.
పీవీ ప్రధాని కావడం అప్పటి చారిత్రక అవసరం
సీనియర్ పాత్రికేయులు కృష్ణారావు
ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ దుర్మరణం తరువాత పీవీ నరసింహారావు ప్రధాని కావడం అప్పటి చారిత్రక అవసరమని ప్రముఖ పాత్రికేయులు అప్పరసు కృష్ణారావు (ఆంధ్రజ్యోతి, ఢిల్లీ) వ్యాఖ్యానించారు. పీవీ శతజయంతి సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి (చెన్నై) యూట్యూబ్ ద్వారా మే 8న సాయంత్రం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన “పీవీ రాజకీయ, సాహిత్య వ్యక్తిత్వం” అంశంపై ప్రసంగించారు. పీవీ విదేశీ పర్యటనలతో మొదలుపెట్టి ఆయన జీవితంలోని అనేక ఘట్టాలకు తాను ప్రత్యక్ష సాక్షినని వక్త పేర్కొన్నారు. అందువల్లే ఆయన మీద ఒక పుస్తకం రాయమని ఒక ప్రచురణ సంస్థ అడగడంతో “విప్లవ తపస్వి పీవీ” అనే పేరుతో రాశానని, అది తనకు కలిగిన అదృష్టమని ఆనందాన్ని వ్యక్తం చేశారు.
దోపిడీ లేని సమాన అవకాశాలు కలిగిన సమాజం ఏర్పాటు చేయడమే అన్ని సమస్యలకు పరిష్కారమని నమ్మిన పీవీ… నూతన ఆర్థిక సంస్కృతి అనే కొత్త ఒరవడి దిద్దారని చెప్పారు. అప్పట్లో బట్టలుతికే యంత్రం (వాషింగ్ మెషీన్) ఉపయోగానికి వ్యతిరేకంగా సీపీఐ పార్లమెంటులో వెలిబుచ్చిన అభ్యంతరాలకు జవాబుగా… ఇలాంటి సంస్కరణలు రాకపోతే మన దేశం పనిమనుషుల దేశంగా మిగిలిపోతుందని పీవీ గట్టిగా బదులిచ్చారని కృష్ణారావు వెల్లడించారు. ఆనాటి ఆ సంస్కరణల ప్రభావం ఎంతటిదన్నది నేడు స్పష్టంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. సంస్కరణల కారణంగా అనేక రంగాల్లో జరిగిన పురోగతిపై సింహావలోకనం చేశారు. ఈనాడు విద్యుత్ కొరత లేకపోవడం అనేది ఆనాడు ఆయన ప్రయివేటీకరణ దిశగా తీసుకున్న చర్యలే కారణమని చెప్పారు. తమ తమ నియోజకవర్గాల అభివృద్ధికై ఎంపీలకు నిధులు కేటాయించడం (ఎంపీ లాడ్స్), పార్లమెంటు స్థాయీ సంఘాలు ఆయన ప్రవేశపెట్టినవేనని గుర్తు చేశారు. అంతకుముందు ఉండిన నేతలు సాధించలేని విజయాలను సాధించారని, సంస్కరణలే అందుకు కారణమని అన్నారు.
దేశ స్వాతంత్ర్య రజతోత్సవాల సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రసంగిస్తూ ఒక కవితను వినిపించారని, అందులోని విరోధాభాసతో కూడిన “విప్లవ తపస్వి” అనే పద ప్రయోగం చేశారని చెప్పారు. విప్లవం, తపస్సు రెండూ విరోధాలైనా, ఆ రెండింటినీ పీవీ సాధించారని, అందుకే ఆ మాటనే తను ఆయనపై రాసిన పుస్తకానికి శీర్షికగా ఎంచుకున్నానని వక్త వెల్లడించారు. పాములపర్తి సదాశివరావు, గార్లపాటి రాఘవరెడ్డి తదితరులతో కలిసి పీవీ చేసిన సాహిత్య కృషిని క్లుప్తంగా వివరించారు. కవిగా, కథా, నవలా రచయితగా, విమర్శకుడిగా, అనువాదకుడిగా ఆయన చేసిన రచనలను ప్రస్తావించారు. రహదారులు, భవనాలనే కాదు… సాహిత్యాన్ని కూడా మెరుగుపరచాలన్న ఆయన వ్యాఖ్య చిరస్మరణీయమని కొనియాడారు. ప్రముఖ రచయిత యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రచించిన “హిందీ సాహిత్య చరిత్ర”కు పీవీ 36 పేజీల ముందుమాట రాయడం ఆయనకు హిందీ సాహిత్యంపై ఉన్న పట్టును తెలియజేస్తుందన్నారు. కార్యక్రమాన్ని నిర్వహించి వక్తను పరిచయం చేసిన మరొక ప్రముఖ పాత్రికేయులు రెంటాల జయదేవ మాట్లాడుతూ… ఇంటర్ మీడియట్, ఆ పై స్థాయిలలో తెలుగు మాధ్యమం ఉండడానికి, తెలుగు అకాడమీ ఏర్పాటుకు పీవీయే కారణమని గుర్తు చేశారు.
.