10_016 తెలుగు సాహిత్యంలో వర్ణనలు

.

మన సాహిత్యం ఎంతో వైవిధ్యభరితమైనది. వర్ణనాత్మకమైనది. సౌందర్యభరితమైనది. ఎందరో కవులు ఎన్నో అద్భుతమైన కల్పనలను సృజించి సాహిత్యాన్ని పరిపుష్టం చేశారు. మాధురీభరితం కావించారు. ‘ వర్ణనా నిపుణః కవిః ’. ఎన్నో వర్ణనలతో పాఠక హృదయాలను రంజింపజేశారు. సుసంపన్నమైన సాహిత్యంలోని వర్ణనలలో మచ్చునకు కొన్ని మనం పరిశీలిద్దాం.

అయ్యలరాజు నారాయణామాత్యుడు అనే కవి “ హంసవింశతి ” అనే కావ్యం రచించాడు. అందులో ఎద్దును వర్ణిస్తూ ఎద్దుకు అలంకరించిన ఆభరణ విశేషములను, వస్త్ర విశేషములను ఉత్పలమాల పద్యంలో వర్ణిస్తాడు నారాయణామాత్యుడు.

.

మోరకసీదు పట్ట మొగముట్టు తలాటము జల్లుపేరు చిం

బోరయుఁ గంచుకుప్పెలును బూదెలగొల్సును పెద్దగంట సిం

గారపు దృష్టిదండ మెడ గజ్జల పేరులు నందెలొప్ప లా

వేరిని దొక్క పస్సె యెకిరింత మహోక్షము పోల్చు వానికిన్

.

కసీదు అంటే బుటా పనితో తయారుచేయబడిన వస్త్రం. దానిని ఎద్దు ( మోరకి ) మెడకి కట్టారు. ముఖభాగానికి మణులు పొదిగిన పతాకం ( మొగముట్టు ) అలంకరించారు. ఈ పతాకానికి కలికితురాయి ఉంది. మణులు, ముత్యాలు దట్టంగా పొదిగిన హారం ‘ జల్లు పేరు ’ అంటారు. మెడకో, కొమ్ములకో అలంకరించారు. చింబోర అనే పేరు గల ఆభరణాన్ని కూడా ఎద్దుకు అలంకరించారు. చెవులకి కంచుతో చేసిన కుప్పెలు ఉన్నాయి. పూసల గొలుసులు కూడా ఉన్నాయి. మెడలో ఒక పెద్ద దండ వేలాడుతోంది. ఇంత అలంకరణలో ఉన్న ఎద్దుకి దిష్టి తగలకుండా మరొక దృష్టి దండను కూడా అలంకరించారు. చిరుగజ్జెలు పొదిగిన మెడ పట్టీలు, నడుముకి కూడా అలంకరించారు. కాళ్ళకి మువ్వల అందాలున్నాయి. వీటన్నింటిలో బాగా బలిష్టమయిన పస్సె ( పశువు ) గొప్ప ఎకిరింత అనగా వాహనము ఆర్భాటంగా అలంకరింపబడినది. మహోక్షము అనగా ఎద్దు వర్ణనము ఈ పద్యంలో సంప్రదాయసిద్ధంగా గ్రామసీమలలో చేసే అలంకరణ కన్నులకు కట్టినట్లు చేసిన వర్ణనమిడి. అలంకరణ విశేషములన్నీ కొత్త పదములతో వర్ణించడం జరిగింది. ఈనాటి వాడుకలో కనుమరుగవుతున్న పదసంపద ఇటువంటి వర్ణనలతో మనకి లభించడం అదృష్టం.

భాస్కర రామాయణంలో యుద్ధకాండలో వీరత్వంలో విజృంభించిన వానరసేనను మహాసముద్రంతో పొలుస్తో చేసిన చక్కని సీసపద్యం…..

