10_017 పాలంగి కథలు – యానాం పెళ్లి

.

సప్త రుషులు తపస్సు చేసిన పవిత్ర ప్రదేశమది. పండితరాయలు పారాడిన పల్లెటూరు అది. వేద పండితులు శిష్యులకు పాఠాలు వల్లె వేయించిన సావిడులవి! గౌతమీ నది ప్రవహించి సశ్యశ్యామలం చేసిన నేల. కొబ్బరి, మామిడి, పనస, పోక, జామ తోటలతో ఒప్పారే కోనసీమ – గోదావరి సప్త గోదావరులుగా చీలి, సముద్రుని చేరేముందు సశ్యశ్యామలం చేసి నేలతల్లిని పరిపుష్టం చేసిన ప్రదేశం అది.

‘‘ చిట్టి బొట్టు పట్టావలె…సిరిగల ఇంటా పుట్టావలె

ఏడుగురక్కలతోడ బుట్టాలేక రాజ్యం ఏలవలె ’’

అంటూ చిట్టిబొట్టూ నోము పట్టిన పిల్లలు అమ్మవారిని అర్థిస్తారు. బహుశా గత జన్మలో నిష్టగా ఈ నోము పట్టి ఉంటాడు. ఈ జన్మలో సిరి సంపద కలిగిన ఇంట పుట్టాడు ఖండవిల్లారింట కడగొట్టు సంతానంగా. ‘‘ పెట్టినవాళ్లకి పుట్టిందే సాక్షి!!! ’’ ఏడుగురాడపిల్లల సరసన సూర్యోపాసనా ఫలంగా వంశోద్ధారకుడిగా ఉదయించాడు. అందుకే సూర్యనారాయణ శాస్త్రి అని పేరు పెట్టుకున్నారు రామ్మూర్తిగారు.

బుడి బుడి అడుగుల నాడే వీధరుగు మీద తండ్రి గారు చెప్పే వేదనాదాన్ని అనుకరించేవాడు. గర్భాష్టమాన ఉపనయనం చేసిన తండ్రి రామ్మూర్తిగారు ముచ్చటపడేలా ఉదయసంధ్యల్లో గాయత్రి చేసేవాడు. అక్కలందరూ వంతులు పోయి మరీ గారం చేసేవారు తమ్ముణ్ణి. పచ్చని పనసతొనల పసిమి ఛాయతో మిసమిసలాడే పసివాణ్ణి కళ్లారా చూస్తేనే ఎక్కడ దిష్టి తగులుతుందోనని అరకంట చూసి క్షణకాలం ముద్దాడి పన్లో పడేది తల్లి కామేశ్వరమ్మ. తండ్రితో పాటుగా చిన్ని ఎర్ర పట్టుబట్ట కట్టుకుని దేవతార్చనలో పాల్గొని అక్కచెల్లెళ్లకు తీర్థం ఇచ్చేవాడు. ఆపై అరుగు మీద కూర్చుని ‘‘రామః రామౌ రామాః’’ అంటూ శబ్దాలు సాధించేవాడు. అందరితోపాటు నేర్చుకుంటున్నా విద్య విషయంలో తనయుడి శ్రద్ధ తండ్రిని మురిపించేది. లోలోనే ఆనందించేవాడు గురువుగా. అగ్రహారంలోనూ, చుట్టుపట్ల పల్లెల్లోనూ జరిగే యజ్ఞాలకూ, యాగాలకూ తండ్రితోపాటు తానూ సిద్ధం.

కామేశ్వరమ్మ పుట్టిల్లు విజయనగరం. మేనమామలుంటున్న విజయనగరంలో వాళ్ల పిల్లలు ఇంగిలీసు వాళ్లు పెట్టిన బడుల్లో(తెల్లదొరలు పెట్టిన) చదువుకోవడం రాజాగారి కొలువులో ఉద్యోగాలు చేస్తుండటం చాలా నచ్చింది ఆవిడకి. అలాగే తన కొడుకూ తలమీద జరీ పాగాతో భుజం మీద జరీ కండువా వేసుకుని కాళ్లకి ముఖమల్‌ పాముకోళ్లతో దర్జాగా ఏ విజయనగరం రాజావారి కొలువులోనో, పిఠాపురం రాజావారి దేవిడీలోనో, ఆఖరికి మొగల్తూరి రాజావారి కొలువులోనైనాసరే నౌఖరీకి కుదిరితే ఎంత గొప్ప అనుకునేది. ఆ మాటే భర్తతో అంటే–‘చాల్లే చెప్పొచ్చావ్‌. మహారాజును సైతం చెయ్యెత్తి ఆశీర్వదించే వైదీకుల ఇంట పుట్టి చక్కగా వేదాధ్యయనం చేసుకుంటున్నవాడిని నియోగపాళ్లల్లా ఆ రాజుల వెనక వెనకే తిరుగుతూ, చేతులు నలుపుకుంటూ చిత్తం చిత్తం అంటూ ఒంగి ఒంగి దండాలెట్టుకునే ఖర్మ వాడికేం పట్టలేదులే’–అంటూ గయ్యిమని, ఉత్తరీయం ఝాడించి లేచ్చక్కాపోయేవాడు. ఇంకేం అంటుంది? ఉక్రోషపడ్డా ఫలితమేముంది గనుక! కోరికను మనసులోనే అణుచుకునేది.

