10_016 ప్రవాసంలో తెలుగు అక్షరం

.

దేశం వదిలి ప్రవాసం వెళ్ళిన తెలుగువారు మన తెలుగుతనాన్ని ముందు తరం వారికి అందించే ప్రయత్నం ఏనాటి నుంచో చేస్తూనే ఉన్నారు. 1976 లో నేను అమెరికా వచ్చినప్పుడు, అప్పటికే కొన్ని సంవత్సరాల కిందట వచ్చిన తెలుగువారు, మన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించుకోవాలని, అలాగే పిల్లలకు తెలుగు భాష రావాలని తాపత్రయపడిపోతూ ఉండేవారు. ఆ రోజుల్లో శని ఆది వారాలు వస్తే ఉన్న పదిమంది ఒకచోట చేరి కష్టసుఖాలు మాట్లాడుకుంటూ ఉండేవారు. అందరికీ కామన్ టాపిక్, కామన్ కన్సర్న్ పిల్లలు!

ఇక్కడ పుట్టి పెరుగుతున్న పిల్లలు చాలా తెలివితేటలు కలవాళ్ళు, అద్భుతంగా ఇంగ్లీషు మాట్లాడతారని సంతోషపడినా వాళ్ళ మాటా, ప్రవర్తన మన సంస్కృతి పరంగా చూస్తే, చాలా భిన్నంగా ఉండటం తల్లిదండ్రులను వ్యాకుల పరిచేది. పిల్లలకు కొంతవరకైనా మన పద్ధతులు, మన ఆచార వ్యవహారాలు తెలియాలని అందుకు గాను వారికి మన భాష  తెలియాలని చాలామంది తల్లిదండ్రులు అభిప్రాయపడుతూ ఉండేవారు. అప్పటి పరిస్థితుల కారణంగా ఇంట్లో ఎవరికి వారుగా తెలుగు నేర్పడం సాధ్యం కాదని, బేస్మెంట్ ఉన్న తెలుగువారి ఇంట్లో ఆదివారాలు తెలుగు క్లాసులు మొదలు పెట్టారు. భాష మీద ఆసక్తి, కొంత పట్టు ఉన్న ఒకళ్ళిద్దరు పిల్లలకు తెలుగు నేర్పే బాధ్యత తీసుకునేవారు. వారానికి ఒకసారి అందరూ కలుసుకోవడం, ఆటపాటలతో పిల్లలు ఎంజాయ్ చెయ్యడం జరిగిందే కాని, నాకు తెలిసి ఈ ప్లాన్ సక్సెస్ కాలేదనే చెప్పాలి. పిల్లలకు మాట్లాడం రాకపోవడం ఒక కారణం అయితే, వాళ్లకు ఆసక్తి కరంగా, వాళ్లకు అర్ధం అయ్యేలా చెప్పే నైపుణ్యం పెద్దవాళ్ళకు లేని కారణంగా “అన్నప్రాసన నాడే ఆవకాయ” అన్న సామెత లాగా అయింది! కానీ కొద్దిమంది తల్లితండ్రులు పట్టుదలగా పిల్లలకు తెలుగు రాయడం, చదవడం నేర్పినవారు లేకపోలేదు.

ఉద్దేశ్యం మంచిదే అయినా తెలుగు రాని పిల్లలకు, తెలుగు మాటల వినికిడి లేని పిల్లలకు తెలుగు రాయడం, చదవడం నేర్పించాలనుకోవడం సరియైన క్రమం కాదని నాకు అర్ధం అయింది. 1979 లో పుట్టిన మా అమ్మాయితో నేను ఇంట్లో తెలుగులో మాట్లాడుతూ మూడేళ్ళ వయసునుంచి, ఆటలు ఆడుతూ తనతో సమయం గడుపుతున్నప్పుడు, అన్నం తింటునప్పుడు, కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు చిన్న చిన్న మాటలు నేర్పించటం మొదలుపెట్టాను. అలా మాటలతో మొదలు పెట్టిన మా ప్రయత్నం ఫలించి, తనకు తొమ్మిదేళ్ళ వయసు వచ్చేసరికి బాగా తెలుగు మాట్లాడ్డం నేర్చుకుంది. మధ్య మధ్యలో ఇండియా వెళ్లటం అక్కడ అందరితో మాట్లాడే అవకాశం, అవసరం రావడం మా అమ్మాయికి బాగా ఉపయోగపడింది.

