10_018 కథావీధి-వడ్డెర చండీదాస్ రచనలు 2

.

వడ్డెర చండిదాస్ గారి హిమజ్వాల సంక్షిప్త పరిచయం.
హిమజ్వాల ని నవల గా వ్యవహరించడం సరికాదు కనుక పుస్తకం అనే ప్రస్తావించాలి.

క్రితం భాగం లో వివరించినట్లు చండీదాస్ గారి రచనా శైలి కీ చలం, త్రిపుర, బుచ్చిబాబు గార్ల వంటి కొందరి రచనా శైలి కీ సామ్యం ఉన్నప్పటికీ కథాంశాన్ని ఆవిష్కరించే విషయం లో చండీదాస్ గారి జోక్యం తక్కువ. ఇదీ వీరి ప్రత్యేకత.

మొదటిసారి చదివినప్పుడు పాత్రల భావాలు అర్ధం కావు. మూడు నాల్గుసార్లు చదివిన తరవాత మాత్రం రచయిత ప్రతిపాదించిన ఉదాత్తమైన తాత్వికం అవగాహనకి వస్తుంది.

మనకి వినడానికి కొంత వింత గా అనిపించే విషయం ఏమిటంటే పాత్రల స్వభావం, ప్రవర్తనల విషయం లో రచయిత జోక్యం తక్కువ గా ఉంటుంది. ఈయన రచనలు పూర్తిగా చదివి విశ్లేషణ చేసిన వారికి ఈ విషయం అవగాహన కు వస్తుంది. అనుక్షణికం చదివిన వారికి ఈ విషయం స్పష్టంగా బోధపడుతుంది.

ఈ ఫణితి విశ్వనాధ వారిది.

‘ హిమజ్వాల ‘ అనే పుస్తకాన్ని చండీదాస్ గారు 1960 లో రచించడం మొదలుపెట్టి కొన్ని పేజీలు రాసి అర్ధాంతరం గా ఆపేసి తిరిగి 1967 లో ప్రారంభించి ఏక బిగిన రాసి పూర్తిచేశారు. అనంతరం  ఆంధ్రజ్యోతి వార పత్రిక లో ధారావాహికం గా ప్రచురించబడింది.

హిమజ్వాల పుస్తకం లోని విషయం స్థూలం గా మానవ సంబంధాలని విశ్లేషణ చేయడమే. అయితే ఇది కుప్పుస్వామి అయ్యర్ గారి ( ఇంగ్లీష్ గ్రామర్ ) మేడ్ డిఫికల్ట్ లా ఉంటుంది.

” ఈ బండ పదాలూ, అనవసరం అయిన వర్ణనలు ఉండడం మూలాన నాకు ఆరు నెలలు పట్టింది. అవే లేకపోయి ఉంటే ఈ పుస్తకాన్ని చదవడానికి బస్సు లో కూర్చుని విజయవాడ నుంచి హైదరాబాదు కు వెళ్లే అంత సమయం చాలు. ఈ నవల లోని నాయిక ఒక టైప్ మనిషి. చలం గారు ప్రతిపాదించిన స్త్రీ స్వాతంత్య్రం కాన్సెప్ట్ ని బాగా సాగదీసినట్టుంది. రచయిత రాసిన కావ్యాన్ని పబ్లిషరు పొరపాటున నవల లా పబ్లిష్ చేసి ఉంటాడు ” అని సంజీవ్ అనే అయన గుడ్ రీడ్స్ అనే వెబ్ సైట్ లో ఈ పుస్తకం పైన తాను రాసిన అభిప్రాయం లో వాపోయారు. ఆయన అభిప్రాయం లో మొత్తం మీద ఈ నవల లో అన్నీ తింగరి పాత్ర లే ఉన్నాయి. క్లయిమాక్స్ అసందర్భం గా సృష్టించినట్టు గా ఉంది.

పుస్తకం చదివాక మనకి కూడా ఇలాగే అనిపించవచ్చు. కానీ ప్రయాణం లో కాలక్షేపం కోసం చదవడానికి చాలా పుస్తకాలు ఉన్నాయి. ఈ పుస్తకం ఆ విభాగానికి చెందినది కాదు. ముగింపు మాత్రం ఇంకో పుస్తకంలో నుంచి తీసుకుని వచ్చి ఇందులో అతికించినట్లు ఉంటుంది.

అదే విధంగా ఈ పుస్తకం లోని శైలీ విన్యాసాల గురించి చాలా మెచ్చుకున్న పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు ఆఖర్లో ఇంత గొప్ప శైలీ విన్యాసాన్నీ ఇత్తడి చెంబు కి మెరుగు పెట్టడం తో పోల్చారు. అసలు విషయం లో సారం లేనప్పుడు నగీషీ లు రాణించవనీ, ఇంట్లో వాడే ఇత్తడి చెంబుకి మెరుగులు పెట్టినా  పెద్దగా ఉపయోగం ఉండదనీ వారి భావం.
ఇహ ఎర్ర భావజాలకులు ఇంత గొప్ప పుస్తకాన్నీ బూర్జువా ఆని ఒక్క ముక్కలో తేల్చేశారు.