అయిదుగురాడపిల్లలకీ లోకం ‘ఓహో…’ అనుకునేలా పెళ్లిళ్లు చేశారు రామ్మూర్తిగారు. మెల్లిగా కొడుక్కు కూడా సంబంధం చూడాలని మనసులో ఆలోచన. చివరి ఆడపిల్లలింకా పసివారే. అందుకే ముందు కోడల్ని తెచ్చుకుంటే…? అనిపిస్తోందీ మధ్య. ఆమధ్య మురమళ్ల శివార్లలో పొలం ఏదో బేరానికొచ్చిందంటే వాకబు చేసి వద్దామని వెడుతుంటే వీరభద్రుడి గుడిపూజారి కనబడి ‘రండి పంతులుగారూ, ఈమధ్య మీరిటువైపు వచ్చినట్టు లేదు. స్వామి దర్శనం చేసుకుని వెడుదురుగాని’ అంటూ తీసుకెళ్లాడు గుడికి. కేశనకుర్రు నుంచి వచ్చిన ఆడంగులు బోలెడుమంది ఉన్నారు గుడి ప్రాంగణంలో. రావిచెట్టు చప్టా మీద కూర్చుని కొబ్బరి చిప్ప కొట్టి, ప్రసాదాన్ని పక్కనున్న పిల్లలకి పెడుతూ తానూ కళ్లకద్దుకుని తింటున్న పాపను చూడగానే రామ్మూర్తిగారికి, ‘ఈ పిల్లని కోడలిగా తెచ్చుకుంటే…’ అనిపించింది.

దగ్గరకెళ్లి ‘ఎవరమ్మాయివే పిల్లా?’ అని అడక్కుండా ఉండలేకపోయాడు. ఫలానా వారి అమ్మాయని తెలిశాక మనసులో ఆలోచన దృఢపడింది. ‘ఇలా రా’ అంటూ పిలిచి ఓసారి చెయి చాపమని రేఖలు చూశారు. అయిష్టంగా, బిడియంగా చెయ్యి చాపి గబుక్కున లాగేసుకుని పరికిణీలో దాచేసుకుంది చేతులు. ఈలోగానే ప్రస్ఫుటంగా ఉన్న రేఖలు చూసిన రామ్మూర్తిగారికి ఆ అమ్మాయి జీవలక్షణం అవగతమైపోయింది. ఒక కుటుంబాన్ని స్థైర్యంగా నడపగల శక్తి, బహుసంతానయోగం చూసి ముచ్చటపడ్డాడు. ఓసారి ముహూర్తబలం చూసుకున్నాడు. అంతే! అట్నుంచి అటే కేశనకుర్రు వెళ్లి పిల్ల తండ్రితో మాట్లాడేశాడు. పిల్ల తండ్రి ఓపట్టాన ‘ఊ’ అనడానికి ధైర్యం చూపలేదు మొదట. తనకన్నా అన్నివిధాలా పైచేయిగా ఉన్న ఈ ముంగండవారి సంబంధం–అనేసరికి చాలా తటపటాయించాడు. కానీ, రామ్మూర్తిగారిచ్చిన ధైర్యంతో, పిల్ల కలిగినవారింట్లో సుఖపడుతుందిలే అని సరేననకుండా ఉండలేకపోయాడు. రామ్మూర్తిగారూ సరే! ఇంట్లో ఆడవాళ్లతో మాట్లాడి నాల్రోజులు పోయాక వచ్చి చెబుతానంటే…అబ్బే సరేననేదాకా నిలబెట్టేస్తేనే!!! ఇంట్లో ఆడంగులు ఒకవేళ నస పెట్టినా ‘ఇంత కలిగిన సంబంధం! ఆపూర్ణులై, వారంతటవారే కోరి చేసుకుంటామంటున్నారు. ఇలాంటి సంబంధం నేను తేగలనా! చెయ్యగలనా!?’ ఇదీ ధైర్యం. ఇంతకీ రామ్మూర్తి గారంతటి పెద్ద మనిషి కోరి పిల్లను వారింటి కోడల్ని చేసుకుంటామంటుంటే కాదనడానికేముంది?!

అలా కొడుక్కి నించున్నపళంగా సంబంధం కుదుర్చుకుని వచ్చేశాడు రామ్మూర్తి.

మిగతా విషయాలు మెల్లిగా తర్వాత మాట్లాడుకోవచ్చునంటూ లేచ్చక్కా వచ్చేశాడు. ఆయన ఏ వ్యవహారమైనా అంతే. క్షణాల్లో నిర్ణయాలు తీసేసుకుంటారు. కార్యం సాధించేస్తారు. ఆయన వ్యవహారశైలే అది.

‘ఇంగిలీసు పాలకులు బాల్యవివాహాలనరికట్టడానికంటూ ఏదో శారదా యాక్ట్‌ అంటూ శాసనం చేశారుష? నీకేమైనా తెలుసురా అబ్బీ?’

‘అవును మావయ్యా. ఎవరైనా సరే బాల్యవివాహం చేస్తే ఠాణాలో వేస్తార్ట.‘

‘ఇదెక్కడి చోద్యం రా?’ మన పిల్లలకి మనిష్టమొచ్చినట్టు పెళ్లి చేసుకుంటే మధ్య వాళ్లకేమిటిష!? అప్రాచ్యపు వెధవ చట్టాలూ వాళ్లూను! గాంధీ గారు మన దేశానికి స్వాతంత్య్రం ఎప్పుడు తెస్తారోగానీ, రజస్వల అయ్యాక ఇక పెళ్లేమిటి?! ఎంత తప్పు! ఎంత తప్పు! నరకానికి పోవాల్సిందేనా ఇహ! అయినా ఒరే! ఎక్కడో ఈ మారుమూల పల్లెటూళ్లో మనం పెళ్లి చేస్తే అక్కడెక్కడో ఉన్న ఆ ఎంగిలిపీచువాడికి ఏం తెలుస్తుందంటావ్‌?’

