10_019 అమెరికా ఇల్లాలి ముచ్చట్లు – కోవిడ్‌లో ప్రయాణం

Please visit this page

.

.

ఏమిటీ…మెసేజ్ లు తర్వాత తీరుబడిగా చూసుకోవచ్చు, ముందు ఆ తడితల తుడుచుకుని, అక్కడ పెట్టిన కాఫీ తాగమంటారా?

.

నేను మెసేజ్ లు చూడటం లేదండి, ఇబ్బంది లేకుండా క్షేమంగా చేరానని మెసేజ్ లు పంపిస్తున్నానండీ.

 

అమ్మకి నాన్నకి కారులోనే మాట్లాడి, చెప్పటం అయింది కదా, బయట వాళ్లకు నిదానంగా పంపించచ్చు. అంత అర్జెంట్ ఏముందీ అంటారా?  

.

అయ్యో! అలా అనకండీ. ఈ కోవిడ్ టైములో మనవాళ్ళు, బయట వాళ్ళు అని తేడా ఏమి లేదండి. అందరూ మనవాళ్ళే, అందరూ మన క్షేమం కోరేవాళ్ళే. నెల రోజులనాడు నేను ఇండియా ప్రయాణం పెట్టుకున్నప్పుడు మీరు, పిల్లలు ఎన్ని జాగ్రత్తలు చెప్పారో, ఎంతలా భయపడ్డారో, నేను అక్కడినించి  బయలుదేరు తున్నప్పుడు అంతకు రెట్టింపుగా వాళ్ళు కూడా కంగారు పడ్డారండీ. నేను ఇండియా వస్తున్నట్టు ఎవరికీ చెప్పలేదు కదా అని వెళ్ళాక  ఫోన్ లు చేస్తే, ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా వాళ్ళ ప్రేమను చూపించారు తెలుసా? అక్కడికి నేనేదో యద్ధంలో వీరోచితంగా పోరాడిన ఝాన్సీ రాణిని అన్నట్టు, అందరూ నాకు వీరతాళ్ళు వేసేసారు! వాళ్ళ మాటలు వింటుంటే నాకయితే తమాషాగా అనిపించింది.

.

“అమ్మో! ఈ కరోనా టైములో పడొచ్చావు, నీకెంత ధైర్యమే?!” అని భాను పిన్ని బుగ్గలు నొక్కుకుంటే “చిన్నప్పటి నుంచీ అంతే, నీకెంత తోస్తే అది చేసెయ్యడమే..ఈ టైములోనా రావడం?” అంటూ పెద్దమ్మ కొడుకు శ్రీధరం అన్నయ్య చివాట్లేసాడు!

.

“వస్తే వచ్చావు గానీ, ఇక కాలు బయట పెట్టకు. ఏమైనా కావాలంటే నాకు ఫోన్ చెయ్యి వదినా!” అంటూ అత్త కొడుకు మురళీ బావ ఫేస్ టైములో వార్నింగ్ ఇచ్చాడు! “క్లాస్ అయిపోతున్నప్పుడు వచ్చే మన “లేట్ లత” లాగా విజిటర్స్ అందరూ ఇక్కడినుంచి వెళ్లిపోతుంటే, నువ్వేంటే ఈ హారిబుల్ టైములో ఇలా ఊడిపడ్డావు? నీకు మతి లేకపోతే మీ ఆయనకైనా ఉండద్దూ?” అంటూ నా చైల్డ్ హుడ్ ఫ్రెండ్ ఉష జోకేసి మరీ తిట్టింది!

.

ఇండియాకు ఈ టైములో వచ్చినందుకు అందరూ నన్ను కోప్పడినా, వెళ్లినందుకు నాకు మాత్రం చాలా తృప్తిగా ఉందండి! కోవిడ్ కారణంగా ఈమధ్య అందరికీ పిల్లల్తో గడిపే అవకాశం దొరికినట్లు, నాక్కూడా చాలా కాలం తర్వాత అచ్చంగా అమ్మావాళ్ళతో గడిపే అవకాశం దొరికింది. ఎక్కడికీ వెళ్ళకుండా ఇంటిపట్టునే ఉన్న నన్ను చూసి తొంభై ఏళ్ళ నాన్న ఎంత ఆనందపడ్డారో చెప్పలేను!

.

