారాదత్తం–ధారా+దత్తం. ఏదైనా దానం చేసేడప్పుడు, నీటిధారతో ఇవ్వడమే శాస్త్రసమ్మతం. అందువల్లే, బలిచక్రవర్తి వామనుడికి దానిమివ్వడం ఇష్టంలేని శుక్రాచార్యులవారు ఆ ధారకు అడ్డుపడతారు. వివాహంలో కన్యాదానఘట్టంలోనూ, ఇతర దానవేళలయందూ ఇవ్వబడే వస్తువులు నీటిధారతోనే దత్తమవుతాయి, అనగా ఇవ్వబడుతాయి.
- ముద్రారాక్షసుడు–ముద్రా+రాక్షస. ఇది అచ్చుతప్పుకు పర్యాయపదంగా మనం వ్యవహరించే ప్రయోగమే అయినా, నిజానికి ఇది ఒక సంస్కృత నాటకం. రాక్షసుడు అనబడే ఒక మహారాజుకు చెందిన రాజముద్రికను కేంద్రబిందువుగా చేసుకొని వ్రాయబడ్డ రసవత్తరమైన నాటకమిది.
- ఆజానుబాహువు–ఆ+జాను+బాహు. పూర్వం ఆభిజాత్యంగల రాజకుటుంబీకులకు తమ మోకాలి(జాను) వరకు(ఆ) చేతులు (బాహు) ఉండేవని ప్రతీతి. నేడు అలా ఎవరికీ ఉండకపోయినా, పొడవున్న వ్యక్తులను ఉల్లేఖించేందుకు ఈ శబ్దం వాడుకలో ఉంది.
- కేక— ’కేకా వాణీ మయూరస్య’ అని అమరకోశోక్తి. అనగా నెమలి చేసే ధ్వని పేరు కేక. కానీ సాంప్రతికాలంలో ఎవరు అరచినా, పిలిచినా, ’కేక పెడుతున్నారు, కేకేశారు’ అనడం వింటూ ఉంటాము. ఆధునిక యువత తమకు నచ్చిన వ్యక్తిని ’మీరు కేక’ అనిగూడా ప్రశంసిస్తూ ఉంటారు!
- అనర్గళం— అర్గళా అనగా సంస్కృతంలో ’గొళ్ళెం’ అని అర్థం. దేనికైనా అడ్డూ అదుపూ లేకుండా, ప్రవాహంగా సాగితే, దానికి ’అనర్గళంగా సాగింది’ అనడం ముఖ్యంగా ఉపన్యాసాల విషయంలో ఉపయోగించబడే పదం.
మన తిట్లల్లో కూడా దాగియుంది సంస్కృతం!
- దద్దోజనం–పెరుగుతో(దధి) మిశ్రితమైన అన్నాన్ని(ఓదనం) ’దధ్యోదనం’ అనగా, దీంట్లో ఉప్పూ, కారం మొదలగు రుచులు పెద్దగా తెలియకపోవడంవల్ల, ఇలా మందబుద్ధితో చురుకులేనివారిని ’ఒరేయ్ దద్దోజనం’ అని సంబోధించేవారు పెద్దలు!
- అప్రాచ్యుడు— ప్రాచీ అనగా తూర్పు. భరతఖండం ఉన్నది ఈ దిశలోనే, కాబట్టి ఇక్కడివారిని ప్రాచ్యులు అనడం సమంజసం. కానీ, మన సంస్కృతిని విస్మరించి, ఇతర దేశాలూ, లేక సంస్కృతలవైపు మొగ్గు చూపేవారిని పూర్వం ఈ శబ్దంతోనే దుర్భాషలాడేవారు మన పూర్వీకులు, ముఖ్యంగా వృద్ధులు!
మన పురాణ పాత్రల పేర్ల వెనుకున్న అర్థం–
- యుధిష్ఠిరుడు–యుధి స్థిరః–యుద్ధంలో స్థిరంగా ఉండేవాడు.
- శూర్పణఖ–చాటంత(శూర్ప) గోళ్ళు (నఖ)గల ఆమె.
- దుర్యోధనుడు–దుఃఖేన యుధ్యతే–ఎవనితో యుద్ధం దుఃఖం కలిగిస్తోందో, అతడు. అందువల్లే పాందవులు సంబోధించేడప్పుడు, వ్యంగ్యంగా ’సుయోధన’ అంటారు. అంటే ’సులభేన యుధ్యతే’–ఎవనితో యుద్ధం చెయ్యడం సులభమో, అతడు అని.