‘మావయ్యా– నడివీధిలో నిల్చుని గట్టిగా అనకు. అసలే ఆ దక్షిణం వేపు పొలం కొనుగోలు విషయంలో నీ మీద పీకలమట్టుకు కక్ష పెట్టుకుని ఉన్నాడు ఆ ద్రావిళ్ల భైరవుడు. పనిగట్టుకుని వెళ్లి ఫిర్యాదు చేయగలడు ఠాణాలో. లేనిపోనిది స్వయంకృతం కాగలదుసుమా!

‘నిజమేరా అబ్బీ. ఏదో పరువుగా బతుకుతున్నాం. ఏమిటి దారి ఇహనిప్పుడు? ఒక్కగానొక్కడు మొగ నలుసు. ఆ కేశనకుర్రువారి సంబంధం ఖాయం చేసుకున్నాను?! చేసేయొచ్చులే అనుకుంటుంటే…’

‘మావయ్యా– ఆ సంబంధానికి అత్తయ్య ఒప్పుకుందా మరి? ఆమధ్యనెప్పుడో ఓసారి మాటల్లో బరంపురంలో వాళ్లవాళ్లెవరో ఉన్నారని…అదే వాళ్ల మేనమామల తాలూకు. వాళ్లమ్మాౖయెతే…వాళ్లన్నివిధాలా మనతో సమ ఉజ్జీలనీ లాంఛనాలు ఘనంగా జరిపిస్తారని చెప్పుకొచ్చింది. నీతో చెప్పిందేమో కదూ?’

‘ఆ…. ఏడ్చింది. వెధవ ఆడతనం కబుర్లూ(ఆలోచనలూ)అదీనూ. ఎంతసేపూ లాంఛనాలూ, పిండాకూడూనూ. వాళ్లిచ్చేదెంత? వీళ్లు పొందేదెంత? కాస్త పిల్ల మంచిచెడ్డలు చూడద్దూ.’

‘వచ్చే పిల్ల ఎవరేనా మనింటికొచ్చాక మనిష్టం వచ్చినట్టు మలుచుకోవచ్చుకదా!’ అని అత్తయ్య ఆలోచన మావయ్యా.

‘ఆ…ఆ…కాస్త పిల్ల గురించి, వాళ్ల వాళ్ల గురించి తెలుసుకోవద్దూ? ఒరే ఓ విషయం చెప్పనా? ఏమైనా తూర్పువాళ్లకి, ముఖ్యంగా బరంపురంవాళ్లకి తామేదో పట్నవాసపు వాళ్లమన్న అహం ఏం?

‘ఏం మీ అత్తకి అదే గొప్ప!! నేను సాగనివ్వనుగానీ…అమ్మో! తక్కువది కాదు’.

‘పోన్లే మావయ్యా. ఆవిడ్నెందుకంటావుగానీ? ఆవిడ మాట సాగనిస్తావా ఏం??’

‘ఏం లేదురా అగ్గన్నా! ఓ విషయం చెబుతా విని అర్థం చేసుకో. ఈ ఇంట్లోకి వచ్చే పిల్ల రాటా ధాటికి ఓర్చుకుని నేర్పుగా సంసారం సాగించేదిగా ఉండాలి. నీకు తెలుసుగా మావాడి పామేదాతనం? ఎంతసేపూ చదువూ, వేదం తప్ప మరోటి అక్కర్లేదు కదా? కనీసం పొలం విషయాలైనా నాతోపాటొచ్చి తెలుసుకుంటాడేమో అంటే…అబ్బే. అవేవీ పట్టవు వాడికి. అందుకే వాడికి పెళ్లాంగా వచ్చే పిల్ల కాస్త చెబితే నేర్చుకుని, ఒడుపుగా సంసారం సాగించేదిగా ఉండాలని నా ఆలోచన. చెప్పొద్దూ నేననుకున్న లక్షణాలన్నీ ఆ కేశనకుర్రువాళ్ల అమ్మాయిలో ఉన్నాయిరా అబ్బీ. చెయ్యి కూడా చూశానుసుమా! అన్నివిధాలా అనుకూలంగా ఉందిరా మరి! ఇంతకీ ఈ ఉపద్రవం వచ్చిపడిందేమిటా అనుకుంటున్నాను.’

‘మావయ్యా వచ్చే కోడల్ని అత్తగారు దిద్దుకుంటుందా, నువ్వు ట్రైనింగు ఇస్తావా? మొత్తానికి నీ ఇంటి కోడలు అందరిళ్లల్లో కోడల్లా కాదన్నమాట! అత్తగారి కింద ఇంటిపనుల్లోనూ, మామగారి ఉద్దేశం ప్రకారం వ్యవహారాల్లోనూ, సరే, ఆడపడుచులు సరేసరి! ఎటోచ్చీ మన్నన బావగార్లు లేరు. ఇంకా నయం ఇంతమందితో వేగాలన్న మాట ఆ పిల్ల! ఇంతకీ ఆ పిల్ల చేతిరేఖల్లో ఇంత సత్తా ఉందంటావ్‌!? ఏమాటకామాటే చెప్పుకోవాలి. పిల్ల మాత్రం రంభే! నేను మొన్ననామధ్య మానేపల్లి పెళ్లికెళ్లినప్పుడు అక్కడ చూశాను. మనవాడి పక్కన ఈడూ, జోడూ! చాలాబావుంటుంది. ఏదో ఓసారి అంటుందంతే అత్తయ్య. ఏమైనా నువ్వనుకున్నదే చేస్తావు కదా! ఆవిడ మాటెక్కడ సాగేడుస్తుంది!?’

