11_001 హాస్యగుళికలు – పెళ్లి పండుగ – ఖర్చు దండగ

.

నాటిక

.

( పాత్రలు: తల్లి, తండ్రి, పెళ్ళికూతురు, పెళ్ళికొడుకు )

.

మొదటి సన్నివేశం

.

పెళ్ళికూతురి తల్లి: ఈ ఏడాదైనా అమ్మాయి పెళ్ళి చెయ్యాలి.

పెళ్ళికూతురి తండ్రి: అవునవును. చేసేయాలి.

తల్లి: నా ఎరికలో ఓ మాంఛి సంబంధం ఉంది.

తండ్రి: నాకు తెలుసులే! మీ చిన్నాన్న కొడుకు కొడుకేగా? ఆ తిరుగుబోతుకి, తాగుబోతు గాడికి చచ్చినా నా కూతుర్నిచ్చేది లేదు.

తల్లి: అబ్బో, బడాయి! మీ గయ్యాళిచెల్లి కొడుక్కివ్వాలనేగా బంగారం లాంటి మావాళ్ళ సంబంధానికి వంకలు పెడుతున్నారు? మీ చెల్లెలు నన్ను కాల్చుకు తిన్నది చాలు. నా కంఠంలో ప్రాణముండగా చచ్చినా నా కూతురికి ఆ గతి పట్టనివ్వను.

తండ్రి: సరే, మన గోల ఎప్పుడూ ఉండేదే కదా. అమ్మాయిని రానీ. దాని అభిప్రాయమేమిటో? అదేం ఆలోచిస్తోందో, అసలే ఈ కాలం పిల్ల!

తల్లి: అలాగే. అదిగో మాటల్లోనే అమ్మాయిలు మిత్ర, చిత్ర వస్తున్నారు. రండర్రా, సమయానికొచ్చారు. (మిత్రతో) నీ పెళ్ళి మాటే మాట్లాడుతున్నాం. మా దగ్గర ప్రస్తుతం రెండు మంచి సంబంధాలున్నాయి. ఆ రెండింటిలో ఏదో ఒకటి ఖాయం చెయ్యి.

మిత్ర: ఇక ఆపుతారా! నీ అన్న కొడుకు, అత్త కొడుకులు తప్ప ఈ ప్రపంచంలో నాకంటూ వేరే పెళ్ళికొడుకులే లేరా? నా ఇష్టంతో పనిలేదా? అయినా నాకు పిల్లవాణ్ణిచూడమని మీతో చెప్పానా?

తండ్రి: అదేమిటే, బుద్ధి లేదూ! ఈడొచ్చిన పిల్ల ఇంట్లో ఉంటే సంబంధాలు చూడరూ?

మిత్ర: ఆఁ చూస్తారు చూస్తారు. ఇలాంటి తలతిక్క సంబంధాలు లేదా పెళ్ళిళ్ళ పేరయ్య చెప్పే గొప్ప సంబంధాలు!

తల్లి: ఏమిటే, హద్దూ పద్దూ లేదా నోటికి? నీకు నచ్చలేదని మగపిల్లలని అనడం ఎందుకు? నీ మనసులోని మాటలు, ఆలోచనలు చెప్పొచ్చుగా మాకు!

సుమతి: హమ్మయ్య! ఇప్పుడు మా అమ్మానాన్న అనిపించారు. అయితే వినండి. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. అతని పేరు ఆకాశ్. ఒక MNC లో సాఫ్టువేర్ ఇంజినీరుగా పని చేస్తున్నాడు. అతని అమ్మానాన్న NRP.

తండ్రి: NRP అంటే?

మిత్ర: Non Resident Parents. ఇక్కడుంటే పిల్లలకి సంస్కారం వస్తుందని వాళ్ళని ఇక్కడే ఉంచేశారు.

తల్లి: మరి తల్లిదండ్రులకి చెప్పకుండా ఆ పిల్లాడు చెంపకి Dove రాసినట్లుగా నిన్నెట్లా లవ్ చేశాడే?

మిత్ర: మాది ఇన్స్టంట్ లవ్.

తల్లి: ఇన్స్టంట్ కాఫీ లాగన్నమాట!

తండ్రి: అయితే ఆకాశ్ పేరెంట్స్ తోటి మాట్లాడతాం. ఇండియాకి రమ్మందాం.