సీ||       పృథులహాసంబులు పెన్నురువులభంగి

                        బఱపు వలములు ప్రవాళలతల

            కైవడిఁ జెలువార ఘనబాహుశాఖలు

                        బహుళవీచీపరంపరల కరణి

            విలసిల్ల నుద్భట వీరసంచారము

                        ల్కుటిలతర గ్రాహ ఘోరగతుల

            చాడ్పున నొప్పార సందడి పలుకుల

                        యులినఖండధ్వని యోజనిగుడ

తే. గీ.||  వివిధ వాహినీ సంగతి వెలయని నినజు

            నాఙ చెలియలికట్టయై యడరరామ

            చంద్రునుదయ ముదంచితోత్సముఁజేయ

            నొప్పెకపిబలోద్ధతి వార్థికుద్దియగుచు.

మహాసముద్రాన్ని పోలిన గొప్పదైన వానరసైన్యము సమీకరించబడింది. వీరులైన ఆ వానరులు అట్టహాసాలు పెద్దనురగలు లాగా అగుపిస్తున్నాయి. అంటే వానరుల నవ్వులను తెల్లని నురగలుగా వర్ణిస్తున్నాడు కవి. వానరుల పొడవైన వాలములు అంటే తోకలు పగడాల తీగలులాగా ఉన్నాయి. ఆ కపి వీరులు గొప్పవైన చేతుల సమూహాలు అనేకమైన వరహాల వరుసలలాగా ప్రకాశిస్తున్నాయి.

ఆ వానరుల సేనానాయకుల ప్రముఖులు అయినవారు అటూ ఇటూ తిరుగుతూ సైన్యాన్ని అంతటినీ జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు. ఆ సేనానాయకుల ఉద్భట వీర సంచారములు ( భయంకరమైన కదలికలు ) భయంకరమైన మొసళ్ళ సంచారం లాగా గోచరిస్తోంది. వేలకొలదీ గుమికూడిన వానరుల ఆర్భాటపు సంభాషణములతో కూడిన ధ్వనులు అఖండమైన సముద్రపు ఘోష లాగే వినబడుతోంది.

ఆ వానర సైన్యమే మహాసముద్రమును పోలియుండగా ఇంకా ఎన్నో వానర సైన్యములు వచ్చి చేరుతున్నాయి. అంతటి సైన్యానికీ సుగ్రీవుని ఆజ్ఞ చెలియలికట్ట. సముద్రపు గట్టు లాంటిది. సముద్రం ఏ విధంగా చెలియలికట్టను దాటదో అదే విధంగా సుగ్రీవుని ఆజ్ఞను ( ఇనజు + ఆఙ ) అంతటి మహా వానర సైన్యము అనే మహా సముద్రము అతిక్రమించకపోవడం విశేషం.

ఇంక సముద్రానికి సంతోషం. చంద్రోదయం కాగానే చంద్రుని చూడగానే సముద్రం ఉప్పొంగిపోతుంది. రామచంద్రునుదయము. రాముడనే చంద్రుని ఉదయంతో కపి సేన అనే సాగరం పొంగి పోతుంటే కపి సేనావాహిని సముద్రాన్ని పోలినది.       

వానర సైన్యము యొక్క సంరంభాన్ని, పటాటోపాన్ని ఎన్నో పద్యాలలో వర్ణించాడు కవి. ఈ సీస పద్యంలో వానరసైన్యము యొక్క ఆర్భాటాన్ని పతాకస్థాయిలో వర్ణించి పాఠకులను ఉర్రూతలూగించి రసానందభరితులను చేయడంలో కవి కృతకృత్యుడు కాగలిగాడు అనడంలో సందేహం లేదు.

ఇక మనుచరిత్రములో అల్లసాని పెద్దన గావించిన అడవిపంది వర్ణనములు ఎన్నో ఉన్నాయి. స్వఛలోక్తి అలంకారం, ఉపమాలంకారంలో చేసిన వర్ణనలు విలక్షణమై చదువరులకు ఆహ్లాదం కలిగిస్తాయి.

మదించిన అడవిపందులు కండూతి ( దురద ) పోగొట్టుకోవడానికి కర్కశమైన తుంటి భాగాన్ని బలమైన చెట్టు ఒరిగిపోయేలా రుద్దుతున్నాయట.

