.
‘ శిరాకదంబం ‘ కు ఆప్తులు, శ్రేయోభిలాషులు, సంపాదకవర్గ సభ్యులు డా. శొంఠి శారదాపూర్ణ గారు అమెరికా లో ఉన్న సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం సలహా మండలి సభ్యులుగా నియమితులైన సందర్భంగా హార్థిక శుభాభినందనలు.
.
‘ శిరాకదంబం ‘ దశమ వార్షికోత్సవం సందర్భంగా అందిన శుభాకాంక్షల సందేశాలు –
.
డా. శారదాపూర్ణ శొంఠి, సంగీతం సాహిత్య విశారద, యూ. ఎస్. ఏ. –
.
.
శిరాకదంబం అంతర్జాల పత్రిక (వార్తావళి) లో మా సమితి నిర్వహించే కార్యక్రమాల ఆహ్వాన పత్రికలూ, ఆ కార్యక్రమ విశేషాలూ ప్రచురిస్తూ మా సమితి ద్వారా మేము తెలుగు భాషకు చేస్తున్న చిన్నపాటి కృషిని తెలుగు లోకానికంతటికీ తెలియచేస్తున్నందుకు ధన్యవాదాలు. ఇంతేగాక మా నెలా నెలా వెన్నెల 'నెట్' ఇంట్లో కార్యక్రమాలన్నీ ఎడిటింగ్ చేసి, సమయానికి ప్రసారం చేస్తూ, మా సంస్థకు సాంకేతిక సహకారం అందిస్తున్న మీకు కృతజ్ఞతాభివందనాలు.
మీ పత్రిక ఇంకా దిన దిన ప్రవర్ధమానమై ఖండాంతర ఖ్యాతి పొందాలని మనసారా కోరుకొంటున్నాము.
.
తటవర్తి జ్ఞానప్రసూన, రచయిత్రి, హైదరాబాద్ –
.
.
పి.వి. రామ మోహన్ నాయుడు, జర్నలిస్టు & టెలివిజన్ నిర్మాత –
.
శిరాకదంబం సంపాదకులకు, యాజమాన్యానికి , సిబ్బందికి నా హృదయ పూర్వక అభినందనలు.
ఈ నాగరిక ఉరుకులు పరుగుల నడుమ, అనాగరిక రాజకీయ క్రీడల మధ్యన మన సంస్కృతికి చిరునామా “ శిరాకదంబం ” .
ఇన్నేళ్ళుగా ప్రచురిస్తున్న అంశాలన్నీ వేటికవే ఆణిముత్యాలు. అయినా కొన్ని మనసు పొరలలో నిక్షిప్తమై నిత్యం గుసగుసలాడుతుంటాయి.. వాటిలో కొన్ని ...
‘ మధు ' శతమ్.... మహత్తరమ్ !!
మధురకవి మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి గారి శతజయంతి సందర్భంగా తెచ్చిన సంచిక అద్భుతం. “ ఆంధ్ర పురాణము”తో మొదలుపెట్టి ఉదయ, శాతవాహన, చాళుక్య, కాకతీయ, పునః ప్రతిష్ట విద్యానగర శ్రీకృష్ణదేవరాయ విజయనాయక రాజ నామకరణాలతో తొమ్మిది అంశాలుగా విరగడించి సంప్రదాయబద్ధమైన 2052 గద్య పద్యాలను తొమ్మిది పర్వాలుగా గుది గుచ్చి వాగ్దేవికి మకరంద మందార మాలలుగా సమర్పించిన మధురకవి మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి గారి శతజయంతి సందర్భంగా ప్రచురించిన ప్రత్యేక వ్యాసం.... ' మధు ' శతమ్.... మహత్తరమ్ !!