- ఇలాగే కృష్ణదేవరాయుల భువనవిజయంలో ’అష్టదిగ్గజాలు’ అనబడు మహాకవులుండేవారని చెప్పుకుంటాము. నిజానికి ఎనిమిది దిక్కులను పాలించే గజాలు ఇవి—ఐరావతః, పుండరీకః, వామనః, కుముదః, అంజనః, పుష్పదంతః, సార్వభౌమః, మరియు సుప్రతీకః
- మాయల ఫకీరు ప్రాణం ఏడు సముద్రాల అవతల ఉందని కథ చెబుతారు. అసలు ఈ సప్త సముద్రాలేంటంటే– క్షార (ఉప్పు), క్షీర(పాలు), దధి (పెరుగు), మధు (తేనె), సురా (మద్యపానం), ఇక్షు (చెరుకు), మరియు శుద్ధోదకం (మంచినీరు).
మనకు తెలిసిన కొన్ని పేర్ల నేపథ్యం–
* నారాయణ–ఎవనికి నీరు (నారాణి) నివాసస్థలమో (అయనం), అతడు.
- శంకర–మంచిని (శం) కలిగించువాడు (కరోతి).
- అపర్ణ–ఒక్క ఆకును (పర్ణ) కూడా భుజించకుండా శివునికై కఠోర తపస్సు ఆచరించింది కాబట్టి పార్వతికి ఈ పేరు.
- శశి–కుందేలు(శశ) గొన్నవాడు–చంద్రునిపై ఉన్న మచ్చ కుందేలురూపంలో ఉంటుంది కాబట్టి చంద్రుణ్ణి శశి అని అంటాము.
చలనచిత్ర ప్రముఖుల పేర్ల వెనుక అర్థాలు–
అమితాభ— ఎనలేని(అమిత) తేజస్సు(ఆభా) కలిగినవాడు.
రాజమౌళి— ఇదొక శ్లేషయుక్తమైన పేరు. సంస్కృతంలో ’రాజ’ అన్న పదానికి చంద్రుడూ, రాజు అని రెండర్థాలున్నాయి. ఆవిధంగా, ’చంద్రుణ్ణి శిరస్సుపై(మౌళిపై) కొన్నవాడు’ అని శివుణ్ణి స్ఫురింపజేస్తుంది, అలాగే ’రాజులలో మౌళీభూతమైనవాడు’ అన్న అర్థం తీసుకుంటే, రాజాధిరాజన్న అర్థం సమన్వయం అవుతుంది.
.
కీరవాణి— చిలుక(కీర)వంటి పలుకు(వాణీ)గలవాడు.
చలనచిత్రాల విషయంలో వాడే సంస్కృత పదాలు– చలనచిత్రం, నిర్మాత, దర్శక, నట, చాయాగ్రహణం, కథ, తారాగణం, నేపథ్యసంగీతం, శుభం!
అలాగే, ‘ధూమపానం, మద్యపానం ఆరోగ్యం(కి) హానికరం!’
‘అతివేగం అత్యంత ప్రమాదకరం!’
వివాహపత్రికల్లో వాడే సంస్కృతం-– వధువు, వరుడు, ఆహ్వానం, దౌహిత్రుడు, పౌత్రుడు, సకుటుంబ – సపరివారం, ఆశీర్వాదం, మదర్పిత – చందన – తాంబూలాది – సత్కారం, భవదాగమనాభిలాషి, భవదీయుడు.
సంస్కృత వాక్యాలను తమ ప్రతీకలలో చిత్రీకరించే ప్రఖ్యాత సంస్థలు–
బహుజనహితాయ, బహుజనసుఖాయ—ఆకాశవాణి
.
సత్యం శివం సుందరం—దూరదర్శన్
.
యోగక్షేమం వాహామ్యహం–ఎల్. ఐ. సీ.
.
య ఏషు సుప్తేషు జాగర్తి– Institute of Chartered Accountants of India
.
యతో ధర్మస్తతో జయః– భారత అత్యున్నత న్యాయస్థానం (Supreme Court of India)
సిద్ధిర్భవతి కర్మజా–ఐ.ఐ.టీ. (మద్రాసు)
.
విద్యావినియోగాత్ వికాసః–ఐ.ఐ.ఎమ్. (అహమ్మదాబాదు)
శరీరం ఆద్యం ఖలు ధర్మసాధనం–AIIMS
.
తేజస్వినావధీతమస్తు–ఆంధ్ర విశ్వవిద్యాలయం
శం నో వరుణః–భారత నౌకాదళం (Indian Navy)
.
నభః స్పృశం దీప్తం– భారత వాయుసేన (Indian Air Force)
సత్యమేవ జయతే–భారత గణతంత్రం –Republic of India
ఇలా, ఎందెందు వెతకిజూసిన అందందే కలదు సంస్కృతం!
.
***************************************
Courtesy : Youtube channels & Image owners — B. Naveena, MBA, MA ( Sanskrit )
Chennai, email: naveena_b_2002@yahoo.co.in
.
____________________________________________________
ఈ రచన పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న comment box లో వ్రాయండి.
_____________________________________________________
అద్భుతమైన సమాచారమందించారు నవీన గారు. హార్దిక శుభాభినందనలు!
Dhanyavaadaalu, Vimala Garu!