10_022 అమెరికా ఇల్లాలి ముచ్చట్లు – శ్రావణమాసం స్పెషల్

Please visit this page

.

సరిగ్గా సమయానికి వచ్చారు….చేతులు కడుక్కురండి… ప్రసాదం తీసుకుందురు గానీ !

ఏమిటీ.. కళ్ళు అంత పెద్దవి చేసుకుని అలా చూస్తున్నారూ? ఇన్ని పిండివంటలు…పలహారాలు చేసాననా ?

ఈ రోజు శ్రావణ శుక్రవారం కదా? పూజ చేసుకున్నాను. అమ్మవారికి నైవేద్యంగా ఇవన్నీ చేసాను. ఇన్నాళ్ళకు కథలో చెప్పినట్టు పన్నెండు రకాలు చేసాను చూసారా !

 కాస్త పాయసం…నాలుగు బూరెలు చెయ్యడానికి, నానా హైరానా పడిపోయే నేను ఉన్నట్టుండి ఇన్ని పిండివంటలు ఎలా చేసానా అని ఆశ్చర్య పోతున్నారుకదూ? ఇదంతా అమ్మవారి మహిమ అనుకుంటున్నారేమో…కాదండీ బాబు అంతా తెలుగు బుల్లితెర మహిమ!

ఈ నెలంతా లేడీస్ అందరూ నోములు, వ్రతాలతో బిజీ….బిజీగా ఉంటారని “ శ్రావణమాసం స్పెషల్ ” అంటూ  “ఆ“ టీవీ లో ప్రత్యేకమైన వంటల ప్రోగ్రాం పెట్టారు. పూజలు… పునస్కారాలు చేసుకునే నాలాంటి ఆడవాళ్ళు గంటలు తరబడి వంటలు చేస్తూ… టైము వేస్టు చేసుకోకుండా నిమిషాల మీద రకరకాల నైవేద్యాలు ఎలా తయారు చేసుకోవచ్చో చూపించారండీ!

“ఆ” టీవీ ఏమిటీ అంటారా? మీకు ఏమి తెలీదు. “ఆ” టీవీ అంటే ఆడవాళ్ళ టీవీ అని అర్ధం. ఆ ఛానల్ లో అన్నీ ఆడవాళ్ళకు సంబంధించిన కార్యక్రమాలే వస్తాయి.

ఆ వంటల షో చూసాక తెలిసింది.. పిచ్చిమొహాన్ని ఇన్నాళ్ళు అన్నీ యధావిధిగా చేస్తూ అనవసరంగా శ్రమపడ్డానని!

ఏమిటీ…. టీవీ లో చూపించేవన్నీ మనకు ఎడిట్ చేసి చూపిస్తారంటారా?

సడేలేండి….సంబడం! అదేదో మీకొక్కళ్ళకే తెలిసినట్టు… ఆ సంగతి నాకూ తెలుసు! కానీ ఈ కుకింగ్ షో అలా కాదు. స్టవ్ వెలిగించినప్పటినుంచీ… చేస్తున్న వంటని ప్లేట్లోకి తీసేంతవరకు ఖచ్చితంగా ఎంత టైం పడుతుందో టైమర్ పెట్టి మరీ చూపించారు.

టైమర్ పెట్టి చూపించడం ఏమిటీ అంటారా?

