.
ఈసారి “నెల నెలా వెన్నెల” కొత్తదనానికి వేదికైంది. మొదటిసారి ఒక ప్రసిద్ధ నృత్య కళాకారిణి సభాసదులను పలకరించి “నృత్యం – వైవిధ్యం” అంటూ నాట్యలోకంలో విహరింపజేశారు. నృత్యం అనేది 64 కళలలో భాగమని, నృత్యానికి పరమార్థం సమాజానికి ఉపయోగపడటమేనని వింజమూరి రాగసుధ పేర్కొన్నారు. అగ్ని పురాణం, భాగవత పురాణం, శివతత్వరత్నాకరం గ్రంథాలలో ఈ లలిత కళల గురించిన వివరణ ఉంటుందని ఆమె తెలిపారు.
.
నృత్యం అనగానే 2 వేల సంవత్సరాలుగా ఉనికిలో ఉన్న భరతముని విరచిత “నాట్యశాస్త్ర” గుర్తొస్తుందని, తరతరాలుగా గురుశిష్య పరంపరలో నోటి ద్వారానే ప్రచారంలో ఉండిన ఈ శాస్త్రంలోని శ్లోకాలు కొన్ని ప్రస్తుతం లభ్యం కావడం లేదన్నారు. దాదాపు వందేళ్ళ నుంచి మాత్రమే అచ్చులో కనిపిస్తుండడం కారణమని వెల్లడించారు.
.
“అభినయ దర్పణం”, “భారతార్ణవం” గ్రంథాలు కూడా ముఖ్యమైనవేనని, 10వ శతాబ్దంలో నాట్యశాస్త్రానికి అభినవ గుప్తుడు రాసిన వ్యాఖ్య “అభినవ భారతి” కూడా నృత్యానికి సంబంధించి అంతే ముఖ్యమైన గ్రంథమని అన్నారు. 13వ శతాబ్దంలో శారంగదేవుడు రాసిన “సంగీత రత్నాకరం”లో ఒక అధ్యాయం నృత్యం మీదేనని తెలిపారు. (శుభంకర కవి రచన) “హస్త ముక్తావళి”, “హస్త లక్షణ దీపిక”, పుండరీక విఠలుడి “నర్తన నిర్ణయం” తదితర గ్రంథాలు దేశంలోని రకరకాల ప్రాంతాలలో రూపుదిద్దుకొన్న గ్రంథాలని వివరించారు. 15వ శతాబ్దం వరకు కూడా నాట్యం మీద గ్రంథాలు వచ్చాయని,కాకతీయ సామ్రాజ్యంలో ముఖ్యమైన జాయపసేనాని, కేరళకు చెందిన బాలరామవర్మ కూడా గ్రంథాలు వెలువరించినవాళ్ళేనని అన్నారు. శాస్త్రీయ నృత్యాలని “మార్గి” నృత్యాలని, ప్రాంతీయ శైలులని “దేశీయ” నృత్యాలుగా పేర్కొంటారని అన్నారు.
.
నాట్యశాస్త్రంలో భరతముని “దాక్షిణాత్యం” (దక్షిణ భారత), “అవంతి” (పశ్చిమ భారత), “పాంచాల మధ్యమ” (మధ్య భారతం, ఆ పై ఉత్తర భారత) “ఔద్రమగధి” (తూర్పు భారత) అనే నాలుగు విధాలు వివరించారు, ఇవి దేశంలోని నాలుగు ప్రాంతాలకు చెందినవని రాగసుధ వివరించారు. నృత్యాన్ని “దేశే దేశే జనానా యాదృచ్ఛా హృదయ రంజకం” అంటారని, ఈ ప్రాంతీయ రీతులన్నీ ఆయా ప్రాంతాలలో మనోరంజకమైనవేనని అన్నారు.
.
