10_016 తెలుగు ఉగాది

.

“ప్లవ నామ సంవత్సరానికి స్వాగతం సుస్వాగతం”

.

అన్ని జన్మలలోకి ఉత్తమమైన జన్మ మానవజన్మ. అటువంటి మనిషి జన్మ భగవంతుని పొందడానికి అత్యంత యోగ్యమైనటువంటి వ్యవస్థ కలిగినటువంటిది. అందుకే మనుషులు ఉపాసన చేసి భగవంతుని పొందడానికి వీలుగా రుషులు కాలాన్ని విభజన చేశారు. అలా ఎంతో వివరంగా విభాగం చేయబడినటువంటి కాలంలో రోజు, వారము, పక్షము, నెల, సంవత్సరము, యామము.. ఇలా కాలం ఎన్నో రకాలుగా విభజింపబడింది. అన్ని విభాగాలలో సంవత్సరము ఒక ప్రధానమైనటువంటి భాగం. అటువంటి సంవత్సరం 365 రోజులతో కూడి 12 మాసములతో మిళితమై ఉంటుంది. మనకి తెలుగు నెలలో మొట్ట మొదటి తిథి అయినటువంటి పాడ్యమినాడు కొత్త సంవత్సరం ఉషోదయ కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతూ ప్రారంభమవుతుంది. మనమంతా ఎక్కువగా చాంద్రమానాన్ని అనుసరిస్తున్నాం. చాంద్రమానం ప్రకారం 60 సంవత్సరములు. ఇప్పుడు వచ్చేది ప్లవ నామ సంవత్సరం. ఈ ప్లవ నామ సంవత్సరం 60 సంవత్సరాల్లో 35 వ సంవత్సరంగా పేర్కొనబడింది.

ప్లవనామ సంవత్సరం అంటే నీటి వనరులు సమృద్ధిగా పుష్కలంగా లభిస్తాయి అని చెప్తారు. ఈ సంవత్సరంలో వాగులు, నదులు, చెరువులు, సముద్రాలు ఉప్పొంగి ప్రవహిస్తాయని పెద్దలు చెబుతున్నారు. ఈ నీటి కొరత లేకుండా ఉంటే పంటలు సమృద్ధిగా పండుతాయి. తద్వారా రైతన్నల కష్టాలకి తగిన ఫలితం దక్కుతుంది. పేదవారి క్షుద్బాధ తీరుతుంది. అప్పుడు దేశం కూడా సుభిక్షంగా ఉంటుంది. ఇలా సుభిక్షంగా ఉండే రోజే ఉగాది. ఈ ఉగాది తెలుగు వారి తొలి తెలుగు పండగ. చైత్ర మాసంలో ఈ మొదటి రోజుని ఉగాది అని సంవత్సరాది అని పిలుస్తుంటాం.  యుగమంటే యోగం. మనిషి జీవితకాలంలో ముడిపడి ఉండడమే యోగం. అలా యోగానికి తొలినాడు కావడంవల్ల ఈ పండుగకు యుగాది అనే పేరు వచ్చింది.

ఈ ఉగాది పుట్టుక వెనుక మరో ఆసక్తికరమైన పురాణ కథ కూడా ఉంది. విష్ణుమూర్తి నాభి నుంచి పెరిగిన కమలం నుంచి పుట్టి సృష్టి బాధ్యతలను స్వీకరించిన బ్రహ్మ తనతోపాటు ఉండమని విష్ణుమూర్తిని కోరాడు. అప్పుడు విష్ణువు పాలకడలిలో శేషతల్పంపై పడుకున్నట్లు ఉన్న తన విగ్రహాన్ని బ్రహ్మ కి ఇస్తాడు. ఇదే దేవుని మొదటి విగ్రహంగా చెప్తారు. ఇదంతా కూడా ఉగాది నాడే జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. చాంద్రమానాన్ని అనుసరించి చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఈ ఉగాది పండుగను జరుపుకుంటాము. ఈ పండుగను యుగాది అంటాము. ఇది సృష్టి ప్రారంభం రోజున జరిగింది. ఈ రోజున అభ్యంగన స్నానమాచరించి, నూతన వస్త్ర ధారణ చేసి, దైవదర్శనం చేస్తాము. గోపూజ, వృషభ పూజ చేస్తారు.

