11_001 అమెరికా ఇల్లాలి ముచ్చట్లు – వంటింట్లో ఆడవాళ్ళు

రేపు గెట్ టు గెదర్ కి అందరిలా మనం కూడా కేటరింగ్ చేద్దాం అంటారా ?

భలేవారే! ఉన్నట్టుండి నాకెంతో ఇష్టమైన పనిని ఔట్ సోర్స్ చేసేస్తారా? పార్టీకి  ఏమేం చెయ్యాలో  మెన్యూ తో సహా ఫిక్స్ అయిపోయింది….షాపింగ్ చేసేసాను….కావలసినవి అన్నీ రెడీగా ………

ఏమిటీ…ఎందుకు ఇంతలా శ్రమ పడటం, ఇండియాలోనే ఎవరూ చెయ్యటంలేదు….. అమెరికాలో ఉంటూ ఇంత చదువుకుని, పెద్ద ఉద్యోగం చేస్తూ కూడా ఎప్పుడూ వంట……. వంటిల్లు……..అమ్మమ్మ లాగా……  నేను వట్టి  ఓల్డ్ ఫాషన్ ఉమన్ ని అంటారా ?

పోనీ అలాగే అనుకోండి, నాకేమి అభ్యంతరం లేదు! రోజూ మీకు, పిల్లలకు వంట చేసి పెట్టటం నాకు ఇష్టమైన పని. అలాగే ఎప్పుడో మనం పిలిస్తే వచ్చే గెస్టులకు నా చేత్తో వండి పెట్టటం నాకు మరింత ఇష్టం! మీరన్నట్టు శ్రమే అయినా అందులో నాకు ఎంతో ఆనందం ఉందండీ.

ఉద్యోగం చేసే ఆడవాళ్ళు వంటలు చెయ్యకూడదని, వంటింట్లో ఉండే ఆడవాళ్ళు  కేవలం గరిట తిప్పే ఆఫీసర్లనీ  మీలాగే అందరూ అపోహ పడుతూ ఉంటారు. ఇంటిపట్టున ఉండే ఆడవాళ్లకు, అందులోనూ వంటలు చేసుకునే ఆడవాళ్లకు ఏమి తెలియదని, లెక్కాడొక్కా రావని వెనకటి రోజుల్లో వాళ్ళను చిన్న చూపు చూసేవారు. నిజానికి వాళ్లకుండే తెలివి తేటలు, సామర్ధ్యం ముందు, చదువుకున్న వాళ్ళు, బయట తిరిగే మగవాళ్ళు ఎందుకూ పనికి రారు. మా ఊళ్ళో వంటింట్లో ఉంటూనే ఊళ్ళేలిన ఆడవాళ్ళు బోలెడంత మంది ఉన్నారు. అందుకే నాకు చిన్నప్పటి నుంచీ వంటిల్లు అన్నా, వంటింట్లో ఉండే ఆడవాళ్లన్నా ఎంతో కుతూహలం! వాళ్ళను చూసి మనం చాలా తెలుసుకోవచ్చు… ఎంతో నేర్చుకోవచ్చు.

మా ఎదురింట్లో ఉండే బామ్మగారు వంటింట్లో అప్పడాలు వత్తుకుంటూనే, కోర్టులో అత్తవారి వైపు నుంచి తనకు రావలసిన భరణం గెలుచుకున్నారు! మా వీధి చివర ఎప్పుడూ పొయ్యి ముందు కూర్చుని ఉండే అమ్మమ్మగారు తన పొలం తాలుకు వ్యవహారాలన్నీ ఆవిడే చూసుకునేవారు. పొలం కౌలుకి ఎటువంటి వాళ్లకు ఇవ్వాలో, ఎంత కాలం ఇవ్వాలో, ఎలాంటి కండిషన్లు పెట్టాలో ఆవిడకు తెలిసినట్టు ఊళ్ళో మగాళ్ళక్కూడా తెలీదు!

ఇంటింటికి వెళ్ళి బట్టలుతికే మా చాకలి వీరయ్య హటాత్తుగా బాల్చీ తన్నేస్తే,  పెళ్ళాం రత్తమ్మ, తల్లి పున్నమ్మ కలిసి బ్యాంక్ లో లోను తీసుకుని లాండ్రీషాప్ పెట్టి పిల్లలిద్దరినీ లక్షణంగా  చదివించారు.

చూసేవాళ్ళకు, ఈ ఆడవాళ్ళు ఎప్పుడూ వంటలు చేస్తూ, ఇంట్లో  అవి ఇవీ సర్దుతూ ఉన్నట్టు కనిపిస్తారు. నిజానికి వీళ్ళు మన అవసరాలు తీరుస్తూ, మనల్ని-మన జీవితాల్ని కూడా సరిదిద్దుతూ ఉంటారు.

