10_016 రమ్యమైనది రామనామం

.

రామనామ ప్రతాపంతో రాళ్ళు నీటిపై తేలాయి. రామనామ బలంతో వానరసేన రావణాసురుణ్ణి నుగ్గు చేసింది. రామనామ సహాయంతో హనుమంతుడు పర్వతాలు ఎత్తాడు. రాక్షసుల మధ్య ఉండి కూడా సీత పాతివ్రత్యం నిలుపుకోగలిగింది. భరతుడు 14 సంవత్సరాలు ప్రాణం నిలుపుకోగలిగాడు. ఎందుకంటే అన్ని ఏళ్ళు అతని కంఠం నుంచి రామనామం తప్ప మరో శబ్దం రాలేదు.

స్వాధ్యాయాదిష్ట దేవతా సంప్రయోగ ప్రయోగ దర్శనం

నామోచ్ఛారణతో సాక్షాత్ భగవత్ దర్శనం అవుతుంది. ఎవరి మనస్సయితే నిరంతరము భగవన్నామంలో  సంలగ్నమై వుంటుందో ఆ

భక్తుడికే నామ మహిమ అర్థమవుతుంది. ప్రియమైన, మధురమైన రామనామ స్మృతి చేత ఎవరి కన్నులైతే  ఆర్ద్రమవుతాయో, క్షణ క్షణము రోమాంచితమవుతూ వుంటుందో వారు నామ వియోగాన్ని భరించలేరు. ఒడ్డున పడ్డ చేప లాగా గిలగిలా తన్నుకొంటారు.

నామస్మరణచే విషయ వాసనలు సన్నగిల్లుతాయి. కామక్రోధాలు దూరమవుతాయి. మనసులో శాంతి వెల్లివిరుస్తుంది. ప్రాపంచిక స్పురణ తగ్గుతుంది. భోగాలపై వైరాగ్యం వస్తుంది. త్యాగరాజు అందుకే అన్నారు.

నామకుసుమములచే పూజించే నరజన్మము జన్మము మనసా శ్రీమన్మావసనామకుసుమములచే….

రామనామం మోహనకరమైనది. రామనామం ఉచ్చరించని వారు లేరు. రామనామ రసాస్వాదన చేసినవారు అన్నం లేకుండా ఉండగలరు గాని ధ్యానం లేకుండా వుండలేరు. జీవించినంత కాలం రామనామ రసాస్వాదన చేస్తూనే వుండాలి.

రామనామం మర్చిపోతేనే శరీరంలో రుగ్మతలు ప్రాప్తిస్తాయి. రామనామం తింటున్నప్పుడు, తాగుతున్నప్పుడు, మెలుకువలో, నిద్రలో, సుఖంలో, దుఃఖంలో స్మరిస్తూ వుంటే వారికి దుఃఖము, దౌర్భాగ్యము, ఆది వ్యాధులు రావు. ఆయుష్షు, ధన బలము రోజు రోజుకూ పెరుగుతూ వుంటుంది. పాపాలన్నీ నశించి అక్షయగతి ప్రాప్తిస్తుంది.

రామనామ వృక్షమునకు

రమ్యమైన పళ్ళు రా

దివ్యమైన పువ్వులు రా

భవ్యపరిమళమురా

వేసిన విత్తెప్పుడు మరి

కాదురా వృధా

జన్మజన్మలకు ఫలములు

జోలినిండ ఇచ్చునురా

.

ధన్యమగును బ్రతుకురా

స్పృశియిస్తే చాలునురా

స్వర్గసుఖము ఎందుకురా

నీడన తలదాల్చిన సరి

చెడిన బ్రతుకు చివురించును

మ్రోడుమనసు పుష్పించు

మోక్షఫలములందించు

కల్పవృక్షము వంటిదిరా

కామితార్థములిచ్చునురా

రామనామములో అనంతశక్తి ఉంది. రామనామం ఉచ్చరించిన వాళ్ళకి ఊర్థ్వ లోకాలు ప్రాప్తిస్తాయి. నమ్మినవాళ్ళకి నరక ప్రాప్తి వుండదు. ఆరాధించినవారికి అఖిల అభీష్టాలు నెరవేరుతాయి. రామనామం వ్రాసిన వారి నుదిటి వ్రాతలే మారిపోతాయి. రాముని మరిచినా రామనామం మరువరాదు.

