.
మాధురీ దేవి తన భర్త తో కలసి వెళ్లిపోవడాన్ని, ఆమె తనని తిరస్కరించినట్టు భావించిన కృష్ణ చైతన్య ఆ భావాలని జీర్ణించుకోలేక చెడు వ్యసనాలకి బానిసై చివరకు అఖిలానంద ఆశ్రమం లో చేరతాడు. అక్కడ కొంతకాలం గడిచాక తండ్రి మరణ వార్త విని విశాఖపట్నం బయలుదేరతాడు.
.
ఇక్కడ నుంచి ముగింపు మొదలవుతుంది. ముందుగా చెప్పినట్టు, ఈ ముగింపు ఇంకో పుస్తకం లో నుంచి పట్టుకుని వచ్చి ఈ పుస్తకం లో అతికించినట్టు ఉంటుంది. అదే విధంగా పాత్రల సంభాషణ లో, సన్నివేశాల కూర్పు లో వేగం ఎక్కువవడం, అంతకు ముందు భాగం లో సాగదీసిన సంభాషణల పద్ధతికీ భిన్నంగా ఉండి మనకి ఇంకో పుస్తకం చదువుతున్నట్టుగా ఉంటుంది.
.
అది ఆలా ఉంచితే ఒకాయన ఈ పుస్తకం మీద రాసిన తన అభిప్రాయం లో చెప్పినట్టు ” ఇందులో ఇతివృత్తం మేధో జనితం కాగా… పాత్రలు వాస్తవ జగజ్జనితం ” భూమ్మీద పాత్రలు…. వాటికి ఆకాశం అంత ఎత్తులో ఆలోచనలు. సంఘటనలని కాలగమనం తో అనుసంధానించడం లో కొంత లోపం, దానికి తోడు ఇంకో ప్రధాన లోపం పాత్రల మధ్య కమ్యూనికేషన్. మిగతా పాత్రలని కాసేపు పక్కన పెడితే, కొడుకు ఉద్యోగం చేస్తున్నాడో, ఉదక మండలం లో ఉన్నాడో, ఆశ్రమం లో ఉన్నాడో, అలాగే భార్య లేని తండ్రి విశాఖపట్నం లో ఒక్కడూ ఏమి చేస్తున్నాడో అన్న విషయాలు తండ్రీ కొడుకులిద్దరికీ అంతగా పట్టవు. పట్టినా ఒకళ్ళనొకళ్ళు సరిదిద్దుకునే ప్రయత్నం చేయరు.
.
మొత్తానికి తండ్రి మరణ వార్త విన్న కృష్ణ చైతన్య విశాఖపట్నం లో తండ్రి ఇంటికి చేరుకుని అక్కడ గీతాదేవి ని చూసి ఆమె ఇప్పుడు తనకు వరసకు తల్లి అవుతుంది అని తెలుసుకుని, ఆమె తన తండ్రిని ఆస్తి కోసం వలలో వేసుకుంది అని బంధువులు అందరూ అనుకుంటున్నారని కూడా తెలుసుకుని ఆమె తో మాట్లాడతాడు. ఆ సంభాషణల సారాంశం టూకీ గా చెప్పాలంటే చింతామణి నాటకం లో చింతామణి బిల్వ మంగళుడు అనే అతని దగ్గర అంతా ఊడ్చేసి ఆఖరికి ” నాలో ఏమి చూసి మోహించావయ్యా? ” అని అడిగినట్టు ఉంటుంది.
.
కృష్ణ చైతన్య మేనత్త గారొహావిడ తన కూతురిని ఇతనికి కట్టబెట్టాలనే పన్నాగం పన్ని వల విసర గా ఆవిడ వల నుంచి తప్పించుకున్న కృష్ణచైతన్య మొత్తానికి పట్టు విడవక గీతాదేవిని తనతో వివాహనికి ఒప్పిస్తాడు.
.