అబ్బ చెప్పాను కదండీ….. ఇది మామూలు వంటల ప్రోగ్రాం కాదనీ. అన్ని షోల్లో లాగా వంటలు ఎలా చెయ్యాలో చూపించే కార్యక్రమం కాదది. ఓ పిండివంట ఎలా చెయ్యాలో చూపించటం గొప్ప కాదు. దాన్ని ఎంత తక్కువ టైములో చేస్తారన్నది అసలైన పాయింటు. ఏ అయిటం చేసినా ఏడు నిముషాలు దాటిందంటే ఎలిమినేట్ అయిపోతారు. పోవమ్మ మహాలక్ష్మీ… పోవమ్మా… అంటూ పంపించేసారు తెలుసా! వంటల్లో చెయ్యితిరిగిన వనితలు కొందరు మూడంటే మూడు నిమిషాల్లో ఇట్టే స్వీట్లు.. అట్టే హాట్లు చేసేసి పట్టుచీరలు….పాపిడిబిళ్ళలు గెలిచేసుకున్నారు! కొన్ని స్వీట్లకైతే స్టవ్ కూడా ఆన్ చెయ్యక్కర్లా….మైక్రోవేవ్ లో ఇలా పెట్టి అలా తియ్యడమే. ఇవాళ నేను చేసిన ఈ పిండివంటలన్నీ ఆ షో లో బహుమతులు గెలుచుకున్నవేనండీ!

ఏమిటీ.. మూడునిముషాల్లో…ఐదు నిముషాల్లో పిండివంటలు పూర్తిచెయ్యడం వింతగా ఉందంటారా?

వింతే మరి! అంతే కాదండోయ్ ! ఆ కొద్దిపాటి టైములో కూడా వంటమీద శ్రద్ధ పెట్టాల్సిన పని లేదుట. చాలా మంది ఓ పక్క వంట చేస్తూనే యాంకర్ అడిగే ప్రశ్నలకు చకచకా సమాధానాలిస్తూ… పాటలు పాడుతూ… డ్యాన్సులు చేస్తూ పూర్తి చేసారు. నిజానికి అది వంటల పోటీ కమ్ టాలెంట్ షో అనుకోండి !  

వంటలకు…డాన్సులకు సంబంధం ఏమిటీ అంటారా?

ఏం చచ్చు ప్రశ్న అండీ బాబు! ఏ కాలం లో ఉన్నారు మీరు? అందుకే తెలుగు ఛానల్స్ చూడండీ. కాస్త తెలివి పెరుగుతుందీ అంటే వినిపించుకోరాయే. అస్తమానం హిస్టరీ ఛానల్సు…ట్రావెల్ ఛానల్సు….ఈ రెండు కాకపొతే న్యూస్ ఛానల్ చూసే మీకు లోకజ్ఞానం..తెలివితేటలు రమ్మంటే ఎలా వస్తాయి?   

ఇప్పుడు పాటలు….డ్యాన్సులు బుల్లితెర వంటల్లో భాగాలు అయిపోయాయి. చేసే వంటలో ఉప్పులు, కారాలు వేసినా వెయ్యక పోయినా ప్రేక్షకులు ఏమి పట్టించుకోరు. కానీ ఆటలు….పాటలు లేకపోతే అమ్మో! ఇంకేమైనా ఉందా?!  “ఆడుతు..పాడుతు పని చేస్తుంటే….అలుపు సోలుపే ఉండదు” అని ఆనాడే మన కవులు పాటలు కూడా రాసారు కదా. అలా ఓ పక్క వంట చేస్తూ మరో పక్క పాటలు పాడుతూ..డ్యాన్సులు చేస్తుంటే శ్రమే తెలీదుట. ఈ రోజుల్లో “అసలు పని” మాట ఎలా ఉన్నా ఆటా పాటా వస్తే చాలు ఇట్టే షయిన్ అయిపోవచ్చు!

