10_017 తో. లే. పి. – కోలవెన్ను సాంబశివరావు

.

నా ఉద్యోగ సౌధంలో నాలుగవ అంతస్థు ఖమ్మం. కాగా అంతకుముందు గడించుకున్న స్వానుభవం అక్కడి నా జీవితాన్ని చాలావరకు సుఖవంతం చేసిందనే చెప్పవచ్చును. ధవళేశ్వరం నుండి బదిలీ పైన ఖమ్మం రావడం జరిగింది. రాగానే గవర్నమెంట్ క్వార్టర్స్ లభ్యం కాకపోవడంతో కొంతకాలం ఊళ్ళో అద్దె ఇంట్లో ఉండవలసివచ్చింది. మా ఇద్దరు పిల్లలను స్కూళ్ళకి పంపి నేను భోజనం కానిచ్చి ఆఫీసుకి నిత్యం సైకిలు ప్రయాణం ఒక అరగంట పాటు చేసేవాడిని. నేను మొదట్లో వర్క్ షాప్ లోనూ, ఆ తరువాత బదిలీ మీద సూపరింటెండింగ్ ఇంజనీర్ ఆఫీస్ లో డిప్యూటీ ఎక్జిక్యూటివ్ ఇంజినీర్ గా పని చేసాను. ఆఫీస్ లో నాకు ఇద్దరు బాస్ లు. టాప్ బాస్ సూపరింటెండింగ్ ఇంజినీర్.. ఆయనే శ్రీ కోలవెన్ను సాంబశివరావు గారు. అనుభవజ్ఞుడు. ఉన్నతమైన వ్యక్తిత్వం, సహృదయత ఆయనకు పెట్టని ఆభరణాలు. ఎదుటి మనిషి మీద నమ్మకం ఏర్పడితే, ఆ మనిషికి అవసరమైనచో తన ప్రాణాన్ని సైతం ధారపోసే మహానుభావుడు ఆయన. దైవభీతి, భక్తి ఉన్నవాడు. కష్టపడి  జీవితంలో పైకి వచ్చిన వ్యక్తి కావడంచేత ఎదుటివాడి కష్టం ఏమిటో సులువుగా గ్రహించగల స్వభావం ఆయనకు సహజసిద్ధంగా ఉండేది. ఆయనకు ముగ్గురు మగపిల్లలు, ఆరుగురు ఆడపిల్లలు సంతానం. సాంబశివరావు గారి సతీమణి సీతారావమ్మ గారు కూడా సహృదయురాలు. సాంప్రదాయబద్ధంగా ఆవిడ కట్టూ,బొట్టూ ఉండేవి. పూజలు, పునస్కారాలు విరివిగా చేసేవారావిడ. ఆవిడకి సంస్కృతం చదువుకుని టీచర్ గా ఉద్యోగం చేస్తూన్న మా ఆవిడ సీతాదేవి అంటే చాలా ఇష్టం. ఇద్దరు కలిసి తరచుగా గుళ్ళూగోపురాలకి వెడుతూ ఉండేవారు. మా క్వార్టర్స్ కూడా కాలనీలో ఒకదానికొకటి దగ్గర దగ్గర గానే ఉండేవి. 

సాంబశివరావు గారు చాలా దైవభక్తిపరాయణులు. భగవద్గీత లోని పద్ధెనిమిది అధ్యాయాలలోని శ్లోకాలను చివరి నుండి మొదటికి అసలు పుస్తకం చూడకుండా అప్పజెప్పగలిగేవారు. తమ స్వంత కారులో పిల్లలని రోజూ మా కాలనీకి దూరంగా వున్న స్కూళ్లకి పంపుతూ ఆ డ్రైవర్ కి చెప్పేవారు ఇతర స్కూల్ పిల్లలు ఎవరైనా వస్తారేమో అడిగి వారిని కూడా ఎక్కించుకుని జాగ్రత్తగా తీసుకుని వెళ్లమని. ఆయనకు  చీఫ్ ఇంజినీర్ గా  ప్రమోషన్ ఇచ్చి హైదరాబాద్ కి  పోస్టు చేసారు. ఆయన, కుటుంబాన్ని పిల్లల  చదువుల దృష్ట్యా కొంత కాలం ఖమ్మం లోనే ఉంచవలసిన పరిస్థితి వచ్చింది. అందుచేత ఆయన ఒక్కరే హైదరాబాద్ కి మకాం మార్చారు. ఇలా ఉండగా, ఒకసారి ఆయన పనిమీద హైదరాబాద్ నుండి ట్రెయిన్  లో విజయవాడ వెడుతూ ఆ ట్రెయిన్ వివరాలు ముందుగా నాకు ఫోను చేసి చెబుతూ నన్ను ఖమ్మం స్టేషనుకి వచ్చి తాను ఎక్కిన బోగీ S3 వద్ద కలవమన్నారు. మర్నాడు, వాళ్ళ అమ్మాయి పుట్టినరోజని, తాను కూడా తెచ్చిన బర్త్ డే గిఫ్ట్ ని నేను తీసుకుని దానిని వాళ్ళ ఇంట్లో అందజేయమని కోరారు‌. ‘అలాగేనండి’ అన్నాన్నేను.