మిత్ర: రమ్మనడం ఎందుకు? Face time చేస్తే చాలు.

తల్లి: మొదటిసారి మాటలకి Face time ఏమిటే?

మిత్ర: వాళ్ళు చాలా సింపుల్ అమ్మా. నేను ఆంటీతో చాలసార్లే మాట్లాడాను.

తల్లి: ఓసినీ… ఎంత తతంగం నడిపావే!?

మిత్ర: సరే. ఎక్కువగా ఆలోచించి బుర్రలు పాడుచేసుకోకండి. ఇంత మంచి న్యూస్ చెప్పినందుకు ఓ స్వీట్, కాస్త కాఫీ ఇచ్చుకో!

తల్లి: తప్పుతుందా? పుచ్చుకో!

.

రెండవ సన్నివేశం

.

ఆకాశ్ – మిత్ర

ఆకాశ్: మన ప్రేమ సంగతి మీ ఇంట్లో చెప్పావా?

మిత్ర: చెప్పాను. మావాళ్ళు ఒప్పుకున్నారుగా!

ఆకాశ్: ఎందుకొప్పుకోరూ? చెప్పులరగకుండా ఫ్రీగా పెళ్ళికొడుకు దొరుకుతుంటేను!

మిత్ర: డోంట్ బి సిల్లీ. మీవాళ్ళు ఒప్పుకున్నారా మన పెళ్ళికి?

ఆకాశ్: దాదాపు ఒప్పుకున్నట్టే. కాకపోతే…

మిత్ర: మధ్యలో ఆ కాకపోతే ఏమిటీ?

ఆకాశ్: ఆఁ ఏంలేదు. మావాళ్ళు కాస్త ఛాదస్తులు. పెళ్ళి traditional గా జరగాలని అంటున్నారు. పైగా నేను, చెల్లి మాత్రమేగా వాళ్ళ సంతానం? నా పెళ్ళి గ్రాండ్ గా నాలుగు రోజులు జరగాలని వాళ్ళ ఆశ.

మిత్ర: నీకేమైనా మతి పోయిందా? లవ్ మ్యారేజ్ సింపుల్ గా చేసుకుంటేనే బాగుంటుంది.

ఆకాశ్: నిజమే! కానీ వాళ్ళు ఒప్పుకోవడం లేదు.

అయితే మన లవ్వంతా వేస్టేనా?

ఆకాశ్: మావాళ్ళని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తాను. అయినా వాళ్ళు ఆశించడంలో తప్పు లేదు కదా?

మిత్ర: ఆమాటకొస్తే నాక్కూడా పెళ్ళి చాలా గ్రాండ్ గా చేసుకోవాలనుంది.

ఆకాశ్: నాకూ అంతే!

మిత్ర: అయితే మన styleలో పేరెంట్స్ తో మాట్లాడి ఒప్పిద్దాం.

.

మూడవ సన్నివేశం

.

మిత్ర: అమ్మా! అమ్మా!

తల్లి: ఏమిటే!

మిత్ర: నాన్నా, మీరూ రండి. పెళ్ళి మాటలు మాట్లాడాలి.

తల్లి, తండ్రి ఇద్దరూ: పెళ్ళి మాటలా… నువ్వు మాట్లాడ్డం ఏమిటే!

మిత్ర: ఈకాలం పెళ్ళిళ్ళలో పెళ్ళి ఎలా చేయాలన్నది వెరైటీగా మేమే డిసైడ్ చేస్తాం.

తల్లి: పెద్దవాళ్ళం మేముండగా ఏవిటి మీరు డిసైడ్ చేసేది?

మిత్ర: మీవంతా పాత చింతకాయ పచ్చడి ప్రాసెస్ లు. మావి చూడు ఎంత మోడరన్ గా ఉంటాయో!

తండ్రి: సరే, ఇక ఆలస్యం ఎందుకు? మొదలెట్టెయ్…

మిత్ర: మొదటి విషయం. మా పెళ్ళి గ్రాండ్ గా ఫైవ్ స్టార్ హోటల్లో జరగాలి.

తల్లి: ఫైవ్ స్టార్ హోటలా! తెలిసే మాట్లాడుతున్నావా?

