10_022 వాగ్గేయకారులు – ముత్తయ్య భాగవతార్

Please visit this page

.

” గం గణపతే ” అని సంస్కృతంలో హంసధ్వని రాగంలో, ” అంబవాణి నన్నాదరించవే ” అంటూ తెలుగులో కీరవాణి రాగం లోనూ, “భువనేశ్వరియా” అనే కన్నడ కృతిని మోహనకల్యాణి రాగం లోనూ, ” హిమగిరి తనయే” శుద్ధ ధన్యాసి రాగంలో, అన్నిటినీ మించి ” సుధామయీ సుధానిదే ” అనే అమృతవర్షిణి రాగంలో కృతినీ వినని వారు, పాడనీ గాయకులు లేరంటే అతిశయోక్తి కాదు. అవును, శ్రీ ముత్తయ్య భాగవతార్ గారు ఇలాంటి రచనలెన్నిటితోనో కర్ణాటక సంగీత సరస్వతిని అలంకరించారు. పిల్లల దగ్గర నుంచి, పెద్ద పెద్ద కళాకారుల వరకూ ఎంతో ఇష్టంగా, గౌరవంగా పాడే కృతులివి. 

.

శ్రీ ముత్తయ్య భాగవతార్ 1877 వ సంవత్సరం, నవంబర్ 15వ తేదీన తమిళనాడు లోని తిరునల్వేలి జిల్లా హారికేశానల్లుర్లో జన్మించారు. జన్మతః ధనవంతులైన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వీరికి చిరుప్రాయం నుంచే సంగీతం లో ప్రవేశం కల్పించిన వీరి తండ్రిగారు గొప్ప సంగీత కళా పోషకులు. దురదృష్టవశాత్తూ తన ఆరవ ఏటనే తండ్రిని కోల్పోయినా, వీరి మేనమామ శ్రీ ఎమ్. లక్ష్మణ సూరి ముత్తయ్య గారిని పెంచే బాధ్యతను చేపట్టి, సంస్కృతం మరియు వేదాలు అభ్యసింప చేసారు. కానీ సంగీతం పట్ల వీరికి గల పిపాస వలన అనతికాలంలోనే హరికేశానల్లుర్ విడిచి సంగీత గురువు కోసం వెతుక్కోనారంభించారు. వారి శ్రమ ఫలించి, పదవ ఏటనే తిరువారూర్ లో పదినైదుమండపాక సామశివా అయ్యర్ గారి వద్ద శిష్యరికం చేసే అవకాశం లభించింది. వీరి వద్ద గడిపిన తొమ్మిది ఏళ్లలో కళను బాగా అభివృద్ధి చేసుకుని, ఒక గొప్ప హరికథా విద్వాన్ గా పేరు గాంచారు. గంభీరమైన గాత్రం, అద్భుతంగా తానం పాడగలగటం వీరిని ప్రజల అభిమాన  కళాకారునిగా నిలబెట్టాయి. సేతూర్ జమీందారీలో ఆస్థాన విద్వాంసునిగా, ఉండేవారు. భారతరత్న శ్రీమతి ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి ప్రథమ గురువు కూడా వీరే. 

.

వీరు గావించిన దాదాపు 400 సంగీత రచనలలో, ( సంగీత త్రిమూర్తుల అనంతరం ఇంత అత్యధిక సంఖ్యలో రచనలు వీరికే ఉన్నాయని చెప్తారు ), రకరకాల వర్ణాలు, కృతులు మరియు తిల్లానాలు ఉన్నాయి. ఇవి గాక 20 రాగాల రూపకర్త కూడా. వీరి రచనలు తెలుగు, తమిళం, సంస్కృతం ఇంకా కన్నడ భాషల్లో ఉన్నాయి. నేటికీ ఎక్కువ ప్రాచుర్యం పొందిన రాగాల్లో విజయసరస్వతి, కర్ణరంజని, బుధమనోహారి, మరియు నిరోష వంటి అపురూప రాగాలున్నాయి. షణ్ముఖప్రియ, మోహన, కళ్యాణి  రాగాలను ప్రజలకు చేరువ చేసి అభిమాన రకాలుగా కూడా నిలబెట్టారు. ఎవరో వారిని పాశ్చాత్యులకు నచ్చే విధంగా ఏదైనా సంగీతాన్ని రూపొందించగలరా అని కోరితే కొన్ని ఆంగ్లేయ స్వరాలఝరులొలికేలా సంగీతం తయారుచేశారట. వీటినే, తరువాతి సమయంలో మధురై మణి అయ్యర్ తమదైన శైలిలో లోకప్రియం చేసిన సంగతి మనకు తెలిసినదే. 
.