కావ్యేషు ప్రేమకథ కడు రమ్యం
ప్రేమ కొందరి జీవితాల్లో వెన్నెల పతాకం. అయితే ప్రేమను వ్యక్తం చేయలేక విఫల జీవులుగా మిగిలి పోయే నష్ట జాతకులు ఎందరో... దమయంతి తన ప్రేమ సందేశాన్ని నల మహారాజు చెంతకు చేరవేయడానికి హంసను వెతుక్కొంది. అది ప్రణయ జీవుల వ్యధార్త గాథను అర్థం చేసుకొన్న పక్షిగనుక తన సాయం తాను చేసి పెట్టింది. అలాగే రుక్మిణీ తనగోడు గోపాలకృష్ణుడికి చెప్పి పంపడానికి ఒక బ్రాహ్మణ్ణి వెతుక్కొంది. మధ్యవర్తిత్వం నరపినందుకు లంచాలు, కానుకలు సమర్పించుకోంది. ప్రేమలేఖ రాయలేక గోపయ్య పట్ల తన విరహం అంతా బ్రాహ్మణయ్య ముందు వెళ్ళబోసుకుంది. అతగాడు ఆ రోజుల్లో టేప్ రికార్డర్ వంటివాడు. వెళ్ళి అక్కడ అంతా ప్లే చేసి వినిపించాడు..... రావూరు కలం - ప్రేమలేఖల్లో వినోద, విషాద రేఖలు
తెలుగు గుండె చప్పుడు నండూరి వారి “ఎంకి పాట”
ఎంకి పాటలు (జాను) తెలుగు సాహిత్యంలో ఒక పెద్ద కుదుపే! . భాషలో, భావంలో, వస్తువులో, అలతి అలతి పదాలతో అనితరసాధ్యంగా కొత్తధనాన్ని సంతరించుకున్న రసగీతాలను నండూరివారి “ఎంకి పాటలు” లో మళ్ళీ అందించి మమ్మల్ని రస డోలలుగించారు.
ఇలా కళాత్మక కథాంశాలు, అచ్చ తెలుగు నుడికారం లోని తి య్యందనాల్ని హృద్యంగా మలచి మాకు ఇన్నేళ్ళుగా అందిస్తున్న “శిరా” వారికి అభినందనలు.
ఏమాత్రం ఆదాయ వనరులు లేకుండా... మహారాజ పోషకుల ప్రాపకం లేకుండా ఇంత కాలం ఇంత శుచిగా ... అభిరుచికరంగా నడుపుతున్న “శిరా” ది మామూలు ప్రయత్నమేమీ కాదు. అసిధారావ్రతం.
తెలుగును బతికిస్తున్నందుకు, మన సంస్కృతిని, మన సారస్వతాన్ని, మన ఆటను, మన పాటను బతిస్తున్న మీకు ధన్యవాదాలు. ముందుముందు మరిన్ని సొబగులు సొగసుగా అడ్డుకోవాలని.. మరిన్ని విజయాలు అందుకోవాలని “ సంగీత సాహిత్య సమలాoకృతి తల్లి భారతి” ని ప్రార్థిస్తున్నాను.
సదా మీ అభివృద్ధి కాంక్షించే...
.
**************************************************************************
.
జి. బి. వి. శాస్త్రి, వైస్ ప్రెసిడెంట్ ( సేల్స్ – మార్కెటింగ్ ), ఫిన్‌స్టోన్ గ్రానైట్స్ –
.
.
ద్విభాష్యం నగేష్‌బాబు, రచయిత, వీణ కళాకారులు –
.
.
శిరా' తో నా సాహితీయాత్ర
----------------------------------------
ఏ మనిషికైనా సాహితీనేపథ్యం ఉండాలంటే దానికి తల్లిదండ్రులు, సమాజం ఎంతో కొంత దోహదం చెయ్యాలి. ఇంటా, బయటా సాహితీ వాతావరణం ఉన్నప్పుడే ఆ మనిషి లో సాహిత్యం పట్ల జిజ్ఞాస కలుగుతుంది. నాలో సాహిత్యం పట్ల ఆసక్తి కలగడానికి బీజం నాటిన నా తల్లిదండ్రులకు సదా కృతజ్ఞుణ్ణి. నేను హైస్కూలు విద్యార్థిగా ఉన్నప్పుడు ఆంధ్ర ప్రభ ఆంధ్ర పత్రిక లాంటి వార పత్రికలు, చందమామ, జ్యోతి, యువ లాంటి మాస పత్రికలకు మా నాన్నగారు చందా కట్టేవారు. ప్రతి వారం పత్రికల్లో వచ్చే సీరియల్స్ కోసం ఉత్కంఠగా ఎదురు చూసేవాళ్ళం. ఇవి కాక ఎమెస్కో వారు అప్పట్లో నిర్వహించిన ఇంటింటా స్వంత గ్రంధాలయం అనే ఉద్యమ ఫలితంగా మా నాన్న గారు అనేక పుస్తకాలు పోస్ట్ లో తెప్పించి మా ఇంట్లో ఓ చిన్న గ్రంధాలయం ఏర్పరిచారు. దాని ఫలితంగా నాలో ఒక రకమైన తార్కిక జ్ఞానం, తెలుగు భాష మీద కొంత పట్టు సాధ్యమయ్యాయి.