1980 ల్లో నెమ్మదిగా ప్రతి రాష్ట్రంలో తెలుగు సంఘాలు ఏర్పడటం మొదలు పెట్టాయి. మన పండగలు జరుపుకునే సందర్భంగా సంఘాలు నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో వేదికమీద చిన్న చిన్న పిల్లలు ముద్దుగా తెలుగు పద్యాలు, పాటలు వినిపించడం అందరికీ స్పూర్తిదాయకంగా ఉండేది. క్రమేణ కార్యక్రమాల్లో పెద్దలతో పాటు, కాస్త తెలుగు మాట్లాడగలిగిన పిల్లలకు కూడా భాగస్వామ్యం ఇస్తూ, వాళ్ళ చేత మన పండగల విశిష్టత గురించి చెప్పించడం, జరగబోయే కార్యక్రమాలను వేదికమీద వాళ్ళ చేత ప్రకటించడం వంటివి చేయించి కొంత విజయం సాధించామని చెప్పచ్చు. ఆ ఉత్సాహంతోనే తెలుగు బాగా మాట్లాడ్డం వచ్చిన మా అమ్మాయి వంటి కొద్ది మంది పిల్లలను తీసుకుని, వారికోసం ప్రత్యేకంగా చిన్న చిన్న సరదా స్కిట్స్ రాసి, వాళ్లకు తర్ఫీదు ఇచ్చి ప్రదర్శనలు ఇప్పించే వాళ్ళం. ఆ రోజుల్లో అప్పటికి అది ఒక సవాలుగా అనిపించినా ఆ ప్రక్రియలో, పిల్లలు పొందిన అనుభవం, మేము పొందిన ఆనందం మాటల్లో చెప్పలేనిది!

పిల్లల చేత తెలుగు మాట్లాడించటం, నలుగురి ముందు ప్రదర్శన ఇప్పించటం “ఒక సవాలు” అని ఎందుకన్నాను అంటే తెలుగు మాట్లాడని పిల్లలు, అలాగే కొంతమంది పెద్దవాళ్ళు కూడా తెలిసో తెలియకో, తెలుగు మాట్లాడగలిగిన పిల్లలను, సంగీతం, నాట్యం నేర్చుకుంటున్నపిల్లల్ని హేళన చెయ్యడం…వారిలో లేనిపోని అనుమానాలను రేకెత్తించడం చేస్తుండేవాళ్ళు.

 “ మీ మామ్-డాడ్ వాళ్ళు ఇండియా వెళ్ళిపోతారు, అందుకే నీకు తెలుగు నేర్పిస్తున్నారు ”

 “ మీ పేరంట్స్ ఇండియాలో ఉన్న అబ్బాయితో నీకు పెళ్ళి చేసేస్తారు. అందుకే నీకు తెలుగు.. డాన్స్ నేర్పిస్తున్నారు ”

“ ఏమిటీ…త్వరగా అల్లుడ్ని తెచ్చుకోవాలనా తెలుగుతో పాటు, మీ అమ్మాయికి పెళ్ళి సంగీతం నేర్పించేస్తున్నారు?! ” అంటూ రకరకాలుగా మాట్లాడుతూ ఉండేవారు. ఈ రకం అనుభవాలు మాకూ ఎదురయ్యాయి!  

తెలుగు సంఘాల తరువాత, నెమ్మదిగా అమెరికాలో మందిరాలు, దేవాలయాలు. చిన్మయా మిషన్ సెంటర్స్ రావడం మొదయ్యాయి. తెలుగు సంఘాలు, తెలుగు మాట్లాడే పిల్లలకు వేదిక మీద అవకాశం ఇస్తే, ఆలయాలు, చిన్మయా సెంటర్స్ సామాజికసేవా కార్యక్రమంలో భాగంగా లాంగ్వేజ్ క్లాసులు ప్రారంభించి పిల్లలు మాతృభాష నేర్చుకునే అవకాశాన్ని కల్పించారు. మా న్యూజెర్సీ లో బ్రిడ్జ్ వాటర్ దేవాలయంలో శ్రీమతి కాశీనాధుని రాధ గారి ఆధ్వర్యంలో ఎంతోమంది పిల్లలు తెలుగు అక్షరాలు నేర్చుకుని తెలుగు చదవడం, రాయడంలో ప్రవీణులై ఎన్నో బహుమతులు కూడా గెలుచుకున్నారు. ఇక పుణ్యం పురుషార్ధం రెండు ఒకే చోట అన్నట్టు చిన్మయా సెంటర్ లో అటు ఆధ్యాత్మిక విజ్ఞానం, ఇటు మాతృభాషా బోధనా కూడా జరుగుతున్నాయి!