మా నానమ్మ పొద్దున లేచినప్పటినుంచి మళ్ళీ పడుకునేవరకు, మజ్జిగ చిలుకుతూ………..పువ్వులు మాల కడుతూ………..ఒత్తులు చేసుకుంటూ………దీపాలు వెలిగిస్తూ……..గీత గోవిందాలు, త్యాగరాజ కీర్తనలు, పోతన పద్యాలూ కమ్మగా పాడుతూ ఉండేది. నాకు తెలుగు భాష మీద అభిమానం, కాస్తంత  సంగీత జ్ఞానం అబ్బాయంటే దానికి కారణం నానమ్మే.

ఇక అమ్మ సరే సరి! మా నాన్న ఉద్యోగరీత్యా ఎప్పుడూ  క్యాంపులకెళ్ళేవారు.  ఇల్లు…. పిల్లలు…… మా చదువులు…….. తాతయ్య…….. నానమ్మ……… ఇంటికి వచ్చే చుట్టాలూ……..అన్నీ అమ్మే చూసుకునేది. నాన్న ఇంట్లో ఉన్నా లేకపోయినా అన్నీ మామూలుగా జరిగిపోయేవి. అమ్మ  వంట చేస్తూనే మా హోంవర్క్ కరక్ట్ చేసేది, చూచిరాత రాయించేది, మా పుస్తకాలకు అట్టలు వేసేది. మాకు తలలు దువ్వుతూ, తలంట్లు పోస్తూ, అన్నాలు పెడుతూ మాతో మాట్లాడుతూనే, మా ప్రవర్తన ఎలావుందో మా మనసులో ఏముందో అన్నీ తెలుసుకునేది. తమాషా  ఏమిటంటే అన్నీ అమ్మే చేస్తున్నా, మళ్ళీ నాన్నే ఇంటికి యజమాని అన్నట్టు ఉండేది !

ఈ రోజుల్లో ఇద్దరూ సంపాదిస్తూ కూడా ఇల్లు నడపడానికి మనం కిందా మీదా పడుతుంటాం. మరి ఆ రోజుల్లో మొగవాడు ఎంత సంపాదిస్తే దానితోనే తృప్తి పడి, సర్దుకు పోయి సంపాదనకు తగినట్టుగా ఆడవాళ్ళు ఇల్లు నడిపేవారు.  మా వెనకింట్లో, అద్దెకుండే సరోజ వాళ్ళ కుటుంబం ఎంత పొదుపుగా ఉండేవారో. చాలీచాలని జీతంతో ఇబ్బంది పడుతున్నా వాళ్ళింట్లో  ప్రేమా ఆప్యాయతలకు మాత్రం కొరవ ఉండేది కాదు.

మిగిలిన ఆధరువుల్ని “ఈ కాస్త మీరు వేసుకోండి అత్తయ్యా “ అని కోడలు “కాదు.. నువ్వు వేసేసుకోమ్మా “ అని అత్తగారు అనటం, సరోజ కోసం వాళ్ళింటికి వెళ్ళే నేను తరచూ వింటు౦డేదాన్ని.

అందరికీ ఇంత వుడకేసి పెట్టటం పెద్ద గొప్పా అని ఈనాటి కాలపు వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ రోజు ఇంటిల్లిపాదికీ భోజనాలు.. టిఫిన్లు..కాఫీలు..బోర్నవిటాలు…పండగలు..పబ్బాలు..చుట్టాలు వీటి వెనక    ఉన్న ఈ ఆడవాళ్ళ శ్రమ……ప్లానింగ్,………బడ్జెట్………. ప్రేమ…….త్యాగం…. ఇవేవి మనం పట్టించుకోము. పైపెచ్చు అలా చెయ్యటం వాళ్ళ డ్యూటీ అన్నట్టు ప్రవర్తిస్తాం.

మా పిన్ని అత్తవారి వైపు వాళ్ళది ఉమ్మడి కుటుంబం. మా పిన్ని కాపరానికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో  కొడుకులు, కోడళ్ళు, పిల్లలతో కలిపి మొత్తం  పదహారుమంది ఉండేవారుట ! వీళ్ళు కాక షుగరు, ఆస్తమా, కీళ్ళ వాతం ఉన్న ముగ్గురు పెద్దవాళ్ళు. ప్రతిరోజు మా పిన్ని అత్తగారు ఎవరికి ఏమేం వండాలో, ఎవరికి ఏవి పడవో, ఏ పిల్లలకు ఏవి ఇష్టమో, ఎవరు ఎలాంటి పథ్యం చెయ్యాలో చెప్తూ టక…. టక…… ఆ రోజు మెన్యూ  ప్లాన్ చేసేవారుట !  ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం విషయంలో ఆవిడ చూపే శ్రద్ధ, ఆహారంలో పోషకవిలువల పట్ల ఆవిడకున్న అవగాహన, జబ్బుల గురించి ఆవిడకున్న జ్ఞానము, చూసి హోం సైన్స్ చదివిన మా పిన్ని ఆశ్చర్యపోయిందిట !