వీరి గురించిన ఇంకొక ఆసక్తికరమైన విషయం  ఏమిటంటే, 1934 లో ఎస్. సౌందరరాజన్ గారి తమిళనాడు టాకీస్ నిర్మించిన ” లవకుశ ” చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఈ చిత్రానికి 63 గీతాలను సమకూర్చే ముందు బొంబాయికి కూడా వెళ్లి వచ్చారు. ఈ గీతాల వలన ఈ చిత్రానికి ” సంగీత లవకుశ ” అని పేరు మార్చటం కూడా జరిగింది. వీరు చిత్రవీణ ఇంకా మృదంగం చక్కగా వాయించేవారట. 
.

వీరి ప్రముఖ రచనలలో “సంగీత కల్పద్రుమం” ఒక గొప్ప రచన. సంగీత అకాడెమీ కి లెక్చర్లు ఇవ్వటంతో బాటు కేరళ విశ్వవిద్యాలయం నుంచి డీ. లిట్. పట్టాను తమ తమిళ గ్రంథానికి 1943 లో అందుకున్న మొదటి సంగీతజ్ఞులు. స్వాతి తిరుణాళ్ అకాడెమీ 1939 లో ఆరంభించినప్పుడు, దాని మొదటి ప్రధానోపాధ్యాయులు వీరే. 

.

” త్యాగరాజ విజయ కావ్యం ” వీరి సంస్కృత రచన. మరొక ప్రథమ విజయం తిరువనంతపురం ఉత్సవ పూజల్లో  నాదస్వర విద్వాంసులు వాయించే ప్రథను కూడా వీరే ప్రవేశపెట్టారు. వీరి శిష్యగణం ” హరికేశాంజలి ” అనే ట్రస్ట్ ని నడుపుతున్నారు. 
 .

వీరు తమ జీవితాన్ని ఎంతో వైభవంగా గడిపారు. వీరి ప్రతిభను చూసి మైసూర్ మహారాజా కృష్ణ రాజ వడయార్ ఎంతో ముగ్ధులయ్యారు. అక్కడుంటున్నప్పుడే చాముండీదేవి పై కన్నడ భాషలో 115 కీర్తనలను వ్రాసారు. తరువాత ట్రావెన్కోర్ మహారాజా వారి ఆహ్వానంపై అక్కడ ఉన్నప్పుడు స్వాతి తిరుణాల్ రచనలు అధ్యయనం చేసిన తరువాత ” సంగీత కల్పద్రుమం ” వ్రాసారని చెపుతారు. దాని ఫలితంగానే వారికి గౌరవ డాక్టరేట్ కూడా లభించింది. మద్రాసు మ్యూజిక్ అకాడెమీ నిర్వహించిన వార్షిక సమావేశం లో మొదటిసారి అధ్యక్షత వహించి, పిమ్మట కర్ణాటక సంగీతంలో ” సంగీత కళానిధి ” బిరుదాంకితులయిన ఘనత కూడా వీరిదే. 

.

వీరు కర్ణాటక సంగీతానికి పరిచయం చేసిన హంసానంది రాగానికి మూలం హిందుస్తానీ సంగీతంలో ” సోహిని ” రాగం. అదే విధంగా ” సారంగ మల్హార్ ” కూడా. ఇవిగాక, కర్ణాటక సంగీతానికి 20 కొంగ్రొత్త రాగాలను కూడా వీరు అందచేశారు. 

.

మీకోసం:

1. సుధామయి సుధానిధి – అమృతవర్షిణి – ఎం‌. ఎల్. వసంతకుమారి

.

.

2. భువనేశ్వరియా – మోహన కల్యాణి – కె. వి. కృష్ణప్రసాద్ 

.

https://youtu.be/dRA9ojCWKUU

 .

3. అంబవాణి నన్ను – బాంబె సిస్టర్స్ –

.

.

4. సరస సమదాన – కాపి నారాయణి – త్యాగరాజ – మదురై మణి అయ్యర్

.

 

5. పాశ్చ్యాత్య పద్ధతిలో స్వరకల్పన – మదురై మణి అయ్యర్

.

.

పంతొమ్మిదవ శతాబ్దారంభానికల్లా, కర్ణాటక సంగీతజ్ఞుల జీవిత చరిత్రలు, వారి వారి రచనలూ, ఒక వ్యవస్థాత్మక పద్ధతిలో సమకూర్చటం ఆరంభం అయినందువలన వీరి గురించి చదవను, వ్రాయను మరియు తెలుసుకొనటం చాలావరకూ సులభతరం అయిందని చెప్పాలి. వికిపీడియా వంటి చోట్ల ఇవి ఉపలబ్ధం అవుతున్నప్పటికీ, కర్ణాటక సంగీతం పట్ల భక్తి, శ్రద్ధాసక్తులు గల వారికోసం మరొకసారి ఈ విధంగా మనం కొంతమంది వాగ్గేయకారుల గురించి తెలుసుకుంటూ వచ్చాము. ఇంతవరకూ వ్రాయని మరికొంతమంది గురించి భవిష్యత్తులో తెలుసుకుందాం….  

.

———— (0)—————