11_001 కథావీధి – వడ్డెర చండీదాస్ రచనలు – అనుక్షణికం 4

.

నెల్లూరు కు చెందిన మధ్యతరగతి లాయరు వేదాంతం నరహరి గారి కూతురు తార MA లిటరేచర్. మంచి రూపసి.  చూపరులను రెచ్చగొట్టే అందం. శారీరక సంబంధాల పై కోర్కెలు లేని మనసు. రూపం చూసి ధనిక కుటుంబానికి చెందిన మనిషి అని ఇతరులు పడే పొరపాటు అభిప్రాయాన్ని నిజం చేయాలనే సంకల్పం. తండ్రి నెల్లూరు లో లీడింగ్ లాయర్ అని చెప్పుకుంటూ, నెల్లూరు వాళ్లకి దూరం గా ఉంటూ ఉంటుంది. ఒక చెల్లెలు, తమ్ముడు. తండ్రి బలవంతం చేసి బ్యాంక్ మేనేజర్ భాగవతుల రామారావు సంబంధం ఖాయం చేసి పెళ్ళి జరిపించగా బలవంతపు కాపురం చేస్తుంది. తార ఖర్చులకు జీతం, అప్పులూ సరిపోక రామారావు లంచాల బాట పడతాడు. తార అందాన్ని వ్యాపార అవసరాలకు వాడుకోదలచిన సూర్యప్రకాష్ ఇంద్రారెడ్డి ని రంగం లోకి దింపి  తార తో స్నేహం చేయించి, రామారావుని లంచం కేసులో ఇరికించి సస్పెండ్ చేయిస్తాడు. సూర్య ప్రకాష్ కురూపి. ఇంద్రారెడ్డి తారను సూర్య ప్రకాష్ కి అప్పగించినప్పుడు తారకు అతను సూర్యప్రకాష్ మనిషి అనీ, సూర్యప్రకాష్ పైన ఇంకో ఆంటీ బాస్ ఉంది అనీ అర్ధం అవుతుంది. ఐశ్వర్యం పై ఉన్న మోజు, భర్త తో జీవించిన అసంతృప్తి జీవితం తారను, సూర్యప్రకాష్ తో జీవితానికి ఒప్పిస్తాయి. కొంతకాలానికి, విలాసవంతమైన జీవితం రొటీన్ బోర్ అవుతుంది. డ్రగ్స్ కి బానిస అవుతుంది. సూర్యప్రకాష్, అతని పార్టనర్స్ కోరికలు తీర్చే మర మనిషి లా మారి ఒకరోజు సాయంత్రం జరిగిన తగవు లో బయటకు వచ్చి కారు నడుపుకుంటూ కొంత దూరం, బస్సు లో కొంత దూరం ప్రయాణం చేసి, బస్సు దిగి, కాలవ పక్కన ఉన్న రైలు పట్టాల మీద కి వెళ్లి ఎదురుగా వస్తున్న రైలు కి ప్రాణాలను బలి ఇచ్చుకుంటుంది.