మనం వేలకు వేలు పోసి మళ్ళీ మాట్లాడితే లక్షలు ఖర్చు పెట్టి ఎమ్ బి ఎ లు,  ఫైనాన్స్ లో పి హెచ్ డీ లు చేసి ఆఫీసులో నలుగుర్ని మేనేజ్ చెయ్యడానికి, సంవత్సరానికి ఒకసారి బడ్జెట్ సబ్మిట్ చెయ్యడానికి నానా  హైరాన పడిపోతాం! ఈ ఆడవాళ్ళు ఏ బిజినెస్ స్కూల్ కు వెళ్ళకుండానే, ఏ సెమినార్లు అటెండ్ కాకుండానే ఇరవై నాలుగు గంటలు, మూడు వందల అరవై రోజులు ఇల్లుని పకడ్బందీగా నడుపుతూ ఉంటారు.

ఆడవాళ్ళు చదువుకుని బయట ప్రపంచం చూడటం చాలా ఆనందకరమైన విషయం. కానీ చదువులు పెరుగుతున్న కొద్దీ  ఆడవాళ్ళకు ఇంటిమీద శ్రద్ధ తగ్గి పోతోంది. దానికి తగినట్టుగా వంట చేయగల శక్తీ, చెయ్యాలన్న ఆసక్తీ సన్నగిల్లి పోతున్నాయి. అందుకే పాపం బుల్లితెర వాళ్ళు వంటల ప్రోగ్రాములు పెట్టి ఈ కాలం ఆడవాళ్లకు వంటలు నేర్పాలని ఎన్నోరకాలుగా కృషి చేస్తున్నారు !

“వంట అంటే వణికి పోయే వనితలను“ ఉత్సాహపరచటానికి రకరకాల ట్రిక్కులు వాడుతుంటారు !

“ వెరైటీ వంటలను ఇట్టే క్షణంలో చేసుకోవచ్చు “ అనే స్లోగన్ తో మొదలు పెడతారు.

పిల్లలకు మందు తియ్యగా ఉంటుందని చెప్పినట్టు, వంట చెయ్యటం చాలా తేలిక అంటూ తేలిగ్గా చెప్పేస్తుంటారు !

“ కావాల్సిన పదార్ధాలు ” అని ఓ చాంతాడంత లిస్టు ఇచ్చి ఇవి ఉడక పెట్టి ఉంచుకొండీ……..ఇవన్నీ వేయించి పొడికొట్టి పెట్టుకొండీ……..ఇవన్నీ గ్రైండ్ చేసి రెడీగా ఉంచుకొండీ……..అనేసి వంట అంతా రెండు నిమిషాల్లో  అయిపోయిన ఫీలింగ్ ఇచ్చేస్తారు. ఆ తర్వాత  యాంకరుగారు ఆ అయిటంని నాజుగ్గా నోట్లో వేసుకుని “వంట అద్దిరింది “ అనో లేక “ వంట సూప్పరుంది “ అనో  పోగిడేసి వెంటనే చూసారా ఎంత క్విక్ గా అయిపోయిందో అంటూ ఆశ్చర్యం ప్రకటిస్తారు !

పోనీ ఈ కొత్త రకం వంటలు ఎలా చెయ్యాలో నేర్చుకుందామని మనం టెలివిజన్ ముందు కూర్చుంటే, షో మొదలైన క్షణం నుంచీ అడుగు అడుక్కీ చిట్కాలంటూ…..బ్రేకు లంటూ…….పొడుపు కథలు అంటూ…. మీరేం చేస్తుంటారు?…….మీ వారి పేరేంటీ ?……..మాకోసం ఒక్క పాట…….అంటూ మనకు పిచ్చెక్కిస్తుంటారు ! 

నా చిన్నప్పుడు భయం పోగొట్టటానికి, కొత్తవాళ్ళ ముందు నేను చక్కగా పాట పాడితే, రిబ్బన్లు – జడ పిన్నులు కొంటానని మా నానమ్మ నాకు ఆశ పెడుతుండేది. అలాగే ఈ వంటల కార్యక్రమంలో కూడా వంటలు చేసి చూపించిన వాళ్లకు చీరలు గట్రా ఇచ్చి సన్మానం చేస్తూ వుంటారు !      