‘ఇంతకీ ఉపద్రవం వచ్చి పడిందేరా అబ్బీ. ఏం చేయాలో పాలుపోవడం లేదు.’

‘ఒరేయ్‌…ఆ వీధి మొగన వచ్చేదెవరంటావ్‌? ఎత్తరిగా రయ్‌ రయ్‌మంటూ వస్తున్నాడు. కనుచీకట్లో ఆనడం లేదు’

‘మావయ్యా పిల్లనివ్వబోయే వియ్యంకుడనుకుంటాను. చేతిసంచీతో కేశనకుర్రు నుంచే కాబోలు.

‘నూరేళ్లాయిష్షు బాబాయ్‌. మీ విషయాలే మాట్లాడుకుంటున్నాం’

‘ఆ…ఆ…నేనేరా అబ్బాయ్‌. బావగారూ! కులాసాయేనా?’

‘కులాసాయేలే…ఏదీ…ఇదేనా రావడం? నడూ ఇంటికెళ్దాం. ఆ సంచీ ఇటు తే నేను పట్టుకుంటాను’

‘వద్దు వద్దు బావగారూ. సాక్షాత్తూ వేదమూర్తులు మీరు. నా సంచీ మీచేత మోయిస్తే ఇంకేమైనా ఉందా?’

‘మావయ్యా మరి నేను వెళ్లొస్తాను. పొద్దుపోతోంది. వస్తా బాబయ్యా.’

‘మంచిదిరా. ఆ సపోటా చెట్టు విరక్కాచింది. కోయించి దక్షిణపు సావిట్లో పరిపించాను. భోజనాలవీ అయ్యాక ఓసారి కనబడు. కాసిన పట్టుకెళ్దుగాని. నీకు కుదరకపోతే తమ్ముణ్ణి పంపు తీసుకెళ్తాడు.’

‘అలాగేలే మావయ్యా’

(గుమ్మంలో) అరుగుపక్కనున్న చిన్న గుండిగలోని నీళ్లతో తాను కాళ్లు కడుక్కుని కాబోయే వియ్యంకుడికి చెంబుతో నీళ్లందించి పైనున్న కండువా తుడుచుకోవడానికి అందిస్తుంటే– ‘అబ్బే నా ఉత్తరీయం ఉంది లెండి’ అని తుడుచుకుంటూ లోపలికి నడిచారు. మండువా దాటి ఉయ్యాల బల్లమీద కూర్చుంటూ…‘ఓయ్‌ అమ్మీ! ఎక్కడున్నావ్‌? ఇటోసారి వచ్చి వెళ్లు?’ అంటూ ఓ గావుకేక పెట్టారు రామ్మూర్తిగారు.

పెరట్లో పాలదాలి వేస్తున్న కావమ్మగారికి వినబడేలోగానే వచ్చినవాళ్లు వీధిలో కాళ్లు కడుక్కుంటుంటేనే చూసిన సుభద్ర, సూరమ్మ పరుగెత్తుకుంటూ వచ్చి–

‘అమ్మా తమ్ముడికి పిల్లనిచ్చే మావగారొచ్చేరే’ అనడం ఒక్కసారే జరిగాయి. ‘ఇదిగో…వచ్చే వచ్చే’ అంటూ చేతిలో పిడకలు సరిగా చుట్టూ సర్ది అక్కడినుంచి నాలుగు గడపలు దాటి వచ్చేసరికి అప్పటికే కబుర్లలో పడ్డారు కాబోయే వియ్యంకులిద్దరూ. కూతురిచ్చిన మంచితీర్థం పుచ్చుకుని.

‘ఇదేనా రాక అన్నయ్య గారూ? అందరూ కులాసాయేనా? వదినగారికి సుస్తీ చేసిందని విన్నాను. ఇప్పుడెలా ఉంది?

‘ఆ బాగానే ఉందమ్మా. ఆమధ్య ఊష్టం చేసిందంతే. తగ్గిందిలే. రేపుదయం అమలాపురంలో ప్లీడరుగారితో పని పడిందిలే. సరే ఎటూ వస్తున్నాను కదా రాత్రికి ఇక్కడికి వచ్చి తెల్లారి పెందరాళే ప్లీడరుగార్ని ఇంట్లో కలవొచ్చని ఇలా చక్కా వచ్చాను’.

‘మంచి పని చేశారు. మాట్లాడుతూ ఉండండి. చిటికెలో వంటయిపోతుంది’.