అయితే కవిత్వం రాయడానికి ప్రేరణ మాత్రం తూర్పుగోదావరి జిల్లా పల్లిపాలెం గ్రామం లో ఆంధ్రీ కుటీరానికి చెందిన మధునాపంతుల సత్యనారాయణ మూర్తి గారితో నాకు ఉన్న స్నేహం, సాన్నిహిత్యం! నాలో కలిగే రకరకాల ఆవేశాల్ని కాగితం మీద పెట్టాలనే కోరికతో వచన కవిత్వం రాయడం మొదలు పెట్టాను. కవిత్వ రచన తో నా ప్రయాణం కేవలం గత ఐదు సంవత్సరాలుగా మాత్రమే. మా ఇంటి పేరు "ద్విభాష్యం" కారణంగా నా కవితలన్నీ "ద్విభాషితాలు " అనే ప్రధాన శీర్షికతో వెలువడ్డాయి. నా కవిత్వానికి నేపధ్యం ప్రధానంగా ప్రకృతి సౌందర్యం మరియు మారుతున్న జీవన ప్రమాణాలు. నేను తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నివాసినైనా... నా ఉద్యోగం దగ్గర్లో ఉన్న మండపేట లో. రోజూ బస్సు మీద ప్రయాణం చేసే వాణ్ణి. రహదారి పక్కనే అందంగా పొడవుగా పరచుకొన్న పంట కాలువ, దానిని ఆనుకుని ఉన్న పచ్చటి సస్యసౌందర్యం, నాతో కలిసి పని చేసే మనుషుల జీవన చిత్రాలు, కళాశాలలో ఆంగ్లోపన్యాసకుడిగా పని చేసిన అనుభవం నాలో భావుకతకు ప్రాణం పోసాయి. శిరాకదంబం లో ప్రచురించబడిన 'అమృతవర్షం' అనే నా మొదటి కవితారచనతో ఆ పత్రికతో నా సాహితీయాత్ర మొదలయ్యింది. . మనిషి యాంత్రిక జీవితానికి బానిసై, సౌందర్యాస్వాదనా శక్తిని కోల్పోవడం నన్ను బాధించిన విషయం. సౌందర్యానుభవం కోసం ప్రతి మనిషి కొంత ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించాలి అనేది నా అభిమతం. అందుకే
"వేళ నిస్సారమౌతున్నప్పుడు
రసాస్వాదనే అమృతవర్షం !
లోకమంతా వెన్నెల్లో తడుస్తున్న సమయాన..
దోసిళ్ళతో ప్రోగుచేసి...
మనస్సులో పోసుకోవడమే
జీవన సౌందర్య రహస్యం"
అని రాసుకున్నాను. ఇంకో సందర్భంలో... ఒక వేటగాడు పక్షి గుండెల్లో తుపాకీ తూటా దింపి దాన్ని హతమార్చడం మనసును తీవ్రంగా కలచివేసింది. మనుషుల్లో కరుణ నింపమని ఒక పక్షి చేసే ప్రార్ధనే "ఆత్మ నివేదన" అనే కవిత! సాంసారిక జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలు, సవాళ్ళు భార్యాభర్తల మధ్య శూన్యాన్ని ఏర్పరుస్తున్నాయి. జీవితం శాంతి మయం కావడానికి చిన్న చిన్న సర్దుబాట్లు ఎంత దోహదం చేస్తాయో తెలియచెప్పడానికి "మూడు కాళ్ళ కుందేలు" అనే కవిత వ్రాసాను. ఆంగ్ల కవి Robert Frost రాసిన The Road not Taken అనే కవిత స్ఫూర్తిగా సవాళ్ళను స్వీకరించమని "దారి" అనే కవితా రచన చేశాను. నిరంతర బస్సు ప్రయాణంలో నాకు ఎదురైన అనేక అనుభవాలను పురస్కరించుకొని "మొదటి బస్సు", "మధ్యాహ్నం బస్సు", "ఆఖరి బస్సు" అనే మూడు కవితలు రచించాను. వ్రాసిన ప్రతి కవితలోనూ ఏదో ఒక సామాజిక లేదా జీవన సందేశం నాకు తెలియకుండానే చోటు చేసుకునేది. మీడియా ప్రభావం బాగా పెరిగి ఆధునిక జీవనంలో... తెలుగు లోగిళ్ళలో తగ్గినటువంటి బంధువుల సందడి ని దృష్టిలో ఉంచుకొని వ్రాసినదే "కాకి- బంధువులు". ఇలా నేను వ్రాసిన ప్రతీ కవితకూ ఏదో ఒక ప్రేరణ ఉండేది.
