10_019 వాగ్గేయకారులు – వెంకటముఖి

Please visit this page

వెంకటముఖి- మేళకర్త రూపకర్త 

.

వెంకటముఖి లేదా వెంకటమఖిన్ లేదా వెంకటేశ్వర దీక్షిత ఒక  ప్రముఖ సంగీతకారుడు, విద్వాంసుడు, పండితుడు అయిన గోవింద దీక్షితులవారి పుత్రుడు. వీరు శివమొగ్గకు దగ్గరలో గల హొన్నాళి అనే ఊరికి చెందిన కన్నడ బ్రాహ్మణ వంశస్థులు. గోవింద దీక్షితులు తంజావూరు రాజైన రఘునాథ నాయకుని ఆస్థానంలో మంత్రిగా ఉండేవారు. వెంకటముఖి తన తండ్రి మరియు పినతండ్రి యజ్ఞనారాయణ వద్ద నుంచి వీణ వాయించటం నేర్చారు. తదుపరి, తానప్పఆచార్యుల వారి వద్ద సంగీతం లో గల మెళుకువలు, పాండిత్యాన్ని అభ్యసించారు. వెంకటముఖి సంస్కృతంలో మంచి పట్టు గలిగి ఉండేవారు. ఇవేగాక, జ్యోతిష శాస్త్రం, తర్కం, తత్వ, వేదాంతాలను ఇంకా అలంకారాలనూ కూడా అధ్యయనం చేశారు.    

.

తండ్రి అడుగుజాడల్లోనే, రఘునాథ నాయకుని సంతతి విజయరాఘవ నాయకుని వద్ద ( 1633-1673 ) మంత్రిగా పనిచేశారు. కర్ణాటక సంగీతంలో రాగప్రకరణలలో ప్రామాణితమైన సైద్ధాంతిక గ్రంథాలు ఏవీ లేకపోవటం గమనించిన రాజు, వెంకటముఖిని ” చతుర్దండి ప్రకాశిక ” అనే  గ్రంథాన్ని రచించమని కోరారు. ఇది వారి రచనలలో అత్యంత ప్రముఖ గ్రంథం కావటం విశేషం. 

 

వెంకటముఖి విరచిత ‘ చతుర్దండి ప్రకాశిక ’ కర్ణాటక సంగీతంలో ఒక మైలురాయి అంటే అతిశయోక్తి కాదు. 20వ శతాబ్దంలో అచ్చువేయించే దాకా, ఇది కేవలం వ్రాతప్రతి రూపంగానే ప్రాచుర్యంలో ఉంటూ వచ్చింది. స్వర స్థానాల, వాటి పౌనఃపున్యం పైనా ఆదరించి మేళకర్త రాగాలకు ఒక వైజ్ఞానిక వ్యవస్థాత్మక వర్గీకరణను అందచేసిన ఏకైక సంగీత గ్రంథం ఇది. ‘ చతుర్దండి ప్రకాశిక ’ అంటే నాలుగు మూలస్తంభాల ద్వారా రాగం ఏ విధంగా ప్రదర్శితం అవుతుంది అని అర్థం. ఇందులో పది అధ్యాయాలున్నాయి. కానీ దురదృష్టవశాత్తు, తొమ్మిదవ అధ్యాయపు ఏకహృ భాగం మరియు పదవ అధ్యాయం లభ్యం కావటం లేదని తెలుస్తోంది. పన్నెడువందల పైచిలుకు ద్విపదలు సరళమైన సంస్కృత భాషలో వ్రాయబడి ఉన్నాయి. వెంకటముఖి గారి మనవడయిన ముద్దు వెంకటముఖి ఈ గ్రంథానికి ఒక అనుబంధాన్ని కూడా అందచేశారు. 

.

ఒకసారి దొంగలబారిన పడిన వెంకటముఖి లలిత రాగంలో ” హరే జీ పీడ కంటక దుష్ప్రదేశ ” అనే పాటను పాడి తప్పించుకున్నారట. తన ప్రజలపై కూడా అత్యంత వాత్సల్యం గల వెంకటముఖి వారిని రాజు గారు తప్పనిసరిగా వేయించిన ” శంఖచక్రాల ” పచ్చబొట్టునించి విడుదల కలిగించటానికి, ” శాఖ చక్రాంగ నాట్యాచారరే ” అనే పాటను రీతిగౌళ రాగంలో ఆలపించారట. అనేక లక్ష్య గీతాలను మరియు ప్రబంధాలను బండిర భాషలో రచించారు. తిరువారూర్ లో ప్రసిద్ధ దైవమైన త్యాగేశుని భక్తుడు. త్యాగేశునిపై వెంకటముఖి 24 అష్టపదులు రచించారు. ఇవేగాక ” గాంధర్వ జనతా ” అనే ఆరభి రాగ గీతాన్ని తానప్పాచార్యులవారిని పొగుడుతూ వ్రాశారు. 

.

కర్ణాటక సంగీతానికి ఒక మూలాధార పట్టికలా 72 మేళకర్త రాగాలను వెంకటముఖి ఏ విధంగా రూపొందించారో నాకు తెలిసిన రీతిలో వివరించటానికి ప్రయత్నిస్తాను. 

.

