.
తెలుగు జావళీల తమిళ రచయిత
ఎంతోమంది వాగ్గేయకారులు తెలుగు నాటి నుంచి తమిళ ప్రాంతాలకు తరలి వెళ్లి, అక్కడ స్థిరపడి, సంగీతానికి అనంతమైన సేవలను అందించటం మనం ఎన్నటికీ మరువరాని అంశం. ఈ వాగ్గేయకారులంతా తమ రచనలను తెలుగులో కొనసాగించటానికి కారణం, తెలుగు భాషకున్న సౌలభ్యం, అనువు మరియు సంగీతానికి ఎంతో మృదువుగా లొంగిపోయి, ఒదిగిపోయే గుణం అనుకుంటాను. కర్ణాటక సంగీతంలో ఏ కచ్చేరీ అయినా ముగింపు ఒక పదమో, జావళీయో లేక రెండూను, దానికి ఒక తిల్లాన జతచేసి ముగించటం ఆనవాయితీగా వస్తోంది. జావళీలు, పదాలు పాడుతున్నప్పుడు, గాయకులు తమ విద్వత్తును గాక, రాగ భావ మాధుర్యాలను శ్రోతలకు అందచేయటానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు. అదే అందులోని తీపి. కొద్ది గంటలు శాస్త్రీయమైన గానం, రాగం, నెరవు, స్వరకల్పన వంటి విద్వత్ప్రదర్శన తరువాత, గాయకులు శ్రోతలకు అందచేసే ఈ చివరి అంశాలయిన పదం, జావళి లేక తిల్లానా చక్కని విందు తరువాత వేసుకునే తాంబూలంలా అనిపిస్తాయంటే చమత్కారం కాదు. జావళీలు కర్ణాటక సంగీతానికి ఇటీవల చేరి, చక్కటి జనాదరణ పొందిన రచనలు. రచనల్లో నాయకీనాయక భావం ప్రబలంగా కనిపిస్తుంది. భక్తిమార్గాలు లేకుండా కేవలం సామాన్య భాషలో శృంగారరసాన్ని అందచేస్తాయి. వీటిలో అక్కడక్కడా అశ్లీల పదాల ప్రయోగం కూడా ఉందని కొందరి అభిప్రాయం. ఇవి పదాల వలే కాక చురుకుగా పాడదగిన రచన. ఇది మంచి వినసొంపైన వేగం లేదా పాశ్చాత్య సంగీతంలో ” risqué ” లేదా ” tempo ” అని పిలువబడే విధంగా రచించబడ్డాయి. పల్లవి, అనుపల్లవి ఇంకా ఒకటి లేదా ఎక్కువ చరణాలను కలిగి ఉంటుంది.
జావళీల మాట ఎత్తగానే, మనకు గుర్తుకు వచ్చేది శ్రీ ధర్మపురి సుబ్బరాయ అయ్యర్. తమిళనాడులోని ధర్మపురికి చెందిన ఈ తమిళ వాగ్గేయకారుడు ( త్యాగరాజుగారు, ముత్తుస్వామి దీక్షితార్ మరియు శ్యామశాస్త్రి కాలానికి ముందరి వాడు ) జావళీలను తెలుగులోనే వ్రాసారు. జావళీ రచయితగా ధర్మపురి వారిని సర్వోత్తమం అని చెప్పుకోవచ్చు మనం. వారి రచనలలో కానవచ్చే సరళత, శృంగారం మనసుకు హత్తుకుంటాయి. చాలావరకూ జావళీలు శ్రీ కృష్ణభక్తినే చాటుతాయి.
సుబ్బరాయ అయ్యర్ గారు తమ రచనలను చాలావరకూ శ్రీమతి వీణ ధనం గారి ఇంట్లోనే రచించారని చెబుతారు. వీణ ధనం గారు మాత్రమే కాక, టి. బాలసరస్వతి గార్లచే కూడా ప్రభావితులై తమ రచనలు కొనసాగించారని అంటారు. తమ పవిత్రమైన స్నేహానికి ప్రతీకగా, శ్రీమతి ధనం ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నప్పుడు ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిలో ” సఖి ప్రాణసఖుడిటు చేసెనే ” అనే జావళీని రచించారట. ఇక టి. బాలసరస్వతిగారు తమ అభినయానికి వీరి రచనలను ఎంచుకునేవారట. ఇలా వారి రచనలను అత్యంతగా అభిమానించిన వారిలో ఎనాది సోదరీమణులు, కూడా ఉన్నారు. వీరి గురించి వ్రాస్తూ, శ్రీ టి. శంకరన్ గారు ” తమ పడకపై తలగడ క్రింద ఒక చిన్న పుస్తకాన్ని ఉంచుకుని, మనసులోకి ఎప్పుడు ఏ జావళీ స్ఫురిస్తే అప్పటికప్పుడు వెంటనే దానిని వ్రాసుకునేవారట. అందరు మహానుభావుల వలెనే, కళల ద్వారా ధనార్జనలో గల కష్టాన్ని చవిచూసిన వారి సతీమణి, తమ సంతానానికి తండ్రి పోలికలు రారాదని నిరంతరం ప్రార్థించేవారుట.
పంథొమ్మిదవ శతాబ్దానికి చెందిన ధర్మపురి సుబ్బరాయ అయ్యర్, రచించిన అనేక జావళీలలో చాలా ప్రముఖమైనవి దిగువనిస్తున్నాను.
- పరులన్నమాట (కాపీ)
- సఖిప్రాణ (జంఝూటి)
- వాని పొందు (కానడ)
- చారుమతి (కానడ)
- ముట్టవద్దురా మోహనాంగా (సావేరి)
- నీ పొందు చాలు (కానడ)
- నారీమణి (ఖమాస్)
- ఇది నీకు (బేగడ)
- ఏమందునే ముద్దు (సయింధవి)
- అదినీపై మరులు (యమునా కళ్యాణి)
- ఎంతటి కులుకే (కళ్యాణి)
వీరి ముద్ర ధర్మపురి. వీరి జీవిత విశేషాలను గురించి ఎక్కువగా సేకరించలేకపోయినప్పటికీ, వారి జావళీలలో నాకు నచ్చినవి మీ ముందుంచుతున్నాను.
జావళీల గురించి అధిక సమాచారం ఇక్కడ పొందవచ్చు:
*********************
.
సఖి ప్రాణసఖుడిటు – ఎం. ఎస్. సుబ్బులక్ష్మి – సెంజురుట్టి – అది తాళం
.
.
ఎంతటి కులుకే – కల్యాణి రాగం – ఓలేటి వెంకటేశ్వర్లు
.
.
అది నీపై మరులు – యమునా కల్యాణి – మహారాజపురం సంతానం
.
.
👉🏾మీకు నచ్చితే Like బటన్ నొక్కండి. మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (comment box) లో తెలియజేయండి👇🏾
******************************************************