సుమారు మూడు సంవత్సరాల పైబడి "శిరాకదంబం" నేను వ్రాసిన ప్రతి కవితకూ అంతర్జాల, అంతర్జాతీయ వేదిక అయ్యింది. అందుకు ధన్యవాదాలు. ఒక అంతర్జాల పత్రిక దశాబ్దకాలం విజయవంతమైన ప్రయాణం చేసిందంటే, ఆ పత్రిక పాటిస్తున్న ఉన్నత ప్రమాణాలు, ఆరోగ్యవంతమైన సాహితీ వస్తుసేకరణ దానికి కారణమనడంలో సందేహం లేదు. అందుకు కారణమైన నిర్వాహకుల నభినందిస్తున్నాను.
పత్రికవైపుకు యువతను కూడా మళ్ళించగలిగితే... రేపటి ఆరోగ్యవంతమైన వాతావరణానికి దోహదం చేసినట్లవుతుంది. అందుకు మంచి సందర్భాలలో యువతకు సంభందించిన వ్యాస, కధా, కార్టూన్ల పోటీలు, బహుమతుల లాంటివి పరిచయం చేస్తే బాగుంటుందేమో. శిరాకదంబం పాఠకులనుంచే ఆ బహుమతుల పోషకులనెంచుకోవచ్చు కూడా !
పత్రిక విజయయాత్రను కొనసాగించాలని... నిర్వాహకులు శ్రీ రామచంద్రరావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
*************************************************************************
.
ఓలేటి వెంకట సుబ్బారావు, విశ్రాంత ఇంజనీర్, విజయవాడ / అమెరికా –
.
శి రా కదంబం-నా అనుబంధం.
ముందుగా శి రా కదంబం కు తన పదవ పుట్టినరోజు సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. బాలారిష్టాలను ధైర్యంగా ఎదుర్కొని, తన గమనంలో అనాయాసంగా ముందుకు సాగుతూన్న 'కదంబం' కు మనసారా అభినందనలను తెలియజేస్తున్నాను.
అయితే, దీని వెనుక మొక్కవోని దీక్ష, కృషితో నిరంతరం శ్రమిస్తూన్న పత్రిక వ్యవస్థాపకులు, సంపాదకులు అయిన మిత్రులు శ్రీ శిష్ట్లా రామచంద్రరావు గారి కృషిని తప్పక కొనియాడాలి. ఆయన మీద గౌరవంతో, అపార వాత్సల్యంతో ఇన్నాళ్ళుగా, ఇన్నేళ్ళుగా ఎంతమందో రచయితలు, రచయిత్రులు, కళాకారులు తమవంతు పూర్తి సహకారాన్ని అందిస్తూ ఉండడం అభినందనీయం.
'కదంబం' అంటేనే వివిధరకాల పుష్పాలతో అందంగా అల్లిన పూలమాల. మరి ఆ పూలకు ఎన్నో రంగులు, సువాసనలు, రూపాలు. అలాగే, ఈ పత్రిక లో కూడా ఆ వైవిధ్యం మనకు అడుగడుగునా గోచరిస్తుంది.
శి రా కదంబం పత్రికకూ, పత్రికాధిపతి శ్రీ రామచంద్రరావు గారు, రచయితలు, రచయిత్రులు, కళాకారులు అందరికీ పేరు పేరునా నా శుభాభినందనలు. ధన్యవాదాలు.
.
