శ్రీ ప్లవ నామ సంవత్సరం ఆరంభమైంది. కాల షట్చక్రంలో 35వ సంవత్సరం. ఊహించని విధాన ప్రపంచపు తీరు తెన్నులు తారుమారై జన సముద్రాన్ని సంక్షుభిత చేస్తున్నాయి. కేవలం ఒక సూక్ష్మ క్రిమి అశేషజన వాహినిని అల్లకల్లోలం చెయ్యగలిగింది. ఈ పరిస్థితిని ఎదుర్కునే విధానం ఆర్షజన సందేశానుసారం తెలియాలి. సాంకేతిక పరిజ్ఞానం, అంతర్జాల విజ్ఞానం, శాస్త్ర పరిశోధనా రీతులు కొంతవరకే చెప్పగలవు. ఈ స్థితి ఆది భౌతికమూ, ఆధిదైవికమూ కూడా అయినందున. భయరోగమనస్తాపాల నివారించి, యోగ క్షేమాల నందించగలవారు ఋషులు మాత్రమే. వారు మనం పుట్టక పూర్వం ఉన్నారు. మనలోనూ ఉన్నారు. మన మధ్యనూ ఉన్నారు…. మన తర్వాతి కాలంలోనూ ఉంటారు. ఆ సంస్కృతి రహస్యాలు తెలిస్తే మనతోఉంటూ మన మధ్యనున్న వారెవరో తెలుస్తుంది. శుద్ధ సత్యానికీ, సాపేక్ష సత్యానికీ ఉన్న బేధం తెలుస్తుంది. ప్రాణం విలువ, ఆరోగ్యం విలువ, జన్మ సార్థకత అర్థమవుతాయి. ఋషుల స్మరణ, గురుజనుల సందేశం, కొందరు విశిష్ట జీవుల చరిత్ర, మనమంతా మరోసారి మనలో మనం చెప్పుకుని సంయమనం సాధిద్దాం.
మనకి కుశాగ్ర బుద్ధి కావాలి. రసైక మతీ కావాలి. కాలంతో, స్థలంతో సంబంధం లేకుండా, తర తమ బేధాలు లేకుండా అన్ని వేళలా కావాలి. భావ విలసనకీ, భావ వికసనకీ భాష, సాహిత్యం, సంస్కృతి, కళ ముడిపదార్ధాలు. వీని సంపూర్ణ స్వరూపం, ప్రయోగం, ప్రయోజనం తెస్తే ఫలం సుసాధ్యం.
అంటే అవి దర్శనం కావాలి. దర్శనం అవటం అంటే ఏమిటి ? ” దృశ్యతే అనేన ఇతి దర్శనమ్ ” ఈ వ్యుత్పత్తి అర్థం ప్రస్తుతం వ్యాసానికి కేంద్రం. దేని వలన చూడబడుతోందో అది దర్శనం అని భావం. చూస్తున్నది ఏది ? దేనిని ? ఏది చూడబడుతోంది ? ఏమవుతోంది ? ఫలం ఏమిటి ? ‘ జ్ఞాత- జ్ఞేయం – జ్ఞానం ‘ – knower – known – knowledge ‘. ఈ విషయాల గూర్చిన చర్చ సులభం కాదు. విషయం చాలా గహనం.
ఇక విషయానికి వస్తే చూడబడేది ఏది ? సత్యం, లోకం, మనుష్యులు, వస్తువులు, ప్రాణికోటి, రోదసి, నక్షత్ర గ్రహ తారా పుంతలు, ఇంత ఎందుకు విశ్వం, అందులో ఉన్న పదార్థాలు నిజ స్వరూపం, యదార్థత్త్వం, స్వభావం, తత్త్వం. సర్వమూనూ దర్శనాన్ని ‘ తత్త్వజ్ఞానం ‘ అని కూడా చెప్పవచ్చు.
మనన పూర్వకంగా, విమర్శనాత్మకంగా, ప్రతీ దానినీ ముందు అవలోకన, ఆ పైన పర్యాలోకన, విశ్లేషణ, సిద్ధాంత ప్రతిపాదన జరుగుతాయి.