****        ****-         ****        ***   ****

ఏలూరు ప్రాంతానికి చెందిన పోలీసు SI సుబ్బావధాని గారి అబ్బాయి వేంకటావధాని, అతని క్లాస్ మేట్ రేబాల స్రవంతి కీ పరస్పరం ఇష్టం. వేంకటావధాని కవి. స్రవంతి రాయలసీమ కి చెందిన రేబాల రాఘవ రెడ్డి గారి అమ్మాయి. ధనిక నేపధ్యం. హైదరాబాద్ లో పినతండ్రి గారి ఇంట ఉండి చదువుతోంది. రోజూ సాయంత్రం వారి అబ్బాయి తో కలసి సందు చివర పార్క్ కి స్రవంతి రావడం, వేంకటావధాని ని కలుసుకోవడం గమనించిన పినతండ్రి, వాకబు చేసి సుబ్బావధాని ది యాయవార బ్రాహ్మణ కుటుంబం అనీ, అతని తండ్రి ఎవరో దూరపు బంధువుల నాశ్రయించగా ఇతనికి కనీస్టీబ్ కొలువు ఇచ్చారు అనీ, అంచెలంచె లుగా SI అయి, లంచాల వాపు లో ఉన్నాడు అని తెలుసుకొని అన్నగారికీ తెలియజేసి, స్రవంతిని నొప్పించకుండా ఒప్పించి త్వరలో పెళ్ళి చేసేయమని సలహా చెపుతాడు.
విషయం గ్రహించిన రాఘవ రెడ్డి, ఊళ్ళో  సివిల్ ఇంజనీర్ సంబంధం మాట్లాడుకుని, స్రవంతి ని ఇంటికి పిలిపించుకుని నెమ్మదిగా సర్ది చెప్పి నిశ్చితార్ధం చేయిస్తాడు. హైదరాబాద్ వచ్చిన స్రవంతి వేంకటావధానికి విషయం చెప్పి విడిపోదాం అని సూచించగా, ఆగ్రహించిన అవధాని, స్రవంతిని హోటల్ కి పిలిచి, తండ్రి పోలీస్ బలం తో ఇరికిస్తాడు. అహం దెబ్బ తిన్న రాఘవ రెడ్డి గంపల గంగులు ని రంగం లోకి  దింపుతాడు. వంటరిగా  పార్క్ లో మైకం లో ఉన్న వేంకటావధానిని పొద చాటుకి తీసుకొని వెళ్లి నోట్లో బట్ట కుక్కి కుడి కాలు తొడ భాగం లో నుజ్జు చేసి గంపల గంగులు మాయం అవుతాడు. సుబ్బావధానిని మారుమూల స్టేషన్ కి బదిలీ చేయించి, అక్కడ అతన్ని కలుసుకున్న రాఘవ రెడ్డి, వేంకటావధాని తన కూతురుకి చేసిన అవమానానికి  తగిన శాస్తి చేసాననీ బ్రాహ్మణులు కనక ప్రాణాల తో విడిచి పెడుతున్నాననీ, బుద్ది రాక ఇంకో ప్రయత్నం చేస్తే అవి కూడా ఉంచననీ హెచ్చరిక చేసి వదిలేస్తాడు.
హాస్పటల్లో ఎనిమిది నెలలు గడిపిన వేంకటావధాని చేతికర్ర సహాయం తో బయటకు వచ్చి కొన్నాళ్ళు విరహ కవిత్వం రాసి, ఒక రోజు స్రవంతి భర్తను కలుసుకుని విషయం వివరించబోగా అతను జాలిగా చూసి, తనకి మొత్తం విషయం తెలుసునని, కొన్ని జాగ్రత్తలు చెప్పి అవధాని ని సాగనంపుతాడు. 

వేంకటావధాని పరిస్థితి చూసి జాలి పడిన విజయ కుమార్, తన పిన తండ్రి మిల్లు లో గుమస్తా గా చేర్పిస్తాడు. అవధాని కొన్నాళ్ళకు బ్యాంక్ క్లార్క్ అవుతాడు. తోటి ఉద్యోగిని జయంతి తో పెళ్లవుతుంది. పెళ్ళికి జయంతి క్లాస్ మేట్ రంగారెడ్డి వస్తాడు. అవధాని కీ రంగారెడ్డి కీ స్నేహమే. స్రవంతి విషయం రంగారెడ్డి కీ తెలుసు.

రంగారెడ్డి ది చేవెళ్ల ప్రాంతానికి చెందిన వ్యవసాయ కుటుంబం. ఆర్ట్స్ కాలేజీ లో కాలక్షేపం చదువు. స్త్రీ లోలుడు కాదు కానీ కొంచెం యావ. స్నేహితులు వేళాకోళం చేసినప్పుడు రంగారెడ్డి తనను కిషన్ కన్హయ్యా తో పోల్చుకుంటూ ఉంటాడు. ఒక సందర్బంలో శ్రీపతి రంగారెడ్డి ది నిజాయితీ బేరం అని కితాబు ఇస్తాడు.

ఒకసారి లాడ్జి లో తన క్లాస్ మేట్ జయంతి ని చూసి, పిలిచి వాకబు చేయగా తన తండ్రి చనిపోవడం తో కుటుంబ పోషణ కోసం వేరే దారేదీ కనపడక ఈ బాట పట్టాననీ, ఎవరికీ చెప్పవద్దని బతిమాలుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది.
ఆమెను రంగారెడ్డి అనునయించి, ఇలాంటి పనులు చేసి భవిష్యత్ పాడుచేసుకోవద్దనీ, తమ అవసరం తీరిపోయిన తరువాత కుటుంబ సభ్యులు జయంతి ని పట్టించుకోరనీ, దునియాదారీ, సమ్జాయించి అలాంటి వాళ్ళ కోసం అతిగా ప్రవర్తించి, జీవితం పాడు చేసుకోవద్దని సలహా ఇచ్చి, తనకు తెలిసిన ధనవంతుల ఇళ్లల్లో ట్యూషన్ లు ఏర్పాటు చేసి తానూ అవసరం పడ్డప్పుడు ఆదుకుంటూ ఉంటాడు.
చదువైన తరవాత కొంతకాలం హైదరాబాద్ లోనే కాలక్షేపం చేసిన రంగారెడ్డి, ఉన్నట్టుండి ఒకరోజు బుద్ది మార్చుకుని అన్ని అలవాట్లకీ స్వస్తి చెప్పి పెళ్ళి చేసుకుంటానని చెప్పగానే తల్లి తండ్రులు పెళ్ళి జరిపించేస్తారు. రంగారెడ్డి వ్యవసాయ దారుడవుతాడు.

