.
1970 వ దశకం….అప్పటి వరకూ ఇండియా దట్ ఈజ్ భారత్ లో గడిచిన కాలంలో అతి ముఖ్యమైన ఘట్టం.
.
స్వాతంత్ర్యం అనంతరం భారతావని లో జరిగిన అతి కీలమైన మార్పులకు ఈ దశకం లోనే బీజాలు పడ్డాయి. దేశంలో విధించ బడిన ఎమర్జెన్సీ తదితర పరిణామాలు దేశ ప్రజలను అన్ని రకాలు గానూ పునరాలోచింపజేసి రాజకీయాలు /ముఖ్యం గా పాలక పక్షం పట్ల, పాలకుల పట్ల వారికి ఉన్న అభిప్రాయాలలోని యధార్ధత పాళ్ళను వారి కళ్ళకు కట్టి నట్లు చూపించింది.
.
ఆ విధంగా మారిన పాలితుల ఆలోచనల కార్యాచరణ కి ఆ తరవాత సుమారుగా రెండు దశబ్దాల కాలం పట్టి, దాని ఫలితాలు తరువాతి తరాల వారు అనుభవించినప్పటికీ, ఆలోచనా ధోరణి లో మార్పు తీసుకొని వచ్చిన దశాబ్దం గా 1970 వ దశకము దేశ చరిత్ర లో నిలిచిపోయింది.
.
ఈ దశకం లో ఏర్పడిన ఆలోచనల మార్పులను ఆ తరవాత తరాల వారికి అందించిన ఈ దశకపు యువతరం, ముఖ్యం గా విద్యార్థుల ఆలోచనా స్రవంతి అనుక్షణికంలో ప్రధాన విషయం.
.
కాలం క్షణాలలో కొలవబడుతుంది. పూర్వ క్షణం, తత్ క్షణం,ఉత్తర క్షణం… ఈ మూడింటి కలయికే అనుక్షణం అన్న విషయం తెలిసిందే. మరి అనుక్షణికం అంటే???? ఇదీ కూడా మనల్ని తికమక పెట్టే పదమే. తాత్కాలికంగా, ప్రాప్త కాలికం గా… క్షణం లోనుంచి క్షణం లోకి చేసే ప్రయాణం అని అనుకోవచ్చు. దూరదృష్టి తో దీర్ఘ దర్శకం గా అవలోకిస్తే క్షణికం అనగా ఆశాశ్వతం, ” క్షణభంగురం ” అనగా క్షణం భంగురం, ప్రతి క్షణం క్షణికమే. అదే అనుక్షణికం.
.
అచ్చులో సుమారు పదిహేను వందల పేజీలు గా వచ్చిన ఈ పుస్తకం లో చండీదాస్ గారు తనని తాను పూర్తిగా ఆవిష్కరించుకుని రచనా శైలి లో తనని ప్రభావితం చేసిన వారినందరినీ, అన్నిరకాలు గానూ అధిగమించేశారు. తన గురించి తాను స్పష్టంగా ముద్ర వేసుకుని దానికి విమర్శకుల, పాఠకుల ఆమోద ముద్ర ను సునాయాసంగా పొందగలిగారు.
.
కొందరు సాహితీ విమర్శకులు ఈ పుస్తకానికి టాల్ స్టాయి గారి ‘ వార్ అండ్ పీస్ ’ అనే ఉద్గ్రంధం తో సాపత్యం తెచ్చారు. ఆ గ్రంధం తో వీరికి ఎంతవరకూ పరిచయం ఉందో మనకి తెలవదు కానీ సాధారణంగా పర భాషా గ్రంథాలని చదివి అందులో రచయిత ప్రతిపాదించదలుచుకున్న తత్వాన్ని పట్టుకోవడానికి మనకి ఆ భాషలో ఉన్న పరిజ్ఞానం ఒక ప్రధానమైన పరిమితి అవుతుంది. అల, వల, తల వరకే ఉన్న పర భాషా జ్ఞానం తో పర భాషా సాహితీ మధనం చేసామని అనుకుని ఆ విషయాన్ని ప్రకటించడం పై మనం ఎక్కువ గా చర్చించడం సరి కాదు కానీ వాస్తవం ఏమిటంటే చాలామంది సాహితీ విమర్శకులకు అనుక్షణికం లోతే అంతు పట్టలేదు.