తల్లిదండ్రులు, తెలుగు సంఘాలు, ఇతర స్వచ్ఛంద సేవా సంస్థలు ఎవరికి తోచింది వాళ్ళు చెయ్యడం, ఎంతవరకు నేర్పగలిగితే అంతవరకు నేర్పటం, ఎప్పుడు వీలయితే అప్పుడు నేర్పడం వంటి ధోరణిలో నడుస్తూ ఉంటాయి. తెలుగు భాషను ముందు తరాలకు అందించాలి అనే ఈ ఉన్నతమైన ఆలోచన ఒక “లక్ష్యం” గా మారింది తెలుగు బడుల ద్వారానే. ఇక్కడ పుట్టి పెరుగుతున్న పిల్లలకు తెలుగు భాషను నేర్పటానికి ఒక సమగ్రమైన ప్రణాళికతో, పటిష్టమైన బోధనా పద్దతితో  తెలుగు బడులు, తెలుగు పాఠశాలలు ముందుకు వచ్చాయి.

.

2007 లో సిలికానాంధ్ర వారి ఆధ్వర్యంలో స్థాపించబడిన “మనబడి” జాతీయ స్థాయిలోనే కాక అంతర్జాతీయ స్థాయిలో అంటే ఇతర దేశాల్లో ఉన్న పిల్లలకు కూడా తెలుగుభాషను నేర్పిస్తున్నారని అందరికీ తెలిసిన విషయమే. ఆరేడు సంవత్సరాలలో పిల్లలకు తెలుగు భాషను సంపూర్ణంగా నేర్పించడానికి కంకణం కట్టుకున్న సంస్థ మనబడి. అందుకోసం ప్రణాళికాబద్ధమైన సిలబస్ ను ప్రత్యేకంగా రూపొందించి తెలుగు భాషను బోధించడానికి అనేకమంది భాషా సైనికులను తయారుచేస్తూ వారి సహాయంతో ముందుకు నడుస్తున్న సంస్థ మనబడి. బోధన శుక్ర,శని,ఆదివారాల్లో ఒకరోజే జరిగినా, మామూలు స్కూలు పద్ధతిని అనుసరిస్తూ నడపడం వల్ల, నేర్చుకోడానికి వచ్చిన విద్యార్థులు, నేర్పే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ఇతర కార్యవర్గం అందరూ ఒక పద్ధతిని అనుసరిస్తారు. తరగతుల వారిగా క్లాసు రూముల ఏర్పాటు, మొదటిరోజున పిల్లలందరికీ పాఠ్యప్రణాళిక పుస్తకం అందిచడంతో పాటు, తరగతిలో పాటించవలసిన నియమాలు, ఇంటిపని (హోంవర్క్) త్రైమాసిక పరీక్షలు, ఫలితాలు తెలియపరచడం, తల్లిదండ్రులతో సమావేశాలు అన్నీ ఒక క్రమంలో జరుగుతాయి. నాలుగు సంవత్సరాలు ఉపాధ్యాయురాలిగా ఉన్నప్పుడు పిల్లలతో ఆ అనుబంధం..ఆ అనుభవం, వారి ప్రగతి తలుచుకున్నప్పుడు నాకు చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది!

.

“కలిసికట్టు” అనే పదం చాలా శక్తివంతమైంది. పది గడ్డిపోచలు కలిస్తే ఒక బలమైన తాడు అవుతుంది. ఒక్కరే  చేసే పనికన్నా నలుగురు కలిసి చేసినప్పుడు, మనలో సమర్ధత పెరుగుతుంది. దానివలన ఫలితం కూడా మరింత ఎక్కువగా ఉంటుంది. దాదాపుగా ఓ వందమంది పిల్లలు ప్రతివారం తరగతులు జరుగుతున్న బిల్డింగ్ లో కలిసి ప్రవేశిస్తూ.. తరగతిలో పదిమంది పిల్లలతో కలిసి కూర్చుని తెలుగులో మాట్లాడుతూ… తెలుగు అక్షరాలు నేర్చుకుంటూ… తెలుగు చదువుతున్నప్పుడు పిల్లల్లో ఆత్మవిశ్వాసం, నేర్చుకుంటున్న దాని పట్ల ఇష్టం పెరుగుతాయి అనటంలో సందేహం లేదు. ప్రస్తుత కాలంలో ప్రవాసాంధ్రుల పిల్లలు ఎంతోమంది మాతృభాష నేర్చుకోడానికి ఉత్సాహంతో ముందుకు వస్తున్నారు. అంతేకాదు తెలుగు భాష నేర్చుకున్న ఈ పిల్లలు పద్యాలు, కవితలు, వ్యాసాలు రాస్తున్నారు..పద్య నాటకాల్లో పాల్గొంటున్నారు. రేడియోలో తెలుగు కార్యక్రమాలు ఇస్తున్నారు!