హైదరాబాద్ నుండి వచ్చే ఆ ట్రెయిన్  ఖమ్మం స్టేషను కి రాత్రి పదకొండున్నరకి వస్తుంది. నేను ఆ రాత్రి సైకిలు మీద బయలుదేరి పదకొండుగంటలకే స్టేషనుకి చేరుకున్నాను. కొంతసేపటికి ట్రెయిన్ వచ్చి ప్లాట్ ఫారం మీద ఆగింది. నేను గబగబా ఇంజను వైపు వెళ్ళి వరసగా చూస్తూండగా S1, S2 బోగీలు, ఆ వెంట D1, D2, D3 బోగీలున్నాయి. S3 బోగీలేదు. అర్ధంకాలేదు…సరే అనుకుంటూ గార్డ్ బోగీ వైపు హూటాహుటీ గా వెడుతూండగా ఆ  గార్డు బోగీ చివరి S3 బోగీ కనబడడం, ట్రెయిన్ స్టార్ట్ అవడం జరిగాయి. అప్పటివరకూ  చేతిలో పేకెట్ తో క్రిందికి దిగి నాకోసం ఎదురు చూసిన ఆయన, ఇక నేను రాలేదనుకుని వెనుతిరిగి స్లోగా కదులుతూన్న ట్రెయిన్ ఎక్కబోతూంటే, నేను గమనించి గబగబా ఆయన్ని పిలిచి ఆయన చేతిలోని పేకెట్ ని అందుకుని, దానిని మరునాడు ఉదయాన్నే వారింట అందజేసాను..ఇదంతా వాస్తవానికి ఒక గొప్ప సాహసమే మరి ! అర్ధరాత్రి సైకిలు తొక్కుకుంటూ స్టేషను కి వెళ్ళి,ఆయన్ని కలిసి ఆయన అప్పజెప్పిన పనిని సకాలంలో సక్రమంగా చేయగలిగినందుకు ఆయన, ఆయన కుటుంబం ఎంతో సంతోషించి, నాకు పదేపదే ధేంక్స్ చెప్పారు. నేను పడిన శ్రమ కూడా నాకు గుర్తుకు రాలేదు వారి ఆ మాటలు వింటూంటే.

ఇలా మరి కొన్నేళ్ళు ఖమ్మంలో గడిచాకా నాది Long standing service అవడంతో అక్కడనుండి నన్ను మాచెర్ల కు బదిలీ చేసారు. ఖమ్మం ఆఫీసులో రిలీవ్ అయాను. ఇక 2, 3 రోజుల్లో మాచెర్ల లో జాయిన్ కావాలి. ” పిల్లలు చదువు సగంలో ఉంది …ఎలాగరా నాయనా ?! ” అనుకుంటున్నాను.

మర్నాడు ఆదివారం సి.ఇ. గారు సతీసమేతంగా హైదరాబాద్ నుండి ఖమ్మం వచ్చి ఐ.బి. లో విడిది చేసారు. వారిని కలవవలసినదిగా నాకు బంగ్లా నుండి కబురు వచ్చింది. వెంటనే వెళ్ళాను. నన్ను లోపల రూం లోనికి రమ్మన్నారు. అక్కడ సాంబశివరావు గారు, వారి సతీమణి ఉన్నారు. నమస్కారాలు, కుశల ప్రశ్నలు అయ్యాకా, వారు అడిగిన మీదట నా మాచర్ల బదిలీ, తాజా పరిస్ధితిని వారికి నివేదించాను. వింటూనే, నా మాటలకు స్పందిస్తూ, మేడమ్ గారు సి.ఇ. గారితో అన్నారు” అదేమిటండీ? సుబ్బారావు గారు, కుటుంబం ఇంతకాలంగా మనకు ఎంత సహాయం చేస్తూ వచ్చారు?! మరి, దానికి ప్రతిఫలమా ఈ ట్రాన్స్ఫరు ? చేయగలిగితే మనం ఉపకారం చేయాలి..లేదా ఊరుకోవాలి..అంతేగానీ అపకారం చేస్తామా?? అసలు, మాచర్లలో మన కాలనీ క్వార్టర్స్ అన్నీ పక్కనున్న సిమెంటు ఫాక్టరీ కారణంగా దుమ్ముమయం అని విన్నాను… అలాంటప్పుడు పాపం… సీతమ్మ, పిల్లలతో అక్కడ ఎంత అవస్ధ పడాలో ?!…” అన్నారు.

