10_018 బోట్స్‌వానాలో మన పండుగలు

.

బోట్స్‌వానా లో ఉన్న తెలుగు వారంతా జరుపుకొన్న తెలుగు పండుగల వేడుకల విశేషాలు మరికొన్ని…..

1993 లో ఆ దేశాధ్యక్షుడు సువాపాన్ ( Suapan ) లైన్ ( 130 కి. మీ. ) మొదలుపెట్టడం మేం అక్కడున్న రోజుల్లో ఒక గొప్ప విషయం. ఇంగ్లీష్ మీడియం వల్ల మన దేశస్థులకి సమాచార మార్పిడి సులభమైంది. ఆ సందర్భంలో మేం ఉన్న అయిదారు సంవత్సరాలు గడిపిన విధం గురించి ముందుగా చెప్పాను. కొంతమంది తెలుగు వారు, హిందీ మాట్లాడేవారు భజనల కోసం వచ్చి అందరూ కలిసి చాలా పండుగలు చేసుకునేవాళ్లం.

అల్లాగే చుట్టుపక్కల ఉన్న సఫారి పార్కులు చూడటానికి వెళ్ళేవాళ్లం. అక్కడ ఆ అడవుల మధ్య కుటీరాల్లో ఉంటూ ఉన్న కొద్దిమంది కూడా చిన్న చిన్న పండుగలు చేసుకునేవారు. వినాయక చవితి కి అక్కడ మట్టితో వినాయకుణ్ణి చేసుకుని పాటలు పాడుకుని, అడవి ఆకులతో పూజ చేసుకుని చిన్న నీటి మడుగుల మధ్య తిరుగుతూ కథ చెప్పుకున్నాం. ఇంక ప్రసాదం వెంట తీసుకుని వెళ్ళిన పళ్లే. బస చేసిన కుటీరంలో వండి ఐస్‌బాక్స్ లలో తీసుకెళ్లిన రాజ్‌మా లు, పచ్చళ్లు వగైరాలతో నైవేద్యం. వెంట తీసుకు వెళ్ళిన రైస్ కుక్కర్లు, చపాతీలు ఆకలి తీర్చేవి. అక్కడ లభించే భోజనం లాంటిది మనకి అలవాటు లేక, రుచి తెలియక తినలేము.

సరే ! నదులన్నీ పర్వతాలలో పుట్టి ప్రవహిస్తాయి కదా ! అలా పుట్టి పెరిగి ఇసుకలో మాయమైపోయే నీటి ప్రవాహం ఉన్న బోట్స్‌వానా లో అతి పెద్ద మంచినీటి డెల్టా ‘ ఒకవాంగో ‘ ( Okavango ) డెల్టా. అక్టోబర్ నుంచి మే వరకు నీరు నిలిచి వేసవి రాగానే క్రమంగా మాయమైపోతుంది. నదులు సాధారణంగా సముద్రం వైపు ప్రవహించి అక్కడ కలిసిపోతే, ఇక్కడ మాత్రం ఇసుక తిన్నెలలో కలిసి పోతాయి. ఆ నీటి ధారలు ఎన్నో రకాల జంతువులకి ఆధారం. మనం ఆ నీటిలో చిన్న తెప్పలలో హాయిగా తిరుగవచ్చు. అక్కడి ప్రజలు ఆ నీటి మధ్య మనల్ని చక్కగా విహరింపజేస్తారు. గట్టిగా పద్యాలు, పాటలు పాడుతూ సృష్టికి మూలమైన భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఆ అద్భుతాన్ని చూస్తూ ఆనందించాము. ఆ అసాధారణమైన నీటివాలు, ఆ చిత్తడి నేలలు ( Swamps ) ఆదేశంలోని ఒక అద్భుతం. మనం ‘ జూ ’ లలో కూడా చూడలేని ఎన్నో రకాల జంతువులు, ఎక్కువ లోతు లేని నీటి మడుగులు, జీబ్రాలు, కొమ్ములున్న లేళ్ళు కనబడతాయి. హఠాత్తుగా రెక్కలు విప్పుకుని ఎగిరే వింత పక్షులు చేపలకోసం వెదికే తీరు కన్నుల విందు చేస్తుంది. ఆ అద్భుతాలు తిలకిస్తూ ఎవరికి వచ్చిన భాషలో వారు సృష్టికర్తని కీర్తిస్తూ పండుగ చేసుకున్నాం. ఆ ‘ కలహారీ ’ ఇసుక తిన్నెల మధ్య, ‘ ఒకవాంగో ’ డెల్టా వద్ద, గుంపులు గుంపులుగా జీబ్రాలు, లేళ్లూ, దుప్పులు ఆ తియ్యని గడ్డి మేస్తూ పెద్ద మిలిటరీ బెటాలియన్ లాగా ఆ వినీలాకాశం క్రింద స్వేచ్ఛగా కదులుతాయి.

