10_020 అమెరికా ఇల్లాలి ముచ్చట్లు – తెలుగు టీవీ

.

ఇదిగో మిమ్మల్నే! ఆ దిక్కుమాలిన టీవీ కాస్సేపు ఆపేసి ఇలా వస్తారా లేదా ?

ఎన్నిసార్లు పిలవాలి? వారంలో అయిదు రోజులు ఆఫీసుకు అతుక్కుపోతారు. శని ఆదివారాల్లో టీవీకి అతుక్కుపోతారు. ఉన్నవాటికి తోడు ఈ తెలుగు మేళం ఒకటి. రాను రాను పిల్లలకంటే అన్యాయమై పోతున్నారు.

ఏమన్నా అంటే, “ఇదుగో వస్తున్నా…అదిగో వెళ్తున్నా” అని అంటారే కానీ జండా కర్రల్లే నిలబడి ఆ టీవీ ముందు నుంచి మాత్రం కదలరు. పిల్లలు హోమ్ వర్కులు మానేసి టివీ చూస్తున్నారని, చెత్త మ్యూజిక్ వింటున్నారని వాళ్ళ మీద అస్తమానం అరిచేవారు.

ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటిటా? దేశంలో ఇంకేమి విషయాలు లేనట్టు అన్నీ సినిమా కబుర్లే!

పేర్లు ఎన్నైనా భగవంతుడు ఒక్కడే అన్నట్టు ఎన్ని ప్రోగ్రాములు చూసినా, ఏ పేరు పెట్టినా అన్నీ సినిమా సంగతులే! ఇంతోటి సినిమాలను “వండర్ ఫుల్…ఫెంటాస్టిక్” అంటూ ఆకాశానికి ఎత్తెయ్యడం. తీరా చూద్దును కదా “గుండక్కా..గంటన్నంతా డొల్లే!” అన్నట్టు ఏ సినిమా అయినా చంపుకోడాలు..నరుక్కోడాలు షరా మామూలే. వెనక సినిమాల్లో చక్కటి భాష, నటన, హావభావన, సున్నితమైన ప్రేమ, హాస్యం ఉండేవి.

ఇప్పుడు సినిమాల్లో నటించే వాళ్లకు ఎవరికీ ఒక్క తెలుగు ముక్క రాదు. వాళ్ళు చెప్పే డైలాగులు మనబోటి వాళ్ళకు అర్ధం కావు. ఆడవాళ్ళు మగవాళ్ళను మించిపోతున్నారు. ఇక పాటలు సరేసరి. వాయిద్యాల హోరులో ఒక్క ముక్కా వినబడదు. ఒకవేళ వినపడినా అర్ధమై చావదు. వెనక సినిమాల్లో హీరో హీరోయిన్లు పార్కులోనో, పూలతోట లోనో ఇద్దరే రొమాంటిక్ గా పాడుకునేవారు. ఇప్పుడేమిటో పాట మొదలవ్వడం ఆలస్యం వెనకాల ఓ ముఠా సిద్దంగా ఉంటుంది. అయినా, ప్రేమించుకునే వాళ్ళు ప్రియుడితోనో, ప్రియురాలితోనో ఏకాంతంగా ఉన్నట్టు ఊహించుకోవాలిగాని, ఇలా గుంపుతో ఊహించుకోవడమేమిటీ నా మొహం!

ఏమిటీ! సినిమాలు నచ్చకపోతే సీరియల్స్ బోలెడు వస్తున్నయిగా అవి చూడమంటారా?

ఆ…ఆసంబడమూ అయింది! వీటి మీద ఆ సినిమాలే నయం. ఈ సీరియల్స్ లో ఎవ్వరికీ పనీ పాటా ఉండదల్లె ఉంది. తీరి కూర్చుని ఏడుస్తూ ఉంటారు. అందరూ టిప్పుటాపుగా తయారయి ఎన్నిసార్లు ఎన్నిరకాలుగా ఏడవచ్చో చూపించి మనల్ని ఏడిపిస్తుంటారు!

ఇవి కాకుండా వేరే ప్రోగ్రామ్స్ చూద్దామా అంటే ఆ యాంకర్లు చేసే హంగామా భరించాలి. పేరుకు తెలుగు ప్రోగ్రామే అయినా ఒకరు, ఇద్ధరు తప్పించి ఎవరికీ సరైన తెలుగొచ్చి ఏడవదు. లోపల అసలు సరుకు లేకపోయినా పై డాబులకు మాత్రం ఎవ్వరూ తీసిపోరు. పెద్ద యాంకరు దగ్గర నుంచి, పిల్ల యాంకరు దాకా అందరూ కట్టిన చీర కట్టకుండా, వేసిన హైర్ స్టయిల్ వెయ్యకుండా తయారవుతారు. వాళ్ళ మొహాలు, చీరలు, నగలు చూసి సంతోషించాల్సిందే తప్ప నోరు విప్పితే భరించలేం. మొహాలు ముద్దుగా ఉంటే బావుంటుంది కానీ, మాటలు ముద్దుగా ఉంటే తలమీద మొట్టాలనిపిస్తుంది.

