.
అనుక్షణికం లో వచ్చే పాత్రలు రెండు వందలకు పైగా ఉంటాయి. రకరకాల మాండలికాలు, ఒకే ప్రాంతం వారు మాట్లాడే భాష అయినా మళ్ళీ అందులో సామాజిక స్థాయీ వ్యత్యాసాలు… వేరు వేరు భావజాలాలు….పాత్రలు తమ భావాలను తమదైన భాషలో చెపుతాయి… శ్రీపతి, స్వప్నరాగలీన, అనంత రెడ్డి, ఇంగువ నిరంజన రావు, పప్పు వరాహ శాస్త్రి, వేదాంతం తార, ఆమె భర్త భాగవతుల రామారావు, శ్రీగంధం కస్తూరి, విజయ కుమార్, సీత, దుర్గ, రమాదేవి, రత్నాకర రావు, నళిని, గంగినేని రవి, అంకినీడు, రవి పెళ్ళి చేసుకున్న అమ్మాయి గంగి, ఆమె తండ్రి సాయులు, అన్న రాములు, వికారాబాద్ పాండురంగారెడ్డి, జంధ్యాల సుబ్రహ్మణ్యం, గోవర్ధన్ రెడ్డి, ధర్భా వీరభద్ర రావు, రేబాల స్రవంతి, వెంకటావదాని, రాజమండ్రి రమణి, శొంఠి గాయత్రి, ఆలేరు మోహన రెడ్డి, బందరు రామ్ముర్తి, దయానంద సరస్వతి, జీడి వేదపారాయణ, అట్లూరి గాంధీ, గుండు శఠగోపం, చెరుకూరి వేంకటేశ్వర రావు, అభ్యుదయ రచయిత్రి మెంతికూర మృదుల, స్ట్టెనో ముష్టి ధనలక్ష్మి, వందన, గోకరాజు గజపతి రాజు, గౌరీపతి శర్మ, సుచిత్ర, జయంతి, విలియమ్స్, వై వి ఎల్ ఎన్ ప్రసాద్,..వెంకటేష్,… ఇలా
.
మొదటి అధ్యాయం లో శ్రీపతి, స్వప్నరాగలీన ల సంభాషణలు, గాయత్రిని పోలీసులు అజ్ఞాతం లో ఉండగా, ఆమె భర్త, మోహన్ రెడ్డి ని అనునయిస్తున్నప్పుడూ, విరసం సభలో తన విప్లవ గళాన్ని, వినిపించిన గాయత్రి కి జరిగిన అవమానాన్ని వింటున్నప్పుడూ, స్వప్న, అనంతరెడ్డి ల పెళ్ళి సందర్బం లోనూ, శ్రీపతి ని వందన తన ఇంటికి పిలిచి శ్రీపతి పై తన ఇష్టాన్ని వ్యక్తం చేసినప్పుడూ, శ్రీపతి గీసిన చిత్రాలకి రామ్మూర్తి ఆర్ట్ గేలరీ లో ప్రదర్శన చేసినప్పుడూ, ఇలా అనేక సందర్భాలలో శ్రీపతి అంతరంగ ఆవిష్కరణ ఉత్తమ స్థాయి లో ఉంటుంది.
.
ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ లాన్ లో కూర్చున్నప్పుడూ, రాత్రి బర్కత్ పురా నుంచి కోఠీ వైపు నడుస్తున్నప్పుడూ, 35 ఏళ్ళ స్టెనో ముష్టి ధనలక్ష్మి అది తన ఇరవై మూడవ పుట్టినరోజు అని చెప్పుకుని చేసిన సెలబ్రేషన్ లోనూ, పప్పు వరాహ శాస్త్రి చెల్లెలు, చారుమతి పెళ్ళిలో నేతి లో బూరెలు ముంచుకు తింటున్న ఇంగువ నిరంజన్ రావు ని చూస్తున్నప్పుడూ, ఇలా అనేక సందర్భాలలో, శ్రీపతి అంతరంగ ఆవిష్కరణ బాగుంటుంది.
.
***** ****** ***** *****
.