అలాగే తెలుగు వారు ప్రత్యేకంగా జరుపుకునే కార్యక్రమాల్లో ఉగాది పచ్చడి తప్పనిసరిగా ఉంటుంది. దీనిని షడ్రుచులతో తయారు చేస్తారు. వేపపువ్వు, బెల్లం,  చింతపండు, మామిడి ముక్కలు, ఆవు నెయ్యి,  నీరు వీటిని కలిపి భగవంతునికి నివేదన చేసి అందరూ ఆరగిస్తారు. దీనిని షడ్రుచులతో చేయడం వెనక అర్థం ఏమిటంటే జీవితoలో సుఖ-సంతోషాలను, కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలని చెబుతారు. అంటే ఈ ఆరు రుచుల్లో తీపి సంతోషానికి, చేదు బాధకి, కారం కోపానికి, ఉప్పు భయానికి, పులుపు చిరాకుకు, వగరు ఆశ్చర్యానికి గుర్తుగా భావిస్తారు. అంతేకాకుండా జీవితం అన్ని రుచుల కలయికగా పేర్కొనడానికి ఈ ఉగాది పచ్చడి ప్రతిబింబిస్తుంది.  అలాగే ఈ ఉగాది నుండి ఒక నెల రోజుల పాటు వేప చిగుళ్ళు తింటే ఎటువంటి వ్యాధులు దరిచేరవు. అంటే జలుబు, జ్వరము, విరోచనాలు, వాంతులు, అజీర్తి లాంటి ఏ వ్యాధి కూడా మన దరిచేరదు. లేదంటే వేపపువ్వు తిన్నా కూడా ఒక నెలరోజుల వరకు చక్కని ఫలితం ఉంటుంది ఇంకా ఈ వేప చిగుళ్లు, ఆకుల వల్ల షుగర్ వ్యాధి కూడా చాలావరకు స్థిరంగా ఉంటుంది. ఇలా ఈ పదార్థాలన్నింటిని సమపాళ్ళలో తీసుకుంటే ఇటు ఆరోగ్య సంరక్షణ, అటు మన జీవితం పట్ల అవగాహన పెంపొందించుకుని ప్రతిరోజూ ఉగాది పండగే అన్నoత సంతోషంగా ఆనందంగా జీవించవచ్చు.

అలాగే ఈ ఉగాది పర్వదినాన పంచాంగ శ్రవణం అతి ముఖ్యమైన ఘట్టం. ఈ పంచాంగంలో మన జీవితానికి సంబంధించిన సుఖదుఃఖాలు, కష్టనష్టాలు అన్ని పొందుపరచబడ్డాయి. దీనిని పూజామందిరంలో పెట్టి పూజ  చేస్తారు. ‘ పంచాంగం’ అంటే ‘ ఐదు అంగములు ‘ తిథి, వార, నక్షత్ర, కరణ, యోగములు కలిగినటువంటిది.  ఇందులో ఒక సంవత్సరకాలాన్ని ప్రమాణం చేసుకుని, ఈ సంవత్సర కాలంలో గ్రహములు ఎలా కదులుతాయో, అవి ఏయే ఫలితాల్ని ఇవ్వబోతున్నాయో,  దానివల్ల జాతక కర్తలు పొందబోయే శుభాశుభాలు, ఇంకా ఆదాయ వ్యయాలు, కందాయఫలాలు, రాజపూజ్యం, అవమానం ఇవన్నీ వివరంగా చెప్పబడతాయి. అందుకే పంచాంగం ఈ ఉగాది రోజునే కాక ప్రతి రోజు చూడాలి. తిథి, వార, నక్షత్ర, కరణము, యోగము ఈ ఐదింటిని మనం ప్రతి రోజూ కూడా పరిశీలన చేస్తే మనకి సంపద, సంపూర్ణ ఆరోగ్యం, పాప నాశనము, ఆరోగ్యసిద్ధి, విజయము ఈ ఐదు మనందరికీ తప్పక లభిస్తాయి.

ఈరోజుతో కొత్త ఫ్లవనామ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరంలో మనకు నీరు సమృద్ధిగా లభిస్తుంది. కాబట్టి ఆ నీటిని పరిశుభ్రంగా ఉంచుకుంటూ, పొదుపుగా వాడుకుంటూ దైవానుగ్రహంతో మనం మన కుటుంబ సభ్యులు, సమాజం, రాష్ట్రం, దేశం, యావత్ ప్రపంచం మన మనసుని ప్రశాంతంగా ఉంచుకొని మంచి పనులపై మన మనసుని లగ్నం చేయాలి. అలాగే శార్వరి నామ సంవత్సరంలో జరిగిన విషాదాలు, కష్టాలు, కన్నీళ్లు, బాధలు అన్నింటినీ ఓ జ్ఞాపకంగా, అనుభవంగా తీసుకొని ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈ ప్లవ నామ సంవత్సరం నుంచి అయినా మనం స్వచ్ఛతను కోరుకుంటూ… ఆ స్వచ్ఛతను మన దగ్గర నుండే ఈ రోజు నుండే ప్రారంభిద్దాం. అలాగే ప్రకృతిని గౌరవిస్తూ వనరుల సంరక్షణ మనందరి బాధ్యతగా గుర్తించి ఆచరించాలి. ఇంకా సమభావం సౌభ్రాతృత్వం అంటూ అందరినీ సమభావంతో చూస్తూ సహాయతా గుణాన్ని అలవర్చుకుoదాం. ఇంకా ఈ నూతన ఉగాది లో అందరం వసుదైక కుటుంబంలోని వ్యక్తులు లాగా మనమంతా ముందుకు సాగుతుంటే ఈ ప్లవ సంవత్సరం సకల జనులకు శ్రేయస్సు మిగల్చాలని కోరుకుందాం.

*********************

Pingali Bhagyalakshmi, Columnist & Writer

Mobile : 9704725609 / 9398163836 Whatsapp No. : 9704725609

Mail ID: pingalibhagyalakshmi103@gmail.com