మన పండుగలన్నీ జాతి సంస్కృతీ సాంప్రదాయాలకు, నమ్మకాలకు ప్రతీకలు. కొన్ని పండుగలు అవతార పురుషులకు, మరికొన్ని ప్రకృతికి సంబంధించినవిగాను ఏర్పడినవి. ఉగాది ప్రకృతికి సంబంధించిన, కాలచోదితమైన పండగ. ” ఉగస్య – ఆది – ఇతి ఉగాది ” అంటే, సృష్టి మొదలైనదని భావం. అప్పటినుంచే కాలమానం ఆరంభమైనది. ప్రతి సంవత్సరము ఒక్కొక్క పేరుతో పిలవబడుతూ 60 పేర్లు కలిగి ఉండటం ఉగాదికి గల ఒక విశేషము.
ఇటువంటి విశిష్ట పండుగను దేశవిదేశాల్లో జరుపుకొనే అదృష్టం నాకు కలిగింది. గౌహతిలో జరుపుకున్న ఉగాది తెలుగు రాష్ట్రం బయట జరుపుకున్న మొదటిది కాబట్టి అక్కడి అప్పటి విశేషాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అక్కడ ఆ ప్రాంతాల్లో మేము 1964 నుంచి పది పదిహేను సంవత్సరాలు గడిపాము. ( దేశవిదేశాల్లో మేము జరిపిన ఉగాదుల గురించి ధారావాహికగా ఇవ్వాలనుకుంటున్నాను. ఈ విషయ ప్రస్తావనని ప్రోత్సహించి ఉత్సాహపరిచిన శిరాకదంబం సంపాదకులకు, పాఠకులకు ఉగాది శుభాకాంక్షలు.)
గౌహతిలో ఉగాది వేడుక :
1964 – 65 సంవత్సరంలో గౌహతిలో తెలుగువారు మొదటిసారిగా జరుపుకొన్న ఉగాది పండగ.
కలకత్తా దాటి రెండు రోజులు బరోనీ మీదుగా గౌహతి చేరి, అక్కడ మాలాగే ఉద్యోగ రీత్యా వచ్చిన తెలుగువారందరం కలిసి ఓ సంఘం ఏర్పాటు చేసుకుని పండుగలు సామూహికంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నాము. తెలుగు మాట వినపడని ప్రదేశం…. బెంగాలీలు, బీహారీలుండే ప్రాంతం… మా అందరికి చిన్న పిల్లలు. తెలుగు మాట్లాడటం తెలిసినా చదవడం రాయడం రాని పిల్లలు. ఎలా వీళ్లకి నేర్పించాలి? అని ఆలోచించాము. నా దగ్గర ‘ఆట విడుపు’లో రేడియో అన్నయ్య, అక్కయ్య నేర్పించిన పాటలున్నాయి. చిన్న డ్రామా పుస్తకం ఉంది, ‘బడి గంట’ అని గుర్తు. అందులోని ఎలకమ్మ పెళ్లి, బుజ బుజ రేకులు, మొద్దబ్బాయి చరితము మొదలైనవి నేర్పించాము. పిల్లలంతా హుషారుగా నేర్చుకున్నారు. చిన్న కమిటీ పెట్టుకున్నాం. యూనివర్శిటీ (గౌహతి) లో ఇద్దరు ప్రొఫెసర్లు రెడ్డి, నారాయణరావు గార్లు. గౌహతికి ఉద్యోగరీత్యా వచ్చిన ఒక ఐఏఎస్ గోపాలకృష్ణగారు, ఆఫీసరు, ఆయిల్ రిఫైనరీలోని శాస్త్రి దంపతులు, ఒక పోస్టుమాస్టరు గారు, కొంత మంది రైల్వే ఉద్యోగస్థులు, శేషుగారు, ఆయన భార్య ఉమ, నేను, మావారు శ్రీ మోహన్ సరేసరి. అప్పుడు టీవీలు లేవు. రికార్డు ప్లేయర్ కూడా దొరికేది కాదు. మేము మద్రాసు బర్మా బజార్ లోను, కలకత్తా మార్కెట్ లోను కొన్న టూ-ఇన్-ఒన్ పెట్టి పాటలు నేర్పించాము.