“వస్తావన్నమాటే గాని నీతో టైము గడిపినట్టే ఉండేది కాదు. నీకోసం ఇంటికి వచ్చేవాళ్ళు..షాపింగులు…ఆ తర్వాత టైలర్ల చుట్టూ తిరుగుళ్ళు…కాశీ-రామేశ్వరం అంటూ అక్కడ్నించే బుక్ చేసుకునే టూర్లు….అక్కడ  పెళ్ళిళ్ళు..ఇక్కడ పేరంటాలు” అంటూ ఎప్పుడూ పరుగులు పెడుతూనే ఉంటావు. కరోనా పుణ్యమా అని ఉన్నన్నాళ్ళు మా కళ్ళముందే ఉన్నావు!” అన్న అమ్మ మొహంలో ఆనందం అంతా ఇంతా కాదు! వాళ్ళకే కాదండీ, నాక్కూడా అమ్మా-నాన్నలతో గడిపిన సమయం చాలా స్పెషల్ గా అనిపించటంతో పాటు,  చిన్నతనం రోజులు గుర్తుకొచ్చాయి! చిన్నప్పుడు పూలపిచ్చి ఉన్న నేను, రోజూ ఇంట్లో ఉన్నవి చాలవన్నట్టు, సువర్ణ గన్నేరు పూలకోసం పక్కింటి బామ్మగారింటికి, ముద్దమందారాలకోసం ఎదురింటి మీనాక్షి అత్తయ్య గారింటికి వెళ్ళేదాన్ని! మళ్ళీ ఇన్నాళ్ళకు నాన్న పూజకు పువ్వులు కోస్తూ..వంటింట్లో అమ్మకు సాయం చేస్తూ..కంచాలు మంచినీళ్ళు పెడుతూ..బట్టలు మడత పెడుతూ ఉంటే, పెళ్ళి అయ్యేంతవరకు ఇంట్లోనే ఉన్న నేను, ఎప్పుడూ వాళ్ళ చుట్టూ తిరగడం గుర్తుకొచ్చిందండి! నెలరోజుల పాటు అమ్మా-నాన్నలతో కలిసి భోంచేసే భాగ్యం కలిగింది!

.

కోవిడ్ టైములో వచ్చానని కోప్పడిన అందరికీ, మళ్ళీ నేను తిరిగి అమెరికాకు వెళ్ళిపోతున్నానని తెలియగానే   ఒకటే కంగారు. ప్రతివాళ్ళు ఎవరికి తోచిన సలహాలు వాళ్ళు ఇస్తుంటే, నాకు నలభై అయిదేళ్ళ కిందట అడుసుమల్లి నుంచి అమెరికాకు చేసిన ప్రయాణం గుర్తొచ్చింది! మీరు నా మెళ్ళో మూడుముళ్ళు వేసి అమెరికా రావడానికి ఏంచెయ్యాలో మూడు ముక్కల్లో చెప్పి ఇక “యూ ఆర్ ఆన్ యువరోన్” అన్నట్టుగా మీ పాటికి మీరు అమెరికాకు చెక్కేసారు!

.

వీసా ఇంటర్వ్యూ కు సిద్ధం అవుతున్న నన్ను చూసి “బొంబాయిలో విమానం ఎలా ఎక్కాలో తెలుసుకోవాల్సింది మానేసి, పనిగట్టుకుని ఇప్పుడు ఈ మద్రాసు వెళ్లటం ఎందుకూ? ” అని మా పెద్దమ్మ పెద్ద ప్రశ్న. ఎడ్లబండి, గుర్రబ్బండి ఎక్కే ఈ పిల్ల అసలు విమానం ఎక్కగలదా, ఎక్కినా ఒక్కతే వెళ్ళగలదా అని మా పెదనాన్నకు పెద్ద డౌవుటు.

.

“అమ్మాయి! మీ ఆయనుండే దేశం వెళ్ళటానికి రెండురోజులు పడుతుందంటున్నావు కదా? మరి నీ తిండి మాటేవిటే? ” అని బామ్మకు బెంగ. ఆ అనుమానం నాకూ ఉన్నా, పైకి బింకంగా “ విమానం వాళ్ళే పెడతారు బామ్మా! ” అని భరోసా ఇచ్ఛా. “ అయితే సరే ” అంటూ అప్పటికి తల ఊపి, నేను బయలుదేరే రోజు ఇంత పొడుగు స్టీలు కారియరు నా ముందుంచి “ అమ్మడూ! విమానం వాళ్ళు పెట్టే ఆ దొరల తిండి నువ్వెలా తింటావే? ఈ కారియర్ లో మడిగా అన్నీ సర్దిపెట్టాను. నీకు ఆకలేసినప్పుడు ఓ పక్కగా కూర్చుని ఎవ్వరూ చూడకుండా తినేసెయ్ ” అంటూ ఆంజనేయ దండకం చదువుకోడానికి పూజగదిలోకి వెళ్ళిపోయింది.

