10_016 లలిత సంగీతం నాడు – నేడు

.

ఆకాశవాణి / దూరదర్శన్లలో లలితసంగీతం నాడు-నేడు

మనకు తెలిసిన ఆకాశవాణి / దూరదర్శన్ లో ఒకనాడు అలరించిన లలితసంగీతం కనుమరుగౌతుందా?”  ఈ మాట అనుకోడానికి బాధగా ఉంది. 1955 – 56 నాటికి విజయవాడ రేడియోలో వినిపించే పాటలు నేటికీ మరువరానివి.  

పద్మవిభూషణ్ శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లు, పద్మశ్రీ శ్రీరంగం గోపాలరత్నం, రమణమూర్తి… ఇలా ఎందరో మహనీయులు, మహా కళాకారులూ కేవలం కర్ణాటక సంగీతమే కాకుండ లలిత సంగీతమనే క్రొత్త రకపు సుగమం, సరళం అయిన పాటలను స్వరపరచి అందరూ పాడుకోడానికి అనువుగా రూపొందించారు. ‘ ఏమిటీ లైట్ మ్యూజిక్ ‘ అనే హేళనను పట్టించుకోకుండా ఒక వినూత్నమైన శైలి లో పెద్ద పెద్ద కవులు వ్రాసిన ఎన్నెన్నో గేయాలను మనందరకూ అందచేసిన స్వర్ణయుగారంభం అది. ఇందులో లలితమైన శైలిలో మనకు కొన్ని అన్నమయ్య పదాలు కూడా లభించాయి. నాకు జ్ఞాపకం ” వైతాళికులు” అనే కవితలు మరియు గేయాల సంపుటి లోంచి ఎన్నెన్నో పాటలు రేడియో లలిత సంగీత కార్యక్రమంలో వినటం.  

రేడియోలో కొంత సమయం ఈ లలితసంగీత ప్రసారణకు కేటాయించబడి ఉండేది. ఇందులో ఎంతోమంది గాయకులూ, గాయనీమణులు, వారికి తగిన రీతిలో నేపథ్య సంగీతాన్ని అందచేయటానికి వాద్య కళాకారులూ ఉండేవారు. వీరిలో కొంతమంది స్టాఫ్ లోని వారైతే, మరికొందరు కాజువల్ కళాకారులుగా బుకింగ్, తద్వారా కొంత ఆదాయాన్ని పొందగలుగుతూ ఉండేవారు. పండుగలూ, ప్రత్యేక సందర్భాలయిన స్వాతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్ డే, గాంధీ జయంతి ఇలా అనేక జాతీయ పర్వాలకు ప్రత్యేక కార్యక్రమాలను, సంగీత రూపకాలను తయారుచేయటం సర్వసాధారణంగా ఉండేది. ప్రతిసారీ కొన్ని నూతన పోకడలతో, ఈ కార్యక్రమాలు చాలా రంజుగా ఉండేవి.  

ఈ లలిత సంగీతానికి గల ప్రత్యేకత ఏమిటంటే అనువైన చక్కని సాహిత్యం, దానికి తగిన సంగీతం ఉండటంతో చాలావరకూ సినిమా పాటలవలె కాక, ఏ విధమైన సంకోచమూ లేకుండా నలుగురి మధ్య కూర్చుని పాడటానికి, పాడమని అడగటానికి, వినటానికి ధైర్యంగా ఉండేది. సినిమా పాటలలో ఏవో కొన్ని తప్ప, అన్నిటికీ ఈ విధమైన అనువు, సౌలభ్యమూ లేదనే చెప్పాలి. దానికి తోడు అవి యుగళగీతాలైతే మరీ కష్టం. వీటన్నిటికీ తోడు, సినిమా పాటలను పాడే శృతులు, ముఖ్యంగా మహిళలకు, ఆడపిల్లలకూ అనుకూలంగా ఉండేవి కాదు. దానికి కావాల్సిన కంఠ పరిణతి వేరే రకపుది. ఆపైన, వీటిని పాడే సమయంలో మధ్యనుండే నేపథ్య సంగీతపు ఖాళీలను ఎలా భర్తీ చేసుకోవాలో తెలీక ఇబ్బంది పడటం నేను  చూశాను. ఈ రకం ఇబ్బంది లలిత సంగీతంలో అనిపించేది కాదు. సాధారణంగా ఏదో ఒక తాళానికి సరిపోవటంతో, ఒక ఆవర్తనం వదిలి పాడగలిగేవారు. దానికి తోడు సినిమా పాట అనగానే మనకు ఆ సినిమా సీన్లు కూడా గుర్తుకు వస్తాయి. దాంతో పాడుతున్న వారి ప్రాముఖ్యం కొంతవరకూ తగ్గుతుందనే చెప్పాలి. ఈ కారణంగానే సంగీత చికిత్సకు సినిమా సంగీతం అంతగా అనువుగా లేకపోవటం గమనించాను. 

 

ఇలాగే హిందుస్తానీ సంగీతంలో కూడా గీత్, గజల్ మరియు భజన్ అనే మూడు శ్రేణుల్లో సుగమ్ సంగీత్ అనే పేరుతో లలిత సంగీతం ఉంది. 80 ల వరకూ ఈ మూడింటికీ కలిపి ఒకటే శ్రేణి ఉండేది. క్రమేపీ గజల్ కి వేరు, గీత్ మరియు భజన్ కి కలిపి వేరుగా చేశారు. అదే కర్ణాటక సంగీతంలో లలితసంగీతం, డివోషనల్ ( భక్తి ) సంగీతం పేరిట కొనసాగుతోంది ఈ పరంపర. ఎంతోమంది గాయనీ గాయకులకు, వాద్యకళాకారులకూ జీవనోపాధి కల్పించిన ఈ శ్రేణి, బాణీ ప్రస్తుతం సత్వరంగా అంతరించిపోతున్న దశలో కానవస్తోంది. కారణం – ఆకాశవాణి కూడా కమర్షియలైజేషన్ కావటం. 