గంగినేని రవి స్వభావం వేరు, కృష్ణా జిల్లాకి చెందిన మధ్య తరగతి కుటుంబ నేపథ్యం. తల్లితండ్రుల స్వభావం తో సర్దుకోడు, సర్ది చెప్పబోయిన ధనవంతుడైన మేనమామ తో తగవు పడతాడు. మేనమామ కూతురు నళిని కి రవి పైన ప్రేమ… అతని కోసం యూనివర్సిటీ లో చేరుతుంది. యూనివర్సిటీ, విద్యార్థి రాజకీయాలు, ఆ తరవాత మిల్లు ట్రేడ్ యూనియన్ లు అంచెలంచెల రాజకీయ నిచ్చెనలు, నళిని ని అహంకారిగా భావించి తిరస్కరించిన రవి, తన తోటి కార్మికుడి చెల్లెలు గంగి ని ప్రేమిస్తాడు. ఆమె తండ్రి ముగ్గు పొడి అమ్ముకునే సాయులు. రవి వారికి, ” రవి సాబ్ “. ఇందిరా కాంగ్రెస్ ఏర్పడిన తరవాత జరిగిన ఎన్నికలలో ముషీరాబాద్ నుంచి పోటీకి నిలబడిన రవి గెలువగా, యూత్ కాంగ్రెస్ నాయకుడూ, రవి సహచర విద్యార్థి అయిన గోవర్ధన్ రెడ్డి ఓటమి పాలవుతాడు. రవికి చెన్నారెడ్డి మంత్రి వర్గంలో చోటు దొరుకుతుంది. ఇందిరాజీ దృష్టిలో పడతాడు. గంగి, రవి దగ్గర నుంచి ఆశించిన శారీరికమైన వాంఛలు తీరకపోవడం తో, నివృత్తి కోసం అక్రమ సంబంధాలకు దిగుతుంది.
.
రవి తిరస్కారానికి గురియై నిరాశ పడిన నళినిని తల్లితండ్రులు అనునయించి, కాలక్షేపం కోసం యూనివర్సిటీ ని ఆశ్రయించిన అంకినీడు తో పెళ్ళి జరిపిస్తారు. అంకినీడుకి సినిమాల మీద మోజు.
.
నళినిని బతిమాలుకుని ఒప్పించిన అంకినీడు అనుభవం లేని భాగస్థులతో కలసి తీసిన సినిమా అపజయం పాలవుతుంది. బుద్ధి మార్చుకున్న అంకినీడు వ్యాపారాలలో నళినికి సహాయం గా ఉంటాడు. వ్యాపారం లో ఎదిగిన నళిని ఆర్థికం గా బలపడి, రాజకీయ బ్రోకర్లను శాసించే స్థాయి కి చేరుతుంది.
.
రవి ఎదుగుదలని సహించలేని సొంత పార్టీ వారు పన్నిన పన్నాగాలలో ఇరుక్కున్న రవికి మంత్రి పదవి కోల్పోయే పరిస్థితి వస్తుంది. సన్నిహితుల సలహాని అనుసరించి, అభిమానాన్ని చంపుకుని నళిని ని కలుస్తాడు.
.
తన అహంకారం బయట ప్రపంచం కోసమే కానీ, రవి ముందు ప్రవర్తించడం కోసం కాదనీ, తన ప్రేమనూ తిరస్కరించిన బావ మీద తనకి జాలే కానీ కోపం లేదనీ, తెలియజేసి, అతను వచ్చిన పని తనకి తెలుసుననీ, మంత్రి పదవికి ఏమీ ఇబ్బంది ఉండదనీ, నిశ్చింత గా ఉండమనీ, సలహా చెప్పి సాగనంపుతుంది. రవి లో మానసిక పతనం మొదలవుతుంది. గంగి ప్రవర్తన అతన్ని వంటరిని చేస్తుంది. అనంతర ఎన్నికల్లో ఓటమి భారం. ఇందిరాజీ ని కలసినా ఉపయోగం ఉండదు.
.
నళిని ప్రేమని తిరస్కరించి తప్పు చేసాను అన్న ఆపరాధనా భావం, గంగి ప్రవర్తనా, రాజకీయం గా తన పతనం రవి ని కృంగదీస్తాయి. తలకి ఎక్కిన రాజకీయ మైకం రవిని మానసికంగా పతనం చేస్తుంది.
.
తరువాయి భాగం వచ్చే సంచికలో….
.
———(0)———
.