10_021 వాగ్గేయకారులు – పచ్చిమిరియం అదియప్ప

.

ప్రప్రథమ అటతాళ వర్ణ రచయిత – పచ్చిమిరియం ఆదియప్ప 

.

తంజావూరు మరాఠా రాజుల పరిపాలనలో అనేక సంగీతకారులకు, వాగ్గేయకారులకు, కళాకారులకు ప్రోత్సాహమిచ్చారు అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎందరో మహా కళాకారులను సంగీత ప్రపంచానికి అందచేశారు. అటువంటి దిగ్గజాలలో ఒకరు  పచ్చిమిరియం ఆదియప్ప. వీరి పేరు తలుచుకోగానే మొట్టమొదట గుర్తుకు వచ్చేది కర్ణాటక సంగీతానికి ఒక చక్కటి పటిష్టమైన నిర్మితి గల అట తాళ వర్ణం అందించి, కర్ణాటక సంగీత అభ్యాసానికి ఒక అమూల్యమైన ప్రామాణిక రచనను అందచేసిన మహనీయుడు. కర్ణాటక సంగీతం అభ్యసించే ఎవరినైనా ఒక స్థాయికి చేరారో లేదో తెలుసుకోవడానికి పెద్దలు అడిగేది “విరిబోణి” వర్ణం వచ్చా అని. అంతెందుకు, ఒకానొకప్పుడు త్యాగరాజ సంగీత సభ, విశాఖపట్నం వారు నిర్వహించే సంగీత పోటీల్లో మూడు అట తాళ వర్ణాలు మూడు కాలాల్లో పాడగలిగి ఉండటం ఒక పరీక్ష. పోటీదారులు ఇచ్చిన మూడు అట తాళ వర్ణాల జాబితాలో నుంచి న్యాయనిర్ణేతలు దేనిని పాడమంటే అది మూడు కాలాల్లో పాడగలిగితే, పోటీలో ఒక మెట్టు ఎక్కినట్టు. ఆ తరువాతే రాగాలాపన, స్వరకల్పన, నెరవు వంటివి పరీక్షించటం నాకు స్వయంగా తెలుసు. ఆ పోటీలో స్వర్ణ పతాకాన్ని గెలుచుకున్నాననే గర్వం కూడా ఒకింత దాచుకోలేకపోతున్నాను. అందుకు పాఠకులు మన్నించగలరు. ఇంతకీ చెప్పవచ్చేది ఏమిటంటే, ఒక అట తాళ వర్ణం విద్యార్ధికి రాగం, తాళం, సాహిత్యం, జ్ఞాపకశక్తి, ” ఎడ్పుప్పు లేదా ఎత్తుగడ ” అనే అంశాలపై సంపూర్ణ అవగాహన కలిగించే అపురూపమైన రచన. కర్ణాటక సంగీతానికి అటువంటి ప్రథమ రచనను అందచేసిన వాగ్గేయకారుడు పచ్చిమిరియం ఆదియప్ప. 

.

18 వ శతాబ్దం లో ఒక కన్నడ మధ్వ బ్రాహ్మణ కుటుంబంలో ఆడియప్ప గారి జననం జరిగింది. ఈ కర్ణాటక సంగీత దిగ్గజం శిష్యులలో మనం ముఖ్యంగా చెప్పుకోవలసింది కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరైన పూజనీయ శ్యామశాస్త్రి గారు, రెండవది ఘనం కృష్ణ అయ్యర్. ఆడియప్ప గారి రచనలు అన్నీ కూడా తెలుగు భాషలోనే చేశారు. 

.

వీరి పేరు ఎప్పుడు తలచుకున్నా, ముందుగా చెప్పుకోవలసింది భైరవి రాగం లో విరిబోణి అట తాళ వర్ణమే. సుబ్బరామ దీక్షితార్ వంటి గొప్ప సంగీతజ్ఞులు ఈ వర్ణానికి వారి ” సంగీత సాంప్రదాయ ప్రదర్శిని ” అనే గ్రంథంలో పెద్ద పీట వేశారు. వీరిని తరుచూ స్వరజతిని నృత్యానికి అనువైనదిగా మలిచిన వాస్తుశిల్పిగా పేర్కొంటూ ఉంటారు. ఈ వర్ణం అంటే ఎంతో ఆరాధనాభావం గల దక్షిణాముర్తి పిళ్ళై అనే తాళ వాద్య కళాకారుడు ఈ వర్ణం ఒక కచేరీని ఆరంభించటానికి సర్వోత్తమ విధానమని భావించేవారు. 

.

ఆదియప్పగారు సంగీతం అభ్యసించే వారికి ప్రథమ దశలో నేర్చుకోడానికి అనువైన ఇతర వర్ణాలు ఎన్నో రచించారు. ఇవిగాక, అనేక కృతులను రక్తి మరియు దేశి రాగాలలో రచించారు. వీరి రచనలు గీత మరియు ప్రబంధ నిర్మితిలో కూడా ఉపలబ్ధం. 

.

తంజావూరు తుల్జాజీ మరియు రాజా ప్రతాపసింహ గార్ల వద్ద ఆస్థాన విద్వాంసునిగా ఉండేవారు. ఆ సమయంలో శ్యామశాస్త్రి గారి జీవితంలో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగిందట. గురు శ్రీ యతి శ్రేష్ట శ్యామశాస్త్రుల వారిని ఆదియప్ప సంగీతాన్ని కేవలం విని వచ్చేయమన్నారట. వారిని అనుసరించవద్దని చెప్పారట. అయితే, ఆదియప్ప గారు శ్యామశాస్త్రి గారిని శిష్యునిగా చేర్చుకుని సంగీతం బోధించారట. వారిని యతి శ్రేష్ఠులవారు ఆదియప్పగారిని అనుసరించవద్దని ఎందుకన్నారో మరి. వీరి ఇతర శిష్య ప్రముఖులలో ఉన్న పల్లవి గోపాలయ్యర్, సంజీవ అయ్యర్, ఘనం కృష్ణ అయ్యర్ గార్లందరూ కూడా కర్ణాటక సంగీత కళామతల్లికి ఎంతో సేవ చేశారు. ఆదియప్ప గారి మనుమడైన సుబ్బుకుట్టి అయ్యర్ ప్రముఖ వైణిక విద్వాంసులని మనకందరకూ తెలిసిన విషయమే. 

ఇదిగో పచ్చిమిరియం ఆదియప్ప విరచిత విరిబోణి వర్ణం:

.

విరిబోణి వర్ణం – ద్వారం వెంకటస్వామి నాయుడు – వైలెన్ :

.

విరిబోణి భైరవి రాగ వర్ణం – ఎమ్మెస్ సుబ్బులక్ష్మి :

.

.

విరిబోణి వర్ణం – డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ :

.