జీవన విధానాన్ని, జీవిత పరమార్థాన్నీ నిర్ణయించి చెప్పేవారు కావాలి. ఆ సూత్రాలు కాలానికి నిలబడాలి. ఆ నిర్ణయాలలో ద్వైదీ భావం అంటే ఔను – కాదు అనే విచక్షణతో కూడిన సూత్రం కాక, నిత్యమై, సత్యమై ఉండే సూత్రం కావాలి. ఏకత, ఏకసూత్రత ఉండాలి. అప్పుడే అది ధర్మంగా పరిగణన పొందుతుంది.
ఆ రహస్యజ్ఞాతలే ఋషులు, యోగం తో సాధించారు. నియమంతో, నిత్యానుష్ఠానంతో, దీక్షతో, ప్రపత్తితో జ్ఞానం సముపార్జించారు. ఆ విధానం లోకానికి చెప్పారు. పూర్వం వారు దీనిని ఒక సమగ్ర విద్యగా తీర్మానించారు.
ఆ విద్య పేరు ‘ అన్వీక్షకీ విద్య ’. ఈ విద్య సర్వ విద్యలకీ ప్రదీపం. సర్వ కర్మలకీ ఉపాయం. సర్వ ధర్మాలకీ ఆశ్రయం. ఈ సిద్ధాంతం అర్థ శాస్త్రం లో ఉట్టంకింపు పొందింది. ఆరంభంలో చెప్పిన కుశాగ్ర బుద్ధికీ, రసైక మతికీ, సుఖానుభూతికీ రాజమార్గం. ‘ దర్శన’ మనే శాస్త్రానికి ఈ విద్య కావాలి. అంటే ఈ శాస్త్ర మార్గంలో అధ్యయనం చెయ్యటం వలన దర్శనం సిద్ధిస్తుంది. ఒకప్పటి కాలంలో,సమాజంలో సాంఘికాభివృద్ధికి వర్ణధర్మం హేతువైతే, వైయక్తిక సమున్నతికి ఆశ్రమ ధర్మం సాధనం. ఇప్పటి రోజులలో అవసరంలో మార్పు లేదు. మార్గాలలో మార్పు వచ్చింది. ఆనాటి దర్శనాలు ఈనాడు ఎంతవరకు ప్రయోజన కారులనేది ప్రస్తుత చర్చలో భాగం.
సమాజం ఉన్నప్పుడు పాలనలు, పరిపాలనలు, ప్రభుత్వాలు, అధికారాలు, నీతి శాస్త్రాలు, సిద్ధాంతాలు, శిక్షలు, రాజకీయాలు, తంత్రాలు, కుతంత్రాలు, సంపూర్ణాధిపత్య విధానాలు, రాజ్యాంగాలు, ప్రణాళికలు, యుద్ధాలు, పతనాలు ఏవీ తప్పవు. సమస్యలు జనావసరాల బట్టీ, కాలాన్ననుసరించీ ఉంటాయి.
విజ్ఞులు పరిష్కార మార్గాలు అందిస్తూనే ఉన్నారు అన్నీ ఉన్న మనకి వివరించటానికి గ్రంథాలు శాస్త్రాలు ఉన్నాయి. వేల సంవత్సరాల పూర్వమే సంస్కృత భాషలో శాస్త్రాలన్నీ వెలిసాయి. ఆ సిద్ధాంతాలు అవిచ్చిన్నంగా నిలిచి ఉన్నాయి. ఎన్నో తరాల, శతాబ్దాల అవిచ్చిన్న ప్రయత్నమో జరిగి ఉండాలి. ఇంతటి కాలాతీత శక్తిని కలిగి మానవ భావ సిద్ధాంతాలని నిలిపి ఉంచగలగడానికి, ఆ భాష పదివేల సంవత్సరాల నుంచి ఆ బలాన్ని ప్రదర్శిస్తోంది. ఆర్ష సిద్ధాంతాలకు సంస్కృతమే ఆలంబన. భాషను ఒక దివ్యమైన శక్తిగా పరిగణించారు. ఈ దర్శన భాగ్యం పొందిన మహనీయుల్ని, వారి చరిత్రని ప్రస్తుత కాలంలో మనం కొంతైనా స్మరించుకుంటే కాలానుగుణం గా మనం ఆ ఫలాన్ని పొందినవారమవుతాం.