“ రామనామాన్ని నేను మీకు ఎందుకు చెబుతున్నానంటే భారతీయులు దీనిని తరతరాలుగా పూజిస్తున్న నామం. ఇక్కడి వృక్షాలు, రాళ్ళు, పశువులు, పక్షులు రామనామంతో పరిచితులే ! ఇక మనుష్యుల సంగతి చెప్పాలా ! ధనుర్విజ్ఞానానికి వెళ్తూంటే రాముని చరణ స్పర్శతో రాయికి ప్రాణం వచ్చింది. రామాయణం చదివితే ఈ సత్యం తెలుస్తుంది ” – గాంధీజీ

కబీర్‌దాస్ కుమారుని పేరు కమాల్. ఒక వ్యాపారి కుష్టురోగంతో బాధపడుతూ రెండుసార్లు రామనామం తలవమని చెప్పాడు. అందుకు కబీరుకు కోపం వచ్చింది. “ నువ్వు వ్యాపారితో రెండు సార్లు రామనామం ఉచ్చరించమని నాకు కళంకం తెచ్చావు. రామనామం రెండుసార్లెందుకు ? ఒక్కసారే చాలు. త్రికరణశుద్ధితో రామనామం ఒక్కసారి పలికితే చాలు. నువ్వు ఆ వ్యాపారి దగ్గరకు వెళ్ళి నెత్తి మీద దుడ్డుకర్ర తో ఒక్కటి పెట్టు. గంగానదిలో నిలబడి శుద్ధ మనస్సుతో ఒక్కసారి నామం జపించమను. ఆ వ్యాపారి హృదయపూర్వకంగా ఒక్కసారి రామనామం పలికాడు. రోగం పూర్తిగా పోయింది.

కబీర్‌దాస్ కమాల్ ను తులసీదాసు వద్దకు పంపాడు. అతని ఎదుటనే తులసీదాసు తులసి ఆకు మీద రామనామం వ్రాసి ఆ ఆకు రసాన్ని అయిదు వందలమంది కుష్టురోగులపై జల్లాడు. అంతా బాగయిపోయారు. కబీరు మళ్ళీ కమాల్ ని సూరదాస్ దగ్గరకు పంపాడు. నదిలో కొట్టుకుపోతున్న ఒక శవాన్ని తీసుకురమ్మని సూరదాస్ కమాల్ని పంపాడు. కమాల్ శవాన్ని తెచ్చి అక్కడ ఉంచాడు. సూరదాస్ ఆ శవం చెవిలో ఒకసారి రామనామం పలికాడు. శవంలో చైతన్యం వచ్చింది. అది చూచి కమాల్ ఆశ్చర్యచకితుడయ్యాడు. రామనామ జపంతో అనంతమైన ఆనందము, జ్ఞానము, శాంతి, అమరత్వము తక్షణమే వస్తాయని నమ్మాడు.

కబీర్ అంటాడు “ ఎవరైనా  స్వప్నంలోనైనా సరే రామనామం జపిస్తే వారి ఉపయోగమైన శరీరం వలిచి జోళ్ళు కుట్టి ఇస్తాను. నామం ఉచ్చరిస్తే తమకు తెలియకుండా ఆథ్యాత్మిక శిఖరాలను అందుకొంటారు. లోక వాసనలు పోతాయి, ఆనందమగ్నుడవుతాడు. అమర అమృతాన్ని చవిచూస్తాడు. ఉన్మాదంతో ఊగిపోతాడు. రామనామ జపం భగవానుని సాన్నిధ్యాన్ని సాక్షాత్కారాన్ని లభింపజేస్తుంది. నామజపం చేసేవారు భాగ్యవంతులు. ఎందుకంటే వారు గర్భవాస నరకం నుంచి విముక్తులవుతారు. హనుమంతుడి తోకకు నిప్పుపెట్టినా అంటుకోలేదు. ఎందుకంటే రామనామంలో ఆయనకి అంత అద్భుతమైన విశ్వాసం వుంది. శీలపరీక్ష కోసం సతీమతల్లి సీతను అగ్నిప్రవేశం చేయించినా ఆమెను అగ్ని ఏమీ చేయలేకపోయింది. ఎందుకంటే ఆమెకు రామనామమే ఆధారం గనుక.