‘ఒసే రవణా. పైలాడు పాలట్టుకొచ్చినట్టున్నాడు. కుండలో పోసి, తప్పేలా తొలిచి వాడికిచ్చేయ్‌. జాగ్రత్తగా కుండ తీసుకెళ్లి దాలిమీద పెట్టు. దాలి వేసే వచ్చాలే. జాగర్త. కుండ దాలిమీద అమరిందో లేదో ఓసారి సరిచూడు. అన్నట్లు పాల తప్పేలా అప్పుడే ఇవ్వకు పైలాడికి. పెరటిలో అరటిచెట్టుని కాయలున్నాయి. కొయ్యమను. గెలంతా కొయ్యకూడదుసుమా. ఓ అత్తం కొయ్యమను చాలు. ఇప్పటికి సరిపోతాయ్‌’’.

‘‘అలాగేనే అమ్మా. ఒరే పైలాడా! ఆ పెరటి తలుపు తీసేవుంది. తిరిగిరా. కొబ్బరిచెట్టుకి నిచ్చెన ఆనించి ఉంది. తీసుకెళ్లి అరటికాయలు ఓ అత్తం విరిచి గిరవాటెయ్‌’’.

‘‘అలాగే పాపగారూ…చాలా, మరినాలుగు కాయలు విరవనా?’’

‘‘వద్దులేరా. చాలు. అమ్మా అరటికాయలు తరగమంటావా?’’

‘‘తరుగమ్మా. కత్తిపీట దారికడ్డంగా వేసుకుని మాత్రం కూచోకు. తమ్ముడొచ్చినట్టున్నాడు. దాహం పుచ్చుకుంటాడేమో అడగండి’’.

‘‘ఒరే తమ్ముడూ. ఇదిగో దాహం పుచ్చుకో. మీ మావగారొచ్చార్రా. వెళ్లి పలకరించు’’

‘‘పోవే నేను వెళ్లను. అన్నపూర్ణక్కయ్యా. సంధ్యావందనం చేసుకోవడానికి పంచపాత్ర, ఉద్ధరిణసావిట్లో పెట్టు. అక్కా అవతలి స్తంభం దగ్గర పెట్టు. నేవెళ్లి మడికట్టుకొస్తా. పీట, పంచపాత్ర, ఉద్ధరిణ తెచ్చి సావిట్లో అవతలి స్తంభం దగ్గరపెట్టు. నాన్నగారి పక్కన వద్దు. మావయ్యగారు కూర్చుంటారక్కడ. సంధ్య వార్చడానికి’’.

‘‘అలాగే పెట్టాలే ఇందాకే. వెళ్లి చూసుకో’’.

‘ఏమోయ్‌ శాస్త్రీ…ఆడుకోడానికెళ్లావా?’

 ‘ లేదండీ దేవాలయంలో సాయంత్రం వేళ సహాధ్యాయులందరం కలిసి ‘మంత్రపుష్పం’ వల్లెవేస్తున్నాం. సంధ్యాకాలం అయిందని అట్నుంచి అటే వెళ్లి గోదాట్లో మునిగి వస్తున్నాం. సంధ్య వార్చాలింకా’

ఆ స్ఫురద్రూపం, ఆ వినయం చూసి తన కూతుర్ని అతనిపక్కన ఊహించుకుంటూ మురిసిపోయాడు పిల్ల తండ్రి. ‘‘నడు బావా. నూతి దగ్గర మనమూ స్నానం చేసి వద్దాం. అమ్మీ మడిబట్టలు పీట మీద ఉంఛావుషోయ్‌?’’

‘‘ఆ…ఆ… పెట్టానిద్దరికీ’’

సంధ్యావందనం పూర్తి చేసుకుని ముందు వసారాలోకొచ్చి కూర్చుని మళ్లీ కబుర్లలో పడ్డారు కాబోయే వియ్యంకులు. ‘ఆ సర్కారువాళ్లేమిటి బావగారూ ఇలా అర్ధం పర్ధం లేని ఆర్డరేశారు. మన పద్ధతులు వాళ్లకేం తెలుసనో. మన ఆచార వ్యవహారాల్లో వాళ్లు కలగజేసుకోవడం ఏమిటో. చక్కగా కేశనకుర్రులో వైభవంగా చేయొచ్చు పెళ్లి అనుకున్నాను.’

‘అన్నట్లు యానాంలో పెళ్లి చేస్తే ఈ ఆర్డరు వర్తించదని అక్కడికి తీసుకు వెళ్లి చెయ్యండని సలహా ఇచ్చారు నడింపల్లి రాజు గారు. చాలా ఇబ్బందే. అయినా మరో దారి లేదు మరి.’

‘నేనూ ఆ విషయమే ఆలోచిస్తున్నాను బావా ! ఎత్తినాటుగా మన వూరి కాని వూరిలో పెళ్లంటే–సమర్ధించగలమా? అని ఆలోచిస్తున్నాను. ఒక్కగానొక్క వంశోద్ధారకుడు వాడు. వాడి పెళ్లి ఏదో ఊళ్లో చేయడమేమిటా అని! కాని తప్పేటట్లు లేదు. మీకూ మరీ ఇబ్బందే.’