మిత్ర: ఏం? తప్పేంటి? మేమిద్దరం నెలకి బోలెడు సంపాదిస్తున్నాం. మా ఫ్రెండ్స్ అందరూ మెచ్చుకునేలా ఫైవ్ స్టార్ హోటల్లో పెళ్ళి జరిగితే ఎంత గ్రాండ్ గా ఉంటుంది!?

తండ్రి: ఆఁ గ్రాండ్ గానే ఉంటుంది! మా సంగతి ఆలోచించావా?

మిత్ర: ఓ! పెద్ద కూతురి పెళ్ళి ఘనంగా చేశారని అంతా అనుకుంటారు. మెచ్చుకుంటారు.

తండ్రి (స్వగతంలో): ఆ తర్వాత చిప్ప పట్టుకొని తిరిగితే ఊళ్ళోవాళ్ళే జాలిపడి చిల్లర డబ్బులు కూడా వేస్తారు.

మిత్ర: ఏమిటి నాన్నా పెద్దకూతురి పెళ్ళికే కళ్ళు తేలేస్తున్నారు?

తల్లి: ఇంకా ఏమిటి తల్లీ నీ డిమాండ్లు?

మిత్ర: చక్కగా సంగీత్, మెహందీ, బాచిలర్ పార్టీ. అవన్నీ ఉంటే మా ఫ్రెండ్స్ అంతా హ్యాపీగా వచ్చి బ్రహ్మాండంగా డాన్సులు చేస్తారు. మంచి డిన్నర్ తిని నా పెళ్ళి వేడుకల గురించి గొప్పగా చెప్పుకుంటారు!

తల్లి: ఆషాఢమాసంలో చేతులకి గోరింటాకు పెడతానంటే “బోర్” అనేదానివి. ఇప్పుడీ మెహందీ ceremony ఏమిటీ?

మిత్ర: ఆఁ అదొక సరదా అమ్మా. అయినా చిన్నపిల్లల సరదాలు పెద్దవాళ్ళకేం తెలుస్తాయి?

తండ్రి: మాకు తెలియక్కరలేదులెమ్మా. ఇంకా ఏమిటి మీ సరదాలు?

మిత్ర: గ్రాండ్ గా రిసెప్షన్ ఇస్తే పెళ్ళైనట్లే!

తల్లి: మరి స్నాతకం, ముహూర్తం అవీ?

మిత్ర: అవి సింపుల్ గా చేసేయండి. బ్రహ్మ గారితో… పిల్లలు ఫంక్షన్లతో బాగా అలసిపోయి ఉన్నారు. వీలైనంత, అంటే గంటలో పెళ్ళి తంతు పూర్తి చూసేయండి.. అని చెప్పండి.

తల్లి: బాగుందే, తెల్లారింది నీ తెలివి! ముఖ్యమైన పెళ్ళి తంతుకి టైం లేదు కానీ ఈ లేనిపోనివి అంత ముఖ్యమా! ఇంత హడావుడి పెట్టుకుంటే అరేంజ్డ్ మ్యారేజ్ కి అయ్యే ఖర్చును మించిపోతోంది.

మిత్ర: అయితే ఏమిటి మీ ఉద్దేశ్యం?

తండ్రి: అంత మేం తూగలేమమ్మా. మీకవి సరదాలైతే మాకవి కొనలేని అందమైన పరదాలు. ఒక్కొక్క ఈవెంటుకీ బోలెడు ఖర్చైపోతుంది.

మిత్ర: పోనీ ఒకపని చేయండి. ఇప్పుడు destination wedding కూడా ఫ్యాషనే. ఏ గోవాలోనో మనాలిలోనో మంచి రిసార్ట్ చూసి అక్కడ రెండు రోజుల్లో ఇవన్నీ జరిగేలా ప్లాన్ చేద్దాం.

తండ్రి (భయంగా, గట్టిగా): అక్కడెక్కడో రిసార్ట్ లో అంటే కోట్లవుతాయే..

మిత్ర: అయితే మా పెళ్ళి తూతూ మంత్రమేనా?

తల్లి: కాదు. మా తాహతుకి తగినట్లుగా ఒకరోజు గ్రాండ్ గా పెళ్ళి చేసేస్తాం.

తండ్రి : నీ చెల్లెలి పెళ్ళి కూడా మేమే చెయ్యాలిగా అంత గ్రాండ్ గానూ? అది కూడా గుర్తుంచుకోండి. కాదు, కూడదంటే నువ్వన్నట్లుగానే మీ ఇద్దరూ బాగా సంపాదిస్తున్నారు కదా. చక్కగా ఇద్దరూ డబ్బులు చేర్చి పెట్టుకొని వచ్చే ఏడు ఘనంగా పెళ్ళి చేస్కోండి.

