11_001 ఆనందవిహారి

.

తమిళనాట ఉన్న తెలుగువారందరూ వలసదారులే (వలస వచ్చినవారే) అనడం సరికాదు

తరతరాలుగా తెలుగువారు సింహళ ద్వీపం నుంచి కటక్ వరకు విస్తరించి ఉన్నారని, అటువంటిది దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత, “తిరుపతి దాటితే కన్యాకుమారి వరకు తమిళనాడేనని అనుకోవడం తప్పని డా. సగిలి సుధారాణి స్పష్టం చేశారు. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి “నెల నెలా వెన్నెల” కార్యక్రమంలో “దక్షిణాది తెలుగు సంస్థానాలు” అంశంపై ఆమె ప్రసంగించారు. గతంలో తమిళనాట విస్తృతంగా పర్యటించి ఇక్కడి తెలుగువారి భాషా సంస్కృతులపై పరిశోధించిన ఆమె అనేక అపూర్వమైన చారిత్రక విశేషాలతో ప్రసంగాన్ని సుసంపన్నం చేశారు. ఈ కార్యక్రమం 14వ తేదీ శనివారం యూట్యూబ్ ద్వారా ప్రసారమైంది.

డా. సుధారాణి మాట్లాడుతూ… దక్షిణాదిన క్రీస్తు పూర్వమే పడమటనున్న ధర్మపురి నుంచి తూర్పున ఉన్న పాండిచ్చేరి వరకు ఏలిన సత్యపుత్రులు తెలుగు రాజులేనని పరిశోధకులు అభిప్రాయం వ్యక్తం చేశారని చెప్పారు. దీనికి ఆధారమైన కథాగేయాలు మౌఖికంగా ప్రచారంలో ఉంటూ వచ్చాయని వెల్లడించారు. 

కొన్ని వందల ఏళ్ళ కిందట తెలుగు ప్రాంతాల ప్రజలు తమిళనాడుకు వచ్చి స్థిరపడినది నిజమే అయినా, ఇక్కడి తెలుగువారంతా వలస వచ్చినవారే అనుకోవడం సరికాదన్నారు. 

ఇక్కడి మదురై, తంజావూరు తదితర ఐదు పెద్ద సంస్థానాలు, ఎట్టయాపురం, రాజపాళయం తదితర ఎనిమిది చిన్న సంస్థానాల విశేషాలను వక్త క్లుప్తంగా వివరించారు. చాళుక్య, చోళ, విజయనగర తదితర వివిధ సామ్రాజ్యాల సామంతులుగా వాటిని పరిపాలించిన తెలుగు రాజుల వివరాలు తెలిపారు. ఆ సంస్థానాధీశుల పరిపాలన, వారు నిర్మించిన రాజప్రాసాదాలు, దేవాలయాల గురించిన ప్రత్యేకతలను కళ్ళకు కట్టారు. మదురైని పాలించినవారిలో ప్రత్యేకంగా నిలిచిన రాణి మంగమ్మ గురించిన విశేషాలు ఆకట్టుకున్నాయి. 

చరిత్ర రచనలో లిపి, మౌఖిక సాహిత్యాలు రెండూ నాణేనికి బొమ్మా బొరుసు వంటివని, అయితే మౌఖిక సాహిత్యం అంతగా ఆదరణకు నోచుకోలేదని సుధారాణి ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇక తను పలకరించిన తెలుగు ప్రాంతాల నుంచి వలస వచ్చినవారు… వస్తూ వస్తూ అక్కడి మట్టిని తెచ్చుకోవడం, ఆ మట్టిని తరతరాలుగా పూజించడం అనేది చరిత్రలోనే అపురూపమైన విషయమని వెల్లడించారు. ఆ మట్టిని ఆధునిక పరికరాలతో పరీక్షించి అది తమ పూర్వీకుల ప్రాంతాలదో కాదో తెలుసుకోవచ్చని తను వారికి చెప్పానని అన్నారు. అప్పుడు వారి మొహాల్లో కనిపించిన ఆనందం అంతా ఇంతా కాదని వక్త తెలిపారు. 

తెలుగునాట భాష మీద శ్రద్ధ కరువైందని, ఈ విషయంలో తమిళనాడు నుంచి నేర్చుకోవలసింది చాలా ఉందని ఆమె వ్యాఖ్యానించారు.

సంస్థ కమిటీ సభ్యురాలు డా. కల్పన గుప్తా కార్యక్రమాన్ని నిర్వహించారు. విజయవాడ వాస్తవ్యులు శిష్ట్లా రామచంద్రరావు, ఆయన కుమారుడు ఉదయ్ సాంకేతిక సహకారాన్ని అందించారు.

.

.

.

*****************************************************************************

.

అమృత మహోత్సవం

.

భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాల సంబరాలు దేశమంతటా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం రోజున  హైదరాబాద్ లోని అశోక్ నగర్ లో ఉన్న కదం టవర్స్ రెసిడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జెండా వందన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

.

ప్రముఖ రచయిత్రి శ్రీమతి తటవర్తి జ్ఞానప్రసూన గారు జెండా ఆవిష్కరణ చేశారు.

.

ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ దేశభక్తిని ఎవ్వరూ మరిచిపోకూడదని, అందరూ ఐకమత్యంగా జీవించాలని కోరుకున్నారు. గాంధీ గారి చిత్రపటానికి పూల మాల వేసి వారి త్యాగాలను స్మరించుకున్నారు. 

ఈ కార్యక్రమాన్ని ఆ కాంప్లెక్స్ వాసులు ధృవ్, ఆలీ మొదలైన యువత నిర్వహించారు. 

.

.

****************************************************************