.

“ పాపా! నీ విమానం చాలాచోట్ల ఆగుతుందంటున్నావ్. నువ్వెక్కడ దిగాలో జాగ్రత్తగా చూసుకో. తొందరపడి తప్పుచోట దిగేవు. మీవూరొచ్చినప్పుడు నిద్రలో ఉంటావేమో, రైల్లో కండక్టర్ కి చెప్పినట్టుగా విమానం కండక్టర్ కి ముందే చెప్పిపెట్టుకో ” అంటూ తాతయ్య సలహా. అడుసుమల్లి నుంచి విజయవాడకు, అక్కడినించి హైద్రాబాద్ కు రాజకుమారి వెంట పరివారం లాగా, అందరూ పొలోమంటూ వచ్చారు. హైద్రాబాద్ నుంచి అప్పట్లో వాడికి ఏమి తెలియకపోయినా, మగతోడుండాలంటూ శ్రీధరం అన్నయ్యను వెంట పంపించారు! ఆ నాటి ఆ ప్రయాణం తలుచుకుంటే నవ్వుతో పాటు, దాని వెనకాల ఉన్న వాళ్ళ ప్రేమ.. ఆ అమాయకత్వం గుర్తుకొచ్చి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయ్.

.

“ మాకు తోడుగా సుశీల ఉంది…మా పనులు మేము చేసుకోగలుగుతూ… భగవన్నామస్మరణ చేసుకుంటూ బాగానే ఉన్నాం, రావద్దు అంటున్నా వినకుండా వచ్చావ్, జాగ్రత్తగా ప్రయాణం చెయ్ తల్లీ ” అంటూ అమ్మా నాన్న కళ్ళనీళ్ళు పెట్టుకుంటే, మొదటిసారి అమెరికా వెళ్తున్నట్టు అనిపించింది.

.

“ కరోనా వచ్చినప్పటి నుంచి ఫ్లయిట్స్ లో మీల్స్ ఏమి ఇవ్వటంలేదుట కదా… నాలుగు రకాలు ప్లాస్టిక్ డబ్బాల్లో సర్ది ఇస్తాను సరస్వతి గారు ” అని సుశీల అంటుంటే బామ్మ కళ్ళముందు కనిపించింది! “ సరూ! నీకు డిల్లీ లో అవసరం అయితే నా కొడుకు వంశీ అక్కడే ఉన్నాడు. వాడికి ఫోన్ చెయ్యి… ఇదిగో నంబరు ” అంటూ ఉష ఎక్సట్రా ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేసింది.

.

“ అమ్మగోరు! ఎల్లే రోజున ఇంత ఏపాకు ముద్దా, పసుపు నీళ్ళలో కలిపి సెంబు దగ్గరెట్టుకోండి. ఇమానంలోకెల్లగానే మీ సీటు కాడ సుబ్బరంగా సల్లేసి కూకో౦డి ” అంటూ పర్వతాలు ప్రికాషనరీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. “ మేడంగారు! ఇయ్యాల రేపు ఈ ఇమానాల్ని నమ్మడానికి లేదు. ఎప్పుడు ఆపేసినా ఆపేత్తారు. మీరు వర్రీగామాకండి. నేను ఈడనే ఎయిట్ చెత్తా, అవసరం అయితే ఒక్క ఫోన్ కాల్ కొట్టండి మేడంగారు ” అంటూ అంజయ్య అభయం ఇచ్చాడు!

.

ఎవరిని పలకరించినా అందరివీ కడుపు తరుక్కుపోయే కథలండి. ట్రీట్మెంట్ కోసం డబ్బు నీళ్ళలా ఖర్చు అవుతుంటే… అయినవాళ్ళు కళ్ళముందే కనుమరుగవుతుంటే మనుషులు ఆర్ధికంగా… మానసికంగా కుంగిపోతున్నారండి.

.