గొప్పవాళ్ళ దగ్గరనుంచీ నాలాంటి వాళ్ళతో సహా బుల్లితెర మీద కనిపించాలంటే ఈ రెండు వచ్చితీరాలి. ముఖ్యంగా ఎగరటం …అదేనండీ గంతులేయడం తప్పనిసరిగా రావాలి. చిన్నప్పుడు నేను రేడియోలో సినిమా పాటలు వింటూ, నాకు తోచినట్టు డాన్స్ చేస్తుండేదాన్ని. నా డాన్సుని ఎవరూ మెచ్చుకోకపోగా ఇంట్లో అందరూ “ నీకు కాళ్ళు చేతులు కుదురుగా ఉండవు కదా? ఏమిటా పిచ్చి గంతులు ” అంటూ అస్తమానం కోప్పడేవారు. ఆ పిచ్చి ఎగురుళ్ళే ఈ రోజుల్లో ఓ పెద్ద స్టైల్  అయిపోయింది! ఏ వంటల ప్రోగ్రాం అయినా “ ఇప్పుడు ఫలానా వారు మనకి ఓ కొత్తరకం వంటకం చూపిస్తారు ” అని అంటారే కానీ… అసలు వంట కంటే ముందు, వాళ్ళు వగలు పోతూ మనకు చూపించేది వాళ్ళ చీరలు… నగలు..డాన్సులే!

ఏమిటీ…. ఈ వంటలు చూస్తుంటే నైవేద్యం కోసం చేసినట్టు లేవంటారా? పార్టీల్లోను.. రెస్టారెంట్ లో చేసే ఐటమ్స్ లా ఉన్నాయంటారా?

అయ్యో రామ! మీకు ప్రతీది విడమరిచి చెప్పాలి. ఇప్పుడు రోజూ మనం తినే ఫుడ్డులో మార్పు వచ్చినట్టే దేముడికి పెట్టే నైవేద్యాల్లో కూడా బోలెడంత కొత్తదనం వచ్చేసిందండీ! పాతవస్తువుల్ని ఆటక మీదకు ఎక్కించేసినట్టు, పాత నైవేద్యాల్ని అందరూ పక్కన పెట్టేస్తున్నారు. ఇప్పటి కాలం అమ్మవార్లు ఆ పాత పరమాన్నాలతో…పులిహోరలతో….అప్పాలతో ప్రీతి చెందరుటా. మనం ఎన్ని కొత్త రకాలు చేస్తే  దేవతలు అంత సంతోషించి, అంతే త్వరగా మన కోరికలు తీరుస్తారుటండీ ! అందుకే ఇవ్వాళా.. రేపు దేవుళ్ళకు “కాంటినెంటల్ టైప్ నైవేద్యాలు” కామన్ అయిపోయాయి.

గులాబ్ జామ్ తో కర్రీ చేసుకోవచ్చనీ….పనీర్ తో పచ్చడి చెయ్యచ్చని…. మష్రూమ్స్ తో మాగాయ పెట్టచ్చని

“ శ్రావణమాసం స్పెషల్ ” షో చూసిన తర్వాతే తెలిసింది!

ఒకవేళ మన చాదస్తం కొద్దీ  సాంప్రదాయకమైన నైవేద్యాలే పెట్టాలనుకున్నా, పూర్వంలాగా వంటకాలన్నీ ఆరోజే చెయ్యక్కరలేదుట. క్రితం రోజే పిండిరుబ్బుకుని రెఫ్రిజిరేటర్లో పెట్టేసుకోవడం….స్వీట్ మరింత రుచిగా ఉండటానికి…త్వరగా అయిపోవడానికి చక్కగా బజారులో దొరికే కోవా కొనుక్కొచ్చి వేసెయ్యడం… కూర మగ్గిపోగానే రెడీ మేడ్ సాస్ వేసి కలిపెయ్యడం లాంటి చిట్కాలు చాలా…చాలా చెప్పారు!!

ఏమిటీ అమ్మవారు ఎప్పటిలా కాకుండా అదోమాదిరిగా ఉందేమిటీ అంటారా?

అమ్మో ఫరవాలేదే…..నా అమ్మవారు కొత్తగా ఉందని కనిపెట్టేసారే! ఇప్పటి ఫాషన్ కు తగినట్టుగా అమ్మవారిని ఎన్ని రకాలుగా అలంకరించుకోవచ్చో కూడా చూపించారు. అందుకే ఈసారి నేను కూడా నా వరలక్ష్మి అమ్మవార్ని కొత్త స్టయిల్ లో అలంకరించుకున్నా.