‘నిన్న మా వూళ్లో నడింపల్లి రాజుగారు ఈ ప్రస్తావన తెచ్చారు. మా గ్రామంలో వారు మా శ్రేయోభిలాషులు లెండి. యానాంలో రెండు సత్రవులున్నాయట. ఓ సత్రంలో కావలసిన వంట సామానులూ అవీ కూడా ఉన్నాయిట. వాటినిప్పించే ప్రయత్నం చేస్తాను అంటూ పెళ్లికి వచ్చినవారందరికీ అన్నదానం తన ఖాతాలోనే అన్నారు. మహానుభావులు. మహా ఉదారులు లెండి. మాఘమాసం చివరిలో అనుకున్నాం కదా. వైశాఖమైతే నయమేమో ఆలోచించమని వారి సలహా. మగవారినెలాగో నచ్చజెప్పి సర్దుకుపోయేలా చేయొచ్చు. కానీ ఆడవారు అలా సర్దుకోరు కదా… అదీ నా భయం. మా ఇల్లాలైతే మరీ బెదిరిపోతుంది. పెద్దింటి వియ్యం. తూగలేని ఎత్తులకెందుకు వెళ్లడం అంటూ ఒకటే నస. వియ్యానికైనా, కయ్యానికైనా సమానస్థాయి ఉండాలి కదా అన్నది దాని మాట. ఏదో ఆపూర్ణులై అభిమానంతో, మీరు కోరి మా అమ్మాయిని కోడలిగా చేసుకుంటానంటుంటే కాదనలేకపోతున్నాను. ఆమధ్య చాతుర్మాస్యానికి వచ్చిన స్వాములారు కూడా ‘‘మీ కూతురు దొడ్డ జాతకురాలు. చాలా పెద్దింటి లోగిలికి ఇల్లాలవుతుంది సుమా’’ అన్నారు. ఏమిటో ఈ కార్యం. గట్టెక్కేదాకా మనసంతా కలగాపులగంగా ఉంది.’

‘‘ఏం ఫర్వాలేదు బావా ! పోనీ నువ్వన్నట్టే వైశాఖ మాసంలోనే చూద్దాం ముహూర్తాలు’’.

‘మావయ్యా మీ మాటకడ్డొస్తున్నాననుకోకండి. నాదోమాట. వైశాఖ మాసంలో కాలువలు కట్టేస్తారు. యానాంకి పడవలో వెళ్లడం చాలా కష్టం. పైగా శ్రమతో కూడుకున్న పని. ఎండల్లో పరాయిచోట పిల్లా జెల్లా సామాన్లతో గోదారిపర్రలు దాటడం చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుందేమో ఆలోచించండి. ఒకవిధంగా మాఘమాసమే నయం. మరోసారి ఆలోచించి చూడండి సుమీ.’

‘నిజమేరా కాముడూ. మాకెవరికీ ఆ ఆలోచనే రాలేదు. ఇప్పటినుంచీ పనులు మొదలుపెడితే అవే అవుతాయిలే. రాజుగారితో ఈ మాటే చెబుతాను. వారంత దూరం ఆలోచించి ఉండరు.’

‘ఇందాకనగా విస్తళ్లేశాను. భోజనానికి రారేం? ఇంకెప్పుడు భోంచేస్తారు?’…లోపల్నించి కేక.

‘ఆ…ఆ…వచ్చే వచ్చే. నడు బావా. భోంచేసి మాట్లాడుకుందాం.’

‘ఒరే కావుడూ నువ్వు కూడా ఇక్కడ భోంచేసేద్దువుగాని నడు.’

‘అబ్బే వద్దు. వద్దు మావయ్యా. మీ అమ్మాయి వస్తానని చూస్తూ ఉంటుంది. పైగా చెప్పా చెయ్యకుండా అలా భోం చేసి వస్తావు అంటూ అమ్మ కూడా కేకలేస్తుంది. వస్తా బాబయ్యా’’.

‘‘మంచిదిరా అబ్బీ’’.

‘‘లాంతర్లు తెచ్చి చెరోపక్కా పెట్టవే అమ్మాయ్‌ బుడ్డిదీపం ఇలా ఇయ్యి. దీపం మండువా దగ్గర పెట్టు. మండువాలో బుల్లి గంగాళంతో నీళ్లూ చెంబూ ఉంచు’’.

మొగాళ్లు భోంచేసి వచ్చేసరికి కళ్లాపి చల్లి ముగ్గులు వేసిన వాకిట్లో మంచాలు వాల్చి పక్కలు పరిచి ఉంచారు. తమలపాకులు, వక్కలు ఉన్న పళ్లెం అందించింది జోగమ్మ.

అందుకుంటూ – ‘కులాసాయేనా అమ్మాయి. ఇంతకీ ఆడపిల్లా, మగపిల్లాడా…ఎన్నో నెలేమిటి?’ అంటూ పలకరించిన కాబోయే తమ్ముడి మావగారికి – ‘మగపిల్లాడేనండీ నాలుగోనెల. కులాసాయే !‘ అంటూ నమ్రతగా జవాబిచ్చి మెల్లిగా లోపలికెళ్లిపోయింది.

మళ్లీ పెళ్లి కబుర్లలో పడ్డారు కాబోయే వియ్యంకులు.

లోపల ఆడవాళ్లు భోజనాలకు కూర్చున్నారు. ’అసలే అంతంతమాత్రపు సంసారం. పైగా ఈ శారదా బిల్లొకటి! యానాంలో చేస్తారట పెళ్లి. పెళ్లంటే మాటలా, ఇంతమందిని ఎత్తినాటుగా వెళ్తే ఎలా చేస్తారు? ఓ ముద్దూ ముచ్చటా తీరేనా? ముద్దూ ముచ్చట్ల మాట దేముడెరుగు ముద్దయినా వేళకి అమరేనా ?’ మూతి ముడిచింది ఓ కూతురు.

‘‘అవును గానీ అక్కయ్యా. నువ్వేదో బరంపురం సంబంధం అన్నావు కదా ఆమధ్య–చెప్పావా అసలు బావగారికి?’’ తోటికోడలు ఆరా.