వంట చెయ్యడం అనేది ఓ రోజులో వచ్చేది కాదు. దానికీ అన్నిటిలాగే శ్రద్ధ, అవగాహనా, అనుభవం, నేర్పు-ఓర్పు కావాలి. అందుకే వంట చేయటం ఓ కళ అని అన్నారు. ఇంట్లో అందరికీ ఇష్టంగా, రుచికరంగా, ఆరోగ్యకరంగా వండి పెట్టటం అన్నది బాధ్యతతో కూడిన పదవి. కానీ ఇప్పటి తరం, వంట అంటే బోర్……వంట రోజూ ఎవరు చేస్తారు?…… వంట కింద టైము వెచ్చించటం వేష్టు అని అనుకుంటున్నారు.

చదువు ఎంత ముఖ్యమో వంట చేయగలగటం, ఇల్లు నిర్వహించుకోగలగటం కూడా అంతే ముఖ్యం. ఒకప్పుడు బయిటికి వెళ్లి తినడం ఒక సరదా కార్యక్రమంగా ఉండేది. ఇప్పుడు అది నిత్యకృత్యం అయిపోయింది.

 ప్రతివాళ్ళు “ వుయి డోంట్ కుక్, వుయి ఈట్ ఔట్ “ అంటూ గొప్పగా చెప్పుకుంటున్నారు. ఆడవాళ్ళు కూడా ఇంటిపట్టున ఉండటం అవమానంగా భావిస్తూ నా హాబీస్ “ వాచింగ్ టీవీ……. షాపింగ్……. ఆల్సో కుకింగ్ “ అంటూ వంటను  హాబీల జాబితాలోకి మార్చేస్తున్నారు!  

“ వంట చేసుకునే ఆడదానికి చదువెందుకు “ అని ఒకప్పుడు, “ ఉద్యోగం చేసే ఆడదానికి  వంటెందుకు” అని   ఇప్పుడు,  అప్పుడూ  ఇప్పుడూ ఎప్పుడూ మనం తప్పు చేస్తూనే ఉన్నాం!

ఏమిటీ రేపటి నుంచీ కిచెన్ లో నాకు హెల్ప్ చేస్తూ నా దగ్గరనుంచి బోలెడు నేర్చేసుకుంటారా?!

.

తొలి ప్రచురణ సుజనరంజని 2011

.

********************************************************

.

వంటింట్లో ఆడవాళ్ళు –నేపథ్యం

.

నేను రాసిన ముచ్చట్లలో నాకెంతో ఇష్టమైన, నాకెంతో తృప్తినిచ్చిన ముచ్చట్లలో ఇది ఒకటి. ప్రవాసంలో మొదటి తరం మహిళల కృషిని, సమర్ధతను గుర్తించనట్టే, మన పైతరాలలో చదువుకునే అవకాశం లేని ఆడవాళ్ళను, ఇంటిపట్టున ఉండే ఆడవాళ్ళను గుర్తించటం మాట అటుంచి, వాళ్ళను తెలుసుకునే ప్రయత్నం కూడా మనం చెయ్యమేమో అనిపిస్తుంది. ఇంట్లో అన్నిపనులు తామే చేసుకునే ఆడవాళ్ళను “వంటింటి కుందేళ్ళు“ అంటూ చులకనగా మాట్లాడ్డం..వాళ్లకు వంట చేయడం తప్పించి వేరే ఏ విషయాలు తెలియవని అనుకోడం నా చిన్నతనం నుంచీ చూస్తూనే ఉన్నాను. కానీ మనం కాస్త జాగ్రత్తగా మనసుపెట్టి గమనిస్తే వాళ్ళకున్న జ్ఞానం..వాళ్ళలో ఉన్నసమర్ధత మనకు స్పష్టంగా కనిపిస్తుంది. నేను మా అమ్మను (87 ఏళ్ళు)  చూసి ఇప్పటికీ... ప్రతిరోజూ అబ్బురపడిపోతూ ఉంటాను!

అమెరికాలో కూడా కొన్ని ఏళ్ళ నుంచీ ఇంటికి ఎవరిని పిలిచినా బయట రెస్టారెంట్ నుంచి ఫుడ్ తెప్పించడం మొదట్లో గొప్పగాను, ఆ తర్వాత రొటీన్ గాను మారిపోయింది. ఇంటికి వచ్చిన వారికి వంటచేసి పెట్టడానికి ఇష్టపడే నన్ను చూసి, మావారు నామీద అప్పుడప్పుడు జోకులేస్తూ ఉంటారు! ఒకసారి మామధ్య జరిగిన సంభాషణ లోనుంచి వచ్చిందే ఈ ముచ్చట!   

.

********************************************************