బంధువులను సాగనంపే సందర్బంలో వీరిరువురూ రైల్వే స్టేషన్ కి వెళ్ళగా అక్కడ ఒక గడ్డం మనిషి తగిలి తాను పూర్వాశ్రమం లో గీతాదేవి భర్త శివరామ్ ని అని పరిచయం చేసుకుని వీరితో కలసి ఇంటికి వచ్చి, తాను తన తప్పులు తెలుసుకుని, స్వభావం మార్చుకుని మంచివాడనై పోయానని, గీతాదేవి ని బతిమాలుకుని, ఆమె ఒప్పుకోకపోవడం తో వాదనకీ, ఆపైన ఘర్షణ లోనికీ దింపి తన తలతో ఆమె తలను పదే పదే మోదగా ఇద్దరూ చనిపోతారు.
.
ఈ దృశ్యాన్ని చూసిన కృష్ణ చైతన్య కొన్ని వేదాంతపు మాటలు అనుకోవడంతో పుస్తకం ముగుస్తుంది.
అప్పటివరకూ పాఠకులలో వున్న ఆసక్తి, ఉత్కంఠత ఒక్క నిముషం లో సున్నా స్థాయి కి పడిపోయి, వారి దృష్టి పాత్రల ఆస్థిర స్వభావం (చంచల స్వభావం కాదు), తర్కజ్ఞాన లేమి మొదలైన అవగుణాల మీదకి పోయి, అప్పటి వరకూ పుస్తకం లో మెచ్చుకోదగిన స్థాయి లో ఉన్న శైలి శిల్పాల విషయం లో రచయిత పడిన శ్రమ బూడిద లో పోసిన పన్నీరు అయిపోతుంది.
.
ఆలా అని కృష్ణ చైతన్య, గీతాదేవి ల పెళ్లి జరిపించి విప్లవాత్మక ముగింపు చేయాలని కాదు. కథాంశం విషయం లో ఆది లోనే హంసపాదు పడడం అనే ఒకే ఒక్క లోపం మొత్తంగా పుస్తకం లోని అనేక మంచి కోణాల ని కమ్మేసి, మరుగుపరిచేసింది. అదే ఈ పుస్తకానికి పెద్ద లోపం.
.
వ్యక్తులుగా ఈ పుస్తకం లోని పాత్రలు ఉన్నతులు, ఉదాత్త స్వభావులు. పాత్రల ద్వారా రచయిత ప్రతిపాదించిన అభిప్రాయాలూ ఉత్తమ స్థాయి లోనే ఉంటాయి. అయినప్పటికీ ఈ పరిస్థితి.
.
అందుచేతనే పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు ఈ పుస్తకం లోని శైలీ విన్యాసాల ను ఇత్తడి చెంబు కి మెరుగులు పెట్టడం తో పోల్చారు. ఒక రచయిత ప్రతిపాదించిన కథాంశం సమాజానికి హితం చేసేది గా లేనప్పుడు ఆ కథారచన లో రచయిత ప్రదర్శించిన శైలీ విన్యాసాలు నిరుపయోగం అని వారి భావం.,
అయితే ” మనిసన్నాక కూసింత కలాపోసన ఉండాలని ” రావు గోపాలరావు కాంట్రాక్టర్ గారు చెప్పిన కోణం లోంచి అలోచించి, చివరి అధ్యాయము చదవకుండా ముగిస్తే ఇది ఒక గొప్ప పుస్తకం.
.
సాహిత్యం లో శైలీ విన్యాసాలు అంటే ఇష్ట పడేవారు తప్పకుండా చదవవలసిన పుస్తకం హిమజ్వాల.
.
( హిమజ్వాల పరిచయం సమాప్తం )
.
వడ్డెర చండీదాస్ గారి రచనలను అనేకమంది ప్రముఖులు మేధో మధనం చేయగా ఏకగ్రీవంగా తేలిన అభిప్రాయం అవి ఉత్తమ స్థాయికి చెందినవి అని. వాటన్నిటి నీ ఇక్కడ పొందుపరచడం కష్టం. ఆసక్తి గలవారు ఆనందా బుక్స్ వారి వెబ్ సైట్ లో పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి రాసిన పెద్ద కవిత, రెండు పేరా గ్రాఫ్ ల వచన పాఠం చదవగలరు.
.
******************************************************
.