పెళ్ళిళ్ళకు “వెడ్డింగ్ ప్లానర్స్” ఉన్నట్టే ఇప్పుడు నోములు వ్రతాలు చేసుకునే వాళ్ళకోసం “పూజా ప్లానర్స్” అని ఉన్నారుటండీ. వాళ్ళు ఈ ”శ్రావణమాసం స్పెషల్” షో కి వచ్చి ఇలాంటి అకేషన్లకు ఎలా ప్రిపేర్ అవ్వాలో నేర్పారు. ఇండియాలో ఇప్పుడు ఈ ప్రొఫెషన్ కు బోలెడంత డిమాండుటండీ!

ఈ రోజుల్లో మొగుళ్ళ కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఆడవాళ్ళకు, పిల్లల్ని పెంచే టైము…. వంటింట్లోకి వెళ్ళే ఓపిక ఉండటం లేదు. ఇంక పూజలకు…. పునస్కారాలకు టైము ఎక్కడు౦టుందీ? అందుకే ఈతరం పిల్లలు పూజా ప్లానర్స్ ని బుక్ చేసేసుకుంటున్నారుట! వ్రతానికి కావాల్సిన వస్తువులకోసం పనికట్టుకుని కొట్టుకొట్టుకు తిరగక్కరలేకుండా అన్నీ వాళ్ళే పట్టుకొస్తారు.  

నా చిన్నప్పుడు మా అమ్మ “వరలక్ష్మీ వ్రతం” రోజున ఎంత శ్రమ పడేదో. ఓ పక్క వంట చేస్తూ..మరో పక్క పిండితో అమ్మవార్ని తయారుచేసుకుంటూ..పూజకు కావాల్సినవి సిద్ధం చేసుకుంటూ..ముత్తైదులకు ఇవ్వాల్సిన వాయనాలు సర్దుకుంటూ నానా హైరాన పడిపోయేది. ఇప్పుడు ఆ బాధలేమి లేకుండా పూజా ప్లానర్స్ కు కాంట్రాక్ట్ ఇచ్చేస్తే అన్నీ వాళ్ళే చూసుకుంటారు. అమ్మవార్ని అలంకరించడం దగ్గరనుంచి…వచ్చిన ఆడవాళ్ళకు తాంబూలం ఇవ్వడం దాకా అంతా వాళ్ళదే పూచీ. మన బడ్జెట్ ని పట్టీ మన అభిరుచిని పట్టీ మనకు ఎలా కావాలంటే అల్లా సిద్ధం  చేస్తారు. అమ్మవార్ని కూడా మనకు ఏ స్టయిల్ లో కావాలంటే ఆ స్టయిల్ లో తయారుచేస్తారుట.

దేవుళ్ళకు స్టయిల్ ఏమిటీ ….అంటారా?

మీకు అన్నీ పూసగుచ్చినట్టు చెప్తే కాని అర్ధంకాదు కదా? స్టయిల్ అంటే టాలీవుడ్ స్టయిల్ల్ లోనా….బాలీవుడ్ స్టయిల్ లోనా…ఈ రెండు కాక హాలీవుడ్ స్టయిల్ ల్లోనా అని అర్ధం!

శ్రావణ మాసానికి ముందు ఏ సినిమా అయినా సూపర్ డూపర్ హిట్ అయితే ఆ సినిమా హిరోయిన్ స్టయిల్ పాపులర్ అయి కూర్చుంటుందిట. ఇంక ఆ స్టయిల్ లో ఉన్న అమ్మవారిని చూడ్డానికి ఎక్కడెక్కడి లేడీస్ వస్తారుట.