ఈ పుస్తకం 1970 వ దశకం లో ఆంధ్రజ్యోతి వార పత్రికలో  ధారావాహిక నవల గా ప్రచురించబడిన సమయంలో ఆ పత్రిక కి పురాణం వారే సంపాదకులు. ఉద్యోగ నిర్వహణ లో భాగంగానేమో అప్పట్లో దీన్ని ఆకాశానికి ఎత్తేసేవారు.

ప్రచురణా కాలం లో ఈ పుస్తకం పత్రిక సర్క్ లేషన్ నీ బాగా పెంచింది.

ఈ పుస్తకాన్ని ” తెలుగు తనపు కూపం లో ఇమడలేక అభాసుపాలైన కళాతపస్వి బుచ్చిబాబు గారికీ ” అనుక్షణికాన్ని ” ఆంధ్రజ్యోతి లో సీరియలించి కీర్తినీ ఆపకీర్తినీ మూట కట్టుకున్న పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారికీ ” వడ్డెర చండీదాస్ గారు అంకితం చేశారు.

ప్రత్యేకంగా ఎత్తి చూపలేము కానీ ఈ పుస్తకం లో ఇంకో లోపం సంఘటలనీ, సన్నివేశాలనీ కాలగమనం తో సమన్వయం చేయడం. చదువుతున్నప్పుడు ముందు వెనుకలు అర్ధం చేసుకోవడానికి సమయం పడుతుంది. చిన్న చిన్న ఆలోచనలు వ్యక్తం చేయడానికి పెద్ద పెద్ద వాక్యాలూ, సమాసాల వాడకం ఇంకో ఇబ్బంది కలిగించే విషయం. ఉదాత్తమైన పాత్రల ప్రవర్తన లో ఉన్న చంచల స్వభావం చదివే వారికి మింగుడు పడడం కష్టం. అది తర్కం లో ఇమడని విషయం.

ఇంక కథ లోకి వస్తే… విషయం చాలా స్వల్పం.
కథ హైదరాబాదు, ముంబై, ఉదకమండలం, అరకులోయ, విశాఖపట్టణం నేపథ్యాలలో సాగుతుంది.

కృష్ణచైతన్య అనే యువకుడు ఉస్మానియా యూనివర్సిటీ, ( అనే అనుకోవాలి ) లో ప్రొఫెసర్, లలితకళల లో ముఖ్యం గా శిల్ప, చిత్ర కళలలో అభినివేశం ఉన్నవాడు. నివాసం బంజారా హిల్స్ వంటి ప్రదేశంలోని పెద్ద బంగాళా. అతను విజయసారధి అనే ధనవంతుడి కొడుకు. తల్లి లేని వాడు. సారధి విశాఖపట్నం లో ఉంటాడు.

ఒకరోజు కృష్ణ చైతన్య ( గాయపడి? ) అపస్మారకం లో ఉన్న గీతాదేవి అనే ఆవిడని కాపాడి ఆశ్రయం ఇస్తాడు. ఆమె తండ్రి ఆస్తిని ని కోల్పోయిన మనిషి. గీతాదేవి ది బాల్యం లో ధనిక నేపథ్యం. ఇప్పుడు పేదరికానికి కొంచెం ఎక్కువ స్థాయి. ఆమె తండ్రి తాత్వికుడు. ప్రస్తుతం తన చిన్ననాటి స్నేహితురాలి ఆదరణ తో యూనివర్సిటీ లో విద్యాభ్యాసం కొనసాగిస్తూ ఉంటుంది. ( ఇంగ్లీష్ లో M. A? ) గీతాదేవి మంచి రూపసి, విద్యావంతురాలు, సంస్కారి.

కృష్ణచైతన్యకి శశాంక్ అనే ఒక అమెచ్యూర్ జర్నలిస్ట్ స్నేహితుడు ఉంటాడు. ఇతనికి కృష్ణ చైతన్య ఇంట్లో పరిచయం అయిన గీతాదేవి పట్ల అవ్యక్త మైన ఆకర్షణ.