ప్రకృతి పరిశీలనాత్మక దృష్టి కలిగిన కవి మాత్రమే ఇటువంటి వర్ణనలను చేయగల సమర్థుడు. పెద్దనగారి వర్ణనావైదుష్యమును ఈక్రింది పద్యంలో పరిశీలిద్దాం….

అడవిలో వేటకు వెళ్ళిన స్వరోచికి ఒక అడవి పంది కనబడింది. ఆ పంది ఎంత బలిష్టంగా ఉందో కవి చెపుతున్న సీసపద్యమిది.

సీ ||      జంభారి భిదుర సంరంభంబు వీక్షించి

                        జరుగునంజన మహాశైలమనగ

            ఝంఝూ ప్రభంజనా స్ఫాలనంబున కుల్కి

                        యరుగు సంవర్త కాలాభ్రమనగ

             కఠిన కంఠేకాల కంఠమూలమువాసి

                        వెసవచ్చు నూజ్జ్వల క్ష్వేళమనగఁ

            గలుష ధూర్వహఖలోత్కరముపై పఱతెంచు

                        దండధర క్రూరదండమనగ

తే.గీ.||   ఘుర్ఘురారావ సంఘాత ఘూర్ణమాన

            సప్తపాథోతి పాథః ప్రచండనక్ర

            తిమితిమింగల మగుచు నభ్రమును మహియుఁ

            గ్రమ్ముకొని వచ్చునొక యేకలమ్ముఁగనియె

అడవిపంది అభ్రమును – మహియున్ ( ఆకాశాన్నీ, భూమినీ కమ్ముకుని వస్తోంది. భూమ్యాకాశాలను ఆక్రమించినంతటి విస్తృతమైన దేహం గలిగిన స్వరూపం అని పందిని వర్ణిస్తున్నాడు కవి. ఆ పంది చేస్తున్న ఘుర్ఘరారావాలకు ( గుర్రు గుర్రుమనే ధ్వనులకు ) సప్త సముద్రాలలోని నీరూ, భయంకరమైన మొసళ్లూ, తిమింగలాదులూ అన్నీ ఘూర్ణమానమైపోతున్నాయట.

ఇంకా ఆ పందిని కవి ఇలా ఉపమిస్తున్నాడంటే –

జంభారి ( జంభాసురిని సంహరించిన ) ఇంద్రుని యొక్క భిదుర ( వజ్రాయుధం ) యొక్క సంరంభానికి భయపడి తప్పించుకుని పారిపోతున్న అంజనమహాశైలంలా ( కాటుకకొండగా ) ఉంది. ఝంఝా ప్రభనజనము ( తుఫాను గాలి తాకిడికి ) కదలిపోతున్న ప్రళయకాలపు మేఘమువలె అడవిపంది పరుగుతీస్తున్నదట. ఈశ్వరుని కంఠము నుండి బయిటకు వెడలివస్తున్న కఠినమైన మండుతున్న కాలకూట విషమేమో ( ఉజ్జ్వల క్ష్వేళము ) అన్నట్లు ఉందిట ఆ అడవిపంది. కలుషధూర్వహ ( పాపాలు చేసిన ) దుర్మార్గుల క్రూరదండము ( యమదండం ) లాగా ఉన్నది ఆ వరాహము.

కాటుక కొండలా, ప్రళయకాలపు మేఘంలాగా, కాలకూట విషంలాగా, యమదండంలాగా – అని దట్టమైన నల్లని రంగుగల అడవిపందికి నల్లని ఉపమానములతో కదిలిపోతున్న ఒక పెద్ద వరాహారూపమును చదువరుల కళ్ళముందు సజీవంగా సాక్షాత్కరింపజేశారు పెద్దన గారు.

‘ వర్ణనా నిపుణః కవిః ’ అనునార్యోక్తికి ఈ పద్యమునందలి ప్రత్యక్షరమూ నిలువుటద్దమే.

.

***********************

.

— Erramilli Sarada

Kakinada

Email : sarada.erramilli@gmail.com

.

__________________________________________________

ఈ రచన పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న comment box లో వ్రాయండి.

__________________________________________________