అయితే అన్ని సంస్థల లాగే తెలుగు బోధించే సంస్థలు కూడా ప్రారంభించిన కొద్ది కాలంలోనే, ఆశయాన్ని పక్కకు పెడుతూ అధికారాలకు.. పట్టుదలలకు… ప్రచారానికి ప్రాముఖ్యత నిస్తూ అసలు లక్ష్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారన్న సందేహం కలుగుతూ ఉంటుంది. 

అయితే మనం అందరం గుర్తుపెట్టుకోవలసిన ముఖ్య విషయం ఒకటి ఉంది. భాషను బెస్ మెంట్ లో నేర్చుకున్నా, దేవాలయానికి వెళ్ళి నేర్చుకున్నా, తెలుగుబడులలో చేరి నేర్చుకోవాలనుకున్నా పిల్లలకు ముందు ఇంట్లో “తెలుగు బీజం” పడాలి. ఆ బీజం సరిగ్గా ఉంటే తర్వాత పిల్లలు ఎక్కడ నేర్చుకున్నా అది చక్కని ఫలవంతమైన వృక్షంగా మారుతుంది. ఇప్పటి తరానికి మన మాతృభాష నేర్చుకోవడానికి, మన ఆచారవ్యవహారాలు అలవరచుకోడానికి అనుకూలమైన పరిస్థితులు, చక్కని అవకాశాలు వచ్చేసాయి. పూర్వం రోజుల్లోలా కాకుండా ఇప్పుడు ఇంటికి ఇండియా నుంచి తరచుగా వచ్చిపోయే పెద్దవాళ్ళు, టీవీలో తెలుగు ఛానల్స్, ఇంటర్నెట్, కుటుంబ సభ్యులతో స్కైప్ లు.. వీడియో కాల్స్ వీటన్నిటి వలన తెలుగు మాటలు వాళ్ళ చెవులకు తాకుతున్నాయి, తెలుగు పదాలు వారి నోట పలుకుతున్నాయి.

“వినికిడి” అనేది ప్రధానం. ఈ అమెరికా దేశంలో రెండో తరానికి చెందిన మా చిన్న మనవరాలితో నేను కొంతకాలం కిందట “లేఖా నీకు తెలుగు నేర్పుతాను నేర్చుకుంటావా?” అని అంటే తను వెంటనే “నాకు  తెలుగు ఆల్రెడీ తెలుసు” అంటూ “తప్పు, వద్దు” అన్న మాటలు చెప్పి ఇంకొకటి “ సరే ” అన్న పదం చెప్పింది. నేను “ఇవి నీకు ఎవరు నేర్పారు?” అని నేను అడిగితే, మొదటి రెండు మాటలు తను పుట్టినప్పటి నుంచీ నేను అంటుంటే విన్నదట! ఇక మూడో పదం వాళ్ళ అమ్మ ఎప్పుడు నాతో ఫోన్ లో మాట్లాడుతున్నా “సరే సరే” అంటుందని చెప్తూ “ఇన్నిసార్లు వింటుంటే, నాకు తెలుగు ఎందుకు రాదూ?” అని అంటుంటే ఆశ్చర్యంతో కూడిన ఆనందం వేసింది!  

ఏ సంస్థలైనా, భావితరానికి తెలుగు నేర్పించి వాళ్ళను ప్రగతి పధంలో నడిపించాలీ అంటే, ముందుగా పిల్లలకు   ఇంట్లో అటువంటి వాతావరణం, ప్రోత్సాహం ఉండాలి. వెనుకటి రోజులతో పోల్చుకుంటే “ప్రవాసంలో తెలుగు అక్షరం” విషయంలో చాలా అభివృద్ధి సాధించామనే చెప్పాలి!

.

‘ మనబడి ’ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “ బాలానందం ” పిల్లల రేడియో కార్యక్రమం ఈ క్రింది లింక్ లో……

.

.

— Dasika Syamaladevi

USA

.

___________________________________________________

ఈ రచన పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న comment box లో వ్రాయండి.

___________________________________________________