వివరాలు :
పేరు : ఓలేటి వెంకట సుబ్బారావు
పుట్టిన ఊరు : పెద్దాపురం, తూ.గో.జిల్లా ; పుట్టిన తేదీ : 04-09-1942
చదువు : బి. ఇ. ( మెకానికల్ ఇంజనీరింగ్ )
అభిరుచులు : రాతకోతలు, బొమ్మలు వేయడం, పాడడం, వినడం వగయిరా..
వివాహం:11-10-1968 (కొవ్వూరు) ; ఇల్లాలు : సీతాదేవి
కొడుకులు-కోడళ్ళు : సుధాకర్, విజయ & శ్రీధర్,శబరి
మనుమడు, మనుమరాళ్ళు : సుజయ్, అనీషా, విదీషా
.
.
పద్మజ శొంఠి, నార్త్ స్టాన్‌ఫర్డ్, అమెరికా
.
రామచంద్ర రావు గారు, శిరాకదంబం పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మీకు శుభాకాంక్షలు
.
పరిచయం :
పద్మజ శొంఠి
హైదరాబాద్, చెన్నై ఆకాశవాణి కేంద్రాలలోనూ, హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ దూరదర్శన్ కేంద్రాలలోనూ, అనేక వేదికల మీద
హిందీ, దక్షిణాది భాషలన్నిటిలో లలిత సంగీత, లలిత శాస్త్రీయ సంగీత కళాకారిణిగా రాణించారు. సినీ పరిశ్రమలో నేపథ్య గాయనిగా, సంగీత దర్శకురాలిగా కూడా పని చేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన అన్నమాచార్య కీర్తనల పరిరక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అన్నమాచార్య, త్యాగరాజ కీర్తనలు, లలిత గీతాలు, భక్తి గీతాలతో కాసెట్లు రూపొందించారు.
డా. అక్కినేని నాగేశ్వరరావు, డా. సినారె, జే.వి. సోమయాజులు, జే. బాపురెడ్డి, పరుచూరి సోదరుల వంటి ఎందరో పెద్దల ప్రోత్సాహం, ఆశీర్వచనాలు అందుకున్నారు.
హైదరాబాద్ లో వాహిని సంస్థ అధ్వర్యంలో 1993 లో సన్మాన సభ జరిగింది.
కామర్స్ లో పట్టభద్రురాలైన పద్మజ శంకర్ గణేశ్, రాజన్ నాగేంద్ర, చక్రవర్తి, విద్యాసాగర్ వంటి సంగీత దర్శకుల నేతృత్వంలో ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల, ఎస్. జానకి వంటి మేటి కళాకారులతో సినీ గీతాలలోను, వేదిక లనూ పంచుకున్నారు.
హైదరాబాద్ లో ప్రముఖ సంగీత దర్శకురాలు, గురువు అయిన శ్రీమతి సి. ఇందిరామణి గారు పద్మజ గారి మాతృమూర్తి. ఆవిడ నేతృత్వంలో హైదరాబాద్ ఆకాశవాణి, దూరదర్శన్ లలో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. ఆ సమాయాలోనే పాలగుమ్మి విశ్వనాథం, ఎం చిత్తరంజన్, మంచాల జగన్నాధరావు, శోభారాజు, టి. ఆర్. జయదేవ్ వంటి సంగీత దర్శకుల వద్ద పాడారు.
అమెరికా లో కూడా తన సంగీత ప్రయాణం కొనసాగిస్తూనే ఉన్నారు. అక్కడ సంగీత నృత్య పాఠశాల నిర్వహణ, తాను స్వరపరిచిన పాటలతో సిడి ల రూపకల్పన, అమజాన్, ఆపిల్ మ్యూజిక్, యూట్యూబ్, స్పాటిఫై, పాండోరా వంటి వాటికి కూడా అందించారు.
కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనల కోసం సిడి లను రూపొందించారు.
అమెరికా లోనే “ శ్రీనివాస స్తుతి మాల ” పేరుతో భక్తి సంగీతాన్ని తెలుగు, తమిళ భాషల్లో స్థానిక కళాకారులతో రూపొందించారు.
తానా సభల్లో ప్రదర్శనల తో బాటు తానా కోసం ‘ ధరణి ‘ పేరుతో ఒక నృత్య నాటిక ను రూపొందించారు.