నా గురించి అంతలా ఆరాటం పడిన వాళ్ళందరికీ, నేను క్షేమంగా చేరినట్లు తెలియచెయ్యకుండా కాఫీ ఎలా తాగుతాను చెప్పండి? మీకు గుర్తుందా! నలభై అయిదేళ్ళ కిందట ఇంటికి రాగానే, బ్యాగులోనుంచి  మామగారు నాకిచ్చిన పక్కింటి కృష్ణమూర్తి గారి ఫోన్ నెంబర్ ఉన్న కాగితం మీకు తీసి ఇస్తే, మీరు కాల్ బుక్ చేసి కనెక్షన్ వచ్చినప్పుడు గొంతు చించుకుంటూ నేను క్షేమంగా చేరానని చెప్పటం.?! మా అమ్మా వాళ్లకు “సరస్వతీ సేఫ్లీ ఎరైవ్డ్” అంటూ టెలిగ్రాం ఇచ్చారు. ఆ మర్నాడు ఓ అరడజను ఎయిరోగ్రామ్స్ తెచ్చి నాముందుంచారు. నాలుగు రోజులపాటు నిద్రపోతూ… మీరు వండి పెడుతుంటే ఆకలేసినప్పుడు తింటూ.. అందరికీ ఉత్తరాలు రాసుకున్నాను. ఆ ఉత్తరాలకోసం అందులో నేను రాసిన వివరాల కోసం పది రోజులపాటు అందరూ కళ్ళల్లో వత్తులు వేసుకుని కూర్చున్నారట! ఇప్పుడు చూడండి క్షణాల మీద మేసేజ్ లు పంపించుకునే స్థాయికి చేరుకున్నాం!

.

ఏమిటీ… టీవీ లో న్యూస్ చూసి నేనెలా ఉన్నానంటూ డాక్టర్ కాలమెన్ ఫోన్ చేసిందా? నా గురించి..అక్కడ పరిస్థితి గురించి..నా ప్రయాణం గురించి  మీక్కూడా బోలెడు కాల్సు…టెక్స్ట్ మేసేజ్ లు వచ్చాయంటారా?!

.

చూసారా…చూసారా ఇదేనండి ఇందాకటి నుంచి మీతో నేను పంచుకుంటున్నది. ఈ కోవిడ్ ప్రపంచాన్నంతటినీ ముప్పతిప్పలు పెడుతున్నా, వాళ్ళు వీళ్ళు…అక్కడ….ఇక్కడ అన్న తేడా లేకుండా మనుష్యులందర్నీ “ఒక్కటి” చేసిందండి!!!

.

*******************************

 

.

కోవిడ్ లో ప్రయాణం-నేపథ్యం

.
వారం రోజుల కిందట నేను ఫ్లయిట్ దిగి కారులో కూర్చోగానే “ఇంటికి వెళ్ళగానే డాక్టర్. అలేటాని పిలిచి మాట్లాడు. పాపం నీ గురించి ఆవిడ చాలా వర్రీ అవుతున్నారు” అని రామకృష్ణ  చెప్పిన మాటలు… “కావాల్సిన కాగితాలు, ముఖ్యంగా కోవిడ్ కాగితాలు అన్నీ దగ్గరపెట్టుకో…చేరంగానే తెలియచెయ్యి అమ్మా శ్యామలా!” అంటూ వోలేటి సుబ్బారావు బాబాయి గారు చెప్పిన జాగ్రత్తలు ”అక్కడ పరిస్థితి వింటుంటే నాకు భయం వేస్తోంది, మామ్! నువ్వు వచ్చేయ్” అంటూ మా అమ్మాయి పడిన కంగారు, నేను ఎలా ఉన్నానంటూ ఎంతో మంది నుంచి వచ్చిన మెసేజ్ లు ఇవన్నీ నాచేత ఈ ముచ్చట రాయించింది.

.

ఈ నలభై ఐదేళ్ళలో ఎన్నో సార్లు ఇండియా వెళ్ళిన నేను, ఈ ట్రిప్ మాత్రం ఎప్పటికి మర్చిపోను.  వెళ్ళాలి..వెళ్ళాలి అని మనసు పీకుతున్నా, ట్రావెల్ టైములో ఏం సమస్యలు ఎదురౌతాయో అన్న సందేహం…. తీరా వెళ్ళాక అక్కడ ఎవర్నైనా ఇబ్బంది పెడతానేమో అని భయపడుతూ చేసిందే ఈ “కోవిడ్ లో ప్రయాణం”. నేను అక్కడికి చేరుకున్న నాలుగు రోజుల్లోనే కోవిడ్ మరింత విజ్రుంభించడం జరిగింది. ఏ ఇబ్బంది లేకుండా తిరిగి వెళ్లగలనా అని మనసులో ఆందోళన ఉన్నా, ఆదిదంపతులు వంటి అమ్మా నాన్నగారితో టైము గడపటం ఇంతో తృప్తినిచ్చింది. ఎంతోమంది నా గురించి ఆదుర్దాపడుతూ నా పట్ల చూపించిన ప్రేమాభిమానం, ఈ ప్రయాణంలో నేను పొందిన ఆనందం వెరసి ఈ ముచ్చట ఇలా వచ్చింది!!

.

**********************************************************************

.