.
సద్విమర్శకుల అభిప్రాయం ప్రకారం తెలుగు బాష లోని సమకాలీన సాహిత్య సాపత్యానికి గీటురాయి అయిన విశ్వనాధ వారి ‘ వేయిపడగలు ’ కన్నా అనుక్షణికం చాలా క్రింద స్థాయిలో ఉంటుంది. దానికి ప్రధానమైన కారణాల లో మొదటిది వేయిపడగలు లో కధాంశం 300 సంవత్సరాల క్రితం మొదలై సమకాలీనం వరకూ నడుస్తుంది. పాత్రాలూ, సంఘటనలూ ఎక్కువే. అనుక్షణికం లో కధాంశం ఒక దశాబ్ద కాలానికే పరిమితం. అనుక్షణికం లో పాత్రల విశ్లేషణ, వివరణ, సంభాషణలు విపులంగా ఉంటాయి. పాఠకులకి స్వంతం గా అలోచించే పని తక్కువ. వేయి పడగలు లో ఇవన్నీ సంక్షిప్తంగా సూక్ష్మం గా ఉంటాయి. ఒక్క ఋతువుల వర్ణనలు మాత్రం వివరంగా ఉంటాయి. సంభాషణలను, సంఘటనలను పాఠకులే విశ్లేషణ చేసుకోవాలి. “ఒకోసారి చదివినప్పుడు ఒకో అర్ధం స్పురించడం ‘ వేయి పడగలు ’ పాఠకుల అనుభవం. స్తూలం గా చెప్పాలంటే వేయి పడగలు వేరే వారెవరైనా రాయాలి అంటే కొన్ని వేల పేజీలకి విస్తరణ చేయవలసి వస్తుంది. ఇలాంటి కారణాలు ఇంకా ఉన్నాయి.
విశ్వనాథ వారికి భాష పైన విపరీతమైన స్థాయిలో పట్టు ఉన్నప్పటికీ పుస్తకం చాలా సందర్భాలలో వారి భావ ప్రకటన కి భాష సరిపోలేదు. కనుకనే పాఠకులు స్వయంగా భావం అన్వయం చేసుకోవలసి వస్తుంది. ఈ పరిస్థితి సంగీతం లో ఉంటుంది. కొన్ని సందర్భాలలో గాయకులు భావం పలికించడం కోసం, నిర్దేశించిన రాగ పరిమితుల ఎల్లలు దాటి స్వర సంచారం చేస్తారు. దీనిని మనోధర్మ సంగీతం అంటారు.
.
అనుక్షణికం ఆంధ్రజ్యోతి వార పత్రిక లో కొన్ని సంవత్సరాల పాటు ధారావాహికం గా ప్రచురించబడి విశేషం గా ఆదరణా / విమర్శలూ పొంది అనంతరం రెండు భాగాల పుస్తకం గా వెలువడింది. ప్రస్తుతం ఆమెజాన్ ద్వారా దొరుకుతుంది.
.
” అనంత వైవిద్య మానవ స్వభావాన్ని నేను కేవలం బ్రహ్మాండం లో అణువంత సృజించాను ” అని చండీదాస్ గారు వినయం గా చెప్పుకున్నారు. దీనికి కారణం తెలుగు విమర్శకులు ఈ పుస్తకానికి ” మనో వైజ్ఞానిక గ్రంథ ” హోదా కల్పించేస్తారేమో అన్న భయం కావచ్చును.
.
ఒక పాఠకుని సందేహానికి వివరణ ఇస్తూ చండీదాస్ గారు
” It is a novel about beastliness and saintliness and beastlisaintliness and saintlibeastliness ” అని అనుక్షణికం గురించి చెప్పుకున్నారు.
.
తరువాయి వచ్చే సంచికలో…..
.
***************************************************************