అమెరికాలో రూపొందించిన “ మరో సంధ్యా రాగం ” అనే చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు.
చికాగొ లోని శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా ( SAPNA ) కోసం అన్నమాచార్య కీర్తనలతో కచేరీ లు చేశారు.
అమెరికాలో ఉన్న అనేక హిందూ దేవాలయాల్లో కచేరీలు ఇచ్చారు.
.
ఎర్రమిల్లి శారద, విశ్రాంత తెలుగు అధ్యాపకురాలు, కాకినాడ
.
.
.
కాళీపట్నం సీతా వసంతలక్ష్మి, శాస్త్రీయ సంగీత కళాకారిణి, గురువు, సంగీత చికిత్సా నిపుణురాలు, గురుగ్రామ్ –
.
.
"పదేళ్ల చిరుత ప్రాయంలోనే ఎంతో పరిణతిని సాధించి, మంచి సాహిత్యం, కథలు, ఇతర ఆకర్షణీయమైన అంశాలతో ఎంతగా ఎదిగింది "శిరాకదంబం"! పేరుకు తగినట్టే, శిరాకదంబంలో అనేక రకాల సంగీత, సాహిత్య కుసుమాలు విరియబూసిన ఈ పత్రిక దినదిన ప్రవర్ధమానంగా ఎదిగి, వటుడింతై, అంతంతై అన్నట్టు విశ్వరూపం సంతరించుకుంది. నాకు సంగీతంపై రకరకాల వ్యాసాలతో బాటు, నేను అనువదించిన "రాగచికిత్స" అనే పుస్తకాన్ని కూడా సీరియల్ రూపంలో ప్రచురించటానికి, నన్నెంతగానో ప్రోత్సాహ పరిచిన శిరాకదంబం చిట్టితల్లికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. "
.
*************************************************************************
.
వక్కలంక కృష్ణ మోహన్ డాక్టర్. ఆదిలక్ష్మి
.
దశమ వార్షికోత్సవ అభినందన మందారాలతో.....
‘ శిరాకదంబం ‘ అంతర్జాల కల్పవృక్షం
రసవంతమైన కథలూ – కవితలూ
మహాకవుల రచనల రసగుళికలు
ఆథ్యాత్మిక వేత్తల విశ్లేషణలు, పంచాంగ శ్రవణాలు
బాలకదంబంతో చిన్నారుల ఆటపాటలు
విద్యావంతులు రచించిన పురాణ పాత్రల విశ్లేషణలు
శొంఠి శారదాపూర్ణ గారు వంటి ఎందరో
పుంభావ సరస్వతుల ( ప్రశంసల ) ఆశీస్సులతో
కోవిడ్ కల్లోలం నేర్పిన కొత్త పాఠాలు
బాల్యంలో అమ్మమ్మ యింటి తీపి జ్ఞాపకాలు
దేశభక్తి – లలిత గేయాలతో
విజేతలకు అందించిన బహుమతులు
ఇలా వివిధ రంగాలలో రాకెట్ లా
దూసుకెడుతున్న ఈ పత్రిక
మరింత వృద్ధిలోకి రావాలని ఆకాంక్షిస్తూ....
.
*************************************************************************
.
డా. తుమ్మపూడి కల్పన, తెలుగు సహాయ అధ్యాపకురాలు, డిఆర్బిసిసిసి హిందూ కళాశాల, చెన్నై
.
శిరా కదంబం అంతర్జాల పత్రిక పెట్టీ అప్పుడే 10 సం.లు అయ్యాయి అంటే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే కాలచక్రం ఎవరి కోసము ఆగదు. తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అదే విధంగా శ్రీ శిష్ట్లా రామ చంద్ర రావు గారు కూడా కాలంతో పాటూ పరుగులు తీయడం వల్లనే ఈరోజు దశ వసంతాలు పూర్తి చేసుకుని 11 వ వసంతంలోకి జయప్రదంగా అడుగు పెట్టారు.