లంక అంతా హనుమంతుడు అంటించినా, అగ్నిలో దగ్ధమైనా విభీషణుని గృహం చెక్కు చెదరలేదు. విభీషణునికి రామనామంపై  విశ్వాసం చెక్కు చెదరనిది గనుక.

రామనామం జపిస్తుంటే మనస్సులో భక్తిసంబంధమైన ఆలోచనలు నదులలా ప్రవహించి పునీతం చేస్తాయి. మనస్సు యొక్క ఆలోచనా విధానం మారి కొత్త రీతులు ఉత్పన్నమవుతాయి. సాత్విక భావాలు చోటు చేసుకుంటాయి.

నామజపం చేత చిత్తములో శాంతి నెలకొంటుంది. శక్తి జనిస్తుంది. రాక్షస ప్రవృత్తిని అంతమొందిస్తుంది. ధృఢ సంకల్పాన్ని, ఆత్మసంయమనాన్ని ఇస్తుంది. నిరంతరము రామనామం చేయడం వలన చిత్తము అద్దము వలె స్వచ్చమవుతుంది. ఉన్నతమైన పవిత్ర భావాలు వస్టాయి. సంస్కారం ఉత్పన్నమవుతుంది. మనిషికి కావల్సిన పద్ధతిలో జీవించగల్గుతారు.

మంచి ఆలోచనలు, పవిత్రమైన భావాలు ధారణ చేసే శక్తివంతుడైతే అతని మనస్సులో అవే భావాలు నిరంతరము చోటు చేసుకొంటాయి. దాంతో అతని జీవన సరళి మారిపోతుంది. ఒకే పనిని మాటి మాటికీ ఆవృత్తి చేస్తూ వుంటే అది ఒక అలవాటయిపోతుంది. నామజపోచ్చారణ వలన దివ్యమైన భావాలు కలిగి, ధ్యాన మగ్నుడై దైవత్వ సిద్ధి పొందుతాడు. పూజారి, పూజనీయుడు ఏకమవుతారు. ఆత్మ పరమాత్మలో లీనమవుతుంది. అదే సమాధి, అదే పూజ, అదే ఆరాధనా. అదే నామస్మరణ ఫలం.

మానసిక జపం రోగాలకు ఔషధి వంటిది. శరీరానికి తిండి ఎంత అవసరమో – మనస్సుకి జపం అంతే అవసరం అని తెలుసుకోవాలి. మహాత్ముడు ఇలా అన్నాడు “ నువ్వు తినకుండా బతకలేవు గాని కేవలం నామం ఆధారంగా బ్రతుకగలవు. అంతఃకరణ పీఠిక పైన స్రవించే అమృతజలం నామస్మరణ ద్వారా లభించేది. దానితో బతకగలవు. నశ్వరమైన ఈ జీవితానికి అది పెట్టనికోట. న్యూనమైన భావాలు మనస్సులో వస్తుంటే కనిపెట్టి వాటిని బయిటికి తోలే ప్రయత్నం చేసి మనల్ని సురక్షితం చేస్తుంది నామం. మనం తెలిసి చేసినా తెలియక చేసినా ఫలితం ఇస్తుంది. ఒక మంచి కబురు విన్నపుడు మనసు హాయిగా వుంటుంది. అదే ఒక కఠోరమైన భీకరమైన మాట విన్నపుడు చలించిపోతాం. సామాన్య శబ్దాలకే ఇంత శక్తి వుంటే రామనామం సామాన్యమా ! మనస్సులో నాటుకుపోయిన రాక్షస ప్రవృత్తిని కూకటి వేళ్ళతో పెకలించి పారవేసే శక్తి రామనామానికే వుంది. ”