కృష్ణచైతన్య గీతాదేవి కొంతకాలం సహజీవనం చేస్తారు. అనేక విషయాలు చర్చించడం అయిన తరవాత గీతాదేవి అతని పై తన ఇష్టాన్ని వ్యక్తం చేసిన సందర్బంలో కృష్ణ చైతన్య సున్నితంగా తిరస్కరిస్తాడు. దీనికి పెద్ద గా కారణం ఏదీ ఉండదు. నిజానికి అతనూ ఆమె పట్ల ఆకర్షణావస్థ ని దాటి అభిమానాన్ని పెంచుకుంటాడు….. నొచ్చుకున్న గీతాదేవి ” ప్రొఫెసర్ గారూ మనిషికి ఆహార సంబందమైన ఆకలే కాకుండా వేరే ఆకలి కూడా ఉంటుంది ఆని గ్రహించండి ” అని ఒక ఉత్తరం రాసి పెట్టి ముంబై లోని తన స్నేహితురాలి ఇంటికి వెళ్ళిపోతుంది.

ముంబై లో ఆమె తన స్నేహితురాలి ఇంట్లో ఉంటూ కృష్ణచైతన్య జర్నలిస్ట్ స్నేహితుడి సహాయంతో ఒక యాడ్ ఏజెన్సీ లో ఉద్యోగం సంపాదించి అక్కడి వాతావరణం లో ఇమడలేక, స్నేహితురాలి భర్తను తట్టుకోలేకా, విశాఖపట్నం లోని ఒక కళాశాల లో ఉద్యోగం సంపాదించి అక్కడకు మకాం మారుస్తుంది.

ఆ ఊళ్ళోని ఒక స్నేహితురాలి ఇంట్లో గీతాదేవికి శివరామ్ అనే అతని తో పరిచయం అయి, అతను వ్యక్తం చేసిన వివాహ ప్రతిపాదనను ఆమె అంగీకరిస్తుంది. శివరామ్ స్థితిమంతుడు. ఒక యువతి గా ఉన్న గీతాదేవి ప్రవర్తన లో అతనికి ఒక స్వాతంత్ర్య భావాలు కలిగిన స్త్రీ కనిపించి మెచ్చుకుంటాడు. అదే విధంగా ప్రవర్తించే ” భార్య గీతాదేవి ” లో అతను విచ్చలవిడితనాన్ని దర్శిస్తాడు. విషయం చిలికి చిలికి గాలి వాన అవుతుంది.

ఒక వర్షం పడిన సాయంత్రం వారిద్దరూ అరకు లోయలో ఉండగా గీతాదేవి ప్రవర్తన, శృంగారం విషయం లో ఆమె వ్యక్తపరచిన అభిప్రాయాలూ, ఆమె చేష్టలూ చూసిన  అతను ఆమెని బజారు మనిషి తో పోల్చి ఆమెను విడిచి వెళ్లి పోతాడు.

చిరు జల్లులలో నడుస్తున్న గీతాదేవి కి ఒక మధ్యవయస్కుడు పరిచయం అవడం, ఆమె అతను సహజీవనం చేయడం అది వివాహనికి దారి తీయడం జరుగుతుంది. అతని పేరు విజయ సారధి అనీ అతను కృష్ణ చైతన్య తండ్రి అనీ గీతాదేవి కి తరవాత తెలిసినా ఆమె తన విషయాలు బయట పెట్టదు.

 
xxxxxxxxx

దీనికి సమాంతరం గా గీతాదేవి వియోగం కృష్ణ చైతన్య లో ఒక మానసిక అలజడిని సృష్టిస్తుంది. అది ఎక్కువై ఒక పశ్చాత్తాప భావనకి దారి తీస్తుంది. ఆ అలజడి ని తట్టుకోలేక అతను ఉదకమండలం వెడతాడు.

అక్కడ అతనికి చిదంబరరావు అనే ఆయన తో పరిచయం కలిగి స్నేహం గా మారుతుంది. చిదంబరరావు వైద్యులకు అంతు చిక్కని వ్యాధి తో బాధపడుతూ ఇంక వైద్యాలు ఆపేసి శేష జీవితాన్ని ప్రశాంతం గా గడపదలచి, భార్య మాధురీదేవి తో కలసి ఉదక మండలం వస్తాడు.

మాధురీదేవి ఆలోచనలు వేరే గా ఉంటాయి. ఆవిడ జీవితం మీదా, శారీరక వాంఛ ల మీదా మోజు లు ఉన్న మనిషి. అవి భర్త వలన నెరవేరేవి కావు అని తెలిసినా అణుచుకుంది. ఇప్పుడు భర్త జీవితం ప్రశ్నార్థకం. దానికి తోడు అందుబాటు లో రూపవంతుడు.

ఒక సాదువు ఇచ్చిన మూలిక తో చిదంబరరావు కోలుకుని, ఆరోగ్యపరంగా పూర్వావస్థకు చేరుకుని అన్నిరకాలు గానూ తేరుకుని భార్య తో కలసి స్వగ్రామం వెళ్లి పోతాడు.

తరువాయి వచ్చే సంచికలో……

.

***********************************************