‘‘ఆహా చెప్పడవూ అయింది. చివాట్లు తిండమూ అయింది. ఏమనుకుంటే ఏం సాగింది గనుక. అన్నీ అక్షరాలా ఆయనగారు అనుకున్నట్లే జరగాలి. అంతే!’’ కంఠం రుద్ధమైంది కామమ్మగారికి ఉక్రోషంతో. ‘‘కట్టుకున్నదాని మాటకు విలువా పాడా?’’

“అమ్మా ఈ అమ్మాయిని నాన్న వీరభద్రుడి గుళ్లో చూశారట కదే? పైగా ఆ అమ్మాయి చెయ్యి కూడా చూశార్ట. సిరి, సంపద, సంతానభాగ్యం ఉన్న అమ్మాయి, ఎక్కడ కాలు పెడితే అక్కడ సంపద స్థిరంగా ఉంటుంది. బహు సంతానభాగ్యం కల పిల్ల. అన్నివిధాలా ఈ సంబంధం అనువుగా ఉందే అమ్మాయ్‌. అందుకే ఎలాగైనా ఈ పిల్లనే ఇంటికి కోడలిగా తేవాలనుకుంటున్నాను! అంటూ చెప్పారమ్మా నాన్న.” పట్నం నుంచి చిన్న కూతురు వివరణ.

“సిరిసంపదా పిల్ల ఎక్కడినుంచి తెస్తుంది? అక్కడేముంది గనక. అవన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇహ ఆవిడ తెచ్చేదేముంది? సంతానమన్నావా? అదేం భాగ్యం! ఎవరికి లేరు?? ఏమిటో ఆయనగారిదంతా ఒంటెత్తుపోకడ. తానెంతంటే అంత. కట్టుకున్నదాని మాటకి వీసమంత విలవైనా లేదు కదా!”

“పోనీలేవే అమ్మా…ఎవరైతేనేం? లక్షణంగా తమ్ముడికి పెళ్లయి కోడలొస్తుంది ఇంటికి. అంతకంటే ఇంకేం కావాలి? మిగిలిన విషయాలు నాన్నకొదిలెయ్‌.”

“సరేలేవే తల్లీ. వదలక పట్టుకు కూర్చున్నానా? పట్టుపట్టినా మాత్రం నా మాట చెల్లి చస్తుందా? సరేలే…లేవండిహ. పొద్దుపోయింది. వంటిల్లు సర్దుకుని కడుక్కోవాలింకా. అన్నీ అయ్యేసరికి ఝామురాత్రి అవుతుంది. గిన్నెలూ అవీ సర్దేయండి.”

‘‘మొత్తానికి మాఘమాసంలో ముహూర్తమే ఖాయం చేశారు. పెళ్లి పనులు సాగుతున్నాయి. మగపెళ్లివారైతే మాత్రం ఏవి తప్పుతాయి? పసుపు దంపించడం, కందులు వేయించి పప్పులు విసురు కోవడం, సారెలో ఆడపెళ్లివారిస్తే మాత్రం పది మంది కలిగిన సంసారం. అటుకులు దంపుకోకుంటే చాలవు కదా! మినుములు విసురుకోవాలి. ధాన్యాలు దంపించుకోవాలి. ఒకటా రెండా ఎన్ని పనులైతే అయ్యేను? తెల్లారాక పాలేరుని(పైలాణ్ణి) కేతా మాణిక్యం ఇంటికి పంపి, వాళ్ల జట్టుగాళ్లతో వచ్చి దంపులు మొదలుపెట్టమని చెప్పాలి. అలాగే వీడిచేత ధాన్యం బస్తాలు దంపుడు సావిట్లో వేయించాలి. చూడు పార్వతీ…పురులిప్పించి కాస్త పురమాయింపు దగ్గరుండి చేయించమ్మా’’.

‘‘అలాగే అక్కయ్యా…నేను చూస్తాగా’’

‘‘అమ్మా మా ఆడపడుచు కొడుక్కి భోగిపళ్లు పోస్తుందిట. దగ్గరగా ఉన్నావ్‌ కదా ఒదినా. ఓసారి వచ్చి వెళ్లు అంటూ కబురు చేసిందే. వెళ్లనా మరి?’’

‘‘ఎవరూ ఆ నడిమింటారి కల్యాణేనా? వాళ్లాయన బడి పంతులు ఉద్యోగంలో చేరాడనీ, ఉద్యగపూళ్లో కాపర పెడ్తాడని అనుకున్నారా మధ్య? ఇంకా వెళ్లలేదా ఆ ఊరు?’’

‘‘ఆమధ్య అలాగే అనుకున్నారు. కానీ ప్రస్తుతం సైకిల్‌ మీద అతనే వెళ్లివస్తున్నాట్ట రోజూ. ఇంతకీ ఏమంటావ్‌? వెళ్లిరానా?’’

‘‘వెళ్లవే. ఒద్దన్నానా! అయినా అంతదూరంనించి వచ్చావ్‌. ఆడబడుచునీ, పిల్లల్నీ చూసి రావద్దంటానా ఏమిటే? అయితే ఈ ఏడాది పండగలకి పుట్టింటికి రాలేదన్నమాట మీ ఆడపడుచు’’.