నేటి సాంకేతిక కాలంలో పత్రిక పెట్టడం ఒక గొప్ప యజ్ఞం లాంటిది. పత్రిక పెట్టీ దాన్ని రకరకాల కథనాలతో, చిత్రాలతో అందంగా ముస్తాబు చేసి మన ముందుకు తీసుకురావడానికి ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ప్రతి నెలా అంతర్జాలంలో మన ముందుకు తీసుకు వస్తున్నారు. అలా మాస పత్రికగా తీసుకువచ్చి...అడి ఇంతింతై గా ఎదిగి పాఠకుల మన్ననలు పొందుతూ, సంఖ్య పెరుగుతూ పక్ష పత్రికగా రూపు దిద్దుకొని నేటికీ పది వత్సరాలు గడచిపోవడం అంటే రామచంద్ర రావు గారి పత్రికా స్థాపన అనే యజ్ఞం నిత్య కళ్యాణం పచ్చ తోరణాలతో అలరారుతోంది. ఈ సందర్భంగా వారికి, వారి కార్యవర్గానికి హృదయ పూర్వక అభినందన వందన మందారాలు.
ఇక ఈ పత్రికతో నాకు గల అనుబంధం గురించి ఒకింత పంచుకుంటాను.
నేను ఆప్యాయంగా బాబాయి గారూ అని పిల్చుకునే రావు గారు నాకు మంచి అవకాశాన్ని ఇచ్చారు. ఈ పత్రికలో నా వ్యాసాలు ప్రచురించారు. సందర్భోచితంగా వారు ప్రచురించడం, దాని వివరాలు నాకు వ్యక్తిగతంగా పెట్టడం ఇవన్నీ వారు నా పట్ల చూపే అవ్యాజమైన ఆప్యాయత, వృత్తి పట్ల వారికి గల నిబద్ధతకు తార్కాణాలుగా కనిపిస్తాయి. అదే విధంగా నాటి, నేటి తెలుగు భాషకు సంబంధించిన అనేక విషయాలతో నేను కొన్ని భాగాలుగా వ్రాసిన వ్యాసాలు కూడా ప్రచురించడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. అది మధ్యలో నా మూలాన ఆగిపోవడం నాకు బాధగా కూడా అనిపించింది. వారు సరేనంటే మళ్లీ మొదలు పెట్టాలని మనసులో ఆలోచన కూడా ఉంది. ముఖ్యమైన సందర్భాల్లో వారు కొత్తగా పత్రికలో ప్రచురించే అంశాలు కూడా చాలా బాగుంటాయి. పాఠకుల మన్ననలు పొందుతాయి. అలాంటివి నన్ను కూడా వ్రాయమని ప్రోత్సహిస్తూ...నేను సరేనని నా కథనాన్ని లేదా వ్యాసాన్ని పంపడంలో చివరి నిమిషం వరకు వారిని ఒత్తిడికి గురి చేసినా నన్ను ఒక్కమాట కూడా అనకుండా భరిస్తున్నందుకు వారికి హృదయ పూర్వక ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను.
ఈ "శిరా కదంబం" అంతర్జాల పక్ష పత్రిక మరింత అందంగా, వైవిధ్యమైన అంశాలతో, అనేక పాఠకులకు, నాలాంటి రచయిత/త్రు లకు చక్కని వేదికగా ఇంకా అభివృద్ధి చెందాలని...ఈ "శిరా కదంబం" అనే సాంకేతిక యజ్ఞం నిర్వహించడానికి మా బాబాయి గారికి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాన్ని ఆ శ్రియఃపతి అనుగ్రహించాలని మనసారా ప్రార్థిస్తూ....సెలవు
.
*************************************************************************
.
గాయత్రీదేవి పుత్సా, ఉపాధ్యాయురాలు, హైదరాబాద్
అభిరుచులు : కవితలు, గజల్స్, కథలు
.
శ్రీదేవి జోశ్యుల, యు. ఎస్. ఏ.
.
శిరాకదంబం అంతర్జాల పత్రిక దశాబ్దం పూర్తి చేసుకున్న సందర్భం లో మీకు మా హృదయ పూర్వక శుభాబినందనలు 🙏
మున్ముందు మరిన్ని హంగు రంగులతో పాఠకులకు కనువిందు చేస్తుందని అభిలషిస్తూ - మీ శ్రీదేవి జోశ్యుల 🙏
.
*************************************************************************
.
వేణుగోపాల్ నరసింహదేవర, కేరళ
.