అక్కడే పంచతంత్ర కథలు చెప్పుకున్నాం. ఎన్నడూ, ఎక్కడా కనబడని జంతువులు, పక్షుల మధ్య గడిపి భగవన్నామ స్మరణ చేయడం ఒక శాంతియుతమైన పూజ, అనిర్వచనీయమైన అనుభవం. అక్కడి ప్రజలు పిల్లల్ని వీపుకి కట్టుకుని ‘ ఒకవాంగో ’ నది దాటడం, అటు ప్రక్కగా వెళ్ళే ఏనుగుల గుంపుల మధ్య, మొసళ్ళ మధ్య గడపడమే ఒక పండుగ. ఆ నేషనల్ పార్క్ పేరు ‘ ఛోబే ’ ( Chobe ). అక్కడి తట్టలు, బుట్టలు వంటి వాటిని తాటి ఆకుల వంటి ఆకులతో అల్లి ఉపయోగించుకుంటారు. ‘ ముకుషు ’ ( Mbukushu ) అని పిలువబడే తండా అని అనవచ్చు. ఇప్పటికీ కూడా బుష్‌‌మెన్ గా వ్యవహరించే ఈ ప్రజల వేట, వేషధారణలో మార్పు లేదు.

నేడు గెబరోన్ ( capital ) నుంచి 400 కిలోమీటర్ల రైల్వే లైన్ జింబాబ్వె, దక్షిణాఫ్రికా లను కలుపుతోంది. నేటి విధ్యావిధానం కూడా అమలులోకి వచ్చి, కంప్యూటర్ల వాడకం ఫ్రాన్సిస్ టౌన్, మఛేడి లాంటి కొన్ని ఊళ్లలోని స్కూళ్ళలో ప్రవేశపెట్టారు. డాక్టర్లు, మంచినీటి సదుపాయం కూడా చాలాచోట్ల ఏర్పడింది. హెల్త్‌కేర్ నెట్‌వర్క్ ఏర్పడింది.    

ఈ విధంగా ఎక్కువ పరిచయం లేని బోట్స్‌వానా లో ‘ లాండ్ ఆఫ్ డిసప్పియరింగ్ రివెర్స్ ’ ( Land of disappearing rivers ) గా ప్రసిద్ధి కెక్కి ‘ ఛోబే ’ లాంటి గేమ్ పార్కులని చూసి, మాలోని భాషాబేధం మరిచిపోయి, అందరం కలిసి  భగవంతుని కీర్తిస్తూ, పాటలు పాడుకుంటూ, పిల్లలకి పంచతంత్ర కథలు, ఇతర కథలు మొదలైనవి చెప్తూ వీలైనంతవరకు అక్కడి ప్రజలతో కలిసి, మెలిసి తిరుగుతూ గడిపాము. అక్కడ పరిచయమైన స్నేహితులు, ప్రజలు అందరికీ శిరసు వంచి నమస్కరిస్తూ…..

దుమేల,రా ! దుమేల,మా !

( కుడి మోచేతి క్రింద ఎడమ అరచేయి ఆన్చి ముందుకి ఒదిగి చేసే అభివాదం, నమస్కారం )

‘ దుమేల, మా ! ’ అనేది స్త్రీలకి, ‘ దుమేల, రా ’ అనేది పురుషులకి ఉపయోగిస్తారు. 

.

**********************************