రాగ సంపత్తి మన భారతీయ సంగీతంలో తప్ప మరెక్కడా కానరాదు. పాశ్చాత్య సంగీతంలో అయితే ‘ రాగం ‘ అంటే ఏమిటో కూడా తెలీదు. మేళకర్త రాగాలను మొదటిసారి పరిచయం చేసింది 14వ శతాబ్దంలో విద్యారణ్యస్వామి అని చెప్తారు. వెంకటముఖికి ముందు, ఎందరో సంగీతకారులు ఈ అంశంపై ఎన్నో అధ్యయనాలు జరిపి, అనేక సిద్ధాంతాలు ప్రతిపాదించినప్పటికీ, వీటిలో ప్రామాణికత లేకపోయింది మరియు రాగాలను వ్యవస్థాత్మకంగా వర్గీకరించిన దాఖలాలు కూడా లేవు. మేళకర్త రాగాల సంపూర్ణ వర్గీకరణ శ్రేయస్సు సంపూర్ణంగా శ్రీ వెంకటముఖి గారికే దక్కి తీరాలి. 

.

మేళకర్త రాగాల ఆవిర్భావం 

.

సంగీతంలో 72 మేళకర్తలకున్న ప్రాముఖ్యత ఎనలేనిది. ఈ మేళకర్తల పట్టిక రూపకల్పన జరగటానికి నాందిని పరిశీలిద్దాం. మేళకర్త అంటే ఆరోహణ మరియు అవరోహణ రెంటిలోనూ సప్తస్వరాలు ఏవీ వర్జితం కాకుండా ఉండి తీరాలి. మేళకర్త రాగాలు మాతృకలు లేదా పితృ లేదా జనక రాగాలుగా పేర్కొనబడతాయి. ఈ కారణంగానే వీటిని సంపూర్ణ రకాలుగా కూడా పిలుస్తూంటారు. 15వ శతాబ్దంలో ఈ మేళకర్త రాగాల వ్యవస్థ గురించి మొట్టమొదటసారిగా శ్రీ రామామాత్యులవారు తమ ” స్వరమేళకళానిధి ” అనే గ్రంథంలో పేర్కొన్నారు. దానినే వెంకటముఖి తన ‘ చతుర్దండి ప్రకాశిక ’ లో వివరించి, ఒక నిర్దుష్టమైన రూపాన్ని కలుగచేసారు. ఈ 72 మేళకర్త రాగాలు 12 భాగాలుగా విడదీయబడి ఒక్కొక్క దానిలో ఆరేసి రాగాలుండేలా ఏర్పరిచారు. ( 12 X 6 = 72 ). ఈ భాగాలనే చక్రాలని పిలుస్తారు. ఈ పన్నెండు చక్రాలకు ఆసక్తికరమైన నామాలు, ఆ చక్రపు సంఖ్యను కనుగొనటానికొక సూత్రం కూడా ఉన్నాయి.

.

మొదటి 36 మేళకర్త రాగాల్లో, 1-36 వరకూ అన్నిటిలోనూ శుద్ధ మధ్యమం మాత్రమే ఉంటుంది. 37-72 వరకూ గల 36 మేళకర్త రాగాలలో ప్రతి మధ్యమం ఉంటుంది. మొత్తం మేళకర్త రాగాలనన్నిటినీ 6 గల జట్లుగా చేయడమైనది.  

.

1 ) 1 నుంచి 36 వరకూఉండే జట్లలో శుద్ధమధ్యమంతో ‘ గ ’ 1, 2, 3, 4,5, 6 లో – గాంధారం గ 1, గ 2, గ 3, గ 2, గ 3, గ 3 అదే వరుసక్రమంలో ఉంటాయి.

2 ) అలాగే 37 నుంచి 72 వరకూఉండే 6 జట్లలో ప్రతిమధ్యమంతోగాంధారం గ 1, గ 2, గ 3, గ 2, గ 3, గ 3 అదే వరుసక్రమంలో ఉంటాయి.

.

అదేవిధంగా ‘ చతుర్దండి ప్రకాశిక ’ లో వెంకటముఖి 12 స్వరాలూ, 16 విభిన్న స్వరస్థానాలు ఆధారం చేసుకుని 72 సాధ్య సంపూర్ణ లేదా మేళకర్త రాగాలను మనకందించారు. 

.

మేళకర్త రాగాల వ్యవస్థయే గాక, ఒక కృతి, రూపకల్పన, ప్రదర్శనలో ఉండాల్సిన నాలుగు ముఖ్యాంశాలను గురించి కూడా ప్రస్తావిస్తుంది ‘ చతుర్దండి ప్రకాశిక ’. 

.

మొదట తాళం లేకుండా మనోధర్మ పద్ధతిన ఒక రాగాన్ని ఆలపించటం – ఆలాపన, ఆ తరువాత గీతం అంటే ఒక తాళానికి సరిపోయేలా వ్రాయబడిన సాహిత్యం లేదా గీతం – థాయ ఆపై ప్రబంధం ఉండాలని బోధిస్తుంది. నేటికీ, కర్ణాటక సంగీతం లో ఈ పధ్ధతి కానవస్తుంది. ముందు ఆలాపన, తరువాత కృతి/కీర్తన, ఆ తరువాత మనోధర్మపద్ధతిన నెరవు, చివరిగా స్వరకల్పన అనుసరించబడుతున్నాయి. 

.

20వ శతాబ్దపు ఆరంభంలో, ముంబైకి చెందిన విష్ణునారాయణ భాత్ఖండే అనే, సంగీతకారుడు ‘ చతుర్దండి ప్రకాశిక ’ గ్రంథాన్ని చూడటం తటస్థించింది. అందులో పేర్కొనబడిన మేళకర్త రాగ వ్యవస్థ ఆధారంగా నేటి హిందూస్థానీ శాస్త్రీయ సంగీతపు థాట్ వ్యవస్థను రూపొందించారు. ఈ థాట్ వ్యవస్థలో వెంకముఖి గారి 72 నీ, కేవలం 10 గా మాత్రమే వర్గీకరించి ఉండటం గమనార్హం. 

.

******************