సాహితీ మిత్రులు శ్రీ శిష్ట్లా రామచంద్ర రావు గారి మానస పుత్రిక శిరాకదంబం, 11 వ వసంతం లోనికీ అడుగు పెడుతున్న సందర్బంలో నా శుభాభినందనలు.
ఈ పత్రిక తో నాకు ఉన్న అనుబంధం గురించి పత్రిక లో ప్రచురించబడిన నా రచనల గురించి ప్రస్తావన చేయడం చర్విత చరణం. సంపాదకుల ప్రోత్సాహం సదా స్మరణీయం
నిర్ధిష్టమైన నైతిక విలువలకూ, సాహితీ సాంప్రదాయాలకూ కట్టుబడి ఒక పత్రికను ఇంత కాలం నిర్వహించడం ఆషామాషీ కాదు.
ఆర్ధిక ఇబ్బందులను, కుటుంబ పరమైన సమస్యలనూ పరిష్కరించుకుంటూ, సంపాదకులు ఇంత కాలం ఒంటి చేత్తో పత్రికను నిర్వహించడం, అభినందనీయం.
అంతర్జాల మాద్యమం ద్వారా వెలువడుతున్న, తెలుగు సాహితీ పత్రిక లలో శిరాకదంబానికి సముచిత మైన స్థానం ఉంది.
"ఇరుసున కందెన బెట్టక పరమేశుని బండి యైన బారదు సుమతీ ","ధనం జగాన్ని నడిపే ఇంధనం, ఆర్ధికం పర మార్దికం, ". ఇలాంటివీ, ఇంకా ఇటువంటి చాలా విషయాలూ మన కందరికీ తెలిసినవే..
శిరాకదంబ సాహితీరధం యాత్ర దిగ్విజయం గా సాగాలనీ, మరిన్ని మంచి సాహితీ సంస్కారం జరగాలనీ, శిరాకదంబానికి పాఠకుల అండ దండలు అన్ని రకాలు గానూ పుష్కలం గా లభించాలి అని కోరుకుంటూ,...
.
*************************************************************************
.
" శిరాకదంబం " వెబ్ వార పత్రిక ప్రచురణకర్త, సంపాదకులైన " శిరా" రావు గారు నాకు సరిగ్గా పది సంవత్సరాల క్రితం పరిచయం అయ్యారు. వారు ఒక సంపాదకులుగా మాత్రమే పరిచయమైనా, వారు అందరికీ ఒక చక్కటి గురువుగా మాత్రమే కాక దూరదృష్టి గల మార్గదర్శి కూడా !! వారు " శిరాకదంబం" ద్వారా చేస్తున్న సాహిత్య, సాంస్కృతిక సేవలు ఆదర్శప్రాయమైనవి మరియు అత్యద్భుత సాంకేతిక సామర్థ్యాన్ని మా ఈ అభిమాన వార పత్రికలో మీరు చూసి, చదివి ఆనందిస్తారు, ఎందుకంటే వీరిదొక ప్రత్యేకమైన శైలి !!
విభిన్న అంశాలను ఎంతో అందంగా ఏర్చి కూర్చి అమర్చి, వాటిని కూచి గారి కుంచెతో కూడిన అందమైన చిత్రాలతో ఒక పెళ్ళి పందిరిలా అలంకరించి తమ పాఠకులకు ఎంతో ఆత్మీయంగా "శిరాకదంబం"ని అందజేస్తుంటారు "శిరా" రావు గారు.
" శిరా" రావు గారికి, వారి అత్యుత్తమమైన సంపాదక బృందానికి వారి " శిరాకదంబం" వెబ్ వార పత్రికకి, దశాబ్ద కాలం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా, అలుపెరగని వారి కృషిని అభినందిస్తూ, మరెన్నో దశాబ్దాలు ఇలాగే అధునాతన క్రొత్త శైలితో ఎల్లప్పుడూ పాఠకుల ఆత్మీయ - అభిమాన వార పత్రికగా గొప్ప ఖ్యాతి ని పొందాలని ఆకాంక్షిస్తూ, వారికి నా హృదయ పూర్వక అభినందనలు, శుభాకాంక్షలు.
జయ పీసపాటి,
వ్యవస్థాపక అధ్యక్షురాలు, ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య
టోరి రేడియో వ్యాఖ్యాత
.
*************************************************************************