అందరూ పరమోత్సాహంగా నేర్చుకుని స్టేజి ఎక్కాము. మరి ప్రక్కవాద్యాలు లేవు కదా. ఒక బెంగాలీ బాబుని పట్టుకుని తబలా వాయించే ఏర్పాటు చేసుకున్నాం. ఉగాది పచ్చడికి నానా తంటాలు పడ్డాము. అప్పుడు వేప పువ్వు లేదు. కానీ ముందు ముందు ఆంధ్ర దేశం వెళ్లిన వాళ్ళు తెచ్చి (ఎండ బెట్టి) యిచ్చేవారు. పెద్దలు గోపాలాచారి గారు పంచాంగ శ్రవణం చేశారు. ఆయన గౌహతిలో గవర్నమెంటులో పని చేసేవారు. ఆ రోజుల్లో గౌహతిలో రిక్షాలు లేవు. కొన్ని ప్రాంతాలకే బస్సులుండేవి. ఆయిల్ కంపెనీ, రిఫైనరీలో పని చేసే వారు ఎంతో ఉదారంగా సభ్యుల్ని జీపుల్లో తీసుకువచ్చేవారు.
అందరం మొదటిసారిగా ఉగాది జరుపుకున్నాం. రెండో సంవత్సరంకి తమాయించుకుని, సభ్యత్వాన్ని పెంచి, ఎంతో శ్రమించి బాగా చేసుకున్నాం. ముఖ్యంగా బీన్ రావు దంపతులు (రైల్వే) అందరి మంచిచెడ్డలనీ కనుక్కుంటూ స్నేహంగా ఉండేవారు. ఇందులో సగం మంది మన మధ్య నేడు లేరు. వారికి శ్రద్ధాంజలి. తిరుపతయ్యగారు, ఆయన భార్య ఎంతో సహాయం చేసేవారు.
ఆ తర్వాత బదిలీ మీద రైలు వెళ్లిన చోటకల్లా వెళ్తూ వచ్చాం మేము. హఫ్ లాంగ్ అనే ఊరికి బదిలీ అయింది. 3000 ఫీట్. నార్త్ కచార్ హిల్స్, ఇలాకాలో లమ్ డింగ్, బదర్‌పూర్‌ల మధ్య గల ఊళ్లో 4, 5 సంవత్సరాలు గడిపాము. రైల్వే ట్రాక్ పనులు జరుగుతుండేవి. మధ్య మధ్య మిలటరీ ఆఫీసర్లు, పిడబ్ల్యూడీలో పని చేసే తెలుగు వారు కలిసేవారు. ఉగాదికి అస్సామీ పిల్లలతో గడిపాము. అదేరోజు వాళ్లు “బిహు” పండగ చేసుకుంటారు. మేము వారితో చేరి ‘మా భాషలో పాట పాడతాం’ అని అడిగి స్టేజి ఎక్కిన సందర్భాలున్నాయి. అన్నిటికీ ఆది అన్నాం కదా. ఇది కూడా మనమాట తెలీని వాళ్ల మధ్య మొదటి ప్రయత్నంగా అనుకున్నాం.
మళ్లీ 75, 80 సంవత్సరాల మధ్య బదిలీ మీద గౌహతి వచ్చాం. అప్పటికి తెలుగు వాళ్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. చిన్న లైబ్రరీ ఏర్పాటు చేసుకున్నాం. పుస్తకాలు తెప్పించుకునేవాళ్లం. స్వంత ఊళ్ళకి వెళ్లినవాళ్ళు సినిమా క్యాసెట్లు తెచ్చేవారు. ప్రొజెక్టరు సరంజామా ఏర్పరచుకున్నాం.
చిట్టిబాబు గారి కచేరీ ఏర్పాటు చేసుకున్నాం ఓ సంవత్సరం. కొత్త సభ్యుల పిల్లలు, హెచ్.బి.మూర్తి గారి పిల్లలు భరత నాట్యం చేశారు. సొంతూళ్ళో ఇంటికి వెళ్లిన వాళ్ళు ఎండబెట్టిన వేప పువ్వు, కొత్త చింతపండు తెచ్చేవారు. మంచి ఉగాది పచ్చడి తిని, పాటలు పాడి, ఆటలు ఆడి, పిల్లల చేత పాడించి ఆడించి, ఆనందంగా గడపగలిగాము అంత దూరాన!
మరికొన్ని విశేషాలు తరువాతి సంచికలో …..
.
— Vanimohan
Chennai
Mail : vanivattyam@gmail.com
***************************************
.
_____________________________________________________
ఈ రచన పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న comment box లో వ్రాయండి.
______________________________________________________