పాశ్చాత్య దేశాల్లో ఉంటున్న తను అక్కడివారికి మన ఘనమైన సాంస్కృతికత, వైవిద్యాల గురించి చెప్పడం శిక్షకురాలిగా తన బాధ్యత అని అనుకున్నానని లండన్లోని యూనివర్సిటీ ఆఫ్ సండర్ల్యాండ్ లో నృత్య బోధకురాలైన రాగసుధ వెల్లడించారు. జానపద (tribal) నృత్య సాంప్రదాయాలపై తనకు ఆసక్తి ఉండడంతో వాటిమీద పరిశోధన మొదలుపెట్టానని చెప్పారు. “ఔద్రమగధి” (తూర్పు) సాంప్రదాయంలో నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ తదితర 7 ఈశాన్య రాష్ట్రాలలో ఒక్కొక్క చోట 15 రకాల నృత్యలున్నాయని, వాటికి సంబంధించిన ఆహార్యం, ఆభరణాలు భలే అందంగా ఉంటాయని వెల్లడించారు. అక్కడివారు అంగరంగ వైభవంగా జరుపుకొనే “హార్న్ బిల్ నృత్యోత్సవం” గురించి ప్రస్తావించారు. మేఘాలయలోని “గ్యారీ” అనే ముఖ్య జన సముదాయ నృత్యం మీద కూడా పరిశోధన చేశానని తెలిపారు. ఈ జానపద నృత్యల్లో ఆయా ప్రాంతాల్లో దొరికే రంగు రాళ్ళను అరగదీసి ముఖానికి రాసుకుంటారని అంటూ… ఈశాన్య రాష్ట్రాల నృత్యాలతోపాటు కేరళకు చెందిన కూడియాట్టం, ఆట్టన్ తుళ్ళల్, కథాకళిలను ఉదహరించారు. ఆభరణాలు కూడా అక్కడ దొరికేవాటితోనే తయారు చేసుకుంటారన్నారు.
.
విదేశాల నుంచి మన దేశానికి వచ్చిన జానపద నృత్య సాంప్రదాయాల్లో తూర్పు ఆఫ్రికా నుంచి తేబడ్డ పుగిడి, సిద్ధి ధమాల్ నృత్యాలు ప్రముఖమైనవని అన్నారు. పుగిడి నృత్యం మహిళలది కాగా సిద్ధి ధమాల్ పురుషులు చేసేదని వివరించారు.
.
.
డాన్స్ అనేది కథ చెప్పడం వంటిదని రాగసుధ అంటూ… “జలాంజలి” పేరిట తానొక కార్యక్రమం చేపట్టానని, ఇందులో….. నృత్యం ద్వారా నీటి నిల్వ, కొరత, పరిరక్షణ వంటి అనేక అంశాలను వివరించే ప్రయత్నం చేశానని చెప్పారు. ఆది శంకరుల గంగా స్తోత్రాన్ని మధ్యమంగా ఎంచుకున్నానని, భారత్ లోని ప్రతిష్టాత్మక భారీ ప్రాజెక్టు “నమామి గంగే” గురించి కూడా దీని ద్వారా అవగాహన పెంపొందించానని వివరించారు. వరల్డ్ వాటర్ డే సందర్భంగా ఈ 20 నిమిషాల కార్యక్రమాన్ని సమర్పించానని అన్నారు.
.
ఆసక్తికరంగా సాగిన ఈ ప్రసంగానికి ముందు వి. ఉషారాణి సభకు స్వాగతం పలికారు. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి ఆధ్వర్యంలో యూట్యూబ్ ద్వారా ప్రసారమైన ఈ కార్యక్రమానికి “శ్రీ రాజాలక్ష్మి ఫౌండేషన్” ఆర్థిక సౌజన్యం చేకూర్చగా… ముళ్ళపూడి ప్రసాద్ (చెన్నై), శిష్ట్లా రామచంద్రరావు, ఆయన కుమారుడు ఉదయ్ (విజయవాడ) సాంకేతిక సహకారాన్ని అందజేశారు. జులై 10, శనివారం సాయంత్రం ఈ కార్యక్రమం ప్రసారమైంది.
.
.
——(0)——