**********      *****    *************      *****

వేంకటావధాని కి జయంతి క్లాస్ మేట్ కాదు కానీ ఇద్దరూ ఒకటే కాలేజ్. పెళ్ళి అయిన తరువాత జయంతి గురించి చూచాయ గా విన్న మాటలు అవధాని లో ముందు ఉన్న అనుమానాలను పెంచి పోషిస్తాయి. మింగలేకా, కక్క లేకా ఉన్న అతని పరిస్థిని గమనించిన జయంతి అతనికి ఏ లోటు రాకుండా ఇంటి పనీ, బయట పనీ తానే చేసుకుంటూ అతకి ఎటువంటి వంకలూ పెట్టడానికి అవకాశం ఇవ్వకుండా ఉంటూ ఉంటుంది.

ఒక శీతాకాలపు సాయంత్రం బాంక్ పని ముగించుకొని సుల్తాన్ బజార్ లో కూరగాయలు కొంటున్న జయంతి ని రంగారెడ్డి పలకరిస్తాడు.
తాను హైదరాబాద్ వచ్చి వారం రోజులైందనీ ఇంకా ఓ నాలుగు రోజులు ఉంటాననీ ఊరిలో వ్యవసాయం తండ్రి, పినతండ్రులు చూసుకుంటారనీ చెప్పి జయంతి డీలా పడ్డానికి కారణం ఏమిటని, అడిగి విషయం తెలుకుని తాను సరిచేస్తానని ధైర్యం చెప్పి పంపిస్తాడు.

జయంతి ని పంపిన రంగారెడ్డి స్వెట్టరూ, మఫ్లరూ సరి చేసుకుని సుల్తాన్ బజార్ నుంచి అబిడ్స్ వైపు నడుస్తూ ఉండగా క్లాస్మేట్ విలియమ్స్ కనిపిస్తాడు. అతను ఇప్పుడు పోలీసు SI. తమ క్లాస్ మేట్ సుచిత్ర ది హత్య అనీ దానిని సహజ మరణం గా చిత్రీకరించారనీ చెపుతాడు.

మరునాడు బాంక్ సెలవవడం చేత రంగారెడ్డి అవధాని ఇంటికి వెడతాడు. జయంతి పక్కింటి ఆవిడ తో ముచ్చట్లు పెడుతుంది. రంగారెడ్డి వంటరిగా ఉన్న అవధాని సందేహాలు కనుక్కుని జయంతి తన సహ విద్యార్థిని అనీ, నిప్పు లాంటి మనిషి అనీ ఆమె పొందు కోసం ప్రయత్నించి భంగ పడ్డ వాళ్లు ఆ రోజుల్లో కొన్ని పుకార్లు పుట్టించారనీ, చెప్పి అయినా అవధాని సంగతి తెలిసినా కూడా జయంతి అన్నీ సర్దుకుని ప్రేమగా ఉంటోంది కనక అవధాని లేనిపోని అనుమానాలు పెట్టుకుని జీవితాలని పాడుచేసుకోవద్దని సలహా ఇస్తాడు. అవధానికి స్రవంతి విషయం, అనంతరం, అవధానికి ఇంటా బయటా జరిగిన అవమానాలు జ్ఞాపకం చేసి, ఇవన్నీ జయంతి కి తెలిసే ఉంటాయనీ, సంస్కారం ఉన్న మనిషి కనక ఆమె అవధాని తో ప్రేమ గా ఉంటోంది అనీ, ఇలాంటి పిచ్చి ఆలోచనలతో జీవితం పాడు చేసుకోవద్దు అని సలహా ఇస్తాడు.

కాసేపటికి ఇంటికి వచ్చిన జయంతి కి అవధాని రంగారెడ్డి ని పరిచయం చేసి ఈ పూట అందరం కలసి భోజనం చేద్దామనీ, రంగారెడ్డి కోసం ఏమైనా స్పెషల్ గా వండమనీ చెపుతాడు. అందరూ కలసి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసాక రంగారెడ్డి సెలవు తీసుకుంటాడు. అవధాని మనసు తేలిక పడి, జయంతి జీవితం బాగు పడుతుంది.

.

తరువాయి వచ్చే సంచికలో…...

.

*********************************************************