11_001 ద్విభాషితాలు – నిశ్శబ్ద శూన్యం

.

మన మధ్య నిశ్శబ్దం….

మనసుల్ని

నిర్వీర్యం చేస్తోంది.

అగాధమై..

మనని చెరో తీరానికి విసిరేస్తోంది.

జీవితమంటే మనుషులే అనుకొన్నపుడు…

మనసుల మధ్య నిశ్శబ్దమెందుకు?

మౌనాన్ని ఛేదించకపోతే..

మనసు వంటరై…

వేదనలో వేసారిపోతుంది.

.

పెదవి చివర నవ్వును…

కంటి కొసన నీటి బొట్టును..

పంచుకోలేనంత..

నిరాశక్త జీవనంలో..

నువ్వు మగ్గిపోతే…

తరువాత…

నువు పిలిచినా

పలకనంత నిస్తేజస్థితిలోకి..

నేను జారిపోతాను.

కాలం జీవితాన్ని దొంగిలించాక..

దొరకని పలకరింపుకోసం…

నువు ఆక్రోశించినా….

అది అరణ్య రోదనమే.

.

జీవన గమనంలో…

అప్పుడో… ఇప్పుడో..

ఒక్కసారైనా…

నీ మాట…..

నా మనసును తాకనప్పుడు…

మన మధ్య నిశ్శబ్దమే.. రాజ్యమేలుతుంది..

గుబులు గూడు కట్టుకొంటుంది.

జీవితమంటే శబ్దం.

జీవించడమంటే…

ఒకరికోసం ఒకరు బ్రతకడం..

కన్నీళ్లు పంచుకోవడం..

నవ్వుల్ని పూయించడం..

నలుగుర్ని వెంట తీసుకెళ్లడం!

.

***************************