మా పెద్ద అక్కయ్య చెప్తోంది….కిందటి ఏడాది పెళ్ళి చేసుకున్న దాని ఆఖరి మనవరాలు లిప్సిక, హైదరాబాద్ లో హై టెక్ సిటీ లో ఉంటుంది. అది మొదటిసారి వరలక్ష్మీ వ్రతం చేసుకుంటోందని మా అక్కయ్య పాపం, అనాతవరం నుంచి అవస్థపడుతూ వెళ్ళిందిట. పేరంటానికి వచ్చిన ఆడపిల్లలందరూ మా లిప్సిక లాగే సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుట! అమ్మాయిలందరూ మూవీ స్టార్స్ లా తయారయి, వస్తూనే  హాపీ ఉగాది… హాపీ దివాలీ అని చెప్పుకున్నట్టు “ హాపీ వరలక్ష్మీ… హాపీ వరలక్ష్మీ” అంటూ ఒకళ్ళ కొకళ్ళు హై ఫైవ్ లు ఇచ్చుకున్నారుటా!

“యువర్ వరలక్ష్మీ లుక్స్ వెరీ  స్మార్ట్…..యువర్ వరలక్ష్మీ లుక్స్ వెరీ గ్లామరస్” అంటూ లిప్సికను పొగిడేస్తుంటే మా అక్కయ్యకు అంతా అయోమయంగా అనిపించిందిట.

మా అక్కయ్య కోడలు శ్రీదేవి మాత్రం, లక్షలు సంపాదించే వాళ్ళ అమ్మాయి అసలు పూజ అంటూ చేసుకోవడమే తన భాగ్యం అన్నట్టు, కూతుర్ని చూసుకుని ఒకటే మురిసిపోయిందిట!  

ఇన్నాళ్ళు “అమెరికా” అంటే ఆధునిక దేశం అని… నాగరికత అంతా ఇక్కడే ఉందని అనుకునేదాన్ని. తెలుగు చానల్స్ చూసిన తర్వాత తెలిసింది…ఆధునికతలో అమెరికా ఎక్కడో ఆమడదూరం వెనకాతల ఉందని!

 ఏమైనా ఈ సారి “శ్రావణమాసం స్పెషల్“ పుణ్యమా అని అస్సలు శ్రమే అనిపించలేదు సుమండీ !   

ఇంతకూ నా సరికొత్త వంటలు… నైవేద్యాలు… ఎలా ఉన్నాయో చెప్పారుకాదు!

అదేమిటీ! మొహం అదోలా పెట్టి అలా బాత్రూం వైపు పరిగెడుతున్నారూ, ఇంకా పదిరకాలు ఉన్నాయి త్వరగా వచ్చేయండి ఇదిగో మిమ్మల్నే…..

.

తొలి ప్రచురణ “తెలుగుకళా సమితి” ప్రత్యేక సంచిక “ప్రతిభ” 2015

.

శ్రావణమాసం స్పెషల్-నేపథ్యం  

మాకు తెలుగు ఛానల్స్ వస్తున్న రోజుల్లో, ఏమయినా కొత్త రకాలు నేర్చుకోవచ్చన్న ఆశతో నేను వంటల షోలు చూస్తూ ఉండేదాన్ని. ఒకసారి ఒక ఛానల్ లో పండగ టైములో వంటల పోటీలు అంటూ వింత వింత వంటకాలు చూపించారు! నిజంగానే టైమరు పెట్టి ఆ కొద్ది పాటి టైములోనే వంటతో పాటు వాళ్ళను డాన్స్ చెయ్యమని, పాట పాడమని నానా హంగామా చేస్తూ కొన్ని రోజుల పాటు జరిగిన ఆ షో ఈ ముచ్చటకు ప్రేరణ అయింది. ఈ మధ్య కాలంలో ఇక్కడికి వస్తున్న యువతరం ఆడపిల్లలు శ్రావణమాసం టైములో “హాపీ వరలక్ష్మీ” అంటూ హాండు షేకులు, హై ఫైవ్ లు ఇచ్చుకోటం కళ్ళారా చూసిన తర్వాత, తప్పకుండా ఈ ముచ్చట రాయాలనిపించింది!  

.

—————–(0)—————-

.