అంతే…ఆవిడ మాటలను ఆయన శ్రద్ధగా ఆలకించి, ఒక క్షణం ఆలోచించి నాతో అన్నారు ” సుబ్బారావుగారు.. మీ ట్రాన్స్ఫర్ ఆర్డర్లు కేన్సిల్ చేయిస్తాను. మీరు ఖమ్మంలో మీ పోస్టు లోనే తిరిగి జాయిన్ అవండి మళ్ళీ ఆర్డర్లు రాగానే ..సరేనా ? ” అని.

చెప్పద్దూ ?!

అనుకోని అదృష్టం తలుపు తట్టింది అనిపించింది నాకు…..

***   ***  ***  ***  ***

మేము ఇద్దరం సర్వీసులో రిటైరయిన అనంతరం నేను విజయవాడ లోనూ, ఆయన తన స్వగ్రామం కంకిపాడు లోనూ స్ధిరపడ్డాము. పెద్దలు అన్న గౌరవంతోనూ, కంకిపాడు నాకు దగ్గరే అవడంచేతనూ నేను అప్పుడప్పుడు ఆ దంపతులను మర్యాదపూర్వకంగా వారింట కలుస్తూ ఉండేవాడిని. వారూ ఎంతో అభిమానంగా, ఆత్మీయంగా నన్ను పలకరించేవారు కలిసిన ప్రతీసారి.. ఇలా ఉండగా, నా శ్రీమతి 2004 లో కాలం చేసింది. ఈ వాస్తవాన్ని, ప్రత్యేకించి సీతారామమ్మగారు అసలు జీర్ణించుకోలేకపోయారు. ఆవిడ అంతకుముందు తరచూ నాతో అంటూండేవారు ” సుబ్బారావు గారూ…మాకు ఆడపిల్లలు ఏడుగురండీ ! మన సీతమ్మతో కలిసి ‘ అని. అంత అభిమానం అన్నమాట ఆవిడకి….!!

నేను ఆ దంపతులను చూడడానికి కంకిపాడుకి వెళ్ళిన ఒక సందర్భంలో వారిద్దరూ నా రాకకు ఎంతో ఆనందించి, చివరకి వారికి వీడ్కోలు పలికి తిరిగి వచ్చేసే సందర్భంలో సీతారావమ్మ గారు నా చేతిలో రెండు పెద్ద సీసాలు ( ఆవకాయ, ఉసిరికాయ ఊరగాయలతో నింపి ) ఉంచారు.

 ఇక సాంబశివరావు గారు ….

ఈనాడు దినపత్రిక లో ప్రచురింపబడే ‘ అంతర్వాణి ‘ ధార్మిక వ్యాసాలను చదివి వాటిని తిరిగి ఒక డైరీలో ఎత్తి రోజూ వ్రాసుకోవడం ఆయన నిత్యకృత్యాలలో ఒకటి. అలా ఏడాది గా వ్రాసుకుంటూ వచ్చిన ఆ వ్యాసాలతో ఉన్న తన డైరీని  పితృవాత్సల్యంతో నాకు  కానుకగా ఇచ్చారు. నిజానికి దానిని ఒక  అమూల్య కానుకగా భావిస్తాను.

మరి కాలగమనంతో బాటుగా కొన్ని మార్పులు సహజం కదండీ?!  వీటిలో భాగంగా…..ముందుగా సీతారావమ్మ గారు, అటు తరువాత మరికొంత కాలానికి సాంబశివరావు గారు దివంగతులయారు.కాగా, ఆ దంపతుల సౌజన్యాన్ని మాత్రం నేను ఏనాడూ మరువను…మరువలేను.

.

                                           **ధన్యవాదాలు..నమస్కారములు**

.