.
దేశం కోసం ప్రాణాలర్పించే సైనికులకు మనోబలాన్నిచ్చే వారి ఇళ్ళలోని స్త్రీశక్తిని గౌరవించడం మన కనీస ధర్మమని జయ పీసపాటి పేర్కొన్నారు.
ఆమె టోరీ రేడియో ద్వారా ప్రజాదరణ పొందిన “జై హింద్” కార్యక్రమ రూపకర్త, వ్యాఖ్యాత.
అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి ప్రతి నెలా యూట్యూబ్ ద్వారా ప్రసారం చేస్తున్న “నెల నెలా వెన్నెల” కార్యక్రమం ఈ మాసపు అంకం ఏప్రిల్ 10వ తేదీ శనివారం సాయంత్రం ప్రసారమైంది. అందులో ఆమె “వీరనారి” పేరిట సైనికుల ఇళ్ళలోని మహిళల త్యాగశీల శక్తి గురించి ప్రసంగించారు. కుమారులను కోల్పోయిన వీర మాతలు, భర్తలను పోగొట్టుకున్న వీర నారీమణులు కొందరు తమవంటి వారి అభ్యున్నతి కోసం ఏర్పాటు చేసిన వసంతరత్న ఫౌండేషన్, వీర నారీ శక్తి తదితర సేవా సంస్థల గురించి తెలిపారు. వాటి ద్వారా యుద్ధ వితంతువులు జీవన భృతి కోసం దరఖాస్తు చేసుకోవడంలో సహకారాన్ని అందజేస్తున్నారని,
వృత్తి విద్య, కంప్యూటర్ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారని, వారి పిల్లల చదువులకై ఆర్థిక సహాయం అందజేస్తున్నారని వివరించారు. తమ భర్తల త్యాగానికి నివాళిగా, వారి ఆశయాలను కొనసాగించే విధంగా సాయుధ దళాలలో చేరిన నీతిక కౌల్, గరిమా ఆబ్రోల్, షాలిని సింగ్, సుష్మిత పాండే, కనికా రాణేల పోరాట స్ఫూర్తిని జయ వివరించిన తీరు వీక్షకులను భావోద్వేగాలకు గురి చేసింది. వక్త “హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య” అధ్యక్షకురాలిగా కూడా సేవాలందిస్తున్నారు.
కార్యక్రమానికి ప్రత్యూష గునిశెట్టి స్వాగతం పలికారు.
.