సినిమా పాటలంటే అందరికీ ఇష్టం. పటిష్టమైన నేపథ్య సంగీతం, చక్కని బాణీలు, గొప్ప కళాకారులు అద్భుతంగా పాడటం, మంచి సాహిత్యం, కొన్ని చోట్ల ఆయా సన్నివేశాలకు తగినట్లు ఉండటమే గాక, క్రొత్త పోకడలు, నవీన వాయిద్యాలు, సంగీతపు రకాలు అన్ని వయసులవారి మనసులనూ ఇట్టే దోచేస్తాయి. ఈ పాటలను రికార్డు చేయటానికి అయ్యే ఖర్చు కూడా అదే విధంగా చాలా ఎక్కువగా ఉంటుంది. రేడియో కమర్షియలైజ్ చేసినప్పుడు, ఈ సినిమా పాటలకు వచ్చిన ప్రాయోజనం సాటిలేనిది. ప్రకటనలు ఇవ్వాలనుకున్న ప్రతి కంపెనీ సినిమా పాటలకే మొగ్గుచూపాయి. ఈ ఒరవడిలో ఆకాశవాణి లలితసంగీతానికి ప్రకటనలు ఇవ్వటానికి ఏ ప్రైవేట్ కంపెనీలూ ముందుకు రాలేదు.  

 

ఇక చూడాల్సిన అంశం సినిమా పాటలతో ఆకాశవాణి లలిత సంగీతం పోటీపడే స్థాయిలో ఉన్నదా లేదా అనేది. నచ్చకపోయినా ఒప్పుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. రేడియోలో సాధారణ ప్రసారానికై రికార్డు చేసే లలితసంగీతం కోసం కేటాయించే నిధులు ఇటీవల అరకొరగానే ఉంటూ వస్తున్నాయి. దాంతో ఒక గాయకుడూ / గాయనికి ప్రక్క వాయిద్యాలు గా అందేవి ఒక తబలా, హార్మోనియం లేదా తంబూరా, సితార్ / ఫ్లూట్ మాత్రమే. రిహార్సల్ కోసం అంటూ సమయం కేటాయించటం అరుదు. అరగంట ముందు ఎలాగో ఒకలాగ నేపథ్య సంగీతం తయారుచేయటం, పల్లవి ఎక్కడ ఎత్తుకుంటారు, చరణం ఎక్కడా, ఎన్ని చరణాలు అంటూ అడగటం, ఏదో ఒకటి వాయించి అయిందనిపించటం నేనే ఎన్నోసార్లు అనుభవపూర్వకంగా చూశాను. ఇక ఎలాగో అలాగ తయారైన ఈ కార్యక్రమాలను ప్రాయోజితం చేయమని ఏ ప్రకటనదారునైనా అడగటం కూడా చాలా కష్టం. ఇక్కడ ఒక ముఖ్య విషయం పేర్కొనాలి. ఆకాశవాణిలో మంచి గ్రేడ్ పొందిన కళాకారులకు మాత్రమే దూరదర్శన్ లో అవకాశాలు ఇచ్చేవారు. దూరదర్శన్ కార్యక్రమాలు ఈ విషయంలో కొంతవరకూ మెరుగనే చెప్పాలి. ఇప్పుడు అవి కూడా 

సినిమా పాటల అనుకరణలకు  పరిమితం కావటం విచారకరం. నిజానికి పాటల పోటీల్లో పిల్లలచేత కూడా సినిమా పాటలనే పాడించటం విషాదకరం. 

 

ఇటువంటి పరిస్థితిలో ఆకాశవాణి ప్రాణం పోసి పెంచిన లలిత సంగీతాన్ని పునరుద్ధరించాలా లేదా కాలక్రమేణా అంతరించిపోతూ ఉంటే చేతులు కట్టుకుని చూస్తూ ఉండిపోవాలా అనేది మనం ఎదుర్కుంటున్న పెద్ద సమస్య. కళాపోషకులూ, ఆకాశవాణి యాజమాన్యం, కళాకారులూ కలిసి ఆలోచించాలిసిన ముఖ్య విషయం. ఏమంటారు? 

 

***********************

.

కొన్ని లలిత గీతాలు –

తొలినాటి సంద్రాలు…. వసంతలక్ష్మి

.

ఏది నీ మనసుకు చిరునామా

– డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణ & పి. సుశీల

.

ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట

రచన – ఏడిద కామేశ్వరరావు గారు,  గానం – శ్రీరంగం గోపాలరత్నం గారు

.

ఈ అనంత విశ్వములో నేనెంతటి వాడను

రచన : వక్కలంక లక్ష్మీపతిరావు గారు, గానం : మల్లాది సూరిబాబు

.

మువ్వలు పలికెనురా

గానం : జిక్కి

యూట్యూబ్ ఛానల్స్ సౌజన్యంతో…..

.

Kaleepatnam Seetha Vasantha Lakshmi

Sunada Vinodini Music Gurukulam, Gurugram, Haryana

.

____________________________________________________

ఈ రచన పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న comment box లో వ్రాయండి.

_____________________________________________________