10_016 తెలుగింట కళాభ్యాసం

.

సంస్కృతి ఒక కుటుంబాన్ని, ఒక దేశాన్ని, ప్రపంచాన్ని రక్షిస్తుంది. మనుషులు వక్రమార్గంలో ప్రయాణించకుండా ఆరోగ్యవంతమైన జీవనాన్ని అలవరుస్తుంది. భారత సంస్కృతిలో ఒక భాగమైన శాస్త్రీయ సంగీతం, భరతనాట్యం, చిత్రలేఖనం మొదలైనవి ప్రపంచ దేశాల్లో ఉన్న ఆ కళలతో పోలిస్తే అనుభూతి ప్రధానమైనవి. ఉత్తర భారతం లో ఉన్న హిందుస్థానీ సంగీతమైనా…  దక్షిణ భారతదేశంలో ఉన్న కర్ణాటక సంగీతమైనా…  వాటిని సాధన చేసేవారికి… వినేవారికి ఎనలేని సంతోషాన్ని… శాంతిని ప్రసాదిస్తాయి. ప్రాచీన కాలంనుంచీ భారతదేశపు కుటుంబాలలో సంగీతసాహిత్యాల పట్ల ఒక ప్రత్యేకమైన గౌరవం.. భక్తి ఉన్నాయి. ప్రతి కుటుంబంలోనూ తల్లిదండ్రులు తమ పిల్లలకు సంగీతం, సాహిత్యం, నృత్యం లేదా ఇతరమైన లలిత కళలను గానీ పరిచయం చేయడంలో ఎంతో ఉత్సాహాన్ని, శ్రద్ధను కనబరిచేవారు. నా బాల్యంలో చాలా ఇళ్లలో హర్మోనియం గానీ, వీణ గానీ ఉండేవి. మంచి వారపత్రికలు, మాస పత్రికలూ దర్శనమిచ్చేవి. కొన్ని ఇళ్లలో ఎవరో ఒకరు సంగీత వాయిద్యాల్లో గానీ, గాత్రంలో గానీ శిక్షణ పొందుతూ ఉండేవారు. మన తెలుగింట ఆడపిల్లలకు పెళ్లిచూపులు జరిగే సందర్భాలలో ‘ అమ్మాయికి సంగీతం ఏమైనా నేర్పించారా? వీణ వాయిస్తుందా ?  పాడుతుందా? ‘ అని అడిగేవారు. ఇది గత వైభవం.

.

దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక సంగీతానికి తమిళనాడు రాష్ట్రంలో ఎక్కువ ఆదరణ ఉంది. అక్కడ శాస్త్రీయసంగీతం పట్ల ఒక కుటుంబపరమైన సంస్కారం… అవగాహన ఉన్నాయి. అందుకే తెలుగింట పుట్టిన లబ్దప్రతిష్టులైన అనేకమంది కర్ణాటక సంగీత విద్వాంసులు వీణ చిట్టిబాబు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, మాండొలిన్ శ్రీనివాస్ లాంటివారు మద్రాసు నగరంలో స్థిరపడ్డారు. ఇప్పటికీ అక్కడ ఆ ఆదరణ అలాగే కొనసాగుతోంది. 

.

మన తెలుగింట కూడా… దశాబ్దాలక్రితం ఆయా ప్రాంతాల్లో జరిగే సంగీత సభలకు పెద్దలతో బాటు పిల్లలు, యువకులు హాజరయ్యేవారు. ఇళ్లలో అడపా దడపా రేడియోల్లో వచ్చే శాస్త్రీయ సంగీతం వినేవారు. ఫలితంగా.. 

ఆ ప్రాంతాల్లో వుండే సంగీతపరమైన వాతావరణం మనుషులపై ఎంతో కొంత ఆరోగ్యవంతమైన ప్రభావం చూపించేది. పాఠశాలల్లో… కళాశాలల్లో జరిగే వార్షికోత్సవాల్లో శాస్త్రీయసంగీతపు పోటీలు ఉండేవి. ఆ కాలపు తెలుగు సినిమాల్లో కూడా తరచూ వీణ వాయిస్తూ పాడే పాటలు దర్శనమిచ్చి… మనసులో ఒక పవిత్రమైన భావన కలుగజేసేవి. 

.

అయితే ఆరు దశాబ్దాలుగా ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. విద్య యొక్క ప్రాధాన్యత పెరిగి, సాంకేతిక అభివృద్ధి ప్రతి ఇంట్లోకి  ప్రవేశించడం వలన తల్లిదండ్రులు తమ పిల్లలు విద్యా ప్రగతిలో వెనుకబడతారు అనే భావనకు లోనవుతున్నారు. సంగీతం, భరతనాట్యం, చిత్రలేఖనం లాంటి కళలు చదువుకు ఆటంకమేమో అనే ఆలోచనకు లోనవుతున్నారు. ఆధునిక విద్యారంగంలో తమ పిల్లల్లో పోటీ తత్వాన్ని పెంచే ప్రయత్నంలో… వారిని శాంతిమయజీవనానికి దూరం చేస్తున్నామనే సత్యాన్ని విస్మరిస్తున్నారు. కానీ చాలామంది పిల్లలు మొబైల్ ఫోన్లతో, చాటింగ్ లతో, ఇంటర్నెట్ తో, వాట్సప్ తో, ఫేస్బుక్ తో… ఎక్కువ కాలాన్ని వృధా చేస్తున్నారు అనే విషయాన్ని వారు విస్మరించడం విచారకరం. 