పురోహితమవటానికీ, మహోదయం దర్శించ వీలు ఎప్పటికప్పుడు కలుగుతుంది.
ఈ ప్రయత్నంలో సందేహాలు అనేకాలు రావచ్చు. అనుమానాలు వెంట పడవచ్చు. నమ్మకం సడలవచ్చు.
ఇతర ప్రపంచ భూభాగాలలో వచ్చిన భాషలతో పోల్చుకుంటూ పోతే, ప్రభావితమవుతూ మార్పులకీ చేర్పులకీ లోనవుతూ, రాజకీయ బానిసత్వం లో నిర్వీర్యమవవచ్చు. మన సంప్రదాయం మీద అవగాహన తక్కువవటం వలన భారతదేశంలో జరిగినదదే. రెండు సహస్రాబ్దాల కాలంపాటు జాతి నిర్బలమయిన వైనం చూస్తున్నాం. మనకీ రోజున కూడా సంస్కృత గ్రంథాలు, శాస్త్రాలు లభ్యమవుతున్నాయి. విజ్ఞులు, విద్యావేత్తలు, భాషావేత్తలు ఉన్నారు. ప్రతివాదులూ ఉన్నారు. అధికారంలో ఉన్న ప్రభుత్వ నిరంకుశ నియమాలకి ఈనాడు నాస్తికవాదులు అనే వర్గం లో ఉన్న ప్రతివాదులు పాశ్చా త్య సంస్కృతినీ అనుసరిస్తూ అనుకరిస్తూ, ధన సమృద్ధి తో బలోపేతమవుతూ పునాదులని సమూలంగా పెకలిస్తున్నారు. సంస్కృత భాష, పూర్వ శాస్త్ర గ్రంథాలు, దర్శనకారుల సిద్ధాంతాలు, మహర్షుల విద్యావిధాన మర్మాలు అంతా అబద్ధమని ప్రకటిస్తూ ఉద్యమిస్తున్నారు. ఆర్షుల పుట్టుపూర్వోత్తరాలు, ఆ నాగరికతలు కల్పనలనీ, వారి ప్రతిపాదనలు వ్యర్థమనీ, వారి చరిత్ర ఇప్పటి మన నైతిక విలువల చట్రంలో ఇముడదనీ, మన ప్రయోజనానికి, ప్రయోగాలకి పనికిరాదనీ అనుకుంటూ, అంటూ, బేరీజు వేస్తూ యువత జన జీవనాన్ని వ్యర్థ గతి పాలు చేస్తున్నారు. ప్రజా జీవన సౌధం కూలిపోకముందే ప్రభుత్వమూ ప్రజా కూడా కళ్ళు తెరవాలి. ప్రతీ దశలో ప్రతీ తరం మన ఋషి సంపదని దర్శించాలి. చర్చించాలి, అభ్యసించాలి.
” నమః ఋషిభ్యో మంత్రకృద్భ్యో మంత్రం పతిభ్యో
మామామృషయో మంత్రకృతో మంత్రపతయః
పరాదుర్మాహ మృషీ న్మంత్రకృతో మంత్రపతీ న్పరాదామ్ “
ఋషులకు నమస్కారము, మంత్రం కర్తలకు నమస్కారము
మంత్రం ద్రష్ఠలకు నమస్కారము మంత్రం పతులకు నమస్కారము.
నేను వారియందు ప్రపత్తి కలిగి విడువక ఉంటాను
నేను వారిని విడువక వారి ధర్మాచరణ పాటిస్తాను .
నన్ను ఋషులును విడవకుందురుగాక. గురుకృప నాకుండుగాక !
ఇటువంటి సూక్ష్మ దృష్టి, ఋషి దృష్టి, కలిగి ఉంటె ఏకాగ్రత సిద్ధిస్తుంది. క్రమశిక్షణ ప్రాప్తిస్తుంది.