“ భక్తుల ప్రాణాధారమైన ‘ రా ’ ‘ మ ’ అనే రెండక్షరాలు వర్ణమాలకి రెండు కళ్ళ వంటివి. సులభంగా ఉచ్చరించగలిగేవి – సుఖమునిచ్చేవి. రామనామస్మరణతో ఇహలోకమే కాదు పరలోకంలో కూడా లాభం ప్రాప్తిస్తుంది.

జన్మ మృత్యురూప సంసార కరాళ దంష్ట్రల లోంచి విముక్తినిచ్చే రామనామ ఉచ్చరించని వారున్నారంటే ఏం చెప్పాలి ? దుర్మార్గంతో ప్రవర్తించే మానవులు రామనామం స్మరించడానికే వెనుకాడతారు. రామనామాన్ని మించిన అధిక శక్తి ఎవరిస్తారు ? పాపాలను దూరం చేస్తుంది, కోరికలు తీరుస్తుంది. మోక్షాన్నిస్తుంది. వివేకవంతుడెవరైనా రామనామాన్ని వదలడు. సత్యాన్ని గుర్తించిన మహానుభావులందరూ ఘట్టిగా నొక్కి చెబుతున్నారు. రామనామ రసాస్వాదన చేయని జిహ్వా జీహ్వే కాదని రామనామం జపించే వారికి విపత్తులు రావు. అగ్ని పత్తిని దగ్ధం చేసినట్లు రామనామం పాపాన్ని పరిహారం చేస్తుంది. సర్వ కళ్యాణమయి రామనామాన్ని సదా జపించండి ”  – వ్యాసుడు

రామనామ మణిదీప ధరుజీహ దేహర ద్వారా తులసీ భీతర బాహిరే హుజెంచాహసి ఉజియార్ 

బాహ్యాంతరాలలో వెలుగు కావాలంటే ముఖం అనే ద్వారం వద్ద నాలుక అనే ప్రాంగణంలో రామనామమనే మణి దీపాన్ని వెలిగించు.

మహామంత్రజో ఈ జపతపమహిమ

కాశీముకుతి హేతు ఉపదేశ

మహిమాజాసు జానగనరావు –

ప్రథమ పూజియత్ నామ ప్రభా ||

మహేశ్వరుడు శివుడు జపించేది, ముక్తికి కారణమైందని కాశీలో శివునిచే ఉపదేశించబడింది – గణేశుడు ప్రథమంగా పూజింపబడడానికి రామనామ మహిమ గణేశుడు గుర్తించడమేనని. అది మహామంత్రము.

మరా మరా అని జపించిన వాల్మీకి పవిత్రుడయ్యాడు. ఒక రామనామం సహస్ర నామాలకి సమానం అని శివుడు వచించడం చేత పార్వతి కూడా రామనామం జపిస్తుంది.

భక్తుల శ్రేయస్సు కోరి శ్రీరామచంద్రుడు మనుష్య శరీర ధారణ చేసి స్వయంగా కష్టాలు పడి సాధువులకి సుఖం పంచి పెట్టాడు. భక్తులు ప్రేమగా పిలుస్తూ తమ దేహాలనే దేవాలయాలు చేసుకొన్నారు. ఇంతమంచి రామనామానికి జోహారులు. భక్తులకు శాంతి, సుఖము, అమృత రసాస్వాదన చేసే రామనామం ధన్యమైంది. నామస్మరణ మరువకండి.

Tatavarthy Gnanaprasuna

Hyderabad

Mobile : 9866004072, Mail Id tatavartig@gmail.com

.

************************

.

____________________________________________________

ఈ రచన పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న comment box లో వ్రాయండి.

______________________________________________________