.

ఇవేమీ చదువుకి ఆటంకం కానప్పుడు లలితకళాభ్యాసం చదువుకి ఎలా ఆటంకమవుతుంది అన్న విషయం వాళ్ల జ్ఞానానికి తట్టదు! తెలుగింట పుట్టిన నేటి తరంలో ఎంతమందికి విశ్వనాధ వారి వేయి పడగలు, కృష్ణ శాస్త్రి భావుకత, శ్రీశ్రీ మహాప్రస్థానం, నండూరి సుబ్బారావు గారి ఎంకి పాటలు, బాలమురళిగారి తత్వాలు, వీణ చిట్టిబాబు కోయిల పాట, బాలసరస్వతి మధురగానం, శోభానాయుడి కూచిపూడి నృత్యం, ప్రసిద్ధ తెలుగు చిత్రకారుడు దామెర్ల రామారావు ల గురించి తెలుసు ?

సంగీతం లాంటి లలితకళలకు పిల్లల్ని దగ్గర చెయ్యడం, సంగీత, సాహిత్య, నృత్య సభలకు పిల్లలు హాజరయ్యేలాగ చెయ్యడం, టీవీ లో ప్రసారమయ్యే మంచి సంగీత, నృత్య కార్యక్రమాలు చూడడం అనేది ఒక కుటుంబపరమైన యాక్టీవిటీ గా మలుచుకోవడం లాంటివి… తల్లిదండ్రుల బాధ్యత! ఇవి పిల్లల మనసుల్లో సంస్కారాన్ని, సంస్కృతిని నింపుతాయనడంలో సందేహం లేదు. 

అమెరికా సంయుక్త రాష్ట్రాల్లాంటి దేశాల్లో లలితకళలు చదువులో ఒక భాగం. అక్కడ సంగీతం లో ఏదో ఒక వాయిద్యాన్ని యాన్సిలరీ సబ్జెక్టు గా తీసుకోవాలి. కానీ మన భారతదేశంలో సంగీతం ఒక ప్రత్యేకమైన కోర్స్ గా చెయ్యాలి తప్ప… నిత్య విద్యాభ్యాసంలో ఒక భాగంగా ఉండడం లేదు. 

సమాజంలో హింసా ప్రవృత్తి, అనాచారాలు, అరాచకాలు పెరిగిపోవడానికి కారణం…. కేవలం విద్యను యాంత్రికం చెయ్యడమే ! విద్యాభ్యాసమనేది… రేపటి ఆరోగ్యవంతమైన, సంస్కారవంతమైన సామాజిక నిర్మాణానికి దోహదం చెయ్యాలన్న బలమైన సంకల్పం ప్రభుత్వానికి, విద్యాలయాలకు, తల్లిదండ్రులకు వుండాలి. ముఖ్యంగా మన తెలుగింట శాస్త్రీయ కళల పట్ల సరైన అవగాహన ఉండడం లేదు. మన తెలుగు సంస్కృతికి దర్పణాలైన జానపద కళలు, సంగీతం, సాహిత్యం, కూచిపూడి, భరతనాట్యం, చిత్రలేఖనం లాంటి కళలను విద్యలో అవసరమైన విభాగాలుగా చేర్చాలి. అప్పుడు పూర్వ వైభవం పునరావృతమవుతుంది. “పాడుతా తీయగా” లాంటి రియాలిటీ షో ల ద్వారా పాత తరం మధురగీతాల్ని ఈతరం యువత సాధన చేయగలిగారు. అలాగే అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి సినిమాల వలన ఎక్కువమంది యువతకు ఆ కీర్తనల విశిష్టత అర్ధమైంది. మన శాస్త్రీయ, లలిత, జానపద కళల్ని యువతకు పరిచయం చేయడంలో మీడియా ప్రముఖమైన పాత్ర పోషించవలసిన అవసరం ఎంతైనా వుంది. ఒక్క దూరదర్శన్ సప్తగిరి ఛానల్ తప్ప మిగిలిన ఛానెల్స్ ఈ విషయంలో శ్రద్ధ వహించడంలేదు. ప్రతీ టీవీ ఛానల్ బాధ్యత వహించి  మన తెలుగింట శాస్త్రీయకళల్ని పోషించడానికి విధిగా కొంత సమయాన్ని కేటాయించాలి. ఈ ఉగాది సందర్భగా అటువంటి  సాంస్కృతిక, శాంతిమయ, ఆరోగ్యవంత సామాజికాభివృద్ధికి ఆహ్వానం పలుకుదాం. 

.

*************************************************

.

Nagesh babu: Veena Vidwan

Poet (Telugu&English)

Retd.Lecturer in English

Kakinada

Mob:9849439170, Mail: nageshbabuveena@gmail.com, Web site:veenanageshbabu.blogspot.com

.

__________________________________________________

ఈ రచన పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న comment box లో వ్రాయండి.

___________________________________________________