‘‘అవునమ్మా. తీసుకురావాలనే అనుకున్నాం. కానీ వాళ్ల పెద్ద పిల్లాడికి టైఫాయిడ్‌ జ్వరం రావడంతో మానేసింది. ఇప్పుడు తగ్గి కులాసాగానే ఉన్నాట్టలే. మరి వెళ్లిరానా’’

‘‘అలాగేనమ్మా. బాబయ్యగారి చిన్నాడు సాయం వస్తాడేమో అడుగు. నీతో సుభద్రని తీసుకెళ్తావా? పెందరాళే బయల్దేరి వెళ్లు. మరీ చీకటి పడకుండా వచ్చెయ్‌’’.

‘‘అలాగేనమ్మా. అయినా మా ఆడపడుచూ, వాళ్ల అత్తగారూ పట్టుబడితే మాత్రం రాత్రికి పడుకుని పొద్దున్నే చీకటితో బయల్దేరి వస్తానులే. కంగారు పడకు’’.

‘‘అదీ నిజమేలే. బావుండదు… ఉండమంటే వెళ్తాననడం. కానీ చీకటితో వచ్చేయండిసుమా! పండగపూటా బోలెడు పనులుంటాయి…’’

‘‘అలాగేలే’’

పెళ్లి ఏర్పాట్ల గురించి కాబోయే వియ్యంకుడితో మాట్లాడటానికొచ్చిన రామ్మూర్తిగారిని చూసి ‘‘రండి రండి అన్నయ్యగారూ… ఒసేయ్‌ వెంకటలక్ష్మీ. మావయ్యగారు కాళ్లు కడుక్కుందుకు నీళ్లు పట్రా. ఒరేయ్‌ అబ్బాయ్‌. నిన్నేరా చిన్నాడా. తువ్వాలు పట్రా. గదిలో బీరువాలో ఉంది. లోపలికి రండి అన్నయ్యగారూ. దాహం పుచ్చుకుందురుగాని’’

‘‘ఏం వద్దమ్మా. ఇప్పుడే పెద్దిరాజుగారి పొలం దాటి వస్తుంటే రాజుగారు కేకేసి ఏవో కబుర్లు చెబుతూ గంగా బొండాలు దింపించి ఇచ్చారు. బావ ఇంట్లో లేరా ఏమిటి?’’.

‘‘ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారు. ఇప్పుడే అలా నడింపల్లి రాజుగారింటికి వెళ్లారు. వచ్చేస్తారు. వదినగారూ, పిల్లలూ అంతా కులాసేనా? అన్నపూర్ణ బందరునుంచి వచ్చిందటగా? పాలేరు చేత జున్ను పాలు పంపించాంలెండి. వాడన్నాడు…’’

‘‘అవునమ్మా. చాలాకాలం అయిందని ఓసారి పండగలకి పిల్లని పంపించమని కార్డు రాయించాను బందరు. వాళ్ల మామగారు పొలం శిస్తులు వసూలు చేసుకునేందుకు కుండలేశ్వరం వస్తూ దీన్ని కూడా తీసుకొచ్చారు. సరే ఎటూ ఎదర పెళ్లి ఉందని అట్టే బెట్టేశాను’’

‘‘బావ రావడం ఆలస్యమవుతుందేమో నేను వెళ్లొస్తాను మరి’’.   

‘‘అబ్బే…ఎందుకూ పిల్లాడెళ్లాడు కబురు చెప్పడానికి. వచ్చేస్తారు. అదిగో మాటలోనే వచ్చేశారు’’

‘‘ బావగారూ నమస్కారం. కులాసాయేనా!’’

‘‘అబ్బే నీకు తెలుసుగా. మురమళ్ల శివారులో ఉన్న కాపుతో పని ఉంటుంది. వాడు పదే పదే కనబడి అడిగితేగానీ ఎంతో కొంత బాకీ చెల్లుబాటు చెయ్యడు. వాడి దగ్గర బాకీ వసూలు చేసుకుని దగ్గరే కదా అని ఇలా చక్కా వచ్చాను’’.

‘‘మంచిది బావగారూ…ఇవాళే ఆ తూర్పువైపునున్న నివేశన స్థలాలు రెండూ బేరం పెట్టి, రాజుగారికి చెప్పివచ్చాను. అలాగే ఆ ఎనిమిది కుంచాల చెక్కా విడిగా ఉంది. అది కూడా అమ్మేస్తానంటే– ఎందుకూ? తనఖా పెట్టి డబ్బు పట్టుకెళ్లండి. ఎప్పుడు వీలైతే అప్పుడు ఇద్దురుగాని అంటున్నారు రాజుగారు. ముందీ స్థలాలు అమ్మేస్తే రొఖ్ఖం వస్తుంది కదా. వెళ్లి బట్టలూ అవీ కొనాలి. దశమీ బుధవారం విఘ్నేశ్వరుడికి మీదు కట్టడం మంచిదన్నాడు యాగ్గీకుడు గారు. ఇహ పనులు మొదలుపెట్టాలి. అలా పొలంకేసి వెళ్దాం నడు బావా’’…అలాగే నడవండి.

‘‘ నేను మా వెంకట్రాముణ్ణి బరంపురం పంపిస్తున్నాను. పట్టుబట్టలూ, అప్పగింత బట్టలూ అక్కడినుంచి తెప్పిస్తున్నాను’’

‘‘అప్పగింత బట్టలు మేం కొనాలి కదా బావగారూ…’’

‘‘అదేమిటి?’’

******************************************

తరువాయి వచ్చే సంచికలో………...