మిత్ర: ఆఁ, అసలు మీతో నేను మాట్లాడితే ఒట్టు!

.

నాలుగవ సన్నివేశం

.

తండ్రి: అమ్మాయ్, మిత్రా!

తల్లి: నాన్న పిలుస్తున్నారు పలకవే.

మిత్ర: నేనస్సలు మాట్లాడను. నా ఆశలన్నీ చల్లారిపోయాయి.

తండ్రి: పిచ్చిపిల్లా. మీ ఇద్దరి కోసం కాకపోతే మా సంపాదన ఇంక దేని కోసం? అలాగని దుబారాకి ఒప్పుకోను, అప్పూ చేయను.  రాత్రంతా మీ అమ్మ, నేను బాగా ఆలోచించాం.

తల్లి: నువ్వు చెప్పిన ఈవెంట్లన్నీ వినడానికి బ్రహ్మాండంగా ఉన్నా అవన్నీ నెరవేర్చితే మేము నెత్తిన గుడ్డేసుకోవాల్సిందే. నీకొక చెల్లెలు కూడా ఉంది.

మిత్ర: నాకేం చెప్పకండి. నేను వినను.

తండ్రి: అలా అనకు. ముందు మేము చెప్పేది విను. నీకు తెలీకుండా నువ్వే ఒక మంచి ఆలోచననిచ్చావు. Destination wedding అని. నువ్వు చెప్పిన సంగీత్, మెహందీ, స్టార్ హోటళ్ళు, గార్డెన్స్, ఇవన్నీ ఇప్పుడు మామూలైపోయాయి. అదే కాస్త వెరైటీగా మన సొంత ఊరిలో మన సొంత ఇంట్లో మూడు రోజుల కార్యక్రమాలు.. ఏవి? నువ్వు చెప్పినవన్నీ చేద్దాం. ఇంటిముందు హాయిగా తాటాకు పందిళ్ళు వేసి ఘనంగా నీ పెళ్ళి జరిపిద్దాం. ఏమంటావ్?

మిత్ర: మరి మా ఫ్రెండ్స్ అంతా అంత దూరం రారు. ఏ ఒకరో ఇద్దరో వస్తారు. అంతే.

తల్లి: ఎందుకు రారు? ఇక్కడి నుంచి మన ఊరికి బస్సు వేద్దాం. ఫ్రెండ్స్, చుట్టాలు అందరూ వస్తారు. ఇంటి నిండా ముగ్గులు తీర్చి అన్ని వేడుకలతో ఏ లోటూ రాకుండా  సాంప్రదాయంగా పెళ్ళి జరిపిస్తాం. అక్కడికొచ్చిన నీ ఫ్రెండ్స్, ఆకాశ్ ఫ్రెండ్స్ ఎంతో అపురూపంగా చెప్పుకుంటారు.

మిత్ర: ఓ, సాంప్రదాయ destination వెడ్డింగా… ఆలోచన బాగానే ఉంది. ఆలోచిస్తుంటే నాక్కూడా నచ్చుతోంది. ఇప్పటివరకు నా ఫ్రెండ్స్ ఎవరూ ఈరకంగా పెళ్ళి చేసుకోలేదు. అయితే ఆకాశ్ తో కూడా మాట్లాడతా.

తల్లి: మేం కూడా ఆకాశ్ అమ్మానాన్నతో మాట్లాడతాం. వాళ్ళు తప్పకుండా ఒప్పుకుంటారనే అనుకుంటున్నాం.

తండ్రి: ఎంత ఆడంబరంగా పెళ్ళి చేసుకున్నామన్నది కాదు ముఖ్యం. ఎంతకాలం సుఖంగా ఒకరినొకరు అర్థం చేసుకొని జీవించాలన్నదే ముఖ్యం. పెళ్ళికి డబ్బు ముఖ్యమే కానీ అవసరాలకు మించి ఖర్చు పెట్టకూడదు. ఇది మీరు అర్థం చేసుకొని ఆచరిస్తే మాకాంతే చాలు.

.

మరో హాస్య గుళిక వచ్చే సంచికలో…..

.

*****************************************