కార్యాచరణలో నిమగ్నత కలుగుతుంది. జ్ఞానయోగ మార్గమిది అని ఆర్షవాక్కు. జ్ఞానులు యోగులు, సాధకులు గురువులు మనకు అతి సామీప్యంలో ఉండి మనని నడిపిస్తూ ఉంటారు. ఆ విషయం తెలియాలి . అవగాహన కలగాలి. విశ్వాసం పెరగాలి. వారి చరిత్రలు, వారి దృష్టి, మన ఏ కాలమైనా తెలుసుకుని తీరాలి. పెద్దల దగ్గర వినాలి. తదేక చింతనతో ఉండాలి. నిత్యజీవనం లో ఉంటూనే ఆ భావన లో నిలవాలి.
తల్లిదండ్రులు సంతానాన్ని పెంచేటప్పుడు తమ శక్తిమేర ఆ మార్గం లో నడిపిస్తారు. ఆపైన గురువుల వద్ద చేరుస్తారు. కాలం మారినా, విధానాలు మారినా, జీవన సూత్రం మారదు. భారతీయమైన సంస్కృతి కేవలం ఒక భూభాగానికి పరిమితం కాదు. కానీ భారతదేశమనే భూభాగం లో యుగాలపాటు విస్తరించి తరతరాల జనావళికి మార్గగామి అయింది. ఆ ఋషి మార్గం తరిగిపోని ఆధ్యాత్మిక సంపత్తిని అందించింది.
ఆ ఆద్యాత్మికతే ఇరవై ఒకటవ శతాబ్ది కాలం లో మరోసారి ఉదయిస్తోంది. నిజమైన అరుణోదయకాలమే !
సృష్టి రహస్యం తెలుసుకోవాలనుకునే వారికందరికీ ఋషుల చరిత్రలు, యోగుల జీవిత వివరాలు, ఉపాసకుల దీక్షావిధానాలు, గురువుల త్యాగనిరతి తెలియాలి. వారు సృష్టి కథ, రహస్యం తెలిసి, కేవలం వారి కర్తవ్యమమే కాక వర్మను జనుల కర్తవ్యం, భవిష్యత్తు తరాల కర్తవ్యం తెలిసి మనకి ఆధ్యాత్మిక శాస్త్రాలని అందించారు. సంఘ జీవనానికైనా, రాజకీయ మర్మాలకైనా, పరిపాలనా దక్షతకైనా, ఆరోగ్య సూత్రాలకైనా, జ్ఞాన సంపాదనకైనా, భోగ విలాస జీవనానికైనా శాస్త్రం ఉంది. శాస్త్ర రహస్యాలని తెలుసుకునే అధ్యయ అధ్యాపన విధానాలనే, ప్రథాన పాతన మార్గాలనీ, ప్రయోగ అన్వయ, వినియోగమార్గాలనీ కూడా వారు చెప్పారు. యుగాల క్రితం ప్రకటమైన శాస్త్రాలలో సంగతులు అంతా కాకపోయినా, ప్రస్తుత కాలానికి ఉపయోగపడే విషయాలని ఎలా వినియోగ పరచుకుని ఫలసిద్ధి పొందాలో వారే స్పష్టం చేశారు. వారి ప్రణాళికలు తెలియాలి. ఆ మార్గం ధర్మమార్గమని తెలిసి విద్యగా నేర్వాలి.
మన సంప్రదాయాలని ఈనాటి వరకు నిలబెట్టి, ఉత్తేజం కలిగిస్తూ, ప్రేరణ నిస్తూ, త్యాగధనులైన తపోధనులు ఎందరెందరో వారిని గూర్చి ముందుముందు రానున్న వ్యాసాలలో మీముందుకొస్తాయి. ఋషి ధ్యానం మనకందరకూ ఆయురారోగ్యాలనిచ్చుగాక !
.
— Dr. Saradapurna Sonty
USA
Mail id : saradasonty@gmail.com
*********************************************
.
___________________________________________________
ఈ రచన పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న comment box లో వ్రాయండి.
_____________________________________________________