పోనీ దేశం వదిలి ఎన్నో ఏళ్లయింది, మన వంటకాలు కొత్తవి నేర్చుకుందామని అవి చూడ్డం మొదలు పెట్టా. అదీ మూన్నాళ్ళ ముచ్చటే అయింది. వాళ్ళు చూపించేవన్నీ చూచాం స్ప్రింగ్ రైసులు, టొమేటో సూపులు, పాస్టాలు…కాంటినెంటల్ డిష్షులునూ. ఇదిగో! మీకు తెలుసో లేదో, ఇండియాలో ఇప్పుడెవ్వరు ఇడ్లీలు-బుడ్లీలు తినడం లేదట. ఉదయం ఓట్ మీల్, మధ్యాహ్నం మష్రూమ్ సూపులు, రాత్రి భోజనానికి బర్గర్లు తింటున్నారట! అందుకే టీవీ వాళ్ళు కూడా అవే నేర్పుతున్నారు.

పదార్ధాల పేరుకూడా సరిగ్గా పలకడం రాని ఓ పాకశాస్త్ర ప్రవీణురాలు చెప్తుంటే విన్నాను, స్వీటులో చివరికి ఎలకల పొడి చల్లితే వాసనతోపాటు రుచి రెట్టింపవుతుందని! రుచిమాట ఏమోగాని తిన్నావాడెవడో ఠపీమని చావడం మాత్రం ఖాయం! సరే ఇవన్నీ నచ్చకపోతే హాయిగా భక్తి ప్రోగ్రాములు చూసుకోవచ్చు కదా అంటారా? నిజమే! కానీ వాళ్ళు మొక్కుబడిగా చూపించే ఒకటే, రెండు భక్తి ప్రోగ్రాములు పొద్దున్నే పెట్టి ఓ పని అయిపోతుందనుకుంటారు. పక్క మీదనుంచి లేస్తూనే టీవీ ముందు కూర్చోడానికి ఆడదానికి, అందులోనూ అమెరికాలో ఉండే ఆడవాళ్లకు ఎలా కుదురుతుందిటా? అయినా నాకు తెలీక అడుగుతా, పొద్దున్న తప్పించి మిగిలిన టైములో భగవంతుని గురించిన విషయాలు తెలుసుకోరాదని రూలు ఏమైనా ఉందిటండీ?

ఏమిటండీ ఆ భాష ? “వెరీ గుడ్దండీ…ఓకేనాండీ, చూద్దామా అనడానికి ఓ లుక్కేద్దామా?

ఫలానా వ్యక్తి బాగా పాడితే “పాట ఇరగదీసాడండీ” అని అనాలిట. డాన్స్ బాగా చేస్తే “కుమ్మేసాడు” అనాలిట!

ఇలా భాషను చిత్రవధ చేస్తూ ఉంటే…

ఏమిటీ.. అంటున్నారు ఇవాళా, రేపు ఎవరూ భాషను పట్టించుకోడం లేదా? ఆడవాళ్ళు ఫ్యాషనుబుల్ గా స్టయిల్ గా ఉంటే వాళ్ళు ఎలా మాట్లాడినా బాగానే ఉంటుందంటారా?

అలాగా! నాకు తెలీదు సుమండీ? అయితే ఆ రోజుల్లో నా ఇంగ్లీషుని మీరెందుకు హేళన చేసారుటా? చెప్పండి!

సరే! నాక్కూడా ఏడు వారాల నగలు, చీరలు పట్టుకురండి. ఆ టీవీలో ఆడవాళ్ళకు మల్లే సింగారించుకుని స్టయిలుగా కనబడుతూ ఒయ్యారాలు ఒలకపోస్తూ సుతారంగా మీకు రోజూ ఆ సూపులే వడ్డిస్తా!

ఏమిటీ….ఆ పనిమాత్రం చెయ్యకూ అంటారా?!!

తొలిప్రచురణ కౌముది పత్రిక 2009

.

****************************************************************

.

👉🏾మీకు నచ్చితే Like బటన్ నొక్కండి. మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (comment box) లో తెలియజేయండి👇🏾

******************************************************