.
బోట్స్‌వానా కబుర్లు చెప్పాను. తెలుగు వారంతా చేరి సామూహికంగా చేసుకున్న పండుగలు, హిందూ టెంపుల్లో తరుచూ కలిసి భజనలు చేసేటప్పుడు, వినటానికి వచ్చే అక్కడ నివసించే ప్రజలు, అక్కడి జంతువుల గురించి చెప్పాను. నేను చిన్నపిల్లలకి తెలుగు భాషని పరిచయం ఏ విధంగా చేసి నెగ్గినదీ చెప్పాను. మాకు హైదరాబాద్ లోని తెలుగు యూనివర్సిటీ వారి సహాయం – పుస్తకాలు, చార్టులు, సిడి లు అందించడం మరువలేని సాయం.
ఆ దేశ సంపద ‘ బీఫ్ ’ ఎగుమతే కాక, విలువైన డైమండ్ గనులున్నాయి. వాటి గురించి ప్రస్తావించకపోతే వ్యాసాలు అసంపూర్తి అవుతాయి. నేడు ఇంటర్నెట్ లో చూసి డైమండ్ గనుల గురించి తెలుసుకోవచ్చు. కానీ నేను ప్రత్యక్షంగా చూసినవి చెప్తాను.
బోట్స్‌వానా లో ORAPA, ప్రపంచంలోనే అతి విశాలమైన “ Open pit diamond mine ”. అంటే భూమిలోపల వేల కొద్దీ మైళ్ళు వెళ్ళి వెతకక్కరలేదు. దాన్ని అతి విశాలమైన ఫుట్‌బాల్ ఫీల్డ్ అనుకోవచ్చు. 20 అంతస్తుల లోతు ఉండవచ్చు.
పెద్ద పెళ్ల నేలనుంచి విడివడిందా అన్నట్లుగా తోస్తుంది. పెద్ద ట్రాక్టర్లు, బుల్డోజర్లు భూమిని తవ్వుకుంటూ పోతుంటాయి. ఈ త్రవ్విన మట్టిని ఆ గోతుల నుంచి ఎత్తుతుంటాయి. కన్వేయర్ బెల్టుల ద్వారా ఈ మట్టిని జల్లించి కడిగి శుభ్రపరుస్తారు మిషన్ల ద్వారా. అందులో నుంచి విలువైన వజ్రాలు కనుక్కుంటారు. వాటిని సైజ్ ల వారీగా ఏరి విలువలు నిర్ణయిస్తారు. 1967 లో కనుగొన్న ఈ సంపద పెరుగుతూనే ఉంది.
మనం ఆ అద్భుతం, మట్టిలోని మాణిక్యాలను చూసి ఆశ్చర్యపడతాము. కట్టుదిట్టమైన భద్రత మధ్య జరిగే తంతు చూసాము. మన వెంట ఒక్క ఇసుక రేణువు కూడా బయిటకు రాదు. అంత భద్రత ఉంటుంది. అక్కడ 1978 నుంచి పనిచేస్తున్న కంపెనీ లో మొదటి నుంచి ఉన్న ప్రొడక్షన్ మేనేజర్ మైక్ మోర్‌మాంగ్ అనే అతను సగర్వంగా చెప్పిన మాట – “ ఈ సంపద ఎవరి జేబుల్లోకి వెళ్ళదు. అంతా సరి సమానంగా ఈ దేశ ప్రజలు, పౌరుల అభివృద్ధికి వెచ్చించబడుతుంది ”.
1969 లో బోట్స్‌వానా గవర్నమెంట్ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ‘ De Beers ’ డైమండ్ సంస్థతో 50 : 50 పద్ధతిన ఒప్పందం కుదుర్చుకుంది. అందుమూలంగా దేశ ఆర్థిక పరిస్తితి మెరుగుపడింది. మిలియన్ల డాలర్లు వారికి లభించాయి. ఆ సంపదని సద్వినియోగం చేసుకున్నారు. తరువాత ఆరోగ్య పథకాలు ఎన్నో అమలు చేసుకున్నారు. ముఖ్యంగా హెచ్‌ఐవి వైరస్ బారిన పడిన వారికి ఉచిత వైద్య సదుపాయం ఏర్పాటు చేసుకున్నారు.
డైమండ్స్ వీరి ప్రధాన నాడీ వ్యవస్థ. Orapa గనుల నుంచి తీసే కుప్పల కుప్పల మన్నులో దొరికే అతి విలువైన వజ్రాలు ఏరి శుభ్రపరచి భద్రపరిచే సదుపాయం ఆ దేశ ముఖ్యపట్టణం ‘ గేబరోన్ ’ లో ఉంది.
ఈ వజ్రాలను వేరు చేయగలిగిన సదుపాయం పది అంతస్తుల్లో ఉంది. అన్ని రాళ్లని సైజ్ ల వారీగా ఏరి, విలువ కట్టి, సర్టిఫై చేస్తారు. ఇవన్నీ అక్కడి ప్రజల కోసమే అనీ, అది వారి హక్కు అని, ఎవరి స్వంతం కాదన్నది వారికి తెలుసు. Trust is the key అంటారు.
వారిది ‘ De Beers ’ అండదండలున్న దేశం. ఎగుమతులకి ఆటంకాలు లేవు. మనలాంటి యాత్రికులు వెళ్ళి చూడవచ్చు. ఆ మట్టి తవ్వకాలు, ఆ పెద్ద మిషన్ల ద్వారా శుభ్రపరచడం, ఏరడం వంటివి చూడవచ్చు. ఆ సంపదతో దేశాన్ని అభివృద్ధి చేసుకున్నారు. ఇంక ఏ రకమైన ఫ్యాక్టరీలు, అట్టహాసాలు లేని దేశం. పశుసంపదని దాచుకుంటూ, భగవదర్పితమైన మణిమాణిక్యాలని కాపాడుకుంటున్న ఏ సముద్ర తీరం, నదీ తీరం లేని భూభాగం సౌత్ ఆఫ్రికా ప్రక్కనున్న బోట్స్‌వానా. అక్కడ మనం డైమండ్స్ కొనుక్కునే వీలు లేదు. కొనాలంటే దక్షిణాఫ్రికా లో కొన్ని షాపులు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా అభివృద్ధి చెంది ఉండవచ్చు. ఇదీ ‘ బోట్స్‌వానా లో డైమండ్స్ ’ కథ.
*******************************
.
👉🏾మీకు నచ్చితే Like బటన్ నొక్కండి. మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (comment box